
పూర్వం దుర్గమాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. హిరణ్యాక్షుడి వంశానికి చెందిన రురుడి కొడుకు అతడు. దుర్గముడు పరమనీచుడు, దుర్మార్గుడు, అతిక్రూరుడు, పరపీడనా పరాయణుడు. దేవతల బలమంతా వేదాలలోనే ఉన్నందున వేదాలను నాశనం చేస్తే చాలు, దేవతలందరినీ ఇట్టే నాశనం చేయవచ్చని తలచాడు. అదంత తేలికగా అయ్యే పనికాదు. అందువల్ల ముందుగా బ్రహ్మను ప్రసన్నుడిని చేసుకుని, అనుకున్న పని సాధించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా హిమాలయాలకు వెళ్లి, అక్కడ బ్రహ్మదేవుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడు.
దుర్గముడి తపస్సు తీవ్రతకు ముల్లోకాలు గడగడలాడాయి. నక్షత్రాలు గతులు తప్పాయి. సూర్యచంద్రులు తేజోవిహీనులయ్యారు. దేవతలంతా హాహాకారాలు చేయడంతో బ్రహ్మదేవుడు హంసవాహనంపై బయలుదేరి, దుర్గముడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు.
‘దుర్గమా! నీ తపస్సుకు ప్రసన్నుడనయ్యాను. వరం కోరుకో’ అన్నాడు బ్రహ్మదేవుడు. ‘బ్రహ్మదేవా! వేదాలలోను, ఈ ముల్లోకాలలోను బ్రాహ్మణులకు తెలిసిన మంత్రాలన్నింటినీ నాకు స్వాధీనం చేయి. దేవతలను జయించే బలం ఇవ్వు’ అని కోరాడు దుర్గముడు.
‘తథాస్తు’ అని పలికి బ్రహ్మదేవుడు అంతర్ధానమయ్యాడు. దుర్గముడికి బ్రహ్మదేవుడు ఈ వరమిచ్చిన తక్షణమే వేదమంత్రాలు విప్రులకు దూరమయ్యాయి. ఎవరికీ ఏ మంత్రమూ స్ఫురించని పరిస్థితి వాటిల్లింది. సంధ్యావందనాదుల వంటి నిత్య నైమిత్తిక కర్మానుష్ఠానాలు, యజ్ఞ యాగాదులు నిలిచిపోయాయి. ఇలా ఎందుకు జరిగిందో అర్థంకాక వేదపండితులు పరస్పరం ప్రశ్నించుకోసాగారు. ఎవరికీ సమాధానం దొరకదాయె! ముల్లోకాల్లోనూ హాహాకారాలే తప్ప ఎక్కడా స్వాహాకారాలు వినిపించని పరిస్థితి దాపురించింది. హవిర్భాగాలు అందక దేవతలందరూ శక్తిహీనులుగా మారారు. దుర్గముడు ఇదే అదనుగా తలచి స్వర్గాన్ని ముట్టడించాడు.
వజ్రదేహుడైన దుర్గముడిని ఎదిరించడం దేవతలకు శక్తికి మించిన పని అయింది. అతడి చేతిలో చావు దెబ్బలు తిని తలో దిక్కూ పారిపోయారు. దుర్గముడు అమరావతిలోని దేవేంద్ర భవనానికి చేరుకున్నాడు. అతడు అక్కడకు రాకముందే, సమాచారం తెలుసుకున్న దేవేంద్రుడు పలాయనం చిత్తగించాడు. స్వర్గాన్ని విడిచి పారిపోయిన దేవతలందరూ దేవేంద్రుడితో పాటు కొండల్లోను, కోనల్లోను ఎవరికీ కనిపించకుండా తలదాచుకోసాగారు. దిక్కుతోచక అడవులు పట్టిన దేవతలంతా ఆపద నుంచి బయటపడటానికి ఆదిపరాశక్తిని పూజించడం ప్రారంభించారు.
మరోవైపు, హోమాలు లేక వర్షాలు కురవడం మానేశాయి. నేలంతా ఎండి బీటలు పడింది. చెరువులు, నూతులు ఎండిపోయాయి. నదీ నదాలలో కూడా నీటిజాడ కనుమరుగైంది. ఈ అనావృష్టి వందేళ్లు కొనసాగింది. కరవు కరాళ నృత్యానికి పశుపక్ష్యాదులు చాలా వరకు అంతరించాయి. మనుషులు అసంఖ్యాకంగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇంటింటా శవాలు, ఏ ఊళ్లో చూసినా కళేబరాల గుట్టలు పడి ఉన్న దృశ్యాలే కనిపించసాగాయి. ఈ దారుణ పరిస్థితికి విప్రులందరూ కలత చెందారు. ఏం చేయాలో దిక్కుతోచక వారందరూ హిమాలయాలకు చేరి, నిరాహారులై ఆదిపరాశక్తిని స్తుతించసాగారు. విప్రుల ప్రార్థనలకు ప్రసన్నురాలైన ఆదిపరాశక్తి వారి ఎదుట ప్రత్యక్షమైంది. మెడలో ఫలపుష్ప వనమూలికాదుల మాలలను, అనంత హస్తాలలో అశేష ఆయుధాలను ధరించి కరుణారస సాగరంలా వారి ముందు నిలిచింది.
దుఃఖిస్తున్న ప్రజలను చూసి, జగజ్జనని అనంత నయనాలు ఏకధారగా వర్షించాయి. ఆ వర్షధారలకు భూమిపైనున్న వాపీ కూప తటాకాదులు నీటితో నిండాయి. ఓషధులు పులకించాయి. ఫలపుష్పాది వృక్షాలు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. అప్పటి వరకు కొండ కోనల్లో దాక్కున్న దేవతలందరూ బయటకు తరలి వచ్చి, విప్రులతో కలసి గొంతు కలిపి దేవిని స్తుతించడం ప్రారంభించారు. జగన్మాత పరవశురాలైంది. తన చేతుల్లోని పండ్లు, కాయలు అందరికీ అందించింది. పశుపక్ష్యాదులకు కావలసిన ఆహారాన్ని వాటికి అందించింది. ఫల శాకాదులు అందించడంతో విప్రులు, దేవతలు జగజ్జననిని ‘శాకంబరి’ అంటూ శ్లాఘించారు.
సురనరాది ప్రాణికోటి ఆహారాన్ని అందుకుంటున్న కోలాహలం దుర్గముడికి వినిపించింది. ఏం జరుగుతోందో తెలుసుకుని రమ్మని దూతలను పంపించాడు. వారు తిరిగి వచ్చి, తాము చూసినదంతా చెప్పారు. దుర్గముడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. ఆయుధాలు ధరించి, రథారూఢుడై సైన్య సమేతంగా హుటాహుటిన జగజ్జనని చుట్టూ ఉన్న దేవతల వద్దకు చేరుకున్నాడు. వస్తూనే శరపరంపర కురిపించాడు. దేవతలందరూ ఎదిరించి పోరాడు. విప్రులు కూడా శక్తి మేరకు యుద్ధం చేశారు. రాక్షస సేనల ధాటికి దేవ సేనలు, విప్రసమూహం తట్టుకోలేకపోవడంతో హాహాకారాలు మిన్నుముట్టాయి. ‘త్రాహి! త్రాహి!’ అంటూ వారంతా జగజ్జననిని శరణు కోరారు.
జగజ్జనని దేవ మానవుల చుట్టూ తేజోమయ రక్షణవలయాన్ని ఏర్పరచింది. రాక్షసుల ఆయుధాలు ఆ వలయం అంచులను తాకి, గోడను తాకిన గులకరాళ్లలా రాలిపోతున్నాయి. జగన్మాత స్వయంగా యుద్ధరంగానికి వచ్చింది. దేవి శరీరం నుంచి అనంతంగా శక్తి స్వరూపిణులు ఆవిర్భవించారు. వారంతా చిత్ర విచిత్రమైన ఆయుధాలతో రాక్షస సేనలను ముట్టడించి, క్షణాల్లోనే తుదముట్టించారు.
దుర్గముడు విచిత్రరథంపై రణరంగానికి వచ్చాడు.
చండప్రచండంగా యుద్ధం చేశాడు. భూమ్యాకాశాలను కమ్మేసినట్లుగా శరపరంపరను కురిపించి, అనంతశక్తులను జయించాడు. జగన్మాత ఎదుట తన రథాన్ని నిలిపాడు. ఇద్దరికీ ఘోర యుద్ధం జరిగింది. చివరకు జగజ్జనని ప్రయోగించిన బాణాలకు దుర్గముడు నెత్తురు కక్కుకుంటూ రథం మీద నుంచి నేలమీద దొర్లిపడి మరణించాడు. దుర్గముడి చావుతో దేవతలు ఆనంద తాండవం చేశారు. ముల్లోకాలూ తిరిగి శాంతిని పొందాయి.