
ఫైనాన్సియర్లు మ్యాపింగ్ చేసుకోవాలి
అమలాపురం రూరల్: వాహనాల క్రయ విక్రయాలతో ప్రమేయం ఉన్న ఫైనాన్సియర్లు రవాణాశాఖ ప్రస్తుత వాహన్ సాఫ్ట్‌వేర్‌లో మ్యాపింగ్ చేసుకోవాలని జిల్లా రవాణాశాఖ అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ ఇప్పటికే 60 శాతం ఫైనాన్సియర్ల మ్యాపింగ్ పూర్తయ్యిందని, మిగిలినవారు కూడా త్వరితగతిన పూర్తి చేసుకోవాలని ఆదేశించారు.
వెలి వేసి వేధిస్తున్నారు..
న్యాయం చేయండి
తాళ్లరేవు: గ్రామంలో జరిగిన చిన్న ఘటనను సాకుగా చూపి సంఘ పెద్దలు తమ కుటుంబాన్ని వెలి వేసి వేధిస్తున్నారని తాళ్లరేవు మాధవరాయునిపేటకు చెందిన గంజా చంటి కుటుంబ సభ్యులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం డిప్యూటీ తహసీల్దార్ సూరిబాబుకు వినతి పత్రం అంద జేశారు.
అనంతరం చంటి విలేకర్లతో మాట్లాడుతూ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడన్నారు. దానిపై ఫిర్యాదు చేస్తే, సంఘ పెద్దలు తమకు న్యాయం చేయకపోగా డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారన్నారు. తాను డబ్బులు చెల్లించకపోవడంతో గ్రామంలోని శుభ కార్యక్రమాలకు పిలువకుండా తమ కుటుంబాన్ని వెలివేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై ఇప్పటికే గ్రీవెన్స్ సెల్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని, అధికారులు న్యాయం చేయాలని కోరాడు.