
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బాలకిష్టారెడ్డి
అగ్రి, ఫార్మా హాల్ టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
22 నుంచి ఇంజనీరింగ్ సెట్ హాల్ టికెట్లు
ఈనెల 29 నుంచి మే 4 వరకు ఆన్‌లైన్ పరీక్ష
కీపై అభ్యంతరం లేవనెత్తాలంటే ఒక్కో ప్రశ్నకు రూ.500
సెట్ కన్వీనర్, కో కన్వీనర్ దీన్‌కుమార్, విజయకుమార్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీజీఈఏపీ సెట్)కు అన్ని ఏర్పాట్లు చేసినట్టు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ దీన్‌కుమార్, కో–కన్వీనర్ డాక్టర్ కె విజయకుమార్‌రెడ్డి తెలిపారు. అగ్రి, ఫార్మా సెట్ హాల్ టికెట్లను శనివారం (19వ తేదీ) నుంచి, ఇంజనీరింగ్ సెట్ హాల్ టికెట్లను ఈ నెల 22 నుంచి డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించామని చెప్పారు. ఈ నెల 29 నుంచి మే 4వ తేదీ వరకు ఈఏపీ సెట్ పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షల ఏర్పాట్లను జేఎన్‌టీయూహెచ్‌లో శుక్రవారం మీడియా సమావేశంలో దీన్‌కుమార్ వివరించారు.
ఒక్క నిమిషం నిబంధన అమలు
హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ ఉంటుందని, దీని ద్వారా పరీక్ష కేంద్రాన్ని తేలికగా తెలుసుకోవచ్చని దీన్‌కుమార్, విజయకుమార్‌రెడ్డి తెలిపారు. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేశారు. మొత్తం 16 జోన్లలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) జరుగుతుందని, ఇందులో నాలుగు జోన్లు హైదరాబాద్ పరిధిలో ఉన్నాయని తెలిపారు.

అగ్రి, ఫార్మాకు 112, ఇంజనీరింగ్‌కు 124 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసిన ట్లు వివరించారు. పరీక్ష కేంద్రం లోపలికి 90 నిమి షాల ముందే అనుమతిస్తామని తెలిపారు. ఇంజనీరింగ్ విభాగానికి 2,19,420.. అగ్రి, ఫార్మాకు 86,101, రెండు విభాగాలకు కలిపి 253 దరఖాస్తులు వచ్చాయని విజయకుమార్ రెడ్డి వెల్లడించారు. మీడియా సమావేశంలో జెఎన్‌టీయూహెచ్ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ టి కిషన్‌కుమార్‌రెడ్డి, ఉన్నత విద్య మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వీటిని మరిచిపోవద్దు
⇒ పరీక్ష కేంద్రం లొకేషన్‌ను హాల్ టికెట్‌పై ముద్రించిన క్యూఆర్ కోడ్ ద్వారా ముందే గుర్తించవచ్చు. ఉదయం సెషన్‌కు 7.30 గంటలకు, సాయంత్రం సెషన్‌కు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. బయోమెట్రిక్ హాజరు తీసుకుంటారు కాబట్టి విద్యార్థులు చేతులకు మెహందీ, టాటూలు, ఇంకు వేసుకోకూడదు.
⇒ పరీక్ష కేంద్రంలోకి బాల్ పాయింట్ పెన్, పెన్సిల్, హాల్ టిక్కెట్, ఐడీ ప్రూఫ్ మాత్రమే అనుమతిస్తారు. క్యాలిక్యులేటర్, సెల్‌ఫోన్, రిస్ట్‌వాచ్, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు. ద్విభాషలో ఉండే ప్రశ్నలు ట్రాన్స్‌లేషన్‌లో తేడా వస్తే, ఇంగ్లిష్‌లోని ప్రశ్ననే ప్రామాణికంగా తీసుకుంటారు.
⇒ పరీక్ష తర్వాత విడుదల చేసే ప్రాథమిక కీపై అభ్యంతరాలు లేవనెత్తాలంటే ప్రతి ప్రశ్నకు రూ.500 చెల్లించాలి. ఆ ప్రశ్నలో తప్పులుంటే ఈ మొత్తాన్ని ఏడు రోజుల్లో తిరిగి ఇచ్చేస్తారు. లేని పక్షంలో ఆ డబ్బు తిరిగి రాదు. నిరాధార అభ్యంతరాలను అదుపు చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.