
గతంలో గర్భధారణ (ప్రెగ్నెన్సీ) ప్లానింగ్ అంటూ ఏదీ ఉండేది కాదు. నిజానికి తమకు కావాల్సినప్పుడు, తమకు అవసరమైన సమయంలోనే ప్రెగ్నెన్సీ వచ్చేలా ప్లాన్ చేసుకుంటే... అది వచ్చేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కాబోయే తల్లికీ, పుట్టబోయే బిడ్డకూ చాలా ప్రయోజనాలు ఉంటాయి. తల్లీ బిడ్డా సురక్షితంగా కూడా ఉంటారు. సరైన ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌తో ప్రయోజనాలెలా కలుగుతాయో తెలుసుకుందాం.
గతం తరం యువతుల్లో తమకు ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం నెల తప్పిన తర్వాత గానీ తెలిసేది కాదు. అప్పుడు... తమకు పెగ్నెన్సీ వచ్చిందా లేదా అని తెలుసుకోవడం కోసం ఇంట్లోనే కొన్ని పరీక్షలు చేసుకునేవారు. అయితే గర్భధారణను ముందే ప్లాన్ చేసుకోవడం వల్ల పుట్టబోయే పిల్లల్లో కొన్ని లోపాల నివారణకు ముందునుంచే జాగ్రత్తపడే అవకాశం ఉంటుంది.
ఉదాహరణకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న మహిళ తాము నెల తప్పాలనుకున్న మూడు నెలల ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ అనే పోషకాన్ని తీసుకోవడం వల్ల ప్రయోజనాలుంటాయి. మార్కెట్‌లో మాత్రల రూపంలో దొరికే ఈ ఫోలిక్ యాసిడ్ చాలా చవక. నిజానికి పాలకూర లాంటి ఆకుకూరల్లో అది సమృద్ధిగా ఉంటుంది. పిండంలో వచ్చేందుకు అవకాశమున్న న్యూరల్ ట్యూబ్ (వెన్నుపాము) లోపాలను అది అరికడుతుంది. పుట్టుకతో వచ్చే ఈ వెన్నుపాము లోపాలను స్పైనాబైఫిడా అంటారు.
చదవండి: అప్పుడు రోజుకూలీ, ఇపుడు కోట్ల విలువ చేసే కంపెనీకి సీఈవో
ఫోలిక్ యాసిడ్ ఇలాంటి అనేక ప్రెగ్నెన్సీ లోపాలను అరికడుతుంది కాబట్టి ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకున్న మహిళలకు మూడు నెలల ముందునుంచే ఆబ్‌స్ట్రెష్టీషియన్స్/ గైనకాలజిస్టులు ఫోలిక్ యాసిడ్ మాత్రలను సూచిస్తుంటారు. ప్రెగ్నెన్సీ ప్లాన్నింగ్ వల్ల స్పైనా బైఫిడా మాత్రమే కాకుండా పౌష్టికాహార లోపాల వల్ల పిండదశలో ఎదురయ్యే మరెన్నో సమస్యలూ నివారించవచ్చు. అంతేకాదు... దేశంలోని మహిళల్లో దాదాపు 59 శాతం మందిలో రక్తహీనత (అనీమియా) ఎక్కువ. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే మహిళకు ఐరన్ సప్లిమెంట్లు ఇవ్వడం ద్వారా కూడా కాబోయే తల్లీ, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకునేందుకు అవకాశం ఉంది.
చదవండి: అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి
గర్భం ప్లాన్ చేసుకున్న నాటి నుంచి మహిళకు అన్ని పోషకాలూ అందేలా ఆరోగ్యకరమైన సమతు లాహారాన్ని ఇవ్వడం, అందులో కూరగాయలు, ఆకుకూరలు, తాజాపండ్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం వంటి జాగ్రత్తలతో ఇటు కాబోయే తల్లి, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండటంతో పాటు, ఆ చిన్నారికి తగినంత రోగనిరోధక శక్తి సమకూరేలా జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశముంటుంది.
డా.స్వప్న సముద్రాల
సీనియర్ గైనకాలజిస్ట్
అండ్ ఆబ్‌స్టెట్రీషియన్