
ఆస్తి పంపకాల్లో వివాదం
చిన్న బావమరిదికి రెక్కీ ఏర్పాటు చేసిన బావ, సోదరి
నలుగురిని పోలీసులకు అప్పగించిన స్థానికులు
ఘట్‌కేసర్: ఆస్తి పంపకాల్లో వాటా కోసం రెక్కీ ఏర్పాటు చేసిన ఘటన ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. అంకుషాపూర్ గ్రామానికి చెందిన బోనాల రాజశేఖర్, ఈశ్వర్ తమ సోదరి లావణ్యను కొండాపూర్ మసీదుబండకు చెందిన మేడ్చల్ శ్రీనివాస్‌తో వివాహం జరిపించారు. ఆ సమయంలో రూ. 12 లక్షలు, ఎకరం భూమి కట్నంగా ఇచ్చారు. అయితే తర్వాత తండ్రి పెంటయ్య ఉద్యోగ విరమణతో వచ్చినడబ్బులోనూ తనకు వాటా కావాలని సోదరి లావణ్య సోదరులను డిమాండ్ చేసింది. దీంతో ఇచ్చిన ఎకరం భూమి విక్రయించిందని, తిరిగి డబ్బులు ఇచ్చేది లేదనడంతో గొడవ ప్రారంభమైంది.
బావమరుదుల కదలికలపై రెక్కీ..
బావమరుదుల కదలికలు తెలుసుకునేందుకు శ్రీనివాస్ టోలీచౌక్‌కు చెందిన బాబు షేక్ సాహెల్ (20), ఎండీ ఇర్ఫాన్ (20), మహమ్మద్ అబ్బు, సల్మాన్(18)తో పాటు మరో మైనర్‌తో రూ.15 వేలకు ఒప్పందం చేసుకున్నాడు. రూ. 1000 చొప్పున 3 సార్లు గూగుల్ పే ద్వారా డబ్బు పంపించి చిన్నబావమరిది ఈశ్వర్, ఇంటి, లొకేషన్ ఫొటోలు శ్రీనివాస్ ఇర్ఫాన్‌కు అందజేశాడు. బుధవారం ఉదయం వారు అంకుషాపూర్ గ్రామంలో బైక్ నంబర్ కనిపించకుండా జాగ్రత్త పడటం, ముఖాలకు మాస్క్‌లు ధరించి అనుమానాస్పదంగా రెక్కీ నిర్వహిస్తుండగా.. స్థానికులకు అనుమానం వచ్చింది. దీంతో వారిని పట్టుకుని ఫోన్ తనిఖీ చేయగా బావ శ్రీనివాస్ పంపిన ఫొటోలు, ఫోన్‌లో టచ్‌లో ఉన్నట్లు గుర్తించడంతో డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుల నుంచి 4 సెల్‌ఫోన్లు, 2 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. వారితో పాటు బావ శ్రీనివాస్, సోదరి లావణ్య పోలీసులు అదుపులో ఉన్నట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు. గతంలోనూ రెక్కీ నిర్వహించిన విషయమై ఇప్పటికే ఓ కేసు ఉంది. హత్యాయత్నం కోణం ఉందా..? అనేది పోలీసుల దర్యాప్తులో తేలనుంది.