
మహమ్మారిని తరిమేద్దాం
ఆలమూరు: వేసవి వచ్చేసింది. వాతావరణ మార్పుల ప్రభావంతో అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. కొద్ది వారాలు గడిస్తే నైరుతి రుతుపవనాలు కూడా వచ్చేసి, వానలు జోరందుకుంటాయి. ఇటువంటి వాతావరణం దోమల పెరుగుదలకు, వ్యాధులకు అనుకూలం. ముఖ్యంగా చిన్న దోమ కాటు వేస్తే ప్రాణాంతకమైన మలేరియా వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంటుంది. అందువలన ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ఇళ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ, మలేరియా మహమ్మారి బారిన పడకుండా తమను తాము రక్షించుకోవాలి.
ఇలా వస్తుంది
తేమ శాతం అధికంగా ఉన్న ప్రదేశాల్లో ఆడ ఎనాఫిలిస్ దోమల వ్యాప్తి అధికంగా ఉంటుంది. ఈ దోమ కుడితే మలేరియా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. దోమ కుట్టిన 10 నుంచి 15 రోజుల తరువాత మలేరియా జ్వర లక్షణాలు బయట పడతాయి. మలేరియా సోకిన వారు సకాలంలో చికిత్స తీసుకోకపోతే ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుంది. ఒకవేళ రోగి కోలుకున్నా ఆ పరాన్నజీవి మాత్రం శరీరంలో ఏడాది పాటు నిద్రాణ స్థితిలో ఉంటుంది. ఈ వ్యాధి సోకిన వారు సమతుల ఆహారం తీసుకుంటే త్వరితగతిన కోలుకుంటారు.
గత ఏడాది 12 అనుమానిత కేసులు
మలేరియా నియంత్రణకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లావ్యాప్తంగా గత ఏడాది 12 మలేరియా అనుమానిత కేసులు నమోదయ్యాయి. వీరిలో ముగ్గురికి మలేరియా ఉన్నట్లు నిర్ధారించారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదని జిల్లా మలేరియా యూనిట్ అధికారులు తెలిపారు. జిల్లాలోని అమలాపురం, రాజోలు, కొత్తపేట, మండపేటల్లో డివిజన్ మలేరియా యూనిట్లున్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అదనంగా మరో మూడు సబ్ మలేరియా యూనిట్ కార్యాలయాలను ఏర్పాటు చేసి, మలేరియా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అమలాపురం డివిజన్ యూనిట్‌కు అమలాపురం టౌన్, అమలాపురం రూరల్, కొత్తపేట డివిజన్‌కు రావులపాలెంలో సబ్ మలేరియా యూనిట్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
వ్యాధి లక్షణాలివీ..
మలేరియాను రక్త పరీక్ష (ఆర్‌డీ) ద్వారా నిర్ధారిస్తారు. ఈ వ్యాధి సోకిన వారు చలి, వణుకుతో కూడిన జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధ పడతారు. వ్యాధి నిరోధక శక్తి లేని వారికి విపరీతమైన తలనొప్పి వచ్చి, ఒక్కోసారి కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదముంటుంది. వ్యాధి నిర్ధారణ కాక ముందే బాధితులు తక్కువగా మూత్రం విసర్జించడం, రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి ముదిరితే మూత్రపిండ సంబంధిత సమస్యలు అధికమవుతాయి. రోగులు వైద్యుల పర్యవేక్షణలో ఏకధాటిగా 14 రోజుల పాటు చికిత్స తీసుకోవాలి. మధ్యలో మానేస్తే వ్యాధి తిరగబెట్టే ప్రమాదం ఉంటుంది. మలేరియాలో ప్లాస్మోడియం ఫాల్సీఫారం రకమైతే మూడు రోజుల పాటు ఏసీటీ చికిత్స పొందాలి. ఈ చికిత్స అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. రోగులు సత్వరమే కోలుకునేందుకు పండ్ల రసాలు, గ్లూకోజ్, చెరకు రసం వంటి ద్రవ పదార్థాలు విరివిగా తీసుకోవాలి.
నివారణ చర్యలు మేలు
వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలి. ఇంట్లో, పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నిల్వ నీటిలో దోమలు వృద్ధి చెందకుండా తరచూ లార్వాసైడ్ క్రిమి సంహారక మందు పిచికారీ చేయాలి. ఇంటి గోడలపై సింథటిక్ ఫైరిత్రాయిడ్, ఏసీఎం క్రిమి సంహారక మందును అవసరమైన మేరకు పిచికారీ చేయాలి. దోమల నివారణ చర్యలు తీసుకోవాలి.
అప్రమత్తంగా ఉండాలి
మలేరియా బారిన పడిన వారు వ్యాధి తీవ్రత తగ్గే వరకూ అప్రమత్తంగా ఉండాలి. నివారణ ఎంతో ముఖ్యమో కోలుకోవడానికి కూడా ఆహారపు అలవాట్లు కూడా అంతే ముఖ్యం. జిల్లాలో మలేరియా కేసులను సున్నా శాతానికి తగ్గించేలా కృషి చేస్తున్నాం.
– ఎన్.వెంకటేశ్వరరావు, జిల్లా మలేరియా
యూనిట్ ప్రత్యేక అధికారి, అమలాపురం
నేడు ప్రపంచ మలేరియా దినోత్సవం
ఇంగ్లండ్‌కు చెందిన నోబెల్ అవార్డు గ్రహీత సర్ రోనాల్డ్ రోస్ సుదీర్ఘంగా 18 సంవత్సరాల పాటు (1881–1899) చేసిన పరిశోధనల వల్ల మలేరియా వ్యాధి సోకే తీరును గుర్తించారు. ఆడ ఎనాఫిలిస్ దోమ వల్ల కుట్టడం వల్లే ఈ వ్యాధి సంభవిస్తుందని నిర్ధారించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్‌ఓ) 2008 ఏప్రిల్ 25 నుంచి ప్రపంచ మలేరియా దినోత్సవం నిర్వహిస్తోంది.
ఫ మెరుగైన పారిశుధ్యంతో
దోమల నిర్మూలన
ఫ ఏమరుపాటుగా వ్యవహరిస్తే
మలేరియాకు చాన్స్

మహమ్మారిని తరిమేద్దాం

మహమ్మారిని తరిమేద్దాం