
ఆత్మదర్శిని
దైవం అనేది బయట వెదికే విషయమే కాదు. సమాజంలోని నియమాలతో, నమ్మకాలతో పద్ధతులతో దానికి సంబంధమే లేదు. ఇప్పుడు సమాజంలో కనిపిస్తున్న ఆధ్యాత్మికత అంతా సమాజానికి చూపించుకోవడానికి, నలుగురిలో మంచి అనిపించుకోవడానికి చేసే ప్రయత్నాలు. నిజానికి ఆధ్యాత్మిక ప్రయాణం నీలోనికి నీవుచేసే ప్రయాణం. గర్భగుడిలోనికి ఒక్కరినే అనుమతించడంలోని అంతరార్థం ఇదే. సత్యాన్ని తెలుసుకోవడానికి బయటి వ్యక్తులు, మధ్యవర్తుల ప్రమేయమే అవసరం లేదు. సత్యం ఒకరు చెబితే అర్థమయ్యే విషయం కాదు. నీకు నీవుగానే సత్యాన్ని తెలుసుకోవాలి. నీ నమ్మకాల నుండి, అహం నుండి పూర్తిగా బయట పడాలి. నేను శరీరం కాదు. వీటికి సాక్షిగా ఉన్న దివ్య చైతన్యాన్ని అని తెలుసుకోవాలి. ఆత్మ చైతన్యవంతమవ్వడమే ధ్యానం.
విజ్ఞాన భైరవ తంత్రంలో శివుడు పార్వతికి 112 ధ్యానపద్ధతులను బోధిస్తాడు. మనం వాటిని పాటిస్తే దైవత్వాన్ని పొందుతామేమోగాని ఆరాధించడం వల్ల కాదు. శివుడు, బుద్ధుడు మొదలైన వారందరూ తాము దైవమని తెలుసుకొని ద్రష్టలైనారు. వారు తమలోని దైవత్వాన్ని తెలుసుకుని ఆ మార్గాన్ని మనకు బోధించారు. కానీ మనం ఆ మార్గాలను అనుసరించకుండా కేవలం వారిని ఆరాధించటం చేస్తున్నాము. దేవుడు భౌతికం కానేకాదు. శుద్ధచైతన్య స్థితిలోనే దైవగుణాలు ఉంటాయి. అది చావు పుట్టుకలు లేని స్థితి. తనను తాను తెలుసుకున్నవాడేస్వామి. నీ నిజస్థితిలో కేంద్రీకృతమై ఉంటే నీవే స్వామి. ఈ నిజమైన అర్ధాలు తెలియకపోవడం వల్లనే కొందరు గడ్డాలు పెంచి విచిత్ర వేషాలతో గురువులుగా, స్వాములుగా చలామణి ఔతున్నారు.
అసలు దైవత్వానికి భౌతిక వేషధారణతో సంబంధమే లేదు. సంసారాన్ని భౌతికంగా వదలవలసిన అవసరం అస్సలు లేదు. సామాన్య జీవితంలో ఉంటూ,రోజువారీ పనులు చేస్తూనే నీ ఆత్మలో నీవు కేంద్రీకృతమై సాక్షిగా ఉండడానికి రూపంతో పనిఏముంది? భాషతో, మాయలతో, అద్భుతాలతో మతంతో దైవత్వాన్ని ముడిపెట్టినంతవరకు ఎన్నటికీ దైవత్వాన్ని చేరలేవు. వీటన్నింటికీ అంటని స్వచ్ఛమైన చైతన్యస్థితే దైవత్వమని తెలుసుకో. సాక్షీభూతుడవై ఉండు. ఆ స్థితిని చేరుకున్నారు కనుకే కృష్ణుడిని, బుద్ధుడిని, క్రీస్తును దేవుళ్ళన్నారు. నీలోని కల్మషాలను తొలగించుకొని స్వచ్ఛమైన చైతన్యంగా మిగిలిపో. అధ్యాత్మిక ప్రయాణాన్ని ఒంటరిగానే చేయాలి. మధ్యవర్తులెవ్వరూ నీకు సహాయం చేయలేరు. యాంత్రికమైన పద్ధతులను పాటిస్తూ, గుడ్డి నమ్మకాలతో ఉంటే మనస్సు ఉచ్చులో చిక్కుకుపోతావు కానీ ఆత్మవైపు వెళ్ళలేవు. ఆత్మ చైతన్యాన్ని మాత్రం పొందలేవు.
దేవుణ్ణి నమ్ముతున్నాను అన్నంతమాత్రాన దేవునికి దగ్గర ఉన్నట్టు కాదు. నమ్మకాలకు అతీతమైన స్థితే దైవత్వం. మనస్సుకు అతీతమైన స్థితే దైవత్వం. అందుకు మార్గమే ధ్యానం.దేవుడు ఒక మనిషి కాదు. దైవత్వం ఒక స్థితి, నీ నిజస్థితి. తనను తాను తెలుసుకున్నవాడే దేవుడు. నీ నిజస్థితిని తెలుసుకుంటే నీవే దైవం.
– స్వామి మైత్రేయ, ఆధ్యాత్మిక బోధకులు