
ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలి
అమలాపురం రూరల్: ధాన్యానికి గిట్టుబాటు ధరలు కల్పించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. ధాన్యం సేకరణపై వ్యవసాయ, పౌర సరఫరాలు, మిల్లర్లు, మార్కెటింగ్, తూనికలు – కొలతలు, జిల్లా సహకార అధికారులతో కలెక్టరేట్లో గురువారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తేమ 17 శాతం ఉన్న ఎ–గ్రేడ్ ధాన్యాన్ని క్వింటాల్ రూ.2,320కి, 75 కేజీలు రూ.1,740కి, కామన్ వైరెటీ క్వింటాల్ రూ.2, 300కు, 75 కేజీలు రూ.1,725కి రైతుల నుంచి కొనుగోలు చేయాలని మిల్లర్లను ఆదేశించారు. రబీలో జిల్లావ్యాప్తంగా 1,64,854 ఎకరాల్లో వరి సాగు జరగగా, సుమారు 5,86,616 మెట్రిక్ టన్నుల దిగుబడి ఉందని, ప్రభుత్వం మొదటి దశలో 2 లక్షల మెట్రిక్ టన్నుల (34 శాతం) కొనుగోలునే లక్ష్యంగా నిర్దేశించిందని చెప్పారు. మంత్రులతో సంప్రదింపులు జరిపి, లక్ష్యాలను పెంచేందుకు కృషి చేస్తామని అన్నారు. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, బహిరంగ మార్కెట్లో కూడా కనీస గిట్టుబాటు ధరలు కల్పిస్తూ అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. ధాన్యం అమ్మిన 24 నుంచి 36 గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేస్తామని తెలిపారు. జిల్లాలోని 379 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లకు 268 మంది టీఏలు, 268 డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 243 మంది హెల్పర్లు, 141 మంది కస్టోడియన్ అధికారులను నియమించామని కలెక్టర్ వివరించారు. సమావేశంలో ఆర్డీఓలు పి.శ్రీకర్, కె.మాధవి, బి.అఖిల, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ బాలసరస్వతి, సహాయ మేనేజర్ నాగేశ్వరరావు, జిల్లా పౌరసరఫరాలు, వ్యవసాయ, సహకార అధికారులు అడపా ఉదయ భాస్కర్, బోసుబాబు, మురళీకృష్ణ, మార్కెటింగ్ శాఖ ఏడీ విశాలాక్షి, తూనికలు – కొలతల శాఖ కంట్రోలర్ రాజేష్, మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు దేశంశెట్టి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
సమస్యలుంటే సంప్రదించండి
ముమ్మిడివరం: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఎటువంటి సమస్యలున్నా జిల్లా కంట్రోలు రూమును 83094 32487 లేదా 94416 92275 నంబర్లలో ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకూ సంప్రదించాలని రైతులకు కలెక్టర్ మహేష్ కుమార్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. వాతావరణంలో ఎటువంటి మార్పులున్నా రైతులను ముందుగానే అప్రమత్తం చేయాలని, వర్షాలు పడే అవకాశం ఉంటే పీఏసీఎస్‌ల ద్వారా అందుబాటులో ఉన్న బరకాలను వినియోగించుకోవాలని సూచించారు.
ఫ కలెక్టర్ మహేష్ కుమార్
ఫ ధాన్యం సేకరణపై సమీక్ష