
‘శాంతము లేక సౌఖ్యము లేదు...’ అన్న త్యాగరాజ కీర్తన సంగీత కచేరీలలో ఎక్కువగా కనిపించదు. పాత రోజులలో నాగయ్య, భాను మతి వంటివారు సినిమాలలో ఈ పాట పాడటం వల్ల, ఆ పాటకూ, మాటకూ బాగా ప్రాచుర్యం ఉండేది.
ఎవరికయినా అకస్మాత్తుగా కోపం బుస్సుమని పొంగివస్తే, చను వున్న సన్నిహితులు, ‘నాయనా! కోపం తగ్గించు. శాంతము లేక సౌఖ్యము లేదు!’ అని త్యాగరాజు గారి పల్లవిని సామెతగా, సుభాషితంగా వాడటం శిష్ట సమాజంలో ఇప్పటికీ అప్పుడప్పుడూ వినిపిస్తుంది.
‘తన కోపమె తన శత్రువు, తన శాంతమె తనకు రక్ష!’ అన్న విషయం అందరికీ అనుభవవైక వేద్యమే. కోపాన్ని దూరంగా ఉంచేవాడికి, సుఖ సంతోషాలు దగ్గరగా ఉంటాయి. కాబట్టి, దార, సుతులు, ధన, ధాన్యములుండిన, / సారెకు జప, తప సంపదలుండిన, / ఆగమ, శాస్త్రములన్నియు చదివిన,.../ భాగవతు లనుచు బాగుగ పేరైన, / శాంతము లేక సౌఖ్యము లేదు! అన్న అయ్య వారి మాట వరహాల మూటే. అయితే, ఇక్కడ ‘శాంతం’ అంటే, క్రోధ రాహిత్యమనీ, కోపం లేకుండా వ్యవహరించటమనీ మాత్రమే అర్థం చెప్తే, అదీ మంచి మాటే! కానీ అది కొంచెం పరిమితమైన అర్థం. వాస్తవానికి, చివరి దాకా చూస్తే, త్యాగయ్య గారంటున్నది, ‘... త్యాగ రాజ నుత! సాధురక్షిత! తనకు ‘ఉప/శాంతము’ లేక సౌఖ్యము లేదు!’ అని. ఉపశాంతం అంటే ఉపశమనం, శమింపజేయటం, నియంత్రించటం! కామ క్రోధ లోభాది ఆరు అంతశ్శత్రువులనూ అదుపులో ఉంచటం.
క్షణికోద్రేకం కట్టలు తెగకుండా చూడటం. ఇంద్రియ కాంక్షల విజృంభణను నిగ్రహించటం. ఒత్తిళ్ళ వల్ల ఓర్పు కోల్పోకుండా,సంయమనంతో స్పందించటం. అటు లౌకిక విషయాలలో గానీ, ఇటు ఆధ్యాత్మిక సాధనలలో గానీ పురోగతి కోరేవాడికి, ఇది అత్యావశ్యకమైన గుణం అనడంలో సందేహానికి ఆస్కారం లేదు!
– మారుతి శాస్త్రి