ఎముకల బలాన్నిచాలాకాలం కాపాడుకుందాం | Mineral Salts Are The Ingredients That Are Needed To Keep The Bone Firm | Sakshi
Sakshi News home page

ఎముకల బలాన్నిచాలాకాలం కాపాడుకుందాం

Published Thu, Oct 3 2019 2:32 AM | Last Updated on Thu, Oct 3 2019 2:32 AM

Mineral Salts Are The Ingredients That Are Needed To Keep The Bone Firm - Sakshi

ఎముక గట్టిగా ఉండాలంటే అందులో ఉండాల్సిన పదార్థాలూ, ఖనిజ లవణాలన్నీ కూరి కూరి నిండి ఉన్నట్లుగా ఉండాలి. అప్పుడే ఎముకకు బలం. అదే కూరినట్లుగా కాకుండా వదులొదులుగా ఉంటే అది పెళుసుగా ఉంటుంది.  అంటే... దీన్ని బట్టి తెలిసేదేమిటంటే... ఎముకలో ఉండాల్సిన ఖనిజాలు, పదార్థాల సాంద్రత ఎంత ఎక్కువగా ఉంటే ఆ ఎముక అంత ఆరోగ్యంగా ఉంటుంది. అలాంటి ఎముకలు ఉన్నవారిలో ఆస్టియోపోరోసిస్‌ జబ్బుల్లాంటివి త్వరగా రావు. అలా ఎముక సాంద్రత ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలకు జబ్బులేమీ రాకుండా చూసుకోవడంతో పాటు వాటిని ఎక్కువ కాలం కాపాడుకోడానికి అవకాశం ఉంటుంది.

ఒకవేళ అదే ఎముకలో క్యాల్షియమ్, ఇతర మినరల్స్‌ వంటివి తక్కువగా ఉంటే అది పెళుసుగా మారిపోతుంది. పెళుసుగా ఉన్నవి త్వరగా విరిగిపోతాయన్న సంగతి తెలిసిందే కదా. ఎముకలు  అలా పెళుసుబారకుండా ఉండాలంటే ఎముకలో ఉండాల్సిన పదార్థాల సాంద్రత (బోన్‌ మినరల్‌ డెన్సిటీ) ఎంత ఉండాలి, అసలు బోన్‌ మినరల్‌ డెన్సిటీ అంటే ఏమిటి, దాన్ని సమకూర్చుకోడానికి ఏం చేయాలి వంటి అనేక అంశాలపై అవగాహన కోసమే ఈ కథనం.

మన ఎముకలు చిన్నప్పుడు కాస్తంత మెత్తగా ఉంటాయి. మెత్తగా అనడం కంటే ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి. మనిషి ఎదిగే కొద్దీ అవి క్రమంగా బలం పుంజుకుని, గట్టిపడుతుంటాయి. అంటే మునుపు ఉన్న ఫ్లెక్సిబిలిటీ తగ్గుతుందన్నమాట. ఇలా ఎముకలు బలం పుంజుకోడానికి... మనం తీసుకునే ఆహారం నుంచి, సూర్యరశ్మి నుంచి అవి అనేక పోషకాలను గ్రహిస్తుంటాయి. ఆహారం నుంచి క్యాల్షియమ్, సూర్యరశ్మి నుంచి విటమిన్‌ ‘డి’ గ్రహిస్తాయి. ఈ రెండింటితో పాటు మనం చేసే శారీరక శ్రమ కూడా తోడైతే అవి మరింత బలంగానూ, ఆరోగ్యకరంగానూ తయారవుతాయి. ఇలా ఎముకలు బలం పుంజుకుని, వాటిలో ఉండాల్సిన పదార్థాన్ని, ఖనిజాలను సమకూర్చుకుని పూర్తి సాంద్రతను సమకూర్చుకోడం అన్నది ఎదిగే పిల్లలు ఎదిగే క్రమంలో నిరంతరం జరిగే ప్రక్రియ. ఇలా ఎముకలో ఉండే సాంద్రతను బోన్‌ మాస్‌ డెన్సిటీ (బీఎమ్‌డీ) అంటారు.

ముప్ఫై ఏళ్ల వయసులో గరిష్ఠ సాంద్రత
ఒక మనిషికి  30 ఏళ్లు వచ్చే నాటికి అతడి ఎముకల్లోని సాంద్రత గరిష్టంగా ఉంటుంది. అలా గరిష్టంగా ఉన్న 30 ఏళ్ల వయసు తర్వాత నుంచి... క్రమంగా ఎముకలోని పదార్థాన్ని కోల్పోతూ ఉంటారు. దీన్నే ‘ప్రోగ్రెసివ్‌ బోన్‌ లాస్‌’ అని వ్యవహరిస్తారు. ఒకవేళ ఎముకలు త్వరత్వరగా తమ సాంద్రత కోల్పోతే అవి చాలా త్వరగా పెళుసుబారి త్వరగా ఆస్టియోపోరోసిస్‌కు దారితీస్తుంది. అయితే కొందరిలో ఎముక సాంద్రతను కోల్పోయే ప్రక్రియ చాలా నెమ్మదిగా, ఆలస్యంగా జరుగుతుంది. కానీ ఒక వయసు తర్వాత మాత్రం ఎముక తన సాంద్రతను కోల్పేయే పరిస్థితి క్రమంగా కొనసాగుతూనే ఉంటుంది.

మహిళల్లో మెనోపాజ్‌ తర్వాత...
మహిళల విషయానికి వస్తే రుతుస్రావం ఆగిపోయిన  (మెనోపాజ్‌) తర్వాత ఎముక సాంద్రత కోల్పోయే వేగం బాగా పెరుగుతుంది. (అందుకే మెనోపాజ్‌ ఆగిన మహిళల్లో ఆస్టియోపోరోసిస్‌ రిస్క్‌ ఎక్కువ). కాబట్టి మన ఎముకలోని సాంద్రతను వీలైనంత ఎక్కువ కాలం మనం నిలుపుకోగలిగితే మన ఎముక ఆరోగ్యం కూడా బాగుంటుంది.

ఎముకల్లో సాంద్రత తగ్గించే రిస్క్‌ ఫ్యాక్టర్లు ఇవే...
ఎముకల్లో సాంద్రత తగ్గేలా చేసే పొగాకు, ఆల్కహాల్‌ దురలవాట్లు, వ్యాయామం చేయకపోవడం వంటి వాటిని మనం ప్రయత్నపూర్వకంగా మార్చుకుని ఆరోగ్యాన్ని సమకూర్చుకోవచ్చు. అయితే ఇందులో కొన్ని మార్చుకోలేని, తప్పనిసరి రిస్క్‌ ఫ్యాక్టర్లు కూడా ఉన్నాయి. అవి... మహిళలు ఎముకల సాంద్రత కోల్పోవడం ఎక్కువ (మరీ ముఖ్యంగా మెనోపాజ్‌ తర్వాత), పొట్టిదనం (అరవై కిలోల కంటే లోపు ఉండి, 155 సెం.మీ. కంటే తక్కువ ఎత్తున్న మహిళల్లో ఎముక సంద్రత తగ్గడం చాలా త్వరగా, వేగంగా జరుగుతుంటుంది). దీనికి తోడు మన ప్రాంతీయత కూడా ఎముక సాంద్రతకు దోహదం చేస్తుంది.  (పాశ్చాత్యులతో పోలిస్తే  ఆసియన్లు, చైనీయులు, కాకసాయిడ్స్‌లో ఎముక సాంద్రత స్వతహాగానే తక్కువ). అలాగే మన కుటుంబ చరిత్ర (కొందరిలో ఎముకలు తేలిగ్గా విరిగే తత్వం ఉంటుంది), మన జీవనశైలి, కాఫీ, ఆల్కహాల్‌ వంటి అలవాట్లు... ఇవన్నీ ఎముక సాంద్రత త్వరగా తగ్గడానికి దోహదం చేసే అంశాలే.

ఎముక సాంద్రతను తక్కువ చేసే జబ్బులివి...
ఇక హైపోగొనాడిజమ్, థైరోటాక్సికోసిస్, కుషింగ్‌ సిండ్రోమ్, అనొరెక్సియా నర్వోజా (తిండిపై ఆసక్తికోల్పోయి అసలు ఆహారం తీసుకోకపోయే రుగ్మత), మాల్‌ అబ్షార్‌ప్షన్‌ సిండ్రోమ్‌ (మనం తీసుకున్న పోషకాలు వంటికి పట్టని రుగ్మత), దీర్ఘకాలిక కాలేయ వ్యాధులు, దీర్ఘకాలిక మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు, ఫిట్స్‌ వస్తున్నప్పుడు తీసుకునే మందులైన యాంటీ కన్వల్సెంట్స్, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ వంటి దీర్ఘకాలిక ఇన్‌ఫ్లమేటరీ వ్యాధుల వల్ల కూడా ఎముక సాంద్రత తగ్గిపోయి, ఆ తర్వాతి దశలో మొదటి వ్యాధుల ఫలితంగా సెకండరీ ఆస్టియోపోరోసిస్‌కు దారితీస్తుంది.

ఎముక సాంద్రతపై దృష్టి పెట్టాల్సిన వారెవరు?
►మహిళలు 55 ఏళ్లు దాటిన వారైతే, పురుషులైతే 65 ఏళ్లు దాటినవారైతే ఒకసారి ఎముక సాంద్రత పరీక్ష చేయించుకోవాలి. ఇక ఈ కింది కండిషన్స్‌ గాని ఉంటే 50 ఏళ్ల పైబడ్డవారంతా ఎముక సాంద్రతపై దృష్టిపెట్టాలి. అవి...

►గతంలో ఏదైనా ప్రమాదం జరిగి ఎముక విరగడం వంటి ట్రామా కేసుల వారు. తక్కువ బరువు ఉన్నవారు.

►గతంలో తుంటి ఎముక ఫ్రాక్చర్‌ అయినవారు

►వెన్నెముకకు సంబంధించిన రుగ్మత లేదా అబ్‌నార్మాలిటీస్‌ ఉన్నవారు.

►గ్లూకోకార్టికాయిడ్‌ స్టెరాయిడ్‌ను ఒక మందుగా తీసుకుంటున్నవారు

►హైపర్‌ థైరాయిడిజమ్‌తో బాధపడుతున్నవారు

►ఆస్టియోపోరోసిస్‌ జబ్బుకు మందు తీసుకుంటూ... డాక్టర్ల అబ్జర్వేషన్‌లో  ఉన్నవారు.

►తినడానికి సంబంధించిన రుగ్మతలు (అంటే తిన్నది సరిగా ఒంటబట్టకపోవడం వంటి) ఈటింగ్‌ డిజార్డర్స్‌ ఉన్నవారు... వీరితో పాటు పొగతాగడం, మద్యపానం  అలవాటు ఉన్నవారు, విటమిన్‌ ‘డి’ లోపం ఉన్నవారు తప్పనిసరిగా మీద 50 ఏళ్లు పైబడ్డ నాటి నుంచే  డాక్టర్‌ సలహా మేరకు ఎముక సాంద్రత పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.

ఎముక సాంద్రత తెలుసుకోవడం ఎలా..?
నిజానికి ఇది ఆస్టియోపోరోసిస్‌ నిర్ధారణకు చేసే పరీక్ష. దీన్ని ‘డ్యుయల్‌ ఎనర్జీ ఎక్స్‌–రే అబ్జార్షియోమెట్రీ’ అంటారు. దీనితో కేవలం ఐదు నిమిషాల్లోనే ఎముక సాంద్రత ఎంత అన్నది తెలిసిపోతుంది. అయితే ఈ విలువను అందరిలో ఒకేలా కాకుండా వయసును పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి దీన్ని ‘టీ’ స్కోర్‌గా చెబుతారు. దీనితో పాటు సీరమ్‌ లెవల్స్‌ ఆఫ్‌ క్యాల్షియమ్, ఫాస్ఫరస్, ఆల్కలైన్‌ ఫాస్ఫేట్స్, ఇన్‌టాక్ట్‌ పారాథైరాయిడ్‌ హార్మోన్‌ (పీటీహెచ్‌) వంటి పరీక్షలు కూడా అవసరమవుతాయి.

ఎముక సాంద్రతను పెంచుకోవాలంటే...  
ముందు చెప్పుకున్నట్లుగానే ఎముక సాంద్రతకు మంచి బీజం యుక్తవయసులోనే పడాలి. పైగా ఎముక సాంద్రత పెరగడానికి తీసుకోవాల్సిన చర్యలన్నీ పెద్దగా ఖర్చు లేకుండానే స్వాభావికంగా జరిగేవే ఎక్కువ. కాబట్టి పిల్లలందరినీ యుక్తవయసులోకి వచ్చే ముందు క్యాల్షియమ్‌ ఎక్కువగా ఉండే ఆహారాన్ని అంటే పాలు, పెరుగు, బ్రకోలీ వంటి తాజా కూరలు ఎక్కువగా తీసుకునేలా చూడాలి. అలాగే ఆరుబయట ఎండకు ఎక్స్‌పోజ్‌ అవుతూ ఎక్కువసేపు ఆడేలా ప్రోత్సహించాలి. దీనివల్ల శరీరంలో విటమిన్‌ ‘డి’ ఎక్కువగా తయారవుతుంది. మనం తీసుకున్న ఆహార పదార్థాల్లోని క్యాల్షియమ్‌ను ఎముకల్లోకి ఇంకేలా చేస్తుంది విటమిన్‌ ‘డి’. అందుకే కేవలం క్యాల్షియమ్‌ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకున్నంత మాత్రాన కాకుండా... విటమిన్‌ ‘డి’ వల్ల కూడా ఎముకలకు బలం చేకూరుతుంది. దీనితో పాటు ఆ సమయంలో వారు తగినంతగా శారీరక శ్రమ, వ్యాయామం చేసేలా చూస్తే పిల్లలు బలంగా మారడమే కాకుండా, వారు మంచి బలంగా తయారవుతారు. చాలాకాలం... అంతెందుకు వృద్ధాప్యంలోనూ వారు ఇంచుమించుగా దాదాపుగా అంతే బలంతో ఉంటారు.

ఎముక సాంద్రతను  నిర్ణయించే అంశాలు...
మనలోని చాలా అంశాలు ఎముక సాంద్రతతో కీలక భూమిక పోషిస్తాయి. ఉదాహరణకు ఒకరి జన్యువుల్లోనే ఎముక సాంద్రత అధికంగా ఉండే గుణం ఉంటుంది. దాంతోపాటు వ్యాయామం / శారీరక శ్రమ, క్యాల్షియమ్‌ తీసుకోవడం, విటమిన్‌ ‘డి’ని గ్రహించడం వంటి అంశాలు కూడా ఎముక సాంద్రతకు దోహదపడతాయి. ఇక పొగతాగడం, మద్యపానం, తరచూ జబ్బుపడటం, శారీరక శ్రమ చేయకుండా ఒక చోట కూర్చొని పనిచేయడం లేదా బద్దకంగా ఉండటం, కొన్ని రకాల మందులు (గ్లూకోకార్టికాయిడ్స్, యాంటీ ఎపిలెప్టిక్‌ మందులు) తీసుకోవడం వంటి అంశాలు ఎముక సాంద్రతను గుల్లబార్చి అవి బలహీనంగా మారేలా చేస్తాయి.

యౌవన దశే  కీలకం
మన బాలలు యౌవన ప్రవేశకాలంలో ఎక్కువగా క్యాల్షియమ్‌ ఉండే ఆహారాన్ని తీసుకోవడం, ఆ సమయంలో ఎక్కువగా విటమిన్‌ ‘డి’ని గ్రహించేలా ఆరుబయట తిరగడం, వ్యాయామం చేయడం వంటివి చేయాలి. ఎందుకంటే ఆ సమయంలో సమకూర్చుకున్న ఎముక సాంద్రత దాదాపు జీవితకాలమంతా రక్షణ ఇస్తుంది. ఆ సమయంలో ఎంత ఎక్కువ సాంద్రతను గ్రహిస్తే, క్రమంగా కోల్పోయే దశ  ప్రారంభమైనా కూడా అది చాలాకాలం ఉండేలా తోడ్పడుతుంది. ఆ సమయంలో దురలవాట్లకు చేరువ కావడం, వ్యాయామం చేయకపోవడం వంటివి చేస్తే అది ఆ తర్వాత కాలంలోనూ నష్టం చేకూరుస్తుంది.

డాక్టర్‌ కె. సుధీర్‌రెడ్డి, ఆర్థోపెడిక్‌ సర్జన్,
ల్యాండ్‌మార్క్‌ హాస్పిటల్స్,
కేపీహెచ్‌బీ, హైదరా
బాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement