Bone Fractures: కట్టుకట్టినా సెట్టవ్వలేదా..? | When Broken Bones Dont Set Properly Diagnosing NonHealing Fractures | Sakshi
Sakshi News home page

నాన్‌ యూనియన్‌ ఆఫ్‌ ఫ్రాక్చర్‌ అంటే..? కొందరిలో ఎముకలు కట్టుకటట్టినా సెట్టవ్వవు..

Published Tue, Apr 29 2025 9:34 AM | Last Updated on Tue, Apr 29 2025 9:34 AM

When Broken Bones Dont Set Properly Diagnosing NonHealing Fractures

అది రోడ్డు ప్రమాదాలు గానీ, ఇంట్లో ఎత్తు నుంచి పడిపోవడంగానీ బాత్‌రూమ్‌లో జారిపడటం గానీ జరిగినప్పుడు మొదట అందరూ అడిగేది... ఎవరివైనా ఎముకలు విరిగాయా అని. ఇంగ్లిష్‌లో ఫ్రాక్చర్‌ అని పిలిచే ఈ ఎముకలు విరిగినప్పుడు ఆపరేషన్‌తో విరిగిన ఎముకల్ని దగ్గర చేయడం, ప్లేట్స్‌ వేయడం, సిమెంట్‌ కట్టు వేసి అతికించడానికి ప్రయత్నించడం వంటి వైద్య ప్రక్రియల్ని అనుసరిస్తూ ఉంటారు. విరిగిన ఎముకల్ని దగ్గరగా వచ్చేలా సెట్‌ చేసినప్పుడు చాలామందిలో సరిగ్గా అతుక్కునే ఎముకలు కొందరిలో అంతగా సెట్‌ కాకపోవచ్చు. దాంతో ఎముకలు సరిగా సెట్‌ కాలేదనీ, అతుక్కోలేదనీ కొందరు ఫిర్యాదు చేస్తుంటారు. ఇలాంటి కేసులనే ఫెయిల్యూర్‌ ఆర్థోపెడిక్స్‌ అని సాధారణ ప్రజలు చెబుతున్నప్పటికీ... వాస్తవానికి ఇలా సరిగా సెట్‌ కాని సందర్భాల్లో దీన్ని ‘నాన్‌ యూనియన్‌ ఆఫ్‌ ఫ్రాక్చర్‌’గా చెబుతున్నారు. ఇలా సరిగా అతకనప్పుడు ఎముకలు ఉన్న సదరు అవయవం సరిగా పనిచేయకపోవడం, నొప్పి రావడంతో పాటు కొన్నిసార్లు ఆ కండిషన్‌ ప్రాణాంతకం కావడం అనే ముప్పు కూడా రావచ్చు. ఇలా ఎముకలు సరిగా అతకని సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అందించాల్సిన చికిత్సల వంటి పలు అంశాల గురించి తెలుసుకుందాం.  

వాటంతట అవే అతుక్కునే ఎముకలు...
విరిగిన ఎముక సరిగా అతకకపోవడం జరిగినప్పుడు అందుకు కారణాలూ, అందులో ఇన్‌వాల్వ్‌ అయిన అంశాలూ ఎన్నో ఉండవచ్చు. ఉదాహరణకు ఒక ఎముక రెండుగా విరిగినప్పుడు దాన్ని సరిగా కూర్చలేకపోతే (సెట్‌ చేయలేకపోతే) ఆ కండిషన్‌ను ‘ఇన్‌సఫిషియెంట్‌ రిడక్షన్‌’ అంటారు. అలాంటి పరిస్థితుల్లో విరిగిన ఎముక చక్కగా అతకదు. ఫలితంగా పూర్తిగా, సరిగా నయం కాదు. ఆ పరిస్థితినే ‘నాన్‌యూనియన్‌’ అంటారు.

ఏదైనా ఎముక విరిగినప్పుడు వాటిని సరిగా అమర్చి పెట్టి అలా కాలానికి వదిలేస్తే అవి వాటంతట అవే కుదురుకుని చక్కగా అతుక్కునే శక్తిని ప్రకృతి ఎముకకు ఇచ్చింది. అందుకే విరిగిన ఎముకను సరిగా సెట్‌ చేసి (అమర్చి) అలా వదిలేస్తే కాలం గడిచే కొద్దీ ఎముక దానంతట అదే నయమవుతుంది. ఇందుకు కావల్సినదల్లా ఆ విరిగిన ఆ ఎముక ముక్కల్ని సరిగా కూర్చడం / పేర్చడంలో నైపుణ్యమే. అయితే కొన్ని సందర్భాల్లో కాస్తంత ప్రత్యేక శ్రద్ధ, కొద్దిపాటి చికిత్స మాత్రం అవసరమవుతాయి. అందుకే చాలా సందర్భాల్లో అత్యంత నిపుణులైన వైద్యుల ఆధ్వర్యంలో చికిత్స జరగకపోయినా ఎముకలు కుదురుకుంటాయి. ఎముకకు ఉన్న ఈ గుణం మూలానే కొన్నిచోట్ల సంప్రదాయ వైద్యం పేరిట ఎముకలను సెట్‌ చేసేవారూ ఎముకల్ని అతకగలుగుతుంటారు. 

తనంతట తానే అతుక్కునే సామర్థ్యం ఎముకకు ఉన్నప్పటికీ నిపుణులైన వైద్యుల అవసరం ఎందుకు అవసరమంటే... విరిగిన ఎముకలకు కట్టు కట్టి పూర్తిగా సెట్‌ అయ్యేందుకు వదలాలంటే విరిగిన ప్రదేశంలో అవి సరిగా అమరేటట్లుగా ఉంచడమన్నది చాలా ప్రధానం. ఇది సరిగా జరగక΄ోతే విరిగిన ఎముక సరిగా (ఖచ్చితంగా) అతుక్కోకపోవచ్చు లేదా నయం కావడమన్నది చాలా ఆలస్యంగా జరగవచ్చు. ఇలా ఎముక అతుక్కోవడంలో జాప్యం జరిగితే దాన్ని ‘డిలేయ్‌డ్‌ యూనియన్‌’ అంటారు. ఈ పరిస్థితిని కొందరు ఎదుర్కొంటారు. ఇక కొందరిలో ఎముక సరిగా అతకనే అతకదు. ఈ పరిస్థితిని ‘నాన్‌ యూనియన్‌’ అంటారు.

డిలేయ్‌డ్‌ యూనియన్‌ / నాన్‌ యూనియన్‌కు కారణాలు

ఎముక విరిగిన చోట కణజాలం కూడా తీవ్రంగా దెబ్బతినడం. 
ఎముక విరిగిన చోట మృదు కణజాలానికి కోలుకోలేనంత నష్టం జరగడం. 
ఎముక సరిగా అతకని ప్రాంతానికి తగినంత రక్తసరఫరా జరగకపోవడం. 
ఎముక సరిగా అతకని ప్రాంతంలో ఇన్ఫెక్షన్‌ రావడం. 
విరిగిన ఎముకను తగినంత సేపు కదలకుండా ఉంచక΄ోవడం, స΄ోర్టు తగినంతగా లభించక΄ోవడం (ఇన్‌సఫిషియెంట్‌ స్ప్లింటేజ్‌). 
రెండు ఎముకలు అతుక్కునేలా తగినంత ఒత్తిడి (కంప్రెషన్‌) కలిగించక΄ోవడం  (ఒక ఎముక మరో ఎముకపై జారకుండా ఉండేలా... ఒకదానితో మరొకటి సరిగ్గా అమరిపోయేలా లేదా కలిసిపోయేలా ఉపయోగించే గరిష్ఠ ఒత్తిడిని కంప్రెషన్‌ అంటారు). 

ఎముక అతుక్కోకపోవడానికి కారణాలు
ఎముక అసలే అతుక్కోక΄ోవడాన్ని నాన్‌యూనియన్‌ అంటారు. సాధారణంగా ఆలస్యంగా అతుక్కోడానికి కారణమయ్యే అంశాలే ఎముక అసలు అతుక్కోక΄ోవడానికీ చాలావరకు కారణం కావచ్చు. దానితోపాటు మరికొన్ని కారణాలూ  ఉండవచ్చు. అవేమిటంటే...  

∙క్యాలస్‌ బ్రిడ్జ్‌ ఏర్పడకపోవడం : రెండు ఎముకలు అతికించేందుకు దగ్గర చేసినప్పుడు వాటి మధ్య కొంత గ్యాప్‌ రావడం. దీని గురించి ఇంగ్లిష్‌లో చె΄్పాలంటే... టూ లార్జ్‌ స్పేస్‌ ఫర్‌ ఫార్మేషన్‌ ఆఫ్‌ క్యాలస్‌ బ్రిడ్జ్‌గా దీన్ని పేర్కొంటారు... అంటే ఎముక అతుక్కునే ముందర రెండు ముక్కల మధ్య ఒక బ్రిడ్జ్‌లాంటిది ఏర్పడుతుంది. దాన్నే ‘క్యాలస్‌ బ్రిడ్జ్‌’ అంటారు. గ్యాప్‌ రావడం వల్ల అది ఏర్పడదు.  

ఇంటర్‌΄ పొజిషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌ టిష్యూ : అతుక్కోవాల్సిన రెండు ఎముకల మధ్య మృదుకణజాలం అడ్డుగా రావడం వల్ల ఎముక అతుక్కోదు. ఇలా జరగడాన్ని ఇంటర్‌పొజిషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌ టిష్యూ గా పేర్కొంటారు.  

అవసరమైన పరీక్షలు 
విరిగిన ఎముక సరిగా అతుక్కుందా లేక సరిగా అతుక్కోలేదా లేదా అతుక్కునే ప్రక్రియ ఆలస్యం అవుతోందా అన్న విషయాన్ని నిర్ధారణ చేయడానికి ఎక్స్‌–రే పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది. 

శస్త్రచికిత్స రహిత విధానాలు
ఇందులో సర్జరీ లేకుండానే క్యాల్షియమ్‌ సప్లిమెంటేషన్‌ ఇవ్వడం, తొడుగులు వంటి ఉపకరణాలను అమర్చడం వంటి ప్రక్రియలను అవలంబిస్తారు. 

చికిత్స
ఎముకలు సరిగా అతుక్కోకపోవడం లేదా ఆలస్యంగా అతుక్కోవడం వంటి సమస్య ఎదురైనప్పుడు అందుకు కారణమైన అంశాలను చూడాల్సి ఉంటుంది. కారణాన్ని బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. ఎముక అతుక్కోవడంలో ఆలస్యం జరిగినప్పుడు ఎముక పెరిగేలా బోన్‌గ్రాఫ్ట్‌ వంటి ప్రక్రియలను కూడా అవలంబించాల్సి రావచ్చు. శస్త్రచికిత్సఎముక సరిగా అతకని చోట బాధితులకు అవసరమైన శస్త్రచికిత్సను చేయడం. 
ఎముకలు అతకని పరిస్థితి నివారణ ఇలా... 
ఇక ఎముక సరిగా అతకకపోవడం వంటి పరిస్థితిని నివారించడానికి... 

ఇలాంటి పరిస్థితిని నివారించాలంటే... ఎముక ఫ్రాక్చర్‌ అయిన వ్యక్తికి పొగతాగే అలవాటు ఉంటే దాన్ని తప్పనిసరిగా మానేయాలి. 

డాక్టర్‌ చెప్పిన చికిత్స ప్రక్రియను తప్పనిసరిగా అనుసరించాలి. 

అన్ని పోషకాలు అందేలా అన్ని ΄ోషకాలు ఉన్న ఆహారాన్ని వేళకు తింటుండాలి.  
పొగతాగేవారు, స్థూలకాయులు, మధుమేహం (డయాబెటిస్‌) సమస్య ఉన్నవారిలో నాన్‌–యూనియన్‌కు అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఈ సమస్యలున్నవారు మరింత జాగ్రత్తగా ఉంటూ డాక్టర్‌ చెప్పే అని సూచనలనూ  పాటించాల్సి ఉంటుంది.

అతుక్కోని భాగాలు ఏవంటే...
నిజానికి శరీరంలోని ఏ ఎముక అయినా సరిగా అతుక్కోక΄ోవడానికి ఆస్కారం ఉంది. అయితే మన శరీరంలో కొన్ని ఎముకలు మాత్రం ఒకపట్టాన అతుక్కోకుండా ఇబ్బంది పెడుతుంటాయి. అందుకు పలు అంశాలు కారణమవుతుంటాయి. ఉదాహరణకు మిగతా ఎముకలతో ΄ోలిస్తే ఆ ఎముకలకు రక్తసరఫరా సరిగా ఉండక΄ోవడం వంటివి. అందుకే ఆ ఎముకల విషయంలో తరచూ ఇలాంటి ఇబ్బంది కలుగుతుంది. ఆ ఎముకలు లేదా ఫ్రాక్చర్లు ఏవంటే... 

లాటెరల్‌ కాండైల్‌ హ్యూమరస్‌ ఫ్రాక్చర్‌: మోచేతిలో బయటవైపు ఉండే  ఎముక విరిగితే దాన్ని లాటరల్‌ కాండైల్‌ హ్యూమరస్‌ ఫ్రాక్చర్‌ అంటారు. ఇది సరిగ్గా అతుక్కోవడంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు.

ఫీమోరల్‌ నెక్‌ ఫ్రాక్చర్‌: తుంటి ఎముకలో తొడలో ఉండే కాలి ఎముక సరిగ్గా ఓ గిన్నెలాంటి భాగంలో బంతిలా కూర్చుంటుంది. ఈ బంతికీ, మిగతా ఎముకకూ మధ్య ఉండే సన్నటి భాగం (నెక్‌) విరిగినప్పుడు అది అంత త్వరగా సెట్‌ కాకపోవచ్చు.  

ఫిఫ్త్‌ మెటాటార్సల్‌ (జోన్స్‌ ఫ్రాక్చర్‌)అరికాలిలో ఉండే ఎముకల్లో ఒకటైన ఈ ఎముక ఫ్రాక్చర్‌ అయినప్పుడు అతుక్కోవడం ఒకింత కష్టం కావచ్చు.

టాలస్‌ ఫ్రాక్చర్‌చీలమండ ఎముకల మధ్య ఉండే ఎముకకు అయిన ఫ్రాక్చర్‌.  

స్కేఫాయిడ్‌ ఫ్రాక్చర్‌మణికట్టుపై బరువు పడినప్పుడు అయిన ఫ్రాక్చర్‌లు. 

సరిగా అతుక్కోకపోవడమన్నది చాలా కొద్దిమందిలోనే...  
ఫ్రాక్చర్‌ అయినవాళ్లలో కేవలం ఒక శాతం కేసుల్లోనే ఎముక అసలు అతుక్కోక΄ోవడం (నాన్‌–యూనియన్‌) జరుగుతుంటుంది. ఇలాంటి పరిస్థితి చాలావరకు కాళ్ల ఎముకల విషయంలోనే ఎక్కువ. ఎందుకంటే కాలి ఎముక విరిగాక మళ్లీ కాళ్లు కదిలించాల్సి వచ్చినప్పుడు తగిలిన చోటే మళ్లీ మళ్లీ దెబ్బలు తగిలే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఈ కండిషన్‌ పునరావృతమయ్యే అవకాశాలెక్కువ. 

ఎముక సరిగా అతకకపోయినా (నాన్‌యూనియన్‌లోనైనా) లేదా ఆలస్యంగా అతికినా (డిలేయ్‌డ్‌ యూనియన్‌లో) కనిపించే సాధారణ లక్షణాలివి... 
ఎముక విరిగిన చోట (ఫ్రాక్చర్‌ ప్రాంతంలో) నొప్పి తగ్గక΄ోవడం లేదా అదేపనిగా నొప్పి వస్తుండటం. 
ఎముక విరిగిన శరీర భాగాన్ని మునుపటిలా ఉపయోగించలేక΄ోవడం. 
ఎముక ఫ్రాక్చర్‌ అయిన చోట వాపు (స్వెల్లింగ్‌) రావడం.  
విరిగిన ఎముకకు సంబంధించిన కీలు (జాయింట్‌)ను కదల్చలేక΄ోవడం. 
విరిగిన ఎముక సరిగా అతుక్కోక కాస్త అటు ఇటు కదులుతుండటం. 

విరిగిన ఎముకలు అతుక్కోవడంలో ఎదురయ్యే సమస్యలివి...  
విరిగిన ఎముక నయమయ్యే సమయంలో ఇతరత్రా అనేక సమస్యలు ఎదురుకావచ్చు. అసలు ఒక ఎముక అతుక్కోనేలేదని ఎప్పుడు చెప్పవచ్చంటే... 
∙మూడు నుంచి ఆర్నెల్ల తర్వాత కూడా విరిగిన ఎముక అతుక్కోకుండా ఉంటే దాన్ని ఎముక అతుక్కోవడంలో ఆలస్యం (డిలేయ్‌డ్‌ యూనియన్‌)గా చెప్పవచ్చు. ఒకవేళ ఆర్నెల్ల తర్వాత కూడా అతుక్కోకపోతే దాన్ని ‘నాన్‌యూనియన్‌’గా పేర్కొనవచ్చు. 
∙ఒక చోట ఎముక అతకడంలో తీవ్రమైన ఆలస్యం జరుగుతోందంటే అక్కడ ఎముక అతుక్కోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అర్థం. జాప్యం తీవ్రంగా ఉందంటే దాన్ని కొంతమేర అతకని ఎముక (నాన్‌యూనియన్‌)గానే పరిగణించాల్సి ఉంటుంది. 
∙రెండుగా విరిగిన భాగాలు ఒకదానితో ఒకటి అతుక్కుపోయినప్పటికీ అది సరిగా ఖచ్చితమైన రీతిలో కూర్చినట్లుగా అతుక్కోక΄ోతే దాన్ని ‘మాల్‌యూనియన్‌’ అంటారు. సాధారణంగా ఎముక సరిగ్గా రెండు ముక్కలుగా విరిగినప్పుడు దాన్ని సరిగా కూర్చుండబెట్టినప్పుడు సరిగానే అతుక్కుంటుంది. అయితే కొన్నిసార్లు దెబ్బ చాలా బలంగా పడి కొన్ని ఎముక విరిగిన చోట ముక్కలుగా అయి΄ోవడం వల్ల అతికించే ప్రక్రియలో ఖచ్చితంగా కూర్చలేని పరిస్థితులు ఏర్పడవచ్చు. దాని వల్ల ఎముక నిడివి కాస్త తగ్గవచ్చు. దీన్ని ‘ఇన్‌సఫిషియెంట్‌ రిడక్షన్‌’గా పేర్కొంటారు. పైన వివరించిన పరిస్థితులు ఏవైనప్పటికీ విరిగిన ఎముక సరిగా అతకక΄ోయినా లేదా అతుక్కోవడంలో ఆలస్యం జరిగినా బాధితులు అనేక సమస్యలు ఎదుర్కొంటారు.  
డాక్టర్‌ బాలవర్థన్‌ రెడ్డిసీనియర్‌ కన్సల్టెంట్‌ఆర్థోపెడిక్‌ సర్జన్‌ 

(చదవండి: ఎనర్జిటిక్‌ హేమంగి..! న్యూక్లియర్‌ సైన్స్‌లో..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement