
హెచ్‌ఎంను బదిలీ చేయాలని ఆమరణ దీక్ష
● మద్దుతుగా తల్లిదండ్రుల ఆందోళన
● ఎమ్మెల్యే, డీవైఈఓ హామీతో ఆందోళన విరమణ
పి.గన్నవరం: ముంగండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులపై వేధింపు ధోరణి ప్రదర్శిస్తున్న ప్రధానోపాధ్యాయురాలిని వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామానికి చెందిన పినిశెట్టి వెంకటేశ్వరరావు మంగళవారం పాఠశాల ఆవరణలో ఆమరణ దీక్ష చేపట్టారు. ఆయనకు మద్దతుగా విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ఆందోళన పాల్గొన్నారు. వివరాల్లోకి వెళితే.. హెచ్‌ఎం కనకదుర్గ తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ గత ఫిబ్రవరి 22న పాఠశాల ఉపాధ్యాయిని అమలాపురంలోని తన నివాసంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాఠశాలలోని ఉపాధ్యాయులందరూ ఏకమై హెచ్‌ఎం తమను కూడా రకరకాలుగా వేధిస్తున్నారని, ఆమెను బదిలీ చేస్తేనే విధులకు హాజరవుతామని ఆందోళన చేశారు. దీంతో విద్యాశాఖ అధికారులు అప్పట్లో హెచ్‌ఎంను టెన్త్ క్లాస్ పరీక్షల కమాండ్ కంట్రోల్ రూమ్‌కు డిప్యుటేషన్‌పై వేశారు. టెన్త్ పరీక్షలు పూర్తవడంతో ఆమె ముంగండకు వచ్చి సోమవారం విధుల్లో చేరారు. గతంలో హెచ్‌ఎంపై వచ్చిన ఆరోపణలపై ఈ నెల 17 డీవైఈఓ పి.రామలక్ష్మణమూర్తి, ఎంఈఓ కోన హెలీనా విచారణ నిర్వహించారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపాల్సి ఉంది. ఈ నేపథ్యంలో హెచ్‌ఎం మళ్లీ విధులకు హాజరవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. కోఆప్షన్ మెంబర్ పినిశెట్టి వెంకటేశ్వరరావు ఆమరణ దీక్ష చేపట్టారు. హెచ్‌ఎంను వెంటనే బదిలీ చేయాలని, లేకపోతే తమ పిల్లలను వేరే పాఠశాలల్లో వేస్తామని తల్లిదండ్రులు నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ స్థానిక నాయకులతో ఫోన్‌లో మాట్లాడారు. మళ్లీ పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే నాటికి కొత్త హెచ్‌ఎంను నియమించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే డీవైఈఓ రామలక్ష్మణమూర్తి ఆందోళన కారులతో మాట్లాడారు. విచారణ నివేదికను పరిశీలించి ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకుంటారని ఆయన హామీ ఇచ్చారు. హెచ్‌ఎం కనకదుర్గ కూడా ఆందోళనకారులతో మాట్లాడారు. తాను ఎవ్వరినీ కించపరచలేదని, విచారణకు కట్టుబడి ఉంటానన్నారు. చివరకు పినిశెట్టికి డీవైఈఓ మూర్తి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఆందోళనలో పోతవరం సర్పంచ్ వడలి కొండయ్య, కుసుమ వెంకటేశ్వరరావు, తెలగారెడ్డి విజయ కృష్ణ, గోసంగి వర ప్రసాద్, జి.దుర్గాప్రసాద్, వై.రోహిత్, దంగేటి శ్రీనివాస్, మొల్లేటి గణేష్ పాల్గొన్నారు. ఎస్సై బి.శివకృష్ణ, ఎంఈఓ–2 వీరభద్రానందం పరిస్థితిని పర్యవేక్షించారు.