
కొంపముంచిన ‘మ్యాజిక్ మనీ’
కరెన్సీ కట్టలను ప్యాక్ చేసి ఇంజక్షన్ ఇస్తే డబుల్ మనీ అంటూ టోకరా
● చైతన్యపురిలో వెలుగులోకి నయా తరహా వంచన
● రూ.1.75 లక్షలు స్వాహా
చైతన్యపురి: మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించినా కొత్త రకం మోసాలకు అమాయకులు బలైపోతున్నారు. చెప్పుడు మాటలతో మోసపోతున్నారు. ఇలా ‘మ్యాజిక్ మనీ’ పేరుతో జరిగిన నయా తరహా మోసం చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. చైతన్యపురిలో నివసించే ప్రైవేట్ ఉద్యోగి దుద్దాల సాయి కల్యాణ్, బి.ఆనంద్ స్నేహితులు. ఆర్థిక ఇబ్బందులు తొలగాలంటే మ్యాజిక్ మనీ ట్రిక్ ఒకటి ఉందని, ఎంత డబ్బులు ఇస్తే దానికి రెట్టింపు సంపాదించవచ్చని ఆనంద్ చెప్పాడు. తన స్నేహితుడు కందా శ్రీనివాస్‌ను మ్యాజిక్ మనీ గురించి తెలుసన్నాడు. ఈ నెల 16న విద్యుత్‌నగర్ రోడ్‌నంబర్–8 లోని శ్రీనివాస్ ఇంటికి సాయి కల్యాణ్‌ను తీసుకెళ్లాడు. కొద్ది సేపటి తర్వాత రవి అనే వ్యక్తిని పిలిపించారు. ఎంత డబ్బు ఇస్తే అంత రెట్టింపు మనీ వచ్చేలా చేస్తానని నమ్మబలికాడు. దీంతో సాయి కల్యాణ్ తన వద్ద ఉన్న రూ.1.75 లక్షల కరెన్సీ నోట్లను శ్రీనివాస్ ద్వారా రవికి అప్పగించాడు. రవి ఆ డబ్బును తీసుకుని బ్రౌన్ కలర్ బాక్స్‌లో పెట్టి పైన ఆకుపచ్చ రంగు టేప్ చుట్టి డబ్బాకు పింక్ కలర్ ఇంజక్షన్ చేశాడు. బాక్స్‌ను శ్రీనివాస్ ఇంట్లోని ఫ్రిజ్‌లో పెట్టి సాయంత్రం వస్తానని రవి వెళ్లిపోయాడు. అయితే సాయంత్రం అయినా రవి తిరిగి రాలేదు. అతని మొబైల్‌కు కాల్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. రెండు రోజుల తర్వాత శ్రీనివాస్ తన ఇంట్లో ఫ్రిజ్‌లోని డబ్బులు పెట్టిన బాక్స్‌ను సాయి కల్యాణ్ ఇంటికి తీసుకొచ్చాడు. దానిని తెరిచి చూడగా డబ్బుకు బదులు తెల్ల కాగితాలు ఉండటం గమనించారు. దీంతో మోసపోయానని గ్రహించిన సాయి కల్యాణ్ మంగళవారం సాయంత్రం పోలీసులకు పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.