
ఓపెన్‌లోనూ టాప్ లేపారు
● వెలువడిన ఓపెన్ స్కూల్ ఫలితాలు
● సత్తా చాటిన విద్యార్థులు
రాయవరం: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం నిర్వహించిన పదవ తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లోనూ బాలికలదే పైచేయిగా నిలిచింది. గత నెల 17 నుంచి 28 వరకూ ఓపెన్ స్కూల్ ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. ఓపెన్ టెన్త్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో కాకినాడ (84.90 శాతం), తూర్పుగోదావరి (81.51), డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ (77.86 శాతం) జిల్లాలు నిలిచాయి. ఈ పరీక్షలకు కాకినాడ జిల్లా నుంచి 2,066 మంది హాజరు కాగా 1,754 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 83.05, బాలికలు 86.83 శాతం ఉత్తీర్ణులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి 2,299 మంది పరీక్షకు హాజరు కాగా, 1,874 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలుర ఉత్తీర్ణత 79.18గా, బాలికల ఉత్తీర్ణత 84.36 శాతంగా ఉంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుంచి 1,102 మంది విద్యార్థులు హాజరు కాగా, 858 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలుర ఉత్తీర్ణత 73.77 శాతం, బాలికల ఉత్తీర్ణత 83,30 శాతంగా ఉంది.
ఇంటర్ ఫలితాల్లో..
ఓపెన్ ఇంటర్ ఫలితాల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ (82.15 శాతం), కాకినాడ (80.88 శాతం), తూర్పుగోదావరి (79.75 శాతం) జిల్లాలు మంచి ఉత్తీర్ణత సాధించాయి. కోనసీమ జిల్లా నుంచి 4,442 మంది పరీక్షకు హాజరు కాగా 3,649 మంది ఉత్తీర్ణులయ్యారు. వారిలో బాలురు 80.60, బాలికలు 84.36 శాతం ఉత్తీర్ణత సాధించారు. కాకినాడ జిల్లా నుంచి 6,395 మంది పరీక్షకు హాజరు కాగా 5,172 మంది పాసయ్యారు. బాలుర ఉత్తీర్ణత 80.49, బాలికల ఉత్తీర్ణత 81.42 శాతంగా ఉంది. తూర్పుగోదావరి జిల్లా నుంచి 4,588 మంది పరీక్షలు రాయగా, 3,659 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలుర ఉత్తీర్ణత 77.53, బాలికల ఉత్తీర్ణత 82.45 శాతంగా ఉంది. రాష్ట్ర స్థాయి ఫలితాల్లో కోనసీమ మొదటి స్థానంలో నిలవగా, ద్వితీయ స్థానంలో కాకినాడ, నాలుగో స్థానంలో తూర్పుగోదావరి జిల్లాలు నిలిచాయి.
రీ వెరిఫికేషన్‌కు అవకాశం
ఓపెన్ టెన్త్, ఇంటర్‌లో ఫెయిలైనవారు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. వాటికి ఈ నెల 26 నుంచి మే 5వ తేదీ వరకూ ఏపీ ఆన్‌లైన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఫీజు చెల్లించాలి. ప్రతి సబ్జెక్టు జవాబు పత్రం రీకౌంటింగ్‌కు రూ.200, రీ వెరిఫికేషన్‌కు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది. ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రెగ్యులర్ ఎస్‌ఎస్‌సీ సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్‌ను అనుసరించి జరుగుతాయి. వాటిని మే 19 నుంచి 24వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్ సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు మే 26 నుంచి 30వ తేదీ వరకు జరుగుతున్నాయి. పరీక్షా రుసుమును ఈ నెల 26 నుంచి మే 5వ తేదీ వరకు ఏపీటీ ఆన్‌లైన్ ద్వారా ద్వారా లేదా పేమెంట్ గేట్‌వే ద్వారా చెల్లించవచ్చు.