
ఉగ్రవాదం నశించాలి
రావులపాలెం: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నిరసిస్తూ బుధవారం రాత్రి రావులపాలెంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఈ ర్యాలీ నిర్వహించినట్టు ఆయన తెలిపారు. తొలుత నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి వైఎస్సార్ సీపీ శ్రేణులు స్థానిక పార్టీ కార్యాలయానికి చేరుకున్నాయి. అక్కడి నుంచి ఫ్లెక్సీలు, కొవ్వొత్తులు చేతపట్టి ఉగ్రదాడిని నిరసిస్తూ అమలాపురం రోడ్డు, ఆర్‌కే రెస్టారెంట్ జంక్షన్ మీదుగా కోనసీమ ముఖద్వారం వరకూ జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అముడా మాజీ చైర్మన్ గొల్లపల్లి డేవిడ్‌రాజు, కొత్తపేట ఎంపీపీ మార్గన గంగాధరావు, వైస్ ఎంపీపీ బొక్కా ప్రసాద్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సాకా ప్రసన్నకుమార్, సర్పంచులు దొమ్మేటి అర్జునరావు, తమ్మన శ్రీను, సబ్బితి మోహనరావు, ఉప సర్పంచ్ గొలుగూరి మునిరెడ్డి, వెఎస్సార్ సీపీ నాయకులు, కప్పల శ్రీధర్, కోనాల రాజు పాల్గొన్నారు.
అమానుషం : ఎమ్మెల్సీ తోట
కపిలేశ్వరపురం (మండపేట): జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో అమాయకులైన పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయడం అమానుషమని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు బుధవారం ఆయన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆర్మీ దుస్తుల్లో ఉగ్రవాదులు రావడం, పర్యాటకులను పొట్టనపెట్టుకోవడమనే అంశాలను తీవ్రంగా పరిగణించి లోతైన విచారణ చేపట్టాలన్నారు.

ఉగ్రవాదం నశించాలి