
తల్లితో కలసి సాహసోపేతమైన ఆధ్యాత్మిక యాత్ర చేశాడు ఆ తనయుడు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బజాజ్ చేతక్ స్కూటర్‌పై సుదీర్ఘ యాత్ర సాగించారు ఆ తల్లీ తనయులు. భారత్‌తో పాటు నేపాల్, భూటాన్, మయాన్మార్ దేశాలను కూడా వారు సందర్శించారు. మైసూర్‌కు చెందిన ఆ తనయుడు కృష్ణకుమార్ (45), అతడి తల్లి చూడా రత్నమ్మ (75). వారి ఆధ్యాత్మికయాత్ర ఎలా సాగిందంటే..
కృష్ణకుమార్ తనకు 21 ఏళ్ల కిందట తన తండ్రి కొనిచ్చిన బజాజ్ చేతక్ స్కూటర్‌పై తల్లిని కూర్చోబెట్టుకుని ఈ యాత్ర ప్రారంభించారు. తండ్రి భౌతికంగా లేకపోయినా, ఈ వాహనం రూపంలో ఆయన తమతో పాటు ఈ యాత్రలు చేస్తున్నారనే భావిస్తున్నారు.
ఇప్పటి వరకు వీరు 92,822 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఏడుపదులు దాటిన వయసులోనూ రత్నమ్మ ఓపికగా స్కూటర్‌పై కూర్చుని యాత్రలు సాగిస్తుండటం విశేషం. ఇటీవల వారు విశాఖ చేరుకున్న సందర్భంగా, వారు తమ యాత్రా అనుభవాలను వివరించారు.
మాతృసేవా సంకల్పయాత్ర...
కృష్ణకుమార్ తల్లి చూడా రత్నమ్మ కుటుంబ బాధ్యతల్లో పడి ఇల్లు దాటి ఎక్కడకూ వెళ్లలేక పోయింది. ఒకసారి మాటల మధ్యలో ఇదే విషయాన్ని కొడుకుతో చెప్పి బాధపడింది. తల్లి మాటలకు కృష్ణకుమార్ ఆవేదన చెందాడు. ఎలాగైనా, తల్లిని ఆధ్యాత్మిక యాత్రకు తీసుకువెళ్లాలని, దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాలను అన్నింటినీ చూపించాలని నిశ్చయించుకున్నాడు.
కొద్దిరోజుల్లోనే తన కార్పొరేట్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఉద్యోగం వదిలేసి ఇంటికి వచ్చాక తల్లితో కలసి స్కూటర్‌పై ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభించాడు. వారం రోజుల్లో 2,673 కిలోమీటర్ల ప్రయాణం
కోవిడ్ సమయంలో వీరు భూటాన్ సరిహద్దులో 52 రోజులు చిక్కుకున్నారు. అక్కడి నుంచి అతి కష్టం మీద అనుమతులు తెచ్చుకుని, తన తల్లిని తీసుకుని కేవలం వారం రోజుల్లో 2,673 కిలోమీటర్లు ప్రయాణం చేసి మైసూర్‌కు చేరుకున్నాడు. కేవలం రెండు రోజుల్లో 891 కిలోమీటర్లు ప్రయాణించిన సందర్భాన్ని మరచిపోలేమని కృష్ణకుమార్ చెబుతాడు.
బదరీనాథ్, కేదార్‌నాథ్, కాశ్మీర్, వైష్ణోదేవి, పరశురామ్ కుండ్, శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు, భారత్–చైనా సరిహద్దుల్లోని అతి ఎత్తైన ప్రాంతం తవాంగ్, మేచుక వంటి ప్రదేశాలను సైతం వీరు సందర్శించారు. ఈ యాత్రలో కృష్ణకుమార్ తన తల్లికి లెక్కలేనన్ని ఆలయాలను స్వయంగా చూపించాడు. ఈ తల్లీ తనయులు కేవలం పట్టణాలనే కాకుండా చిన్నచిన్న గ్రామాలు, అక్కడ ఉన్న ఆలయాలను కూడా సందర్శిస్తూ ముందుకు సాగుతున్నారు.
తన 68వ ఏట ఈ ప్రయాణాన్ని ప్రారంభించిన చూడా రత్నమ్మ నేటికీ ఎంతో ఆరోగ్యంగా, ఉత్సాహంగా తన ప్రయాణాన్ని కుమారుడి చేయి పట్టుకుని సాగిస్తున్నారు. తాజాగా వీరు పంచారామాల యాత్ర ముగించుకుని విశాఖకు చేరుకున్నారు. కోవిడ్ సమయంలో తీర ప్రాంతంలోని ఆలయాలను వీరు సందర్శించలేకపోయారు. దీంతో మైసూర్ నుంచి వీరు తిరిగి ఈ యాత్రను ప్రారంభించారు. రోజూ దాదాపు 150 నుంచి 200 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తూ, ముందుకు సాగుతున్నారు.
చిన్న అనారోగ్యం కూడా లేదు...
తన కోసం అన్నీ చేసిన అమ్మ కోసం తాను ఉన్నతమైన ఉద్యోగాన్ని వదులుకున్నాడు కృష్ణ కుమార్. తన వద్దనున్న డబ్బులతోనే ఈ యాత్రలను పూర్తిచేస్తున్నారు. వీలయినంత వరకు ఆలయాలు, మఠాలు, క్షేత్రాలలో బస చేస్తారు. బయటి ఆహారం తినకుండా ఆరోగ్యాన్ని జాగ్రతగా చూసుకుంటారు. ఇప్పటి వరకు చేసిన యాత్రల్లో తమకు కనీసం జ్వరం, జలుబు వంటివి కూడా రాలేదని, తన కంటే తన తల్లి పదిరెట్లు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఈ యాత్రల్లో పాల్గొంటున్నట్లు కృష్ణకుమార్ చెప్పారు.
మాట ఇచ్చాను... నెరవేరుస్తున్నాను
అమ్మకు ఇచ్చిన మాట కోసం ఈ యాత్రలు చేస్తున్నా. మాట ఇస్తే దానిని నెరవేర్చడం ముఖ్యం. బయటి ప్రపంచాన్ని చూడని మా అమ్మకు నేను దేశం అంతా చూపించాను. ఎంతో క్లిష్టమైన ప్రాంతాలకు సైతం స్కూటర్‌పై చేరుకున్నాం. అమ్మకు సేవ చేయడం, ఆమ్మతో ఉండటం చాలా సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తోంది.
– కృష్ణకుమార్
ఫొటో: పి.ఎల్.మోహనరావు
(చదవండి: అలాంటి స్పందన ఊహించలేదు..! ఎయిర్‌పోర్ట్‌లో నటి సోనాలికి ఎదురైన ఆ ఘటన..)