Hyderabad District News
-
కొంపముంచిన ‘మ్యాజిక్ మనీ’
కరెన్సీ కట్టలను ప్యాక్ చేసి ఇంజక్షన్ ఇస్తే డబుల్ మనీ అంటూ టోకరా ● చైతన్యపురిలో వెలుగులోకి నయా తరహా వంచన ● రూ.1.75 లక్షలు స్వాహా చైతన్యపురి: మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించినా కొత్త రకం మోసాలకు అమాయకులు బలైపోతున్నారు. చెప్పుడు మాటలతో మోసపోతున్నారు. ఇలా ‘మ్యాజిక్ మనీ’ పేరుతో జరిగిన నయా తరహా మోసం చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. చైతన్యపురిలో నివసించే ప్రైవేట్ ఉద్యోగి దుద్దాల సాయి కల్యాణ్, బి.ఆనంద్ స్నేహితులు. ఆర్థిక ఇబ్బందులు తొలగాలంటే మ్యాజిక్ మనీ ట్రిక్ ఒకటి ఉందని, ఎంత డబ్బులు ఇస్తే దానికి రెట్టింపు సంపాదించవచ్చని ఆనంద్ చెప్పాడు. తన స్నేహితుడు కందా శ్రీనివాస్‌ను మ్యాజిక్ మనీ గురించి తెలుసన్నాడు. ఈ నెల 16న విద్యుత్‌నగర్ రోడ్‌నంబర్–8 లోని శ్రీనివాస్ ఇంటికి సాయి కల్యాణ్‌ను తీసుకెళ్లాడు. కొద్ది సేపటి తర్వాత రవి అనే వ్యక్తిని పిలిపించారు. ఎంత డబ్బు ఇస్తే అంత రెట్టింపు మనీ వచ్చేలా చేస్తానని నమ్మబలికాడు. దీంతో సాయి కల్యాణ్ తన వద్ద ఉన్న రూ.1.75 లక్షల కరెన్సీ నోట్లను శ్రీనివాస్ ద్వారా రవికి అప్పగించాడు. రవి ఆ డబ్బును తీసుకుని బ్రౌన్ కలర్ బాక్స్‌లో పెట్టి పైన ఆకుపచ్చ రంగు టేప్ చుట్టి డబ్బాకు పింక్ కలర్ ఇంజక్షన్ చేశాడు. బాక్స్‌ను శ్రీనివాస్ ఇంట్లోని ఫ్రిజ్‌లో పెట్టి సాయంత్రం వస్తానని రవి వెళ్లిపోయాడు. అయితే సాయంత్రం అయినా రవి తిరిగి రాలేదు. అతని మొబైల్‌కు కాల్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. రెండు రోజుల తర్వాత శ్రీనివాస్ తన ఇంట్లో ఫ్రిజ్‌లోని డబ్బులు పెట్టిన బాక్స్‌ను సాయి కల్యాణ్ ఇంటికి తీసుకొచ్చాడు. దానిని తెరిచి చూడగా డబ్బుకు బదులు తెల్ల కాగితాలు ఉండటం గమనించారు. దీంతో మోసపోయానని గ్రహించిన సాయి కల్యాణ్ మంగళవారం సాయంత్రం పోలీసులకు పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
బుక్ చేయబోయి బుక్కయ్యాడు!
ఆన్లైన్ విధానంలో శ్రీశైలంలో రూమ్ బుకింగ్ ● జీఎస్టీ కోసమంటూ ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు ● నగదు రిఫండ్ చేస్తామని రూ.1.33 లక్షలు స్వాహా సాక్షి, సిటీబ్యూరో: శ్రీశైలం వెళ్లాలని భావించిన నగర వాసి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా రూమ్ బుక్ చేసుకున్నారు. జీఎస్టీ విషయంలో తేడా రావడంతో ఆ బుకింగ్ రద్దు చేసుకోవాలని భావించారు. చెల్లించిన మొత్తం రిఫండ్ ఇస్తామంటూ ఎర వేసిన సైబర్ నేరగాళ్లు రూ.1.33 లక్షలు కాజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నగరానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి శ్రీశైలంలోని వైశ్య సత్రంలో రూమ్ కోసం ఆన్లైన్లో సెర్చ్ చేశారు. ఓ వెబ్సైట్ ఆధారంగా ఒక రోజు కోసం రూమ్ బుక్ చేసుకుని, అందుకు సంబంధించి రూ.1000 చెల్లించారు. అది బోగస్ వెబ్సైట్ కావడంతో బాధితుడి వివరాలను సైబర్ నేరగాళ్లకు చేరాయి. కొద్దిసేపటికే అతడికి కాల్ చేసిన నేరగాళ్లు... రూమ్ అద్దె మాత్రమే చెల్లించారని, బుకింగ్ ఖరారు కావడానికి జీఎస్టీగా మరో రూ.180 చెల్లించాలని కోరారు. దీంతో తనకు రూమ్ వద్దని చెప్పిన బాధితుడు తాను చెల్లించిన రూ.వెయ్యి రిఫండ్ చేయాలని కోరాడు. దీంతో సైబర్ నేరగాడు రిఫండ్ కోసం సంప్రదించాలంటూ మరో నెంబర్ ఇచ్చాడు. బాధితుడు ఆ నెంబర్‌కు కాల్ చేసి విషయం చెప్పగా... రిఫండ్ ప్రాసెస్ ప్రారంభించడానికి తొలుత తమకు రూ.1 చెల్లించాలని కోరారు. యువకుడు అలానే చెల్లించగా... రూ.2 రిఫండ్ చేశారు. తమ కంపెనీ రిఫండ్ పాలనీ ఇలానే ఉందని... తమకు చెల్లించిన మొత్తానికి రెట్టింపు తిరిగి ఇస్తూ రిఫండ్ పూర్తి చేస్తామని నమ్మబలికారు. ఆపై బాధితుడి నుంచి రూ.1,180 కట్టించుకుని రెట్టింపు ఇచ్చారు. ఇలా కొన్నిసార్లు జరిగిన తర్వాత రూ.76,500 చెల్లించాలని చెప్పడంతో బాధితుడు నిరాకరించాడు. ఇప్పటి వరకు తాను చెల్లించింది తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో తమ వద్దకు నేరుగా వచ్చి డబ్బు తీసుకోవాలని వాళ్లు చెప్పడంతో నగర యువకుడు అంగీకరించలేదు. చివరకు తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు లెక్కలు చూడగా సైబర్ నేరగాళ్లకు రూ.1,33,564 చెల్లించినట్లు తేలింది. ఈ మేరకు ఆన్లైన్ ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. -
పోలింగ్‌కు బీఆర్ఎస్ దూరం
ఫలించిన కేటీఆర్ హుకుం ● కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీల నుంచి అందరూ హాజరు ● 112 మందికిగాను ఓటేసింది 88 మంది ● ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ అప్పుడు అలా.. ఉమ్మడి రాష్ట్రంలో ఒక పర్యాయం హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్ధానానికి రెండు పార్టీలు పోటీకి దిగగా, ఓటర్ల బలం లేని పార్టీ తీరా పోలింగ్ రోజున బహిష్కరించడంతో సాంకేతికంగా పోలింగ్ జరిగినప్పటికీ, ఎన్నిక ఏకగ్రీవమే అయినట్లు సమాచారం. సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. అవాంఛనీయ ఘటనలేమైనా జరుగుతాయేననే భయాందోళనలతో పాటు పలు ఊహాగాలకు తావిచ్చింది. పలు ప్రచారాలతో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఎన్నికలో ఓటర్లు కేవలం ప్రజాప్రతినిధులే కావడం.. పార్టీల వారీగా సంఖ్యాబలంతోనే గెలవలేమని తెలిసి తక్కువ ఓట్లున్న పార్టీలు పోటీ చేయకపోవడంతో గతంలో ఏకగ్రీవంగానే ఈ ఎన్నిక ముగిసేది. ఈసారి తగిన సంఖ్యాబలం లేనప్పటికీ, బీజేపీ పోటీలో దిగడం, ఇతర పార్టీల ఓట్లనూ కూడగడతామని ధీమాగా చెప్పడంతో ఈ ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఈ పోలింగ్‌ను తాము బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించిన నేపథ్యంలో.. ఆ పార్టీ వారి వైఖరి ఏమిటన్నది పోలింగ్ ముగిసేంత వరకూ సస్పెన్స్‌గానే సాగింది. ఒక దశలో నలుగురైదుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోలింగ్‌కు వస్తున్నట్లు మీడియాలో కొందరికి సమాచారమిచ్చి, అంతలోనే ఆ ఆలోచన విరమించుకున్నట్లు తెలిసింది. రెండు కేంద్రాల్లో పోలింగ్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెండు కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. బుధవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సమయమున్నప్పటికీ, మధ్యాహ్నం 2 గంటల వరకే 78.57 శాతంతో పోలింగ్ పూర్తయింది. మొత్తం 112 మంది ఓటర్లలో (కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు) 88 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. మిగతా 24 మంది బీఆర్ఎస్ వారిగా భావిస్తున్నారు. అన్ని పార్టీల్లో వెరసి ఎక్స్అఫీషియో సభ్యులు 31 మందిలో 22 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 81 మంది కార్పొరేటర్లలో 66 మంది ఓట్లేశారు. తొలుత బీజేపీ.. పోలింగ్ సమయం ప్రారంభమయ్యాక తొలుత బీజేపీ నుంచి కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డా.కె. లక్ష్మణ్ వరుసగా ఓట్లు వేశారు. అనంతరం ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, జాఫర్ హుస్సేన్, మాజిద్ హుస్సేన్, అహ్మద్ బలాలా, మహ్మద్ ముబిన్, కౌసర్ తదితరులు ఒకరి తర్వాత ఒకరు ఓట్లు వేశారు. టీజేఎస్ ఎమ్మెల్సీ కోదండరామ్, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ప్రస్తుత ‘స్థానిక’ సిట్టింగ్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శ్రీగణేశ్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్‌రెడ్డితో పాటు ఇతర కార్పొరేటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ విడిగా వచ్చి ఓటేశారు. బీఆర్ఎస్ మినహా మిగతా పార్టీలకు చెందిన ఓటర్లందరూ పోలింగ్‌లో పాల్గొన్నారు. ఎంఐఎం గెలుపు లాంఛనమే.. పోలింగ్‌లో 88 మంది పాల్గొన్నందున సగం కంటే ఎక్కువ.. అంటే 45 ఓట్లు వచ్చిన వారు విజేతగా నిలుస్తారు. ఎంఐఎం పార్టీకి స్వతహాగానే 49 ఓటర్ల బలం ఉండటంతో పాటు కాంగ్రెస్ ఓట్లు కూడా వారికే పడే అవకాశ ఉండటంతో ఎంఐఎం గెలుపు లాంఛనమేనని భావిస్తున్నారు. బీజేపీ మాత్రం తమకు కొన్ని కాంగ్రెస్ ఓట్లు పడ్డట్లు చెబుతోంది. స్ట్రాంగ్‌రూమ్‌లకు బ్యాలెట్ బాక్స్‌లు పోలింగ్ ముగిశాక బ్యాలెట్ పత్రాలున్న బాక్స్‌లను జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌లోకి తరలించారు. ఓటు వేస్తున్న నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి -
ఈసారి ‘బతుకమ్మ’ కుంటలోనే..
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యే నాటికి బతుకమ్మ కుంటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, ప్రజలు వినియోగించుకోవడానికి సిద్ధం చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. స్థానికులు బతుకమ్మ కుంటలోనే పండగ సంబరాలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ వివాదానికి సంబంధించి న్యాయస్థానం మంగళవారం కీలక తీర్పు ఇచ్చింది. దీంతో రంగనాథ్ బుధవారం అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటను సందర్శించారు. అభివృద్ధి పనులను స్థానికుల సమక్షంలో పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజలో ఆయన పాల్గొన్నారు. యుద్ధ ప్రాతిపదికన ఈ చెరువు పునరుద్ధరణ, అభివృద్ధి, సుందరీకరణ పనులు జరగాలని అధికారులను ఆదేశించారు. ఈ చెరువు పునరుజ్జీవంతో పరిసరాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలూ ఆహ్లాదకరంగా మారుతాయన్నారు. అభివృద్ధి పనులకు సహకరించాలని స్థానికులను కోరారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ చెరువు పూడికతీత ప్రారంభమైంది. ఆ నెల 18న జేసీబీలు కేవలం అడుగున్నర తవ్వగా... లోపల నుంచి నీళ్లు ఉబికివచ్చాయి. ఆపై కోర్టు వివాదం నేపథ్యంలో పనులకు బ్రేక్ పడగా.. బుధవారం మళ్లీ మొదలయ్యాయి. హైడ్రా కోసం ప్రత్యేక లోగో సిద్ధమైంది. ఇప్పటి వరకు అధికారులు జీహెచ్ఎంసీలో భాగంగా ఉండగా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) కోసం రూపొందించిన లోగోనే వినియోగించారు. తాజాగా హైడ్రా కోసం ఓ ప్రత్యేక లోగోను డిజైన్ చేశారు. ప్రభుత్వ భూముల కబ్జాలపై చర్యలు తీసుకుంటున్నప్పటికీ హైడ్రా ప్రధాన లక్ష్యం జలవనరుల పరిరక్షణ. ఈ థీమ్ ఉట్టిపడేలా లోగోను కమిషనర్ ఏవీ రంగనాథ్ ఖరారు చేశారు. అభివృద్ధి పనులు పునఃప్రారంభంలో రంగనాథ్ వెల్లడి హైడ్రా కోసం రూపొందించిన ప్రత్యేక లోగో సిద్ధం -
ఉగ్రవాదంపై పెల్లుబికిన ఆగ్రహం
జమ్మూ కశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై మంగళవారం జరిగిన ఉగ్రదాడిని నగరం ముక్తకంఠంతో ఖండించింది. ఉగ్రవాదంపై ఆగ్రహం పెల్లుబికింది. బుధవారం నగర వ్యాప్తంగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేశారు. మృతులకు నివాళులు అర్పిస్తూ ర్యాలీలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ ఉగ్రవాదుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్–ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌కు క్రీడాకారులు, రిఫరీలు నల్లబ్యాడ్జీలతో హాజరయ్యారు. సంతాప సూచికంగా ఈ మ్యాచ్‌కు చీర్ గర్ల్స్ను రద్దు చేశారు. – సాక్షి, సిటీబ్యూరో -
సుంకిశాల పనుల్లో నిర్లక్ష్యం వద్దు
జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి సాక్షి, సిటీబ్యూరో: సుంకిశాల ప్రాజెక్టు పనుల డిజైన్లు వెంటనే సమర్పించాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులను జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. పనుల నాణ్యతలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. బుధవారం నాగార్జున సాగర్ వద్ద నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆయన జలమండలి ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. పైపులైన్ విస్తరణ పనులు.. సుంకిశాల ఇంటేక్ వెల్ నిర్మాణ పనులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం సివిల్, టన్నెల్, ఎలక్ట్రికల్, పైపులైన్ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. టన్నెల్, ఎలక్ట్రికల్ పనులు తుది దశకు చేరుకున్నాయని.. సివిల్ వర్క్స్ ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అనంతరం సుంకిశాల టన్నెల్ గేట్ రిటైనింగ్ వాల్ పక్కకు ఒరిగిన ప్రాంతాన్ని అశోక్‌రెడ్డి పరిశీలించారు. ఆయన వెంట జలమండలి ప్రాజెక్టు డైరెక్టర్ టీవీ శ్రీధర్, సీజీఎం మహేష్, జీఎంలు, ప్రాజెక్టు అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఉన్నారు. -
‘కళింగ’ వేదికగా వస్త్ర వైభవం..
ఏప్రిల్ 27 వరకు కొనసాగనున్న నేషనల్ సిల్క్ ఎక్స్పో సాక్షి, సిటీబ్యూరో: దేశంలోని వివిధ ప్రాంతాల సాంస్కృతిక వైవిధ్యం కలిగిన వస్త్ర ఉత్పత్తులు నగరం వేదికగా అలరిస్తున్నాయి. నగరంలోని బంజారాహిల్స్ వేదికగా కళింగ కల్చరల్ సెంటర్లో ఏప్రిల్ 27 వరకు కొనసాగనున్న ‘నేషనల్ సిల్క్ ఎక్స్పో’ నగరవాసులకు నాణ్యమైన, విలక్షణమైన వస్త్రర సోయగాలను చేరువ చేస్తోంది. ఈ ఎక్స్‌పోలో విభిన్న రకాల పట్టు డిజైన్లతో పాటు కాటన్ డిజైన్ దుస్తులు, డిజైనర్ బ్లౌజ్‌లు, కుర్తీలు తదితర భారతీయ వస్త్ర వైభవాలు నేత కార్మికుల ద్వారా 50 శాతం వరకు తగ్గింపుతో అందించబడుతున్నాయి. ఇందులోని మహారాష్ట్ర స్వచ్ఛమైన పైథానీ సిల్క్ చీరలు, కర్ణాటక – బెంగళూరు సిల్క్, సాఫ్ట్ సిల్క్ తదితరాలు వస్త్ర ప్రియులను ఆకర్షిస్తున్నాయి. -
‘సీవర్ క్రోక్’ పనితీరు పరిశీలన
సాక్షి, సిటీబ్యూరో: మురుగు నీటి పైపు లైన్లలో పేరుకుపోయిన సిల్ట్‌ను తొలగించేందుకు ఉద్దేశించిన సీవర్ క్రోక్ రోబోటిక్ యంత్రం పనితీరును హైడ్రా, జీహెచ్ఎంసీ కమిషనర్లు ఏవీ రంగనాథ్, ఇలంబర్తి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రోబోటిక్, వాటర్–జెట్ శక్తితో నడిచే ఈ యంత్రం సిల్ట్‌ను తొలగించే విధానాన్ని గమనించారు. సచివాలయం ముందు ఉన్న డైన్లలో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. మురుగు, వరద నీరు పొంగి రహదారులను ముంచెత్తిత్తడం నగరంలో సర్వ సాధారణం. ఈ పరిస్థితుల్లో సీవర్ క్రోక్ ఎంత వరకు ఉపకరిస్తుందనేది అధ్యయనం చేశారు. వాటర్ జెట్‌తో టర్బైన్ తిప్పడంతో ముందుకు వెళ్లి ఈ యంత్రం బ్లేడ్ల సాయంతో చెత్తను తొలగిస్తుంది. మురుగునీటి లైన్లను శుభ్రం చేయడానికి సీవర్ క్రోక్ను గతంలో వాటర్ బోర్డు వినియోగించిందని తయారీ సంస్థ అజంతా టెక్నో సొల్యూషన్స్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ జర్మయ్య తెలిపారు. -
రాజ్‌తరుణ్‌పై న్యాయపోరాటం చేస్తా
మణికొండ: తాను ఉంటున్న ఇంటిని లాక్కునేందుకు సినీహీరో రాజ్‌తరుణ్ అతని తల్లితండ్రులను పంపి డ్రామాలు చేస్తున్నాడని, అతని అనుచరులతో తనపై దాడి చేయించాడని, అతడిపై న్యాయ పోరాటం చేస్తానని అతని మాజీ ప్రియురాలు లావణ్య అన్నారు. కోకాపేటలోని రాజ్‌తరుణ్ విల్లాకు బుధవారం అతని తల్లితండ్రులు రాజేశ్వరి, బసవరాజు తాము ఇక్కడే ఉంటామని రాగా, వారిని ఇంట్లోకి రానివ్వకుండా లావణ్య అడ్డుకున్న విషయం తెలిసిందే. వారు అర్దరాత్రి వరకు విల్లా ముందే కూర్చోవటంతో నార్సింగి పోలీసులు జోక్యం చేసుకుని వారిని ఇంట్లోకి పంపించారు. దీంతో గురువారం ఆమె రాజ్‌తరుణ్ తరఫు వ్యక్తులు 15 మంది తనపై దాడి చేశారని, వారి వెనక అతనే ఉన్నాడా.. మస్తాన్ సాయి ఉన్నాడా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనకు రాజ్‌తరుణ్‌తో ప్రాణహాని ఉందని, ఇప్పటి వరకు కలిసి పోదామని మిన్నకున్నానని, బుధవారం జరిగిన దాడితో అతనిపై న్యాయపోరాటం చేస్తానన్నారు. బెయిల్‌పై ఉన్న వ్యక్తి తనపై దాడులు చేయిస్తున్నారని ఆమె ఆరోపించింది. మస్తాన్‌సాయిని పంపినట్లు రాజ్‌తరుణ్‌ను కూడా జైలుకు పంపుతానన్నారు. కాగా రాజ్‌తరుణ్ తల్లి తండ్రులు విల్లాలోని రెండవ అంతస్తులో ఉండగా లావణ్య మొదటి అంతస్తులో ఉంటున్నట్లు తెలిపారు. ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని.. భవనం పైనుంచి దూకి ప్రియురాలి ఆత్మహత్య గచ్చిబౌలి: ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి లోనైన ఓ యువతి ప్రియుడి ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని బంజారానగర్‌లో చోటు చేసుకుంది. ఎస్ఐ రాములు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అస్సాం రాష్ట్రం, బస్కంది గ్రామానికి చెందిన సుల్తానా బేగం(26) సిద్ధిఖీనగర్‌లో ఉంటూ గచ్చిబౌలిలోని అంతేరా హోటల్లో సర్వర్‌గా పని చేస్తోంది. వెస్ట్ బెంగాల్‌కు చెందిన సైదుల్లా షేక్ గచ్చిబౌలిలోని నావాబ్ హోటల్లో మేనేజర్‌గా పని చేస్తూనే పెస్ట్ కంట్రోల్ పని చేసేవాడు. సుల్తానా, సైదుల్లా షేక్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సుల్తానా తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేసేందుకు సంబంధాలు చూస్తుండటంతో తనను పెళ్లి చేసుకోవాలని సుల్తానా సైదుల్లాపై ఒత్తిడి పెంచింది. బుధవారం సాయత్రం పెళ్లి విషయమై గొడవ జరిగింది. దీంతో పెళ్లికి నిరాకరించిన అతను ఆమె ఫోన్‌ను బ్లాక్‌లో పెట్టాడు. దీంతో సుల్తానా మరో యువతికి ఫోన్ చేసి షైదుల్లా ఉంటున్న ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. దీంతో ఆమె ఈ విషయాన్ని సైదుల్లాకు చెప్పినా అతను పట్టించుకోలేదు. దీంతో మనస్తాపానికి లోనైన సుల్తానా గురువారం ఉదయం సైదుల్లా నివాసం ఉండే భవనంపైకి ఎక్కి 6వ అంతస్తు నుంచి దూకడంతో కింద పార్క్ చేసి ఉన్న కారుపై పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి నిమ్స్‌కు తరలించగా ఉదయం మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ● నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో మరోసారి ఫిర్యాదు ● నాపై 15 మంది దాడి చేశారు ప్రాణహాని ఉంది ● రాజ్‌తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య -
‘ట్రాఫిక్ పే’లో వివక్ష!
సాక్షి, సిటీబ్యూరో: ట్రాఫిక్ నిర్వహణ కోసం ఓ జంక్షన్లో హోంగార్డు, ఇన్స్పెక్టర్, ఏసీపీ, అదనపు డీసీపీ నిల్చున్నారు. దాదాపు మూడు గంటల పాటు ఎవరి డ్యూటీలు వారు చేశారు. ఈ నలుగురిలో హోంగార్డు, ఇన్స్పెక్టర్పై వాయు కాలుష్య ప్రభావం ఉండగా... ఏసీపీ, అదనపు డీసీపీపై మాత్రం లేదన్నది ప్రభుత్వ ఉద్దేశం. అందేంటని అనుకుంటున్నారా..? ఈ కారణంగానే ట్రాఫిక్ వింగ్‌లో పని చేసే వారికి చెల్లిస్తున్న 30 శాతం పొల్యూషన్ పే ఇన్స్పెక్టర్ స్థాయి వరకే అమలు చేయడం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయి విధులు నిర్వర్తించాల్సిందేనని, తమకూ పొల్యూషన్ పే అమలు చేయాలని ఉన్నతాధికారులు కోరుతున్నారు. రాజధానిలోనే ఎక్కువ ప్రభావం... రాజధానిలో కాలుష్య ప్రమాణాలు నానాటికీ ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఇది వాహనాలు ప్రయాణించే రోడ్లు, సిగ్నల్స్ నేపథ్యంలో ఆగుతున్న జంక్షన్ల వద్ద ఎక్కువగా ఉంటోంది. నగరంలో మొత్తం 585 ట్రాఫిక్ జంక్షన్లు ఉన్నాయి. వీటిలో దాదాపు 400 ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు విధి నిర్వహణ (పాయింట్ డ్యూటీ)లో ఉంటున్నారు. అన్నిచోట్లా కాలుష్యం స్థాయి ఒకేలా ఉండట్లేదు. వాహన శ్రేణి, రాకపోకల సంఖ్య ఆధారంగా లెక్కిస్తే 125 జంక్షన్లలో అత్యంత తీవ్రంగా... మరో 200 జంక్షన్లలో తీవ్రంగా ఉంటోంది. కాలుష్య నియంత్రణ మండలి నివేదికల ఆధారంగా ట్రాఫిక్ పోలీసుల గతంలో ఈ గణాంకాలను రూపొందించారు. ఈ వాయు కాలుష్యానికి తోడు ప్రమాణాలు పాటించని/ మోడ్రన్ హారన్లు, శక్తిమంతమైన లైట్లు శబ్ధ, కాంతి కాలుష్యాలకూ కారకాలవుతున్నాయి. వీటికి చెక్ చెప్పేందుకు అవసరమైన యంత్రాలు, యంత్రాంగం లేకపోవడంతో ఇబ్బందులు నానాటికీ పెరుగుతున్నాయి. ప్రమాదపుటంచుల్లో ట్రాఫిక్ సిబ్బంది.... ఈ పరిస్థితుల్లో పని చేస్తున్న ట్రాఫిక్ సిబ్బంది అనేక ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. 2012లో ట్రాఫిక్ సిబ్బందికి నిర్వహించిన సామూహిక వైద్య పరీక్షల ఫలితాలను విశ్లేషించిన నాటి ట్రాఫిక్ చీఫ్ సీవీ ఆనంద్ ఆందోళనకర అంశాలను గుర్తించారు. నగర ట్రాఫిక్ విభాగంలో పని చేస్తున్న వారిలో అనేక మంది ఊపిరితిత్తులు, కళ్లు, చెవులకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారని తేలింది. సరాసరిన 32 శాతం మందికి ఊపిరితిత్తుల, 25 శాతం మందికి కంటి, ఏడు శాతం మందికి చెవి సంబంధ రుగ్మతలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి జీతానికి అదనంగా పొల్యూషన్ పే ఇప్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు 30 శాతం ఇప్పించాలంటూ సీవీ ఆనంద్ అప్పట్లో పార్లమెంట్ స్థాయీ సంఘాన్ని కోరారు. వారు ఆమోదముద్ర వేయడంతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. వీటిని పరిగణలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం అనేక మార్పుచేర్పులతో 2016 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అక్కడ అలా... ఇక్కడ ఇలా... పోలీసు విభాగంలో లూప్‌లైన్లుగా భావించే అవినీతి నిరోధక శాఖ, పోలీసు అకాడమీల్లో పని చేస్తున్న సిబ్బందికి జీతంపై అదనంగా 30 శాతం చెల్లించే విధానం అమలులో ఉంది. కీలక బాధ్యతలు నిర్వర్తించే సీఐ సెల్, ఆక్టోపస్, సీఐడీ, సీఎస్డబ్ల్యూల్లోనూ అదనపు చెల్లింపు విధానం అమలవుతోంది. అయితే అక్కడ అన్ని స్థాయిల అధికారులకు ఇది వర్తిస్తుంది. ట్రాఫిక్ విభాగం దగ్గరకు వచ్చేసరికి తొలుత కానిస్టేబుల్ నుంచి ఇన్స్పెక్టర్ వరకు ఇచ్చారు. ఆపై హోంగార్డుల్నీ ఈ జాబితాలో చేర్చారు. గతంలో మాదిరిగా కాకుండా ప్రస్తుతం ఉన్నతాధికారులు సైతం పాయింట్ డ్యూటీలు చేయాల్సి వస్తోంది. దీంతో ఏసీపీలు, అదనపు డీసీపీలు, డీసీపీలు, ట్రాఫిక్ చీఫ్‌కు ఇది వర్తించాలని పలుమార్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే ఇప్పటికీ సర్కారు దీనిపై దృష్టి పెట్టట్లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ట్రాఫిక్ విభాగంలోనే పని చేస్తున్న తమకూ ఆ పొల్యూషన్ పే అమలు చేయాలని కోరుతున్నారు. ఈ దిశలో డీజీపీ కార్యాలయం సైతం కృషి చేయాలని వేడుకుంటున్నారు. ఇన్స్పెక్టర్ స్థాయి వరకే పొల్యూషన్ పే 2016 నుంచి 30 శాతం ఇస్తున్న సర్కారు మరికొన్ని విభాగాల్లోనూ ప్రోత్సాహకాలు అక్కడ మాత్రం అన్ని ర్యాంకులకు వర్తింపు తమకూ ఇవ్వాలంటున్న ఉన్నతాధికారులు -
ఫోన్ చోరీ... ఖాతా ఖాళీ!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో సంచరించే సిటీ బస్సుల్లో తిరుగుతూ... ప్రయాణికుల సెల్ఫోన్లు తస్కరించే ముఠాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ సెల్ఫోన్లను వినియోగించి వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసే గ్యాంగ్స్ ఇటీవల పుట్టుకొచ్చాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ వ్యక్తి రూ.2.98 లక్షలు నష్టపోగా... తాజాగా ఓ మహిళ రూ.1.04 లక్షలు పోగొట్టుకున్నారు. ఇలాంటి ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఫోన్ పోయిన వెంటనే కొన్ని కీలక జాగ్రత్తలు తీసుకోవాలని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. నగరానికి చెందిన ఓ మహిళా ఉద్యోగి (45) ఇటీవల తార్నాక నుంచి కాచిగూడకు వెళుతుండగా ఆమె ఫోన్ తస్కరణకు గురైంది. ఆ తర్వాత రెండు రోజులకు ఆమె కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ లోపే నేరగాళ్లు ఆమె బ్యాంకు ఖాతా నుంచి అక్రమ లావాదేవీలు చేసి రూ.1,04,901 కాజేశారు. ఆ ఫోన్లో ఉన్న సిమ్‌కార్డు నెంబరే బ్యాంకు ఖాతాతో లింకై ఉండటంతో పాటు యూపీఐ యాప్స్ అందులోనే ఉన్నాయి. ఫోన్ అన్‌లాక్ చేయడానికి, యూపీఐ లావాదేవీలకు పటిష్టమైన పాస్వర్డ్ లేకపోవడంతో తేలిగ్గా తెరిచిన నేరగాళ్లు అక్రమ లావాదేవీలు చేయగలిగారు. ఈ లావాదేవీలపై బ్యాంకు నుంచి ఎస్సెమ్మెస్‌లు వచ్చినప్పటికీ... ఫోన్ సైతం నేరగాళ్ల వద్దే ఉండటంతో బాధితురాలికి విషయం తెలియలేదు. బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాతే తాను నష్టపోయిన విషయం గుర్తించిన బాధితురాలు గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇటీవల చోటు చేసుకుంటున్న ఈ నేరాలను గమనించిన సైబర్ క్రైమ్ పోలీసులు ఇలాంటి వ్యవస్థీకృత ముఠాలు బస్సుల్లో సంచరిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. పాస్వర్డ్ పటిష్టంగా ఉండాలి.. ఈ నేపథ్యంలో నగరవాసులకు కొన్ని కీలక హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆండ్రాయిడ్, ఐఫోన్లలో కచ్చితంగా ఫౌండ్ మై డివైజ్‌ను యాక్టివేట్ చేసుకోవాలని కోరుతున్నారు. ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే వెంటనే సిమ్‌కార్డు బ్లాక్ చేయించుకోవాలని, పోలీసులతో పాటు బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. తన నెట్ బ్యాంకింగ్, యూపీఐ లావాదేవీలను నిలిపివేయాల్సిందిగా బ్యాంకును కోరాలని సూచిస్తున్నారు. అన్‌లాక్, యూపీఐ చెల్లింపుల పాస్వర్డ్స్ పటిష్టంగా ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. తొలుత సెల్ఫోన్లు చేజిక్కించుకుంటున్న నేరగాళ్లు యూపీఐ యాప్స్ వినియోగించి డబ్బు స్వాహా బస్సుల్లో సంచరిస్తున్న వ్యవస్థీకృత ముఠాలు అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసు అధికారులు -
పెంపుడు కుక్కను చెడగొడుతున్నాయని..
అల్వాల్: తన పెంపుడు కుక్కను వీధి కుక్కలు చెడగొడుతున్నాయని ఆగ్రహానికి లోనైన ఓ వ్యక్తి వీధి కుక్కలను గోడకేసి కొట్టి కాలితో తొక్కి చంపేసిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఇంటీరియర్ డెకరేటర్‌గా పనిచేసే ఆశీష్ కుటుంబంతో కలిసి బొల్లారంలోని వీబీసిటి అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. పూర్తిగా శాఖాహారి అయిన అశీష్ రెండు కుక్కలను పెంచుకుంటూ వాటికి శాఖాహారమే అలవాటు చేశాడు. ఈ క్రమంలో అపార్టుమెంట్ పరిసరాల్లో వీధికుక్కలు మాంసాహారం తింటూ తరుచూ తన పెంపుడు కుక్కల వద్దకు రావడం, వాటిపై దాడి చేస్తుండటంతో అతను విసుగెత్తిపోయాడు. ఈ నెల 14న సాయంత్రం అతను కుక్కను తీసుకొని అపార్టుమెంట్ సెల్లార్లోకి వెళ్లగా వీధి కుక్క పిల్లలతో సహా అక్కడికి వచ్చింది. దీంతో ఒక్కసారిగా విచక్షణ కోల్పోయిన అశీష్ నాలుగు కుక్కపిల్లలను గోడకేసి కొట్టి కాలితో తొక్కి చంపేశాడు. జంతు ప్రేమికులు బుధవారం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీధి కుక్కలను చంపిన యజమాని జంతు ప్రేమికుల ఫిర్యాదు కేసు నమోదు -
రూ.44 లక్షలు స్వాహా!
సాక్షి, సిటీబ్యూరో: ఆన్లైన్లో దరఖాస్తు చేసిన రెండు గంటల్లో రుణం ఇస్తామంటూ నమ్మబలికిన సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన ఓ వ్యక్తిని నిండా ముంచారు. రుణం పొందడానికి అన్ని అర్హతలు ఉన్నాయని, రూ.15 లక్షలు మంజూరు అయిందని చెప్పి రూ.44 లక్షలు కాజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సికింద్రాబాద్ ప్రాంతంలో నివసించే ఓ ప్రైవేట్ ఉద్యోగికి ఇటీవల వాట్సాప్ ద్వారా ఓ సందేశం వచ్చింది. మహాలక్ష్మీ ఫైనాన్సెస్ సంస్థ నుంచి వచ్చినట్లు ఉన్న ఆ సందేశంలో అర్హులైన వారికి దరఖాస్తు చేసిన రెండు గంటల్లో వ్యక్తిగత రుణం మంజూరు చేస్తామని ఉంది. ఆ సందేశం చివరలో ఓ నెంబర్ సైతం ఉండటంతో బాధితుడు ఫోన్ చేశాడు. బాధితుడి నుంచి కొన్ని వివరాలు తెలుసుకున్న అవతలి వ్యక్తి సిబిల్ స్కోరు చాలా తక్కువగా ఉందని, ఈ పరిస్థితుల్లో రుణం ఇవ్వడం సాధ్యం కాదని చెప్పాడు. ఆపై తాము పంపే క్యూఆర్ కోడ్‌కు కొంత మొత్తం చెల్లించాలి రీపేమెంట్ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని సూచించాడు. ఇలా చెల్లించిన మొత్తం రిఫండబుల్ అని మోసగాడు చెప్పడంతో బాధితుడు చెల్లించాడు. నేరగాళ్లు ఆధార్, పాన్‌కార్డులతో పాటు ఓ చెక్కు ఫొటోను పంపమని కోరడంతో బాధితుడు అలానే చేశాడు. ఈ విషయం తెలిసిన అతడి సోదరుడు వారించడంతో వాటి ఫొటోలను బాధితుడు నేరగాడి చాట్ నుంచి డిలీట్ చేసేశాడు. బాధితుడిని సంప్రదించిన సైబర్ నేరగాడు రూ.15 లక్షల లోన్ ప్రాసెస్‌లో ఉండగా డాక్యుమెంట్లు డిలీట్ చేసిన ఉల్లంఘనకు పాల్పడ్డావని చెప్పాడు. దీంతో పాటు బాధితుడి ఎస్బీఐ ఖాతాలో బ్యాలెన్స్ తక్కువగా ఉండటంతో దాని నిమిత్తం మరికొంత పెనాల్టీ అంటూ వసూలు చేశాడు. ఇలా మొత్తం ఎనిమిదిసార్లు రకరకాలైన పెనాల్టీలు, ఫీజులు వసూలు చేసిన సైబర్ నేరగాడు ప్రతి సందర్భంలోనూ రిఫండ్ అంటూ నమ్మబలికాడు. చివరకు ఓ రోజు రుణం మంజూరైందని చెప్తూ దానికి సంబంధించిన సందేశమంటూ డమ్మీ స్క్రీన్‌షాట్ పంపాడు. త్వరలోనే తమ సంస్థ ప్రధాన కార్యాలయం అధికారులు సంప్రదించి ఆ మొత్తం రిలీజ్ చేస్తారని నమ్మించాడు. వాళ్లు సూచించిన మొత్తం మరోసారి డిపాజిట్ చేయాలని, అలా కాకుంటే రుణం రద్దు అవుతుందని బెదిరించారు. అప్పటికే దాదాపు 25 సార్లు పెనాల్టీల చెల్లింపు కోసం బాధితుడు కుటుంబీకులు, బంధువులతో పాటు స్నేహితుల వద్ద అప్పు చేసి రూ.44,83,000 చెల్లించాడు. వీటికి తోడు మరికొంత చెల్లించాలంటూ వాళ్లు చెప్తుండటంతో అనుమానించిన బాధితుడు ఆరా తీశాడు. ఈ నేపథ్యంలోనే తాను మోసపోయినట్లు గుర్తించి ఆ మొత్తం తిరిగి చెల్లించాలని కోరాడు. దీంతో పంథా మార్చిన సైబర్ నేరగాళ్లు బాధితుడిని బెదిరింపులతో కూడిన, అభ్యంతరకరమైన సందేశాలు పంపడం మొదలెట్టారు. ఈ మేరకు బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. -
ఫ్రీడమ్ వేరుశనగ నూనె సరికొత్త ప్యాక్ ఆవిష్కరణ
సాక్షి, సిటీబ్యూరో: కొత్తగా నవీకరించిన ఫ్రీడమ్ వేరుశనగ నూనె ప్యాక్‌ను బుధవారం ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి.చంద్రశేఖరరెడ్డి ఆవిష్కరించారు. సంప్రదాయ భారతీయ ఊరగాయ, పచ్చళ్లు, ఇతర వంటకాలకు అవసరమైన ఆరోగ్యకర కుకింగ్ ఆయిల్ కలెక్షన్‌ను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. ఫ్రీడమ్ వేరుశనగ నూనె గింజ రుచిని కలిగి ఉంటుందని, వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో సంప్రదాయ రుచి, సువాసనతో ఊరగాయలు, పచ్చళ్లు తయారు చేయడానికి ప్రాధాన్యతనిస్తారన్నారు. వీని అభిరుచికి తగిన ‘ఫ్రీడమ్ వేరుశనగ నూనె ప్యాక్’ను పరిచయం చేయటం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో జెమినీ ఎడిబుల్స్–ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ చేతన్ పింపాల్టే తదితరులు పాల్గొన్నారు. -
మా కుమారుడి ఇంట్లోనే ఉంటాం..
మణికొండ : మా కుమారుడి కష్టార్జితంతో నిర్మించుకున్న ఇంట్లో తామే ఉంటామని హీరో రాజ్‌తరుణ్ తల్లిదండ్రులు రాజేశ్వరి, బసవరాజు పేర్కొన్నారు. తమ ఇంట్లో లావణ్య అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతోందని, తమకు స్వంత ఇల్లు ఉండగా బయట అద్దెకు ఉండాల్సిన ఖర్మ తమకు లేదని వారు పేర్కొన్నారు. బుధవారం నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోకాపేటలోని విల్లాలో రాజ్‌తరుణ్ తరఫు వ్యక్తులు, కేర్ టేకర్స్తో పాటు అతని తల్లిదండ్రులు వచ్చారు. తమ ఇంట్లో తాము ఉంటామని లోనికి వెళ్లే ప్రయత్నం చేశారు. దాంతో లావణ్య వారిని అడ్డుకున్నారు. తన ఇంటి సీసీ కెమెరాలను, ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేసి తనపై దాడి చేశారని లావణ్య ఆరోపించారు. రాజ్‌తరుణ్‌తో తనకు జరిగిన వివాహంతో పాటు ఇంటి విషయం కోర్టులో ఉందని, కోర్టు ఆదేశాల ప్రకారమే తాను నడుచుకుంటానన్నారు. కాగా దీనిపై తమకు లావణ్య, రాజ్‌తరుణ్ తల్లిదండ్రులు ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదని నార్సింగి పోలీసులు తెలిపారు. -
ఓజీ కుష్ డ్రగ్స్ స్వాధీనం
సాక్షి, సిటీబ్యూరో : అమెరికాలోని ఫ్లోరిడా, కాలిఫోర్నియా తదితర ప్రాంతాల్లో పండించే ఓజీ కుష్ అనే డ్రగ్స్‌తోపాటు ఇతర మాదకద్రవ్యాలను, విదేశీమద్యం సీసాలను ఎకై ్సజ్ శాఖ ఎస్టీఎఫ్ బి టీమ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ డ్రగ్స్‌తోపాటు స్కోడాకారు గంజాయి, హాషిష్ సింథటిక్ డ్రగ్స్, చరస్ వంటి మత్తుపదార్ధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఎకై ్సజ్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టుకున్న డ్రగ్స్‌ను, నిందితులను హాజరుపరిచారు. పట్టుబడిన కారు, డ్రగ్స్ విలువ రూ.40 లక్షలుగా ఉంటుందని ఆయన వెల్లడించారు. కాచిగూడ రైల్వేస్టేషన్‌న్‌లో బుధవారం బి టీమ్ ఎస్ఐ సంధ్య బృందం ఈ డ్రగ్స్‌ను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద బైక్‌పైన ఉన్న ఒక వ్యక్తి స్కోడా కారులోని మరో వ్యక్తి నుంచి ఓజీ కుష్‌ను మార్పిడి చేసుకుంటుండగా ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నారు. కారులో తనిఖీల్లో 500 గ్రాముల ఓజీ కుష్, కిలో గంజాయి, 6 గ్రాముల చరస్, 4.38 గ్రాముల హషీష్ సింథటిక్ డ్రగ్స్‌తోపాటు ఐదు విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులు ప్రతీష్ భట్, జై సూర్యలను అరెస్టు చేసినట్లు జాయింట్ కమిషనర్ ఖురేషి తెలిపారు.ఈ సమావేశంలో బి టీమ్ లీడర్ ప్రదీప్‌రావు, సీఐ భిక్షా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ● అమెరికా నుంచి దిగుమతి ● బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు సరఫరా ● పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.40 లక్షలు -
రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్ విధానాన్ని రద్దు చేయాలి
చిక్కడపల్లి: రిజిస్ట్రేషన్లలో స్లాట్ బుకింగ్ విధానాన్ని రద్దుచేసి డ్యాకుమెంట్ రైటర్స్‌కు జీవనోపాధి కల్పించాలని తెలంగాణ డ్యాకుమెంట్ రైటర్స్ ఫెడరేషన్ నాయకులు శ్రీనివాస్, గిరిబాబు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం అశోక్‌నగర్‌లోని చిక్కడపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్లాట్ విధానంతో రానున్న రోజుల్లో డాక్యుమెంట్ రైటర్స్ జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. స్లాట్ విధానంతో వినియోగదారులు నష్టపోయే అవకాశం ఉందన్నారు. స్లాట్ పద్ధతిని రద్దుచేసి పాత విధానాన్ని కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డ్యామెంట్ రైటర్స్ ఈశ్వర్, అశోక్, కార్తీక్, బ్రహ్మం, అతీఫ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ డ్యాకుమెంట్ రైటర్స్ ఫెడరేషన్ -
ఇప్పటికి ఏడుగురు!
సాక్షి, సిటీబ్యూరో: అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులుగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు, ఓ మీడియా ఛానల్ మాజీ ఎండీ శ్రవణ్‌రావులపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. తీవ్రమైన, సంచలనాత్మక కేసుల్లో వాంటెడ్‌గా ఉండి, విదేశాలకు పారిపోయినట్లు ఆధారాలు లభించిన వారిపై పోలీసులు ఈ నోటీసులు జారీ చేయిస్తారు. తెలంగాణ నుంచి రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయి ఉన్న వారి సంఖ్య ప్రస్తుతం ఏడుగా ఉంది. శ్రవణ్‌రావు తిరిగి రావడంతో వీరిలో వాంటెడ్ నిందితుల సంఖ్య ఆరు మాత్రమే. ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావులపై జారీ అయిన రెడ్ కార్నర్ నోటీసుల్ని ఇంటర్‌పోల్ కేవలం అఫీషియల్ వ్యూలోనే ఉంచింది.ముగ్గురిపై ఉగ్రవాద సంబంధ కేసుల్లో...ఈ ఏడుగురిలో ముగ్గురిపై మాత్రం ఉగ్రవాద సంబంధిత కేసుల్లో రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. మాదన్నపేట సమీపంలోని కూర్మగూడకు చెందిన ఫర్హాతుల్లా ఘోరీ అలియాస్ అబు సూఫియాన్ 1998లోనే ఉగ్రవాదం వైపు మళ్లి అ/్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 2002లో గుజరాత్‌లోని అక్షర్ధామ్ దేవాలయంపై దాడి, 2004లో నగరం కేంద్రంగా బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి హత్యకు కుట్ర, 2005లో నగర కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయం మానవబాంబు దాడి, 2012 నాటి బెంగళూరు ‘హుజీ కుట్ర’ సహా అనేక కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నాడు. ఇతడితో పాటు బెంగళూరు కుట్ర కేసులో నిందితులుగా ఉన్న మరో ఇద్దరి పైనా ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్, బెంగళూరు, హుబ్లీ, నాందేడ్‌లో విధ్వంసాలకు కుట్ర పన్నిన ఆరోపణలపై నమోదైన ఈ కేసులో తలాబ్‌కట్టకు చెందిన మహ్మద్ సాదిక్ బిన్ ఉస్మాన్, యాకత్‌పురకు చెందిన మహ్మద్ అబు సాద్‌ల పైనా ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేసింది.మరో ఇద్దరిపై వేర్వేరు కేసుల్లో...ఈ ముగ్గురిపై ఉగ్రవాద సంబంధ కేసుల్లో, ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో రెడ్ కార్నర్ నోటీసులు జారీ కాగా.. మరో ఇద్దరిపై వేర్వేరు కేసుల్లో ఈ నోటీసులు ఉన్నాయి. కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో నమోదైన అనేక హత్య, హత్యాయత్నం కేసుల్లో నగరానికి చెందిన తాహెర్ అన్సారీ నిందితుడిగా ఉన్నాడు. ఇతడితో పాటు అమీర్‌పేట కేంద్రంగా పని చేసిన ఓ ప్రైవేట్ బ్యాంక్‌ను నిండా ముంచిన బాబు మహ్మద్ పైనా ఇంటర్‌పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసులు ఉన్నాయి. ఇతగాడు మరికొందరితో కలిసి 1997–2000 మధ్య సదరు బ్యాంకును నిండాముంచినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ రెడ్‌కార్నర్ నోటీసులు ఉన్న మోస్ట్‌వాంటెడ్ జాబితాను ఇంటర్‌పోల్ తన వెబ్సైట్లో ఉంచుతుంది. అసవరాన్ని బట్టి కొందరి వివరాలు పబ్లిక్ వ్యూలో, మరికొందరివి అఫీషియల్ వ్యూలో ఉంచుతుంది. ఇలా అఫీషియల్ వ్యూలో ఉన్న కారణంగానే ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావులపై ఉన్నవి ప్రత్యేక లాగిన్ అవకాశం ఉన్న అధికారులకు తప్ప సాధారణ ప్రజలకు కనిపించవు. కేవలం ఉగ్రవాద సంబంధిత, అత్యంత తీవ్రమైన కేసుల్లో నిందితులుగా ఉన్న వారి వివరాలు మాత్రమే పబ్లిక్ వ్యూలో ఉంటాయి.శ్రవణ్రావుపైసుప్రీం కోర్టుకు...ఇలా రెడ్కార్నర్లో ఉన్న నిందితుల్లో శ్రవణ్‌రావుకు సుప్రీం కోర్టు ఊరట ఇవ్వడంతో వచ్చి లొంగిపోయారు. అయితే దర్యాప్తునకు సహకరించాలంటూ న్యాయస్థానం విధించిన షరతును ఈయన ఉల్లంఘిస్తున్నారని పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికి మూడుసార్లు నోటీసులు ఇచ్చి విచారించినా సరైన వివరాలు చెప్పలేదని, ట్యాపింగ్ సమయంలో వినియోగించిన ఫోన్లు ఇవ్వాలని కోరితే వేరేవి ఇచ్చారని ఆరోపిస్తున్నారు. ఆయన స్వాధీనం చేసిన మూడు ఫోన్లకు ప్రాథమికంగా ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించిన అధికారులు అందులో ఎలాంటి డేటా లేదని తేల్చారు. ఇలా దర్యాప్తునకు సహకరించని శ్రవణ్‌రావుపై సుప్రీం కోర్టును ఆశ్రయించాలని అధికారులు భావిస్తున్నారు. ఆయనకు ఉన్న ఊపశమనం ఎత్తివేయాలంటూ కోర్టును కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. -
ఇళ్ల స్థలాల్లోకి పేదలను అనుమతించండి
ఇబ్రహీంపట్నం రూరల్: రామోజీ ఫిలింసిటీ ఆక్రమణలో ఉన్న ఇళ్ల స్థలాల కబ్జా కోసం లబ్ధిదారులకు సహకరించాలని సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి సమక్షంలో బుధవారం రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫిలింసిటీ చెరలో ఉన్న పేదల భూములకు విముక్తి కల్పించాలన్నారు. గతంలో నిరుపేదలకు ప్రభుత్వం అందజేసిన ఇళ్ల స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. శాంతియుతంగా ఇంటి నిర్మాణ పనులు చేసుకుంటామని, ఇందుకు సహకరించాలని కోరారు. దీనిపై సీపీ స్పందిస్తూ ఇంటి స్థలాల అంశంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సామేలు, మండల కార్యదర్శి సీహెచ్ బుగ్గరాములు, ఇంటి స్థలాల పోరాట కమిటీ కన్వీనర్ పి.జగన్, మండల కమిటీ సభ్యుడు ఆనంద్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. రామోజీ ఫిలింసిటీ ఆక్రమణలో ఉన్న భూముల చెర విడిపించండి సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాలయాదయ్య డిమాండ్ రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబుకు వినతిపత్రం -
బీఆర్ఎస్తోనే మారిన బంజారాల బతుకులు
బంజారాహిల్స్: బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కృషితో తెలంగాణలో బంజారాల బతుకులు మారాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. అఖిల భారత బంజారాల ఆధ్యాత్మిక గురువు, పౌరాదేవీ పీఠాధిపతి శ్రీశ్రీ చంద్రశేఖర్ మహారాజ్ బుధవారం ఎమ్మెల్సీ కవిత నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా సంప్రదాయబద్దంగా ఎమ్మెల్సీ కవిత వారిని ఆహ్వానించి సన్మానించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీకవిత మాట్లాడుతూ... రాష్ట్రంలోని బంజారాల ఆశీస్సులు కేసీఆర్‌పై, బీఆర్ఎస్ పార్టీపై ఉన్నాయని తెలిపారు. బంజారా పిల్లలకు విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడానికి కేసీఆర్ ఎన్నో చర్యలు తీసుకున్నారని వివరించారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సహకరించుకున్నా ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించి కేసీఆర్ చరిత్ర సృష్టించారని స్పష్టం చేశారు. దేశంలోనే తొలిసారిగా సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే చంద్రవతి, హరిప్రియ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
చెరువుల పక్కన, ఖాళీ ప్లాట్లలో యథేచ్ఛగా బోర్లు
సాక్షి, సిటీబ్యూరో: భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో తాగునీటికే కాదు.. ఇంటి అవసరాలూ తీరే పరిస్థితి కనిపించడంలేదు. నీటి సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది. పశ్చిమ హైదరాబాద్ ప్రాంతంలో విచ్చలవిడిగా బోర్ల తవ్వకాల ప్రభావంతో జలాలు పాతాళానికి పడిపోయి బోరుబావులు బావురుమంటున్నాయి. ఫలితంగా వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరుగుతోంది. రాత్రి పగలూ తేడా లేకుండా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కొనసాగుతోంది. సిటీజనుల అవసరాలను సొమ్ము చేసుకునేందుకు కొందరు చెరువుల పక్కన, ఖాళీ ప్లాట్లలో.. ఇలా ఎక్కడ పడితే అక్కడ బోర్లు వేసి, కోట్ల కొద్దీ లీటర్ల నీటిని పుడమి కడుపు నుంచి తోడేస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి.. అక్కడ ఉన్న నీటి కొరత తీవ్రత, అత్యవసరాన్ని బట్టి ట్యాంకర్ నీటి ధరను పెంచేసి వసూళ్లకు పాల్పడుతున్నారు. జంట జలాశయాల పరీవాహకంలో.. నగర శివార్లలోని జంట జలాశయాల పరిసరాల్లో విచ్చలవిడిగా ప్రైవేటు ఫిల్లింగ్ కేంద్రాలు భారీగా పుట్టుకొచ్చాయి. మూసీ పరీవాహకంలో సైతం ప్రైవేటు బోర్ల నీటి దందా అడ్డూ అదుపూ లేకుండా సాగుతోంది. అసలు బోరు ఎక్కడుంది? ఎక్కడి నుంచి నీళ్లు వస్తున్నాయన్నది అర్థంకాని పరిస్థితి నెలకొంది. చెరువులు, కుంటలు, ఖాళీ స్థలాల్లో ఎక్కడిపడితే అక్కడ బోర్లు ఏర్పాటు చేసి గుర్తించకుండా వాటి చుట్టూ ఇంటిని తలపించేలా రేకుల షెడ్లు వేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో సిమెంట్, కాంక్రీట్‌తో శ్లాబ్‌లు నిర్మిస్తున్నారు. గండిపేట, నార్సింగ్, మణికొండ, హఫీజ్‌పేట, మియాపూర్, బౌరంపేట, దుండిగల్, మల్లంపేట, ఉప్పల్, రామంతాపూర్, బోయిన్పల్లి తదితర ప్రాంతాల్లో చెరువుల పక్కన ప్రైవేటు బోర్ల వ్యాపారం విచ్చలవిడిగా సాగుతోంది వాల్టాకు తూట్లు.. వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ (వాల్టా) యాక్ట్– 2002 ప్రకారం ఇంటి అవసరాల కోసం బోరు వేసినా రెవెన్యూ విభాగం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకుంటే క్షేత్రస్థాయి పరిస్థితులు, దరఖాస్తుదారు అవసరం, అక్కడి భూగర్భ జలాల లభ్యతను బట్టి అనుమతినిస్తారు. ఇంటి నిర్మాణం కోసం సామాన్యులు బోరు వేస్తే.. ఈ చట్టాన్ని చూపి నానా ఇబ్బందులూ పెట్టే రెవెన్యూ యంత్రాంగం ప్రైవేటు నీటి దందా కోసం ఇష్టానుసారంగా పదుల సంఖ్యలో బోర్లు తవ్వి పుడిమిని తోడేస్తున్నా.. కనీసం అటువైపు కన్నెత్తి చూడట్లేదు. ఇటీవల జలమండలి విజిలెన్స్ విభాగం అక్రమ ఫిల్లింగ్ కేంద్రాలను గుర్తించి రెవెన్యూ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లింది. ఇదీ పరిస్థితి.. మహానగరం కాంక్రీట్ జంగిల్‌గా మారడంతో వర్షపు నీరంతా నాలాలు, డ్రెయినేజీల నుంచి మూసీలో కలుస్తోంది. ఫలితంగా ఆశించిన స్థాయిలో నగర పరిధిలో భూగర్భ జలమట్టాలు పెరగలేదు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధితో పాటు ఔటర్ పరిధిలోని సుమారు 45 ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు సగటున 12 మీటర్ల దిగువన పడిపోయినట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వెయ్యి నుంచి 5 వేల అడుగుల మేర తవ్వించిన బోర్లు సైతం ఎండిపోతుండటంతో భూగర్భజలాలు ఎంత పాతాళానికి పడిపోతున్నాయో అర్థం చేసుకొవచ్చు.. జలమండలి ట్యాంకర్ల తాకిడి గ్రేటర్‌తో పాటు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో తాగునీటిని సరఫరా చేస్తున్న జలమండలి ఈసారి పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకోలేక తడబడుతోంది. పశ్చిమ హైదరాబాద్ పరిధిలోని గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, పటాన్చెరు, మూసాపేట్, మాదాపూర్, హైటెక్ సిటీ, నానక్‌రాంగూడ, కోకాపేట్, నార్సింగి, కొండాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల నుంచి తాకిడి అధికంగా పెరిగినట్లు తెలుసోంది. సాధారణంగా వాటర్‌బోర్డుకు వేసవిలో రోజుకు 5 వేల నుంచి 6 వేల వరకు ట్యాంకర్ల డిమాండ్ ఉంటోంది. కానీ.. ఈసారి ఆ సంఖ్య పదివేలు దాటింది. ట్యాంకర్ బుక్ చేసిన 12 గంటల లోపు ట్యాంకర్‌ను సరఫరా చేయడం గమనార్హం. కేవలం ట్యాంకర్లపైనే ఆధారపడిన హోస్టళ్లు, సర్వీస్, వాణిజ్య కేంద్రాలు మాత్రం అత్యవసర సరఫరాకు ప్రైవేటు ట్యాంకర్ల వైపు మొగ్గుచూపుతున్నాయి. అక్రమ ఫిల్లింగ్ కేంద్రాలతో ప్రైవేటు ట్యాంకర్ల దందా పశ్చిమ హైదరాబాద్‌లో పెరిగిన డిమాండ్ నీటి రేట్లు పెంచేసి వ్యాపారుల దోపిడీ ప్రతిరోజూ పది వేల ట్రిప్పులకుపైగా జలమండలి సరఫరా 4 లక్షల ట్రిప్పుల వరకు అంచనా.. రాబోయే రోజుల్లో ట్యాంకర్లకు డిమాండ్ మరింత పెరిగవచ్చని జలమండలి అంచనా వేస్తొంది. గత ఏడాదితో పోల్చితే ఈసారి జనవరిలో 35 శాతం, ఫిబ్రవరిలో 50 శాతం, మార్చిలో 90 శాతం అదనంగా డిమాండ్ పెరిగినా.. ఎలాంటి ఆటంకం లేకుండా సరఫరా చేయగలిగింది. తాజాగా ఈ నెలలో రెట్టింపు స్థాయిలో ట్యాంకర్ల డిమాండ్ పెరిగింది. ఏప్రిల్, మే నెలల్లో సగటున 4 లక్షల ట్రిప్పుల చొప్పున డిమాండ్ ఉండే అవకాశం ఉంటుందని జలమండలి అంచనా వేస్తోంది. జలమండలి ద్వారా ట్యాంకర్ల సరఫరా ఇలా సంవత్సరం జనవరి ఫిబ్రవరి మార్చి 2021 52,778 55,175 75,782 2022 45,613 52,548 83,078 2023 74,870 86,479 1,12,679 2024 81,821 1,12,926 1,69,596 2025 1,19,752 1,84,074 2,82,961 -
నల్లాలకు వ్యవసాయ మోటార్లు
యథేచ్ఛగా నీటిని తోడుతున్నట్లు బహిర్గతంనీటి సరఫరాలో పెరుగుతున్న ప్రెషర్.. మోటార్ ఫ్రీ ట్యాప్ వాటర్ స్పెషల్ డ్రైవ్‌తో నీటి సరఫరాలో ఒత్తిడి పెరుగుతోంది. క్షేత్ర స్థాయిలో తనిఖీలు కొనసాగుతుండటంతో కొందరు వినియోగదారులు నల్లాలకు మోటార్లను తొలగిస్తున్నారు. దీంతో నీటి సరఫరాలో ఒత్తిడి పెరిగి సమపాళ్లలో సరఫరా కొనసాగుతోంది. దీంతో లో పెష్రర్‌తో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులు ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా నీటి సరఫరాలో లోప్రెషర్ ప్రాంతాలపైనే జలమండలి దృష్టి సారించి తనిఖీలను ముమ్మరం చేసింది. ● వాణిజ్య సముదాయాల్లో డొమెస్టిక్ కనెక్షన్లు ● పలు ప్రాంతాల్లో పర్యటించిన జలమండలి ఎండీ ● స్పెషల్ డ్రైవ్‌తో పెరుగుతున్న నీటి ప్రెషర్ ● రెండో రోజూ కొనసాగిన మోటార్ ఫ్రీ ట్యాప్ డ్రైవ్ సాక్షి, సిటీబ్యూరో: మహా నగరంలో తాగునీటి నల్లాలకు వ్యసాయ మోటార్లను బిగించి నీటిని తోడుతున్నట్లు బహిర్గతం కావడం ఆందోళన కలిగిస్తోంది. జలమండలి నీటి సరఫరాలో లో ప్రెషర్ తగ్గించేందుకు పకడ్బందీగా చేపట్టిన ‘మోటర్ ఫ్రీ ట్యాప్’ వాటర్ స్పెషల్ సర్వే తనిఖీలో నల్లాలకు బిగించిన మోటార్లు కుప్పలు తెప్పలుగా బయటపడుతున్నాయి. మరోవైపు వాణిజ్య భవన సముదాయాలు డొమెస్టిక్ కనెక్షన్లు కలిగి ఉన్నట్లు తనిఖీ బృందాలు గుర్తిస్తున్నాయి. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా బుధవారం పలు ప్రాంతాల్లో నల్లాలకు వినియోగిస్తున్న సుమారు 32 మోటార్లను సీజ్ చేసి 39 మంది వినియోదారులకు జరిమానాలు విధించారు. రెండో రోజూ జలమండలి ఎండీ అశోక్ రెడ్డి క్షేత్ర స్థాయిలో పర్యటించి తనిఖీలు నిర్వహించారు. ఎస్ఆర్ నగర్‌లోని మధురానగర్ పరిధిలో నీటి సరఫరాను పరిశీలించారు. లోప్రెషర్ను గుర్తించి సమీపంలోని హాస్టళ్లు, వాణిజ్య సముదాయాలును తనిఖీ చేశారు. 2 హెచ్‌పీ మోటార్ వినియోగంపై ఆగ్రహం వ్యవసాయానికి వినియోగించే 2 హెచ్‌పీ మోటార్లను నల్లాలకు వినియోగించడంపై అశోక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. పది గృహ సముదాయాలకు సరిపడే నీటిని ఒకే గృహానికి వాడితే మిగతావారు ఏమైపోవాలంటూ ఆయన ప్రశ్నించారు. మరోసారి ఇలాంటి తప్పు చేస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. గృహ సముదాయంలోని ఆ హాస్టల్‌కు నెలవరకు నీటిని నిలిపివేసి ట్యాంకర్ సైతం బుక్ చెయ్యకుండా బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఇదే ప్రాంతంలో మరో భవనానికి సైతం వ్యవసాయ మోటార్ వాడుతూ పట్టుపడగా కనెక్షన్ తొలగించి, నెల వరకు ట్యాంకర్ సరఫరా కూడా నిలిపివేయాలంటూ అధికారులకు ఎండీ ఆదేశాలు జారీ చేశారు. ప్రతిరోజూ వాటర్ సరఫరా సమయంలో తనిఖీలు కొనసాగించాలని ఆయన సూచించారు. -
ఒప్పందం కుదిరేనా!
జపాన్ రవాణా సదుపాయాలపై అధ్యయనం.. ఈ పర్యటనలో భాగంగా జపాన్‌లోని వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో వినియోగంలో ఉన్న ప్రజారవాణా సదుపాయాలను కూడా ముఖ్యమంత్రి బృందం అధ్యయనం చేయనుంది. జపాన్‌లోని కోబ్, క్యోటో, నగోయా, ఒసాకా, సప్పోరో, సెండాయ్, టోక్యో, యొకోహామా తదితర నగరాల్లో సబ్వే వ్యవస్థలు ఉన్నాయి. ప్రయాణికుల రద్దీకనుగుణంగా మెట్రోపాలిటన్ ప్రాంతాలను క్రాస్ చేసే సబర్బన్ కమ్యూటర్ రైల్వే సదుపాయం అక్కడ ఉంది. అలాగే అనేక నగరాల్లో స్ట్రీట్‌కార్, మోనోరైల్ నెట్‌వర్క్‌లు అందుబాటులో ఉన్నాయి. అర్బన్ ర్యాపిడ్ రైల్ సిస్టమ్, ఆటోమేటెడ్ గైడ్‌వే ట్రాన్సిట్ (ఏజీటీ), ఆటోమేటెడ్ పీపుల్ మూవర్, (ఏపీఎం), లైట్‌రైల్ ట్రాన్సిట్ (ఎల్‌ఆర్‌టీ), ట్రామ్, సిటీబస్ వంటి వివిధ రకాల ప్రజారవాణా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లో మెట్రో రైల్ విస్తరణతో పాటు అర్బన్ ట్రాన్స్పోర్టేషన్కు అనుగుణమైన ప్రజారవాణా సదుపాయాలపై ఈ అధ్యయనంలో దృష్టి సారించనున్నట్లు అధికారులు తెలిపారు. సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రెండోదశ నిర్మాణానికి నిధుల సమీకరణకు రాష్ట్ర సర్కారు జైకా (జపాన్ ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ ఏజెన్సీ)తో సంప్రదింపులు జరుపుతోంది. ఇందులో భాగంగా ఆ సంస్థతో రుణ అంశంపై చర్చించేందుకు హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి జపాన్ పర్యటనకు వెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం నుంచి జపాన్‌లో పర్యటిస్తున్నందున.. ఇదే సమయంలో జైకాతో సమావేశం నిర్వహించేలా షెడ్యూల్ ఖరారైంది. ఈ సమావేశంలో నిధుల విడుదల వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశముంది. మెట్రో రెండో దశ నిర్మాణానికి నిధులు అందజేసేందుకు జైకా సూత్రప్రాయంగా అంగీకరించింది. తాజాగా సీఎం జపాన్ పర్యటనలో భాగంగా మరోసారి జైకా ప్రతినిధుల బృందంతో సమావేశమై నిధుల విడుదలపై పరస్పర ఒప్పందం కుదు ర్చుకునే అవకాశం ఉన్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. తద్వారా మెట్రో రెండో దశకు నిధులను అందజేసేందుకు జైకా సిద్ధంగా ఉన్న దృష్ట్యా కేంద్రం నుంచి సావరిన్ గ్యారంటీ లభించేందుకు ఒత్తిడి చేసేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. నిధుల సేకరణంలో భాగంగా.. మెట్రో రెండో దశలో మొదట ప్రతిపాదించిన 5 కారిడార్లలో 76.4 కిలోమీటర్ల మెట్రో నిర్మాణానికి సుమారు రూ.24,269 కోట్లు వ్యయం కానున్నట్లు అంచనా. ఇందులో ప్రైవేట్ సంస్థల నుంచి 52 శాతం నిధులను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకు న్నారు. అంటే.. సుమారు రూ.12,726 కోట్లు జైకా వంటి సంస్థల నుంచి రుణాలుగా తీసుకోవా ల్సి ఉంటుంది. మిగతా వ్యయంలో 30 శాతం నిధులు అంటే రూ.7,313 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది. మరో 18 శాతం నిధులను (రూ.4,230 కోట్లు) కేంద్రం భరించాల్సి ఉంటుంది. అలాగే మెట్రో స్టేషన్లలో మౌలిక సదుపాయాలతో పాటు పలు పనులను పీపీపీ విధానంలో చేప ట్టాలని ప్రతిపాదించారు. ప్రైవేట్ సంస్థల నుంచి నిధుల సేకరణలో భాగంగా సీఎం జపాన్ పర్యటనలో జైకాతో సంప్రదింపుల్లో హెచ్‌ఏఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కీలకంగా వ్యవహరించనున్నారు. మెట్రో రెండో దశపై జైకాతో సంప్రదింపులు సీఎం రేవంత్‌తో పాటు జపాన్ పర్యటనలో మెట్రో ఎండీ -
‘దొంగ’మొగుడు
సొంత భార్య మెడలోని బంగారు గొలుసునే కొట్టేసిన ఘనుడు ఎట్టకేలకు కేసును ఛేదించిన పోలీసులుకేపీహెచ్బీకాలనీ: గాఢ నిద్రలో ఉన్న భార్య మెడలోని రెండు తులాల బంగారు గొలుసును తానే కాజేసి.. దొంగలు ఎత్తుకెళ్లారంటూ కథనం అల్లి పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు యత్నించిన ఓ భర్తను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రెండు తులాల బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ కాలనీ వసంతనగర్ కాలనీలోని ప్లాట్ నంబర్– 115లోని బహుళ అంతస్తుల భవనంలో మెదక్ జిల్లా వల్లూరుకు చెందిన ముక్కెర ఆంజనేయులు, భార్య భాగ్యమ్మతో కలిసి వాచ్‌మన్‌గా పని చేస్తూ ఇక్కడే ఓ గదిలో నివాసం ఉంటున్నారు. తన భార్య మెడలోని రెండు తులాల బంగారు గొలుసును దొంగిలించాలని పథకం వేసిన ఆంజనేయులు మంగళవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో భాగ్యమ్మ గాఢ నిద్రలో ఉండగా ఆమె మెడలోని 2 తులాల బంగారు గొలుసును దొంగిలించి దాచి పెట్టాడు. వెంటనే ఎవరో దొంగలు వచ్చి తన భార్య మెడలోని బంగారు గొలుసును తెంచుకెళ్లారంటూ బుకాయిస్తూ భార్యను కూడా నమ్మించాడు. ఇదే విషయాన్ని ఇరుగు పొరుగు వారికి చెప్పి పోలీసులకు సైతం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా భాగ్యమ్మ, ఆంజనేయులును విచారణ చేయగా.. పొంతన లేని సమాధానాలు చెప్పారు. సీసీ పుటేజీల ఆధారంగా బయటి వ్యక్తులెవరూ వీరి గదిలోకి రాలేదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆంజనేయులును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయగా.. బంగారు గొలుసును తానే దొంగిలించానని ఒప్పుకొన్నాడు. గొలుసు పోయిందనే సానుభూతి పొందటంతో పాటు ప్లాట్ యజమానులు ఇచ్చే ఆర్థిక సహకారంతో తన అప్పులు తీర్చుకోవచ్చని పథకం వేసి చోరీకి పాల్పడినట్లు వెల్లడించాడు. ఈ మేరకు పోలీసులు ఆంజనేయులును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
‘భూ భారతి’
భూముల రక్షణకేనేటి నుంచి 30 వరకు చట్టంపై అవగాహన సమావేశాలు సదస్సుల సమాచారం తేదీ మండలం 17 షాద్‌నగర్, కేశంపేట 19 ఆమనగల్లు, తలకొండపల్లి 21 చేవెళ్ల, శంకర్పల్లి 22 కొందుర్గు, చౌదరిగూడ 23 మాడ్గుల, యాచారం 24 మెయినాబాద్, షాబాద్, గండిపేట్ 25 మంచాల, ఇబ్రహీంపట్నం 26 కొత్తూరు, నందిగామ, శంషాబాద్ 28 అబ్దుల్లాపూర్‌మెట్, హయత్‌నగర్, సరూర్‌నగర్ 29 మహేశ్వరం, కందుకూరు, కడ్తాల్ 30 శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, బాలాపూర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న భూ భారతి చట్టానికి సంబంధించిన పోర్టల్‌ను ఆవిష్కరించి రైతు కుటుంబాలకు అంకితం చేసింది. జూన్ 2 నుంచి పోర్టల్ అమలు చేసేందుకు సన్నాహకాలు చేస్తున్న ప్రభుత్వం ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించేందుకు మండలాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తోంది.సాక్షి, రంగారెడ్డిజిల్లా: భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తీసుకొచ్చిన ‘భూ భారతి’పథకాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా గురువారం నుంచి ఈ నెల 30 వరకు మండలాల వారీగా రికార్డ్ ఆఫ్ రైట్స్(ఆర్ఓఆర్)–2025 భూమి హక్కుల రికార్డు, ధరణి స్థానంలో కొత్తగా తీసుకురాబోతున్న భూ భారతి, ఆర్ఓఆర్లో తప్పుల సవరణ, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, వారసత్వ భూముల మ్యూటేషన్, సేల్‌డీడ్ ఇతర మార్గాల ద్వారా వచ్చిన మ్యూటేషన్, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, పట్టాదారు పాసుపుస్తకాలు, అప్పీల్ వ్యవస్థ, రివిజన్ అధికారాలు, న్యాయ సహాయం, గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు. రెవెన్యూ రికార్డులను పక్కాగా నిర్వహించడంతో పాటు భూములకు (కమతం) ఆధార్ తరహాలో భూధార్ నంబర్ కేటాయింపు సహా ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు సైతం ఈ నంబర్ల ఆధారంగానే అందనున్నాయి. భూ రికార్డుల నిర్వహణలో ఎలాంటి వివాదాలకు ఆస్కారం ఇవ్వొద్దని నిర్ణయించింది. ఆర్డీఓ, తహసీల్దార్ సహా డి సెక్షన్ అధికారులు ఈ సమావేశాల్లో పాల్గొని, రైతులు, భూ యజమానుల్లోని అనుమానాలను నివృత్తి చేయనున్నారు. తద్వారా రెవెన్యూ శాఖపై సృష్టించిన అపవాదులను పూర్తిగా తొలిగించుకోవాలని యోచిస్తోంది. రిజెక్ట్ చేస్తే.. కారణం చెప్పాల్సిందే జిల్లా వ్యాప్తంగా 12,43,035 ఎకరాల భూములు ఉన్నాయి. వీటిలో 64,803 ఎకరాల అటవీ భూములు ఉండగా 8,86,705 ఎకరాల సాగు భూములు ఉన్నాయి. 2,26,509 ఎకరాల వ్యవసాయేతర భూములు ఉన్నాయి. 1,89,406 ఎకరాలు తోటలు, చెట్లతో నిండి ఉంది. 59,906 ఎకరాలు సాగుకు యోగ్యం కానీ భూములున్నాయి. ప్రభుత్వ, భూదాన్, వక్ఫ్, సీలింగ్, లావణి, అటవీ భూములతో పాటు ప్రైవేటు పట్టా భూములు ఉన్నాయి. నగరానికి సమీపంలో జిల్లా ఉండడం, ఐటీ, అనుబంధ సంస్థలతో పాటు రియల్ ఎస్టేట్ రంగం పెట్టుబడులు ఇక్కడ భారీగా పెడుతుండటంతో జిల్లాలోని భూములకు రెక్కలొచ్చాయి. దీంతో పాటు సరిహద్దు వివాదాలు కూడా అధిక మయ్యాయి. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020 నవంబర్‌లో ధరణి ఫోర్టల్‌ను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు రెండు లక్షలకుపైగా దరఖాస్తులు పోర్టల్‌లో నమోదు కాగా, ఇప్పటికే 1.80 వేల దరఖాస్తులను క్లియర్ చేయగా.. ప్రస్తుతం 17,646 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. వీటిలో 7,966 దరఖాస్తులు తహసీల్దార్ల వద్ద, 3,351 దరఖాస్తులు ఆర్డీఓల వద్ద, అదనపు కలెక్టర్ వద్ద 4,877 దరఖాస్తులు, కలెక్టర్ వద్ద 1,452 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. గతంలో దరఖాస్తు తిరస్కరిస్తే. కారణం చెప్పేవారు కాదు. ప్రస్తుతం అమల్లోకి తెచ్చిన భూ భారతిలో అప్పీల్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. కొత్తగా అమల్లోకి తీసుకురాబోతున్న భూ భారతిపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహిస్తోంది. కమతాలకు భూదార్ నంబర్ల కేటాయింపు వాటి ఆధారంగానే సంక్షేమ ఫలాలు -
బుల్లెట్ తీసి బతికించారు..
గచ్చిబౌలి: సోమాలియా దేశంలో జరిగిన సివిల్ వార్‌లో ఓ యువకుడికి తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. కోమాలోకి వెళ్లిన యుకుడికి బుల్లెట్‌ను తీసేందుకు అక్కడి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రెండు నెలల అనంతరం రోగిని ఎయిర్ అంబులెన్స్‌లో గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. 12 గంటల పాటు శస్త్ర చికిత్స చేసిన కేర్ హాస్పిటల్ డాక్టర్ల బృందం 3.5 సెంటీ మీటర్ల పొడవు ఉన్న బుల్లెట్‌ను బయటకు తీసింది. దీంతో సదరు యువకుడు గులెమ్ మహముద్ హెర్సీ(27) ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. గురువారు కేర్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ లక్ష్మీనాథ్ శివరాజు వివరాలు వెల్లడించారు. సోమాలియాకు చెందిన గులెమ్ మహమూద్ హెర్సీ అనే యువకుడికి అక్కడ జరిగిన సివిల్ వార్‌లో నుదుటి నుంచి బుల్లెట్ తలలోకి దూసుకెళ్లిందన్నారు. చిన్న మెదడు దగ్గర చేరడంతో అతడు కోమాలోకి వెళ్లాడని, అక్కడి వైద్యులు తల ముందు పుర్రె ముందు భాగం నుంచి బుల్లెట్‌ను తీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందన్నారు. కోమాలోంచి కొద్దిగా కోలుకున్న తర్వాత అతడిని రెండు నెలల అనంతరం ఎయిర్ అంబులెన్స్‌లో గచ్చిబౌలి కేర్ హాస్పిటల్‌కు తీసుకొచ్చారన్నారు. రేడియాలజీ, సిటీస్కాన్, ఎంఆర్ఐలో బుల్లెట్ పొజిషన్, లోకేషన్‌ను గుర్తించామన్నారు. న్యూరో నావిగేషన్, సర్జికల్ మైక్రో స్కోప్ ద్వారా బ్రెయిన్ ఫంక్షన్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా 12 గంటల పాటు ఆపరేషన్ చేసి బ్లీడింగ్ కాకుండా, వైటల్ స్టక్చర్స్ను కాపాడుకుంటూ బుల్లెట్‌ను తీశామన్నారు. బ్రెయిన్ స్టెంట్ దగ్గర ఉన్న బుల్లెట్‌ను బయకు తీయడం చాలా అరుదుగా జరుగుతుంటుందన్నారు. సర్జరీ జరిగి రెండు వారాలు గడిచిందని, రోగి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. అతడిని రిహాబిలిటేషన్ సెంటర్ ఉంచామని, మరో నాలుగు వారాలు గడిస్తే మరింత కోలుకునే అవకాశం ఉందని తెలిపారు. కేర్ హాస్పిటల్స్ సీఈఓ నీలేష్ మాట్లాడుతూ ఇలాంటి క్లిష్టమైన కేసులకు అత్యాధునిక వైద్య సదుపాయాలు , నిపుణులైన వైద్యులు తమ వద్ద ఉన్నారని తెలిపారు. ఆఫ్రికా, దక్షిణ ఆసియా దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ రోగులకు గమ్యస్థానంగా కేర్ హాస్పిటల్ ఉందన్నారు. రెండు నెలలకు పైగా తలలో బుల్లెట్ గచ్చిబౌలి కేర్ హాస్పిటల్లో అరుదైన శస్త్ర చికిత్స 3.5 సెంటీ మీటర్ల బుల్లెట్‌ను బయటకు తీసిన కేర్ వైద్యులు సురక్షితంగా బయటపడ్డ సోమాలియా యువకుడు -
ఆర్థిక సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య
అల్వాల్: ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం వెలుగులోకి వచ్చింది. అల్వాల్ ఇన్స్పెక్టర్ రాహుల్‌దేవ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వెస్ట్ మారేడ్‌పల్లి ప్రాంతానికి చెందిన నర్సింగ్‌రావు కుమారుడు సందీప్‌కుమార్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తూ అల్వాల్ టెలికాం కాలనీలో నివాసం ఉంటున్నాడు. గత కొన్నేళ్లుగా వివిధ లోన్ యాప్‌ల నుంచి అప్పు తీసుకున్నాడు. యాప్‌ల నిర్వాహకులు ఒత్తిడి చేయడంతో మనస్తాపానికి లోనైన అతను బుధవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి నర్సింగ్‌రావు ఫిర్యాదు మేరకు అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. -
కేంద్రం పూచీకత్తు ఇస్తే రెండో దశ మెట్రో నిధులిస్తానంటున్న జైకా
సాక్షి, సిటీబ్యూరో: ‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లుంది రెండో దశ మెట్రో పరిస్థితి. నిధులిచ్చే సంస్థలు ఉన్నా అడుగు ముందుకు పడటంలేదు. ప్రతిపాదనలు, ప్రణాళికలు, సమగ్రమైన ప్రాజెక్టు నివేదికలను కూడా సిద్ధం చేసుకొని, చివరకు నిధులను సమకూర్చే సంస్థలను సైతం ఎంపిక చేసుకున్నప్పటికీ కేంద్రం ప్రాపకం లభించకపోవడంతో రెండో దశ మెట్రో ప్రాజెక్టుపై ప్రతిష్టంభన నెలకొంది. నిధుల సేకరణలో భాగంగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఏఎంఆర్‌ఎల్) సంస్థ పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ఈ క్రమంలో రెండో దశ మెట్రోకు నిధులను అందజేసేందుకు జపాన్‌కు చెందిన ఆర్థిక సంస్థ జైకా నుంచి సుముఖత లభించినట్లు తెలిసింది. ఆ సంస్థ ప్రతినిధులతో హెచ్‌ఏఎంఆర్‌ఎల్ ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపింది. ప్రస్తుతం ప్రక్రియ కూడా తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. కేవలం కేంద్రం నుంచి సావరిన్ గ్యారంటీ లభించకపోవడం అనేదే ఇప్పుడు సాంకేతికంగా ఎదురవుతున్న సమస్య. రెండో దశపై రూ పొందించిన డీపీఆర్‌లను రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో కేంద్రానికి పంపించి 6 నెలలైంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ అంతర్జా తీయ విమానాశ్రయానికి కనెక్టివిటీనిచ్చే ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే పలుమార్లు కేంద్ర మంత్రులను కూడా కలిశారు. కానీ ఇప్పటికీ కేంద్రం నుంచి సావరిన్ గ్యారంటీ లభించలేదు. దీంతో రుణాలు ఇచ్చే సంస్థలు సిద్ధంగా ఉన్నప్పటికీ పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. ప్రైవేట్ సంస్థల నుంచి 52 శాతం నిధుల సేకరణ.. మెట్రో రెండో దశలో ప్రతిపాదించిన 76.4 కిలోమీటర్ల కారిడార్ల నిర్మాణానికయ్యే మొత్తం వ్యయం రూ.24,269 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇందులో 30 శాతం అంటే రూ.7,313 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తేంది. మరో 18 శాతం నిధులు అంటే రూ.4,230 కోట్లు కేంద్రం భరించాల్సి ఉంటుంది. మిగతా 52 శాతం నిధులు.. రూ.12,726 కోట్లు అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాల రూపంలో సేకరించాలని నిర్ణయించారు. మెట్రో స్టేషన్లలో మౌలిక సదుపాయాలతో పాటు పలు పనులను పీపీపీ విధానంలో చేపట్టాలని ప్రతిపాదించారు. కేంద్రం నుంచి లభించే ఆర్ధిక సహాయంతో పాటు రుణాల సేకరణ ద్వారా ఈ ప్రాజెక్టును చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు జైకా సంస్థ నుంచి సానుకూలత లభించింది. కేంద్రం అనుమతి సహా అన్నీ అనుకూలిస్తే 2028 నాటికి ప్రతిపాదిత 5 కారిడార్లలో రైళ్లను నడపాలని హెచ్‌ఏఎంఆర్‌ఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. – గతేడాది డీపీఆర్‌లు సిద్ధం చేసినప్పటికీ ఇప్పటి వరకు సావరిన్ గ్యారంటీ లభించకపోవడంతో తీవ్రమైన జాప్యం నెలకొంది. ‘మెట్రో రెండో దశకు నిధుల కొరత ఏ మాత్రం సమస్య కాదు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు నిధులను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. కానీ కేంద్రం అనుమతి లభించడమే కీలకం’ అని అధికారులు చెబుతున్నారు. జైకాతో సంప్రదింపులు చాలావరకు తుదిదశకు చేరుకున్నాయని పేర్కొన్నారు. ఇతర మెట్రోపాలిటన్ నగరాల్లో మెట్రో రెండు, మూడో దశలు కూడా పూర్తయ్యాయి. కానీ.. హైదరాబాద్‌లో మాత్రం ఏడు సంవత్సరాలు ఆలస్యంగా రెండోదశకు ప్రణాళికలను రూపొందించారు.ప్రస్తుతం మొదటి దశలోని 69 కిలోమీటర్ల కారిడార్లలో 5 లక్షల మంది ప్రయాణం చేస్తుండగా, రెండో దశలో ప్రతిపాదించిన 5 కారిడార్లు అందుబాటులోకి వస్తే ప్రయాణికుల సంఖ్య 8 లక్షలు దాటే అవకాశం ఉన్నట్లు అంచనా. ఆ సంస్థతో చర్చలు జరుపుతున్న హెచ్‌ఏఎంఆర్‌ఎల్ కేంద్ర ప్రభుత్వ అనుమతి లభించకపోవడంతోనే జాప్యం ప్రైవేట్ సంస్థల నుంచి 52 శాతం నిధుల సేకరణకు కసరత్తు -
రేపు తాగునీటి సరఫరాలో అంతరాయం
సాక్షి, సిటీబ్యూరో: గోదావరి తాగునీటి సరఫరా పథకంలో భాగంగా హైదర్ నగర్ నుంచి అల్వాల్ వరకు 1200 ఎంఎం డయా ఎంఎస్ గ్రావిటీ మెయిన్ పైపులైన్‌కు షాపూర్ నగర్ వద్ద మరమ్మతు పనులు చేపడుతున్న నేపథ్యంలో శనివారం ఉదయం 6 నుంచి సాయంత్రం 9 గంటల వరకు కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా, మరికొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని జలమండలి గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. అంతరాయం ఏర్పడే ప్రాంతాలివే.. నగర శివారులోని షాపూర్‌నగర్, సంజయ్ గాంధీ నగర్, కళావతి నగర్, హెచ్ఎంటీ సొసైటీ, హెచ్ఏఎల్ కాలనీ, టీఎస్ఐఐసీ కాలనీ, రోడమేస్త్రి నగర్, శ్రీనివాస్ నగర్, ఇందిరానగర్, గాజులరామారం, శ్రీ సాయి హిల్స్, దేవేందర్ నగర్, కై లాస్ హిల్స్, బాలాజీ లేఅవుట్, కై సర్ నగర్, గాజులరామారం తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని జలమండలి స్పష్టం చేసింది. -
26/11
సిటీ @నగరంలోనూ ముంబై ఉగ్రదాడుల చేదు గుర్తులు ● దాడుల్లో కన్నుమూసిన ఇద్దరు హైదరాబాదీలు ● ఇక్కడి అడ్రస్‌లతో ఉగ్రవాదుల గుర్తింపు కార్డులు ● ఎట్టకేలకు అమెరికా నుంచి తెహవూర్ రాణా తరలింపు సాక్షి, సిటీబ్యూరో: 26/11 ముంబై మారణహోమం కేసులో కీలక నిందితుడిగా ఉన్న తెహవూర్ రాణాను ఎట్టకేలకు ఢిల్లీకి తీసుకువచ్చారు. గురువారం అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో ఇండియాకు ఇతడిని తీసుకువచ్చినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటించింది. ముంబై మహా నగరంలో 2008 నవంబర్ 26న అజ్మల్ కసబ్ సహా పది మంది సృష్టించిన మారణ కాండకు సంబంధించి భాగ్య నగరంలోనూ కొన్ని చేదు గుర్తులున్నాయి. నాటి దాడుల్లో ఇద్దరు హైదరాబాదీలు మరణించగా.. నగరంలోని కొన్ని ప్రాంతాల చిరునామాలతో ఉగ్రవాదుల దగ్గర నకిలీ గుర్తింపు కార్డులు లభించాయి. దీంతో కొందరు నగరవాసులు ఆ కేసుల్లో సాక్షులుగా వాంగ్మూలం ఇచ్చారు. అసువులు బాసిన ఇరువురు.. మారణహోమం సృష్టించడానికి పాకిస్థాన్ నుంచి సముద్ర మార్గంలో వచ్చిన ఉగ్రవాదులు ‘బుడ్వార్ పార్క్ జెట్టీ’ నుంచి ఓ ట్యాక్సీలో ‘వీటీ’ రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ దిగుతూ.. అందులో బాంబు అమర్చారు. పాతబస్తీకి చెందిన కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎకై ్సజ్ కన్సల్టెంట్ అడ్వొకేట్ లక్ష్మీనారాయణ గోయల్ ఓ కేసు పని నిమిత్తం ముంబై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో భాగంగా అదే రోజు కాందవెల్లీ ప్రాంతం నుంచి ‘వీటీ’ రైల్వే స్టేషన్‌కు ఆలస్యంగా చేరుకున్నారు. దీంతో ఆయన ఎక్కాల్సిన హుస్సేన్‌సాగర్ ఎక్స్‌ప్రెస్‌ను మిస్సయ్యారు. వీటీ స్టేషన్ నుంచి తిరిగి కాందవెల్లీలోని తన మరదలు ఉష ఇంటికి వెళ్లడానికి ఉగ్రవాదులు దిగిన ట్యాక్సీనే ఎక్కారు. ఈ ట్యాక్సీ ‘విల్లే పార్లీ’ సమీపంలోకి చేరుకోగానే అందులోని బాంబు పేలడంతో ఆయన కన్నుమూశారు. నగరంలోని నేరేడ్మెట్ పరిధిలోని డిఫెన్స్ కాలనీకి చెందిన విజయరావు బాంజే అక్కడి తాజ్ హోటల్లో చీఫ్ చెఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేశారు. ముష్కరులు టార్గెట్ చేసిన వాటిలో ఈ హోటల్ కూడా ఒకటి. అతిథులను రక్షించే ప్రయత్నంలో ఉగ్రవాదుల తూటాలకు బాంజే బలయ్యారు. బోగస్ గుర్తింపు కార్డుల్లోనూ... 26/11 దాడుల్లో పాల్గొన్న పది మంది ఉగ్రవాదుల్లో తొమ్మిది మంది దగ్గర బోగస్ పేర్లతో గుర్తింపు కార్డులు లభించాయి. వీటిలో కొన్నింటిపై హైదరాబాద్‌లోని వివిధ చిరునామాలు ముద్రించి ఉన్నాయి. ఈ మారణహోమంలో సజీవంగా దొరికిన ఉగ్రవాది అజ్మల్ కసబ్ (2012లో ఉరి తీశారు) దగ్గర లభించిన బోగస్ గుర్తింపు కార్డులో నాగోలు ప్రాంతానికి చెందిన చిరునామా ఉంది. దిల్‌సుఖ్‌నగర్‌లోని అరుణోదయ డిగ్రీ కళాశాలలో చదువుతున్నట్లుగా చక్రబర్తి పేరుతో ఉన్న ఆ గుర్తింపు కార్డులో నాగోలులోని మమతానగర్ కాలనీ, ఇస్మాయిల్ ఖాన్‌కు నరేష్ విలాస్ వర్మ పేరుతో నాగోలు, నిస్సార్‌కు దినేష్‌కుమార్ పేరుతో సరూర్‌నగర్‌లోని హుడా కాలనీ, ఫహదుల్లాకు రోహిత్ దీపక్ పాటిల్ పేరుతో విజయ్‌నగర్ కాలనీలోని ఎస్కే అపార్ట్మెంట్స్ చిరునామాలతో నకిలీ గుర్తింపు కార్డులు తయారు చేశారు. ఈ నేపథ్యంలోనే ముంబై దాడుల కేసులు దర్యాప్తు చేసిన అక్కడి క్రైమ్ బ్రాంచ్ అధికారులు హైదరాబాద్ సైతం వచ్చి నాగోలు, అరుణోదయ డిగ్రీ కళాశాలలో విచారణ చేశారు. 26/11 ఉదంతాలపై నమోదైన కేసుల్లో అరుణోదయ కాలేజీ ప్రిన్సిపల్‌గా పని చేసిన రాధాకృష్ణయ్య, గోయల్, బాంజే కుటుంబాలు సైతం కీలక సాక్షిగా ఉండి న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చాయి. అప్పట్లో 48 గంటల ఉత్కంఠ.. దాడులు జరుగుతున్న రోజే ఆ ఉగ్రవాదుల్లో షాదుల్లాహ్, ఇమ్రాన్ బాబర్ ఓ న్యూస్ ఛానల్ ఫోన్ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తమది హైదరాబాద్ అంటూ చెప్పడంతో తీవ్ర కలకలం రేగింది. వాళ్లు ఎవరు? నగరంలో ఎక్కడి వాళ్లు? అనే ఉత్కంఠ 48 గంటలు నెలకొంది. చివరకు లింగ్విస్టిక్ ఎక్స్పర్ట్స్ (భాషా నిపుణుల) వల్ల దీనికి తెరపడింది. ఈ నిపుణులు ఉగ్రవాదుల ఇంటర్వ్యూ రికార్డులు విశ్లేషించారు. వీరి మాటల్లో ‘జిహాద్’ (పవిత్ర యుద్ధం), ‘జుల్మ్’ (అట్రాసిటీ) పదాలే ఎక్కువగా ఉన్నాయి. వీరు వాడిన మాండలికం ఆధారంగా పాకిస్థాన్‌లోని పంజాబ్, పెషావర్లకు చెందిన వారుగా భాషా నిపుణులు నిర్ధారించారు. టెర్రరిస్టులు వాడిన ‘ఖత్లే ఆమ్’ (సామూహిక మారణకాండ) పదాన్ని అక్కడి వారే ఉచ్చరిస్తారని తేల్చారు. ఇలా మరికొన్ని పదాలను విశ్లేషించిన నిపుణులు ఉగ్రవాదులకు హైదరాబాద్‌తో సంబంధం లేదని తేల్చారు. దీంతో పోలీసు, నిఘా వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ముంబై పేలుళ్ల దృశ్యం (ఫైల్) -
రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి
కొండపాక(గజ్వేల్): రోడ్డు ప్రమాదంలో ఏడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన కుకునూరుపల్లి మండలం, లకుడారం గ్రామ శివారులో గురువారం చోటు చేసుకుంది. కుకునూరుపల్లి ఎస్సై శ్రీనివాస్ కథనం మేరకు.. హైదరాబాద్‌లోని మూసాపేటకు చెందిన ఉమేశ్ తన 5 నెలల కుమారుడి పుట్టు వెంట్రుకలను తీయించేందుకు కుటుంబ సభ్యులతో వేముల వాడలోని రాజరాజన్న దేవ స్థానానికి కారులో బయలు దేరారు. ఈ నేపథ్యంలో ఉమేశ్ చెల్లెలు కుమారుడు రామారం కార్తీక్ (7) కూడా మేనమామతో కలిసి కారులో వెళ్లాడు. కార్యక్రమం అనంతరం తిరుగు ప్రయాణంలో కుకునూరుపల్లి మండలంలోని లకుడారం గ్రామ శివారులోకి రాగానే కారు అదుపు తప్పి రాజీవ్ రహదారి పక్కన విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో కార్తీక్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న మిగితా ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తమ కుమారుడి మృతికి కారణమైన బావమరిది ఉమేశ్‌పై చర్యలు తీసుకోవాలంటూ రామారం బాబీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విషాదం నింపిన పుట్టు వెంట్రుకల వేడుక కారులో వేములవాడకు వెళ్లిన కుటుంబం తిరుగు ప్రయాణంలో లకుడారం గ్రామ శివారులో కారు బోల్తా ఆరుగురికి స్వల్ప గాయాలు -
52 కిలోల గంజాయి పట్టివేత
చిలకలగూడ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏడో నంబరు ప్లాట్‌ఫారంపై తరలించేందుకు సిద్ధంగా ఉంచిన రూ. 26 లక్షల విలువైన 52 కిలోల గంజాయిని ఆర్పీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్పీఎఫ్ ఎస్ఐ రమేష్ నేతృత్వంలో సిబ్బంది సూర్య, నరేష్, రమేష్‌లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏడో నంబరు ప్లాట్‌ఫారంపై 26 బ్యాగులను గుర్తించారు. అక్కడ ఉన్న ప్రయాణికులు, షాప్కీపర్స్ను వాకబు చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు సదరు బ్యాగులను తెరిచి చూడగా గంజాయి కనిపించింది. మొత్తం 26 బ్యాగుల్లో 52 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు గురువారం సికింద్రాబాద్ రైల్వే డీఎస్పీ ఎస్ఎన్ జావేద్ తెలిపారు. -
కంబైన్డ్ డిఫెన్స్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
● ఈ నెల 13 నుంచి పరీక్షల నిర్వహణ ● హాజరుకానున్న 8086 మంది అభ్యర్థులు ● ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు ● అన్ని కేంద్రాల్లోనూ మౌలిక వసతుల కల్పన ● జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారి లక్డీకాపూల్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో మూడు సెషన్లలో నిర్వహించనున్న డిఫెన్స్ సర్వీస్ పరీక్షతో పాటు పాటు రెండు సెషన్లలో జరిగే నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటా చారి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఈనెల 13 నుంచి జరగనున్న పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, రూట్ ఆఫీసర్లు, లోకల్ ఇన్స్పెక్టింగ్ అధికారులు, టైం డిపార్ట్మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పరీక్షల నిర్వహణకు 22 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయా కేంద్రాల్లో 8086 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు. అధికారులు పరీక్షా కేంద్రాలను ముందుగా పరిశీలించి వసతులు కల్పనపై నివేదికలు అందజేయాలని సూచించారు. పరీక్షల నిర్వహణలో భాగంగా ఐదు రూట్లుగా విభజించడం జరిగిందని లోకల్ ఇన్స్పెక్టింగ్ అధికారులుగా 22 మందిని నియమించామన్నారు. డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, ఇంగ్లిష్, మధ్యాహ్నం 12 నుంచి 2.30 వరకు జనరల్ నాలెడ్జ్ పరీక్ష అలాగే సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు ఎలిమినేటరి మ్యాథమెటిక్స్ పరీక్ష ఉంటుందన్నారు. విధంగా నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ ఎకాడమీ ఎగ్జామినేషన్ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మ్యాథమెటిక్స్ పరీక్ష , మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు జనరల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుందన్నారు. అభ్యర్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని, హాల్ టికెట్‌తో పాటు గుర్తింపు కార్డు తీసుకురావాలన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతి లేదన్నారు. అన్ని కేంద్రాల గేట్లను అరగంట ముందే మూసివేస్తామన్నారు. సమావేశంలో అదనపు డీసీపీ భాస్కర్, పర్యవేక్షకులు జహీరుద్దీన్ , చీప్ సూపరింటెండెట్లు, రూట్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. -
గ్యారంటీ.. ఇవ్వరేంటీ!
వివిధ నగరాల్లో మెట్రో రెండు, మూడో దశలు ఇలా... చైన్నె: మెట్రో రెండో దశకు రూ.63,246 కోట్లతో అంచనాలు 2024 అక్టోబర్‌లో ఆమోదం. బెంగళూరు: సుమారు రూ.14,788 కోట్ల అంచనాలతో చేపట్టిన మెట్రో రెండో దశకు 2021 ఏప్రిల్‌లో అనుమతి లభించింది. మూడో దశలో భాగంగా రూ. 15,611 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టుకు 2024 ఆగస్టులో అనుమతి. హైదరాబాద్: రెండో దశ ప్రాజెక్టు కోసం రూ. 24,269 కోట్లతో రూపొందించిన ప్రాజెక్టు డీపీఆర్‌ను 2024 నవంబర్లోనే కేంద్రానికి అందజేశారు. కానీ.. ఇప్పటివరకూ అనుమతి లభించలేదు. -
21 నుంచి అరుదైన నాణేలు, కరెన్సీ ప్రదర్శన
చార్మినార్: ఈ నెల 21, 22, 23 తేదీల్లో పాతబస్తీలోని ఉర్దూ ఘర్‌లో అరుదైన అంతర్జాతీయ నాణేలు, కరెన్సీ నోట్లు, పురాతన వస్తువుల ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 7 గంటల వరకు సందర్శకులకు ప్రవేశం ఉచితమని పేర్కొన్నారు. అరుదైన నాణేలు, పేపర్ కరెన్సీ, స్టాంపులు, పెయింటింగ్‌ల ప్రదర్శన చరిత్రపై ఆసక్తి ఉన్నవారికి ఈ ఎగ్జిబిషన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఏపీజే అబ్దుల్ కలాం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగే ఈ అంతర్జాతీయ నాణేలు, కరెన్సీ ఎగ్జిబిషన్ అందరికీ అందు బాటులో ఉంటుందని.. తమకు కావాల్సిన వాటిని ఖరీదు చేయవచ్చని, అలాగే తమ వద్ద ఉన్న పురాతన నాణేలను విక్రయించవచ్చని సొసైటీ కార్యదర్శి డాక్టర్ సయ్యద్ అబ్దుల్ హై ఖాద్రీ తెలిపారు. నాణేలు, పేపర్ కరెన్సీ, స్టాంపులు, పెయింటింగ్‌లతో పాటు ఇతర పురాతన వస్తువుల మిశ్రమ కలయిక వస్తువులను ఎగ్జిబిషన్లో సందర్శకులకు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. -
15న సీ్త్ర సమ్మిట్ 2.0
లోగో ఆవిష్కరించిన కొత్వాల్ ఆనంద్ సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మహిళల భద్రతను మరింత పెంచడమే లక్ష్యంగా హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌తో (హెచ్సీఎస్సీ) కలిసి సిటీ పోలీసులు ‘సీ్త్ర’ (షీ ట్రంప్స్ థ్రూ రెస్పెక్ట్, ఈ క్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్) పేరుతో మరోసారి సదస్సు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 2023లో ఓసారి ఈ సదస్సు నిర్వహించారు. ఈ నెల 15న నిర్వహించనున్న రెండో సమ్మిట్‌కు సంబంధించిన లోగోను కొత్వాల్ సీవీ ఆనంద్ గురువారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. వివిధ వర్గాలకు చెందిన మహిళలు, యువతులతో పాటు నిపుణులు ఈ సమ్మేళనంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా తమ అనుభవాలను పంచుకోవడంతో పాటు సలహాలు, సూచనలు ఇస్తారు. -
మామిడి రైతుల ప్రయోజనాలే ముఖ్యం
గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి అబ్దుల్లాపూర్‌మెట్: పండ్ల మార్కెట్‌కు వచ్చే మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ వారి ప్రయోజనాల కోసమే మార్కెట్ కమిటీ పనిచేస్తోందని గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి అన్నారు. మామిడి సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో గురువారం ఆయన బాటసింగారం పండ్ల మార్కెట్లో జరుగుతున్న మామిడి పండ్ల క్రయవిక్రయాలను పాలకవర్గ సభ్యులు, అధికారులతో కలిసి పరిశీలించారు. మామిడి మార్కెట్ యార్డులో కలియ తిరిగి రైతుల సమస్యలు, క్రయవిక్రయాలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్‌కి వచ్చిన రైతుల సమస్యలు తెలుసుకొని వారి సలహాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతేడాది కంటే ఈ సంవత్సరం మామిడి దిగుబడి అధికంగా ఉందని, మార్కెట్‌కి వచ్చే రైతులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. రైతులకు గిట్టుబాటు అందించేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు. రోజుకు 800 వాహనాలు మార్కెట్‌కి వస్తున్న తరుణంలో ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగాకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సీహెచ్ భాస్కరాచారి, మార్కెట్ సెక్రటరీ ఎల్.శ్రీనివాస్, డైరెక్టర్లు బండి మధుసూదన్ రావు, అంజయ్య, నవరాజ్, రఘుపతి రెడ్డి, నరసింహ, జైపాల్ రెడ్డి, మచ్చేందర్ రెడ్డి, గణేశ్‌నాయక్, వెంకటేశం గుప్తా, ఇబ్రహీం పాల్గొన్నారు. -
సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి ముట్టడికి యత్నం
బంజారాహిల్స్: లంబాడీ ఎమ్మెల్యేలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తూ లంబాడీల లడాయి సేవాలాల్ బంజారా సంఘం ఆధ్వర్యంలో గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించారు. దాదాపు 50 మంది లంబాడా మహిళలు సీఎం ఇంటి ముట్టడికి యత్నించగా వారిని అడ్డుకున్న పోలీసులు బలవంతంగా వాహనంలో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సేవాలాల్ బంజారా సంఘం నాయకులు మాట్లాడుతూ అగ్రకుల ఆధిపత్యంలో నలిగిపోతున్న లంబాడీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించి గుర్తింపునివ్వాలన్నారు. రాష్ట్రంలోని 45 నియోజకవర్గాల్లో లక్షల సంఖ్యలో లంబాడాల ఓట్లు ఉన్నాయని, గెలుపోటములను ప్రభావితం చేయగలిగిన సత్తా కల లంబాడాలకు ప్రభుత్వంలో భాగస్వామ్యం లేకపోవడం దారుణమన్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉన్న లంబాడీలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించుకున్నామన్నారు. లంబాడీలను విస్మరించడం తగదని, తమకు మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని కోరారు. లేని పక్షంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామన్నారు. అరైస్టె వారిలో నాయకులు సక్రిబాయి, కొర్ర చందునాయక్, లావుడియా ప్రసాద్ నాయక్, ధరావత్ గణేష్‌నాయక్, శాంతిబాయి, నాగునాయక్, కొర్ర లాలునాయక్, శ్యామలనాయక్, నునావత్ రాంబాబునాయక్, నాగరాజునాయక్, శ్రీనునాయక్, బానోత్ బాలాజీనాయక్ తదితరులు ఉన్నారు. -
ఇక పక్కా!
ఆస్తుల లెక్క.. లే ఔట్ ఖాళీ స్థలాలు, పార్కులు, బల్దియా కార్యాలయాలు.. ● మార్కెట్లు, కమ్యూనిటీ హాళ్లు, స్థిరాస్తులు తదితరాలు ● అంగుళం సైతం తేడా రాకుండా డీజీపీఎస్ సర్వే ● తొలుత ఎల్బీనగర్, కూకట్పల్లి జోన్ల పరిధిలో.. ● కన్సల్టెంట్లకు జీహెచ్ఎంసీ ఆహ్వానం సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో కోటి మందికి పైగా ప్రజలకు వివిధ పౌర సేవలందిస్తున్న జీహెచ్ఎంసీకి ప్రధాన, జోనల్, సర్కిల్ కార్యాలయాలతో పాటు పలు ఆస్తులున్నాయి. మున్సిపల్ మార్కెట్లు, షాపులు, భూములతో పాటు పార్కులు, డంపింగ్ యార్డులు, స్లాటర్ హౌస్‌లు తదితరాలున్నాయి. అయినా.. తమ స్థిరాస్తులు ఎక్కడ ఎన్ని ఉన్నాయో, ఎవరి స్వాధీనంలో ఉన్నాయో, ఎంత విస్తీర్ణంలో ఉన్నాయో, వాటిలో ఎవరుంటున్నారో కనీస వివరాలు కూడా జీహెచ్ఎంసీ వద్ద లేకుండాపోయాయి. అంతేకాదు.. లే ఔట్ల ఖాళీ స్థలాల్లో పార్కులు, ఆటస్థలాలు, ఇతరత్రా సదుపాయాలు కల్పించాల్సి ఉండగా, అసలు ఆ లేఔట్లలోని ఖాళీ ప్రదేశాలు ఎన్ని చోట్ల ఉన్నాయో, ఎంత విస్తీర్ణంలో ఉన్నాయో వంటి వివరాలు కూడా జీహెచ్ఎంసీ వద్ద లేవు. సుదీర్ఘ కాలం మొద్దు నిద్ర తర్వాత ఎట్టకేలకు జీహెచ్ఎంసీ తమ ఆస్తులెన్ని ఉన్నాయో కచ్చితంగా తెలుసుకోవాలనే నిర్ణయానికొచ్చింది. అందుకుగాను ఆషామాషీగా కాకుండా కచ్చితమైన, అంగుళం కూడా తేడా రాకుండా వాటిని కనిపెట్టడంతోపాటు రియల్ టైమ్‌లోనూ వాటిని ఆన్లైన్ ద్వారా వీక్షించే సదుపాయం ఉండాలని భావిస్తోంది. అందుకోసం తమ స్థిరాస్తుల సర్వే, డిజిటలీకరణ, జియో రిఫరెన్సింగ్ తదితరమైనవి చేయగల కన్సల్టెంట్ల సేవలను ఆహ్వానిస్తూ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ)టెండర్లను ఆహ్వానించింది. ఈ పనులకు ఎంపికయ్యే కన్సల్టెన్సీ జీపీఎస్ సర్వే కాకుండా అంగుళం వరకు కూడా కచ్చితమైన వివరాలందజేయగల డీజీపీఎస్ (డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) సర్వే నిర్వహించాల్సి ఉంటుంది. సర్వే చేయాలిలా.. ప్రతి ఆస్తికి సంబంధించిన విస్తీర్ణం, సరిహద్దులు, చుట్టుపక్కల ఉన్న భవనాలు, రోడ్లు, వాటర్, విద్యుత్, సివరేజి వంటి యుటిలిటీస్ లైన్లు తదితరమైనవి డీజీపీఎస్ను ఉపయోగించి చేయాలి. ఆస్తికి సంబంధించి ప్రతీ మూల రియల్ కోఆర్డినేట్లు గుర్తించాలి. అన్ని భవనాల ముందు, పక్కల, లోపల దృశ్యాలు కనిపించేలా ఫొటోలు తీయాలి. సదరు భవనం జీహెచ్ఎంసీ ఏ సర్కిల్లో ఉందో పేర్కొనడంతో పాటు సర్వే నెంబరు, టౌన్ సర్వే నెంబరు, డోర్ నెంబర్, లొకాలిటీ పేరు, గ్రామం, మండలం, జిల్లా పేర్లతో పాటు ఖాళీ ప్రదేశమా, భవనమా, భవనమైతే నాలుగువైపులా సరిహద్దులు, ప్రహరీ ఉందా.. లేదా? భవనమైతే ప్రస్తుత వినియోగం, బిల్టప్ ఏరియా, భవనంపేరు వంటి వివరాలు పొందుపరచాలి. ● లే ఔట్ ఓపెన్ స్పేస్లైతే లే ఔట్ పేరు, నెంబరు, లే ఔట్ మేరకు ఎంత ఓపెన్‌స్పేస్ ఉండాలి.. ఎంత ఉంది.. (చదరపు గజాల్లో), ఎంత మేర కబ్జా అయింది, కబ్జాలో జరిగిన నిర్మాణాల వంటి వివరాలు సైతం పొందుపరచాలి. జీహెచ్ఎంసీకి సంబంధించిన స్థిరాస్తులన్నింటికీ యూనిక్ ఐడీ నెంబరు ఇవ్వాలి. ఇందుకుగాను తగినన్ని బృందాల్ని నియమించాలి. జోన్‌కు కనీసం రెండు బృందాల వంతున ఆరు జోన్లకు తగినన్ని బృందాల్ని నియమించాలి. ఈ బృందాలకు ఆయా అంశాల్లో జీహెఎంసీ టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ, ఇంజినీరింగ్ విభాగాలు సహకరిస్తాయి. టౌన్‌ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో సర్వే చేయిస్తారు. తొలుత ప్రయోగాత్మకంగా ఎల్బీనగర్, కూకట్పల్లి జోన్లలో ఈ సర్వే నిర్వహిస్తారు. -
ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఉద్యోగి
అబిడ్స్: పాత మీటర్‌కు బదులుగా కొత్తది ఇవ్వాలని, మీటర్లో ఎలాంటి బకాయిలు లేకుండా చూసేందుకు రూ.20 వేల లంచం డిమాండ్ చేసిన టీజీఎస్పీడీసీఎల్ మంగళ్‌హాట్ విద్యుత్ సెక్షన్ ఉద్యోగి (గ్రేడ్– 4 ఆర్టిజన్ అబ్దుల్ రహ్మాన్) ఏసీపీ అధికారులకు చిక్కాడు. సీతారామ్పేట్లోని మంగళ్‌హాట్ విద్యుత్ కార్యాలయంలో ఫిర్యాదుదారు ఉమర్ రూ.20 వేల లంచం ఇస్తుండగా హైదరాబాద్ జిల్లా ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మంగళ్‌హాట్ ప్రాంతంలో నివసించే ఉమర్ ఇంటి కరెంట్ మీటర్‌పై బకాయిలు ఉన్నాయి. బకాయిలు లేంకుడా చూడాలని, ఎలాంటి పెనాల్టీ లేకుండా కొత్త మీటర్ ఇవ్వాలని ఉమర్ విద్యుత్ శాఖ ఉద్యోగి అబ్దుల్ రహ్మాన్‌ను సంప్రదించాడు. దీంతో తనకు రూ.20 వేలు ఇస్తేనే పాత బకాయిలు లేకుండా చూస్తానని రహ్మాన్ హామీ ఇచ్చాడు. మంగళవారం డబ్బులు ఇస్తానని చెప్పిన ఉమర్ నేరుగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనల మేరకు తన కార్యాలయంలో డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రహ్మాన్‌ను పట్టుకుని కేసు నమోదు చేశారు. లంచం డిమాండ్ చేస్తే 1064కు ఫిర్యాదు చేయండి.. నగరంలో ఏ ప్రభుత్వ శాఖలోనైనా అధికారులు, ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే టోల్‌ఫ్రీ నెంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ సూచించారు. అదేవిధంగా వాట్సాప్ నెంబర్ 94404 46106కు కూడా ప్రజలు ఫిర్యాదు చేయొచ్చని ఆయన సూచించారు. ఫిర్యాదు దారుల పేర్లను ఏసీబీ రహస్యంగా ఉంచుతుందని, లంచగొండి అధికారులపై చర్యలు తీసుకుంటామని గంగసాని శ్రీధర్ వెల్లడించారు. -
స్నేహితుల దాడిలో యువకుడి మృతి
జవహర్‌నగర్: గంజాయి అమ్ముతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నాడని ఓ యువకుడిని అతని స్నేహితులు దారుణంగా కొట్టడంతో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాప్రాల్ భగత్‌సింగ్ కాలనీలో నివసించే పుళ్లురి వెంకటనర్సయ్య రెండవ కుమారుడు ప్రణీత్ (21) డ్రైవింగ్ పనిచేస్తుంటాడు. అదే కాలనీకి చెందిన అతని స్నేహితుడు గోవర్ధన్ గంజాయి అమ్ముతున్నాడని ఇటీవల కాలనీలో కొందరికి చెప్పాడు. దీంతో కోపగించిన గోవర్ధన్ ఈ నెల 5వ తేదీన రాత్రి తన స్నేహితులు జశ్వంత్, విన్సెంట్‌లతో కలిసి ప్రణీత్‌తో మాట్లాడాలని పిలిపించి స్థానికంగా ఉండే మైదానానికి తీసుకెళ్లారు. అక్కడ ప్రణీత్‌ను కర్రలు, చేతులతో దారుణంగా కొట్టడంతో మెడపై తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో వారు అక్కడి నుండి పరారయ్యారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ప్రణీత్‌ను స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమించడంతో అనంతరం గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రణీత్ మంగళవారం ఉదయం మృతిచెందాడని వైద్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
మియాపూర్‌లో లారీ బీభత్సం
హోంగార్డు మృతి ● మరో ఇద్దరికి గాయాలు మియాపూర్: మద్యం మత్తులో వాహనం నడిపి ట్రాఫిక్ హోంగార్డు మృతికి కారణమయ్యాడు ఓ లారీ డ్రైవర్. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ క్రాంతి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో ట్రాఫిక్ కానిస్టేబుళ్లు రాజవర్ధన్, వికేందర్, సింహాచలం (42) విధుల్లో ఉన్నారు. ఇదే సమయంలో ఎర్రగడ్డ నుంచి మియాపూర్ వైపు మద్యం మత్తులో లారీ నడుపుతూ వచ్చిన డ్రైవర్.. యూటర్న్ వద్ద ఉన్న ట్రాఫిక్ గొడుగును ఢీకొట్టాడు. పక్కన విధులు నిర్వర్తిస్తున్న సింహాచలంపై ట్రాఫిక్ గొడుగు పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతనితో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు రాజవర్ధన్, వికేందర్లకు కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు పరిశీలించి సింహాచలం అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. రాజవర్ధన్, వికేందర్లు చికిత్స పొందుతున్నారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం చింతల్కట్ గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ శ్రీనివాస్‌ను మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకుని డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా 321 యూనిట్లు వచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు చెప్పారు. మృతుడు సింహాచలం స్వస్థలం ఏపీలోని శ్రీకాకుళం జిల్లా చిగురువలస గ్రామం. నగరంలోని బాచుపల్లి బొల్లారంలో భార్య కుమారి, ఇద్దరు కూతుళ్లతో కలిసి నివాసముంటున్నాడు. మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో రెండేళ్ల నుంచి హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ‘హై సిటీ’ ప్రాజెక్టుల భూసేకరణపై సమీక్ష సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో కేబీఆర్ పార్కు చుట్టూ, ఇతరత్రా ప్రాంతాల్లో ట్రాఫిక్ చిక్కుల పరిష్కారానికి, ఫ్లై ఓవర్లు తదితర నిర్మాణాల కోసం ప్రభుత్వం రూ.7032 కోట్లకు పరిపాలన అనుమతులు జారీ చేసి ఎంతో కాలమైంది. కానీ.. ఇప్పటి వరకు సదరు పనుల్లో పురోగతి కనిపించడం లేదు. ఇంకా టెండర్ల దశ కూడా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో టెండర్లు పూర్తి కాగానే ఎంపికయ్యే కాంట్రాక్టర్లకు పనుల నిమిత్తం స్థలాల్ని అప్పగించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణను త్వరితంగా పూర్తి చేసేందుకు కసరత్తు ప్రారంభమైంది. జీహెచ్ఎంసీలోని భూసేకరణ విభాగం అడిషనల్ కమిషనర్ కె.శివకుమార్ నాయుడు సంబంధిత టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్ అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మూడు విభాగాల్లోని సిబ్బంది సమన్వయంతో పని చేసి భూసేకరణలు త్వరితంగా పూర్తిచేయాలని సూచించారు. సమావేశంలో ప్రాజెక్టుల విభాగం సీఈ భాస్కర్‌రెడ్డి, అడిషనల్ సీసీపీ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఇకనుంచి ప్రతివారం సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో శిల్పా లేఔట్ ఫేజ్–2, నల్లగొండ క్రాస్‌రోడ్ ఫ్లై ఓవర్, ఆరాంఘర్ ఫ్లై ఓవర్ ర్యాంప్, శాస్త్రిపురం ఆర్యూబీల పనులపై కూడా సమీక్షించారు. వాటిని కూడా వీలైనంత త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. -
మావోయిస్టులతో శాంతి చర్చలు ప్రారంభించాలి
కవాడిగూడ: ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గడ్ రాష్ట్రంలో కొనసాగుతున్న ఆదివాసీల హత్యా కాండను వెంటనే నిలిపివేసి గిరిజనుల జీవించే హక్కును పరిరక్షించాలని, మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం వెంటనే శాంతి చర్చలను ప్రారంభించాలని పలువురు వక్తలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఇందిరా పార్కు ధర్నా చౌక్‌లో సీపీఐఎం ఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఛత్తీస్‌గడ్‌లో ఆదివాసీ జాతి హననాన్ని నిలిపివేయాలని కోరుతూ ప్రజాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి , సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు జె.చలపతిరావు, గోవర్ధన్, సాధినేని వెంకటేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర నాయకులు పద్మ , ప్రొఫెసర్ కాశీం, విమలక్క తదితరులు పాల్గొని ప్రసగించారు. బస్తర్ ప్రాంతంలో కొనసాగుతున్న నరమేధం ఆదివాసీల అంతానికే తప్ప వారి సంక్షేమానికి ఏమాత్రం కాదని వారు పేర్కొన్నారు. సమాజ మనుగడలో ఆదివాసీల పాత్ర ఎంతో ముఖ్యమనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికై నా గుర్తించాలని వారు కోరారు. మావోయిస్టులు అభివృద్ధికి నిరోధకంగా వ్యవహరిస్తున్నారని కేంద్ర మంత్రులు మాట్లాడటం సరి కాదని అన్నారు. మావోయిస్టులు ప్రాతిపాదించిన శాంతి చర్చలకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకొని చర్చలు ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ పేరిట వందలాది మంది ఆదివాసీలను, మావోయిస్టులను ఇష్టారాజ్యాంగా కాల్చి చంపుతున్నారని, ఈ పరిణామం దేశానికి, ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై పోరుకు ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రజా ధర్నాలో పలువురు వక్తల డిమాండ్ -
ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన వ్యక్తిపై కేసు
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–2లోని సర్వే నెంబర్ 403/పీ షేక్‌పేట విలేజ్ డీపంక్ జూబ్లీహిల్స్ హైదరాబాద్ మున్సిపాలిటీ ప్లాట్ నెంబర్ 85, 86లలో ఉన్న 286 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తిపై షేక్‌పేట మండల తహసీల్దార్ అనితారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలివీ..బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–2లో ఖరీదైన 286 గజాల ప్రభుత్వ స్థలాన్ని గుంటి శ్రీధర్‌రావు అనే వ్యక్తి ఆక్రమించి మెటీరియల్ డంప్ చేయడమే కాకుండా ఇనుపరాడ్లు, జేసీబీలను ఇందులో దింపాడు. సమాచారం అందుకున్న షేక్‌పేట తహసీల్దార్ అనితారెడ్డి, సికింద్రాబాద్ ఆర్డీఓ సాయిరాం, మండల సిబ్బంది కబ్జా స్థలాన్ని చేరుకుని నిర్మాణాలను నిలిపివేశాడు. సామగ్రితో పాటు జేసీబీని సీజ్ చేశారు. ఈ మేరకు పోలీసులకు కబ్జా చేసిన గుంటి శ్రీధర్‌రావుతో పాటు కాంట్రాక్టర్ నర్సింగరావుపై ఫిర్యాదు చేయగా పోలీసులు వీరిపై బీఎన్ఎస్ 329 (3), 324 (3), 3 (5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తన ప్లాట్‌ను ఆనుకుని శ్రీధర్‌రావు ప్రభుత్వ స్థలంలోకి చొచ్చుకువచ్చి బండరాళ్లను పగులగొట్టడమే కాకుండా ఇందులో నిబంధనలకు విరుద్ధంగా షెడ్లు నిర్మించేందుకు ప్రయత్నించచారన్నారు. సుమారు రూ.9 కోట్ల విలువైన ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. సిబ్బందితో కలిసి అక్రమ నిర్మాణాలను కూల్చివేయించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ‘ఆపరేషన్ ధూల్‌పేట’ సక్సెస్ సాక్షి, సిటీబ్యూరో: గంజాయి, డ్రగ్స్ నియంత్రణలో భాగంగా ఎకై ్సజ్ అధికారులు చేపట్టిన ‘ఆపరేషన్ ధూల్‌పేట్’ కొనసాగుతోంది. ఇప్పటి వరకు గడిచిన 250 రోజుల్లో 102 కేసుల్లో 425 మందిని నిందితులుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వారిలో 327 మందిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. 13 మందిని బైండోవర్ చేశారు. మరో 85 మంది నిందితులు పరారీలో ఉన్నారు. మొత్తం 401 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే 147 సెల్ఫోన్లు, 58 బైక్‌లు, 2 కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా, ఏపీ, తదితర రాష్ట్రాల నుంచి నగరానికి గంజాయి సరఫరా చేసే ముఠాలపైన నిఘాను కఠినతరం చేశారు. అలాగే పీడీ యాక్ట్‌లతో పాటు, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎకై ్సజ్ అధికారులకు చిక్కకుండా తప్పించుకొంటున్న లేడీడాన్ల ఆటకట్టించినట్లు చెప్పారు. గత సంవత్సరం జూలై 17వ తేదీన ఎకై ్సజ్‌శాఖ ఆపరేషన్ ధూల్‌పేట్‌ను ప్రారంభించింది. ఇప్పటి వరకు సాధించిన ఫలితాలను దృష్టిలో ఉంచుకొని నగరమంతటా ఇదే తరహాలో దాడులు, తనిఖీలను ఉధృతం చేసేందుకు ఎకై ్సజ్‌శాఖ ప్రణాళికలను రూపొందించింది. ప్రస్తుతం ధూల్‌పేట్‌లో 90 శాతం గంజాయి అమ్మకాలు తగ్గాయని, పూర్తిగా నిర్మూలించే వరకు దాడులను కొనసాగిస్తామని ఎకై ్సజ్‌శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్‌రెడ్డి తెలిపారు. ● గంజాయి నియంత్రణకు పకడ్బందీ చర్యలు ● 250 రోజుల్లో 102 కేసులు ● 401 కిలోల గంజాయి స్వాధీనం ● 425 మందిపైన కేసులు నమోదు -
ఫ్యూచర్ సిటీ పేరిట నకి‘లీలలు’
ఫేక్ వెబ్సైట్ సృష్టించిన కేటుగాళ్లు ● ఔట్సోర్సింగ్ ఉద్యోగాలంటూ ప్రచారం ● అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఫ్యూచర్ సిటీని సైతం కేటుగాళ్లు వదిలిపెట్టలేదు. ఫ్యూచర్సిటీటీజీ.ఇన్ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించారు. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటోతో పాటు ఫోర్త్ సిటీకి సంబంధించిన వివరాలను పొందుపరిచారు. ఫ్యూచర్ సిటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ)ని ఏర్పాటు చేసింది. ఎఫ్‌సీడీఏ కోసం కొత్తగా 90 పోస్టులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో 34 రెగ్యులర్ పోస్టులు కాగా.. 56 పోస్టులను ఔట్సోర్సింగ్/కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఈ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలనే నియామకాలు చేపడుతున్నట్లు నిరుద్యోగులు, యువతకు వల వేస్తున్నారు. ఈ నకిలీ ప్రకటనలు, ఉద్యోగ భర్తీ ప్రక్రియలపై నిరుద్యోగులు, యువత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత గ్రేటర్లో ఫోర్త్ సిటీ అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే. 765.28 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫోర్త్ సిటీని అభివృద్ధి చేయాలన్నది సర్కార్ లక్ష్యం. ఇప్పటికే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ)ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. దీని పరిధిలోకి మహేశ్వరం, ఆమన్‌గల్, కడ్తాల్, కందుకూరు, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల ఏడు మండలాల్లోని 56 గ్రామాలను ఎఫ్‌సీడీఏ పరిధిలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఫోర్త్ సిటీలో అంతర్గత రోడ్లు, మురుగు నీటి వ్యవస్థ, నీటి సరఫరా, సౌర విద్యుత్ పార్క్ అభివృద్ధి ఇలా పలు అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్లను సైతం ఈ నకిలీ వెబ్సైట్లో ఆహ్వానించడం గమనార్హం. -
సైబర్ నేరగాళ్ల ‘డబుల్ టోకరా’!
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ పశువైద్యుడిని టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు ఆర్మీ జాగిలాలకు వ్యాక్సినేషన్ పేరుతో ఎర వేశారు. పే టెస్టింగ్ అని, ఆ మొత్తం రిఫండ్ అంటూ రెండుసార్లు టోకరా వేశారు. మొత్తమ్మీద రూ.1.79 లక్షలు కోల్పోయిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సదరు పశువైద్యుడికి (27) రెండు రోజుల క్రితం ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆర్మీ అధికారులుగా చెప్పుకున్న వ్యక్తులు బాధితుడితో మాట్లాడారు. తమ యూనిట్లో ఉన్న 90 జాగిలాలకు వ్యాక్సినేషన్ చేయాలని చెప్పారు. ఈ పశువైద్యుడు గతంలో కొన్ని ఆర్మీ జాగిలాలకు వ్యాక్సిన్లు వేసి ఉండటంతో ఈ పని చేయడానికి అంగీకరించారు. ఇతడిని పూర్తిగా నమ్మించడానికి సైబర్ నేరగాళ్లు ఆర్మీ అధికారుల మాదిరి తయారు చేసిన నకిలీ గుర్తింపుకార్డుల్నీ పంపారు. చెల్లింపుల విషయం ఖరారు చేయడానికి తమ ఉన్నతాధికారులు సంప్రదిస్తారంటూ సైబర్ నేరగాళ్లు చెప్పారు. ఆపై కాల్ చేసిన మరికొందరు ఆర్మీ ఉన్నతాధికారులుగా పరిచయం చేసుకున్నారు. ఇది ఆర్మీకి సంబంధించిన వ్యవహారం కావడంతో వీడియో కాల్లో మాట్లాడుకుందామని చెప్పారు. ఆర్మీ అధికారుల యూనిఫాంలోనే ఉండి మాట్లాడిన సైబర్ నేరగాడు మొత్తం బిల్లులో సగం వ్యాక్సినేషన్ ప్రారంభించడానికి ముందు, మిగిలిన మొత్తం తర్వాత ఇస్తామని చెప్పాడు. పే చేసిన మొత్తం మీకు చేరుతుందో లేదో పరీక్షించాలంటూ వైద్యుడి ఫోన్లో ఫేన్ పే తెరిపించారు. అందులోని క్రెడిట్ కార్డు బిల్లు పేమెంట్ సెక్షన్లోకి వెళ్లమని చెప్పారు. తమ క్రెడిట్‌కార్డుకు సంబంధించిన వివరాలు, ఫోన్ నెంబర్ చెప్పిన సైబర్ నేరగాళ్లు ఆ మొత్తం చెల్లించమని చెప్పారు. తనకు నగదు కావాల్సి ఉండగా తాను చెల్లించడం ఏమిటంటూ బాధితుడు ప్రశ్నించాడు. తమ క్రెడిట్ కార్డుకు టూ స్టెప్ వెరిఫికేషన్ విధానం అమలో ఉందని, మీరు పే బటన్ నొక్కినా చెల్లింపు పూర్తి కాదని నమ్మించారు. ఇది నమ్మిన వైద్యుడు అలా చేయడంతో కొంత మొత్తం నష్టపోయారు. దీనిపై సైబర్ నేరగాళ్లను ప్రశ్నించగా..ఆ మొత్తం రిఫండ్ వస్తుందంటూ మరోసారి అలానే చేయించారు. రెండోసారి చేయడానికి బాధితుడు సంశయించగా.. అలా చేయకపోతే రిఫండ్ రాదని భయపెట్టారు. దీంతో రెండోసారీ సైబర్ నేరగాళ్ల క్రెడిట్‌కార్డు బిల్లు చెల్లించిన వైద్యుడు రూ.1,79,998 నష్టపోయారు. ఐదు నిమిషాల్లో మొత్తం రిఫండ్ వస్తుందని చెప్పిన నేరగాళ్లు ఆపై స్పందించకపోవడంతో తాను మోసపోయినట్లు బాధితుడు గుర్తించాడు. ఈ మేరకు మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నిందితుల ఫోన్ నెంబర్లతో పాటు క్రెడిట్‌కార్డు వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వెటర్నరీ డాక్టర్‌ను టార్గెట్ చేసిన కేటుగాళ్లు ఆర్మీ జాగిలాలకు వ్యాక్సినేషన్ పేరుతో ఎర పే టెస్టింగ్, రిఫండ్ పేర్లతో నగదు స్వాహా సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో బాధితుడి ఫిర్యాదు -
పంజాబ్ నేషనల్ బ్యాంక్ జోనల్ మేనేజర్‌గా సునీల్‌కుమార్ ఛుగ్
సాక్షి, సిటీబ్యూరో: పంజాబ్ నేషనల్ బ్యాంకు హైదరాబాద్ జోనల్ మేనేజర్‌గా సునీల్‌కుమార్ ఛుగ్ మంగళవారం బాధ్యతలను స్వీకరించారు. ఆయన పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్ నుంచి పదోన్నతిపై జోనల్ మేనేజర్‌గా నియమితులయ్యారు. సీఏ పూర్తి చేసిన సునీల్‌కుమార్ ఛుగ్ గత 30 ఏళ్లుగా బ్యాంకింగ్ రంగంలో అనుభవం కలిగి ఉన్నారు. అనేక బ్యాంకులకు చెందిన కార్పొరేట్ బ్రాంచ్‌లలో పనిచేసిన అనుభవం ఉంది. ఆయన నేతృత్వంలో పీఎన్బీ హైదరాబాద్ జోన్‌కు ఆయన నియమితులు కావడం వల్ల బ్యాంకు కార్యకలాపాలు మరింత విస్తృతమవుతాయని పీఎన్బీ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆకాంక్షించారు. -
మకాం నుంచి విధ్వంసం వరకు సారూప్యత
సాక్షి, సిటీబ్యూరో: నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఐదున్నరేళ్ల వ్యవధిలో నగరంలో రెండు భారీ విధ్వంసాలను సృష్టించింది. 2007 ఆగస్టు 25న గోకుల్‌చాట్, లుంబినీపార్క్‌ల్లో బాంబుల్ని పేల్చి 47 ప్రాణాలు తీసి, మరో 300 మంది వరకు క్షతగాత్రుల్ని చేసింది. ఆ తర్వాత 2013 ఫిబ్రవరి 21న ముష్కరులు మరోసారి 18 మందిని చంపి, 131 మందిని క్షతగాత్రుల్ని చేశారు. ఈ రెండు ఆపరేషన్ల మధ్య అనేక సారూప్యతలు ఇలా ఉన్నాయి. దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో ఐదుగురు నిందితులకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఫాస్ట్‌ట్రాక్ కోర్టు 2016లో ఉరిశిక్ష విధించగా.. దీనిని సమర్థిస్తూ తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మంగళవారం తీర్పు వెలువరించింది. అనుమానం రాని చోట మకాం.. సిటీని టార్గెట్‌గా చేసుకుని విధ్వంసం సృష్టించడానికి నిర్ణీత సమయం ముందు వచ్చిన ఐఎం ఉగ్రవాదులు పోలీసుల దృష్టి పడని, వారికి అనుమానం రాని ప్రాంతాల్లోనే షెల్టర్లు ఏర్పాటు చేసుకున్నారు. 2007 నాటి జంట పేలుళ్ల కోసం నగరానికి వచ్చిన ఉగ్రవాదులు హబ్సిగూడలోని స్ట్రీట్ నెం.8లో ఉన్న బంజారా నిలయం అపార్ట్మెంట్లోని 302 ఫ్లాట్‌ను ఎంచుకుంటే.. 2013 ఫిబ్రవరి నాటి దిల్సుఖ్నగర్ ఆపరేషన్ పూర్తి చేయడం కోసం వచ్చిన వారు అబ్దుల్లాపూర్‌మెట్ సాయినగర్‌లో ఉన్న రేకుల ఇంటిలో ఆశ్రయం పొందారు. ఈ రెండు సందర్భాల్లోనూ విద్యార్థులం అంటూనే ఇళ్లు అద్దెకు తీసుకున్నారు. రెండు ఇళ్ల యజమానులూ వాటికి సమీపంలో లేకపోవడం వీరికి కలిసి వచ్చింది. రెండుసార్లూ ముగ్గురే.. గోకుల్‌చాట్, లుంబినీ పార్క్ విధ్వంసాల కోసం ముష్కరులు 25 రోజుల ముందు నగరానికి చేరుకోగా.. దిల్సుఖ్నగర్ పేలుళ్ల కోసం మాత్రం కేవలం 16 రోజుల ముందే వచ్చారు. 2007లో తొలుత అనీఖ్ షఫీఖ్ సయీద్ (లుంబినీ పార్క్‌లో బాంబు పెట్టాడు) అనే ఉగ్రవాది వచ్చాడు. షెల్టర్ ఏర్పాటు చేశాక అక్బర్ ఇస్మాయిల్ చౌదరి (ఇతడు పెట్టిన బాంబు పేలలేదు)ని పిలిపించాడు. ఇద్దరూ కలిసి ప్రాథమిక రెక్కీలు పూర్తి చేసిన తర్వాత పేలుడుకు రెండు రోజుల ముందు మాత్రమే ప్రధాన సూత్రధారి, పాత్రధారి అయిన రియాజ్ భత్కల్ (గోకుల్ చాట్‌లో పెట్టింది ఇతడే) చేరుకుని బాంబుల పని పూర్తి చేశాడు. ఆ తర్వాత ఒక రోజు తమ గదిలోనే ఉండి తిరిగి వెళ్లారు. దిల్సుఖ్నగర్ ఆపరేషన్ కోసం మొదట తెహసీన్ అక్తర్ అలియాస్ మోను (ఏ–1 మిర్చ్ సెంటర్ వద్ద బాంబు పెట్టిన వ్యక్తి) రాగా.. కొన్ని రోజులకు తబ్రేజ్, వఖాస్ (107 బస్టాప్‌లో పెట్టిన వ్యక్తి) వచ్చారు. ఈ ముగ్గురూ కలిసి రెండు పేలుళ్లు జరిపి వెళ్లారు. మంగుళూరు నుంచే ‘పార్శిల్స్’... ఈ రెండు జంట పేలుళ్లకు అవసరమైన పేలుడు పదార్థం, డిటొనేటర్లు ఉగ్రవాదులు నగరానికి చేరుకున్న తర్వాతే వారికి అందాయి. 2007లో విధ్వంసం సృష్టించడానికి పదిహేను రోజుల ముందు మంగుళూరు నుంచి రియాజ్ భత్కల్ పేలుడు పదార్థంతో పాటు ఇతర ఉపకరణాలను ఓ బస్సు ద్వారా పంపాడు. వీటిని అనీఖ్, అక్బర్లు చాదర్‌ఘాట్‌లో రిసీవ్ చేసుకున్నారు. 2013లో మాత్రం తబ్రేజ్ నేరుగా మంగుళూరు నుంచి తీసుకువచ్చాడు. ఇతడిని మోను ఎల్బీనగర్ చౌరస్తాలో రిసీవ్ చేసుకుని తమ డెన్‌కు వెంటపెట్టుకు వెళ్లాడు. 2007లో చెక్కతో చేసిన షేప్డ్ బాంబుల్ని పేల్చగా.. 2013లో మాత్రం ప్రెషర్ కుక్కర్లతో తయారు చేసిన బాంబుల్ని పేల్చారు. రెండు సందర్భాల్లోనూ పేలుడు పదార్థంగా అమోనియం నైట్రేట్‌నే వినియోగించారు. కామన్ ‘పాయింట్’ దిల్సుఖ్నగర్.. 2007లో గోకుల్‌చాట్, లుంబినీ పార్క్ పేలుళ్ల ఆపరేషన్, 2013లో ఏ–1 మిర్చ్ సెంటర్, 107 బస్టాప్‌ల వద్ద జరిగిన విధ్వంసం.. ఈ రెండు అంశాల్లోనూ దిల్సుఖ్నగర్ కామన్ పాయింట్‌గా ఉంది. అప్పట్లో గోకుల్‌చాట్‌లో రియాజ్, లుంబినీ పార్క్‌లో అనీఖ్ బాంబులు పెట్టగా... అక్బర్ మరో బాంబును దిల్‌సుఖ్‌నగర్‌లోని వెంకటాద్రి థియేటర్ ఎదురుగా ఉన్న ఫుట్ఓవర్ బ్రిడ్జ్ వద్ద వదిలి వెళ్లాడు. ఆ రెండూ పేలగా... ఇది పేలలేదు. దిల్సుఖ్నగర్ ఆపరేషన్‌లో మాత్రం ఉగ్రవాదులు నేరుగా దిల్‌సుఖ్‌నగర్‌నే టార్గెట్ చేసి రెండు బాంబుల్ని పేల్చారు. ఈ రెండు ఉదంతాలపై నమోదైన ఐదు కేసుల్లోనూ రియాజ్ భత్కల్ ప్రధాన నిందితుడిగా, మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు. 2007లో నేరుగా వచ్చి హబ్సిగూడలోని గదిలో బాంబుల్ని అసెంబుల్ చేసి గోకుల్‌చాట్‌లో బాంబు పెట్టగా.. 2013లో మాత్రం పాకిస్థాన్ నుంచి నేతృత్వం వహించి చేయించాడు. బాంబుల అసెంబ్లింగ్ బాధ్యతల్ని వఖాస్‌కు అప్పగించాడు. రెండుసార్లూ మారిన ‘టార్గెట్స్’.. ఈ రెండు ఆపరేషన్లలోనూ ఉగ్రవాదులు ఆఖరి నిమిషంలో అనుకోని ప్రాంతాన్ని టార్గెట్‌గా చేసుకుని బాంబు పెట్టాల్సి వచ్చింది. 2007లో ఉగ్రవాదులు టార్గెట్ చేసిన ప్రాంతాల్లో గోకుల్‌చాట్, దిల్‌సుఖ్‌నగర్‌లతో పాటు హుస్సేన్‌సాగర్‌లో తిరిగే షికారు బోటు ఉంది. అయితే.. ఇందులో బాంబు పెట్టేందుకు ట్రిగ్గర్ ఆన్ చేసుకుని ఆటోలో వెళ్లిన అనీఖ్.. ఆటోవాలాకు చెల్లించేందుకు అవసరమైన చిల్లర లేకపోవడంతో బాంబు పేలే సమయం సమీపించి లుంబినీపార్క్ లేజేరియం వద్ద వదిలి వెళ్లాడు. 2013 ఫిబ్రవరి 21న సైతం దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ–1 మిర్చ్ సెంటర్‌తో పాటు దాని వెనుక ఉన్న ఓ మద్యం దుకాణాన్ని టార్గెట్ చేశారు. అయితే.. అక్కడికి బాంబుతో కూడిన సైకిల్‌ను తీసుకువెళ్తున్న వఖాస్ సమయం మించిపోతుండటంతో 107 బస్టాప్ వద్ద పార్క్ చేసి వెనక్కు వెళ్లిపోయాడు. -
మేడ్చల్ కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు
● తనిఖీలు చేపట్టిన బాంబు స్క్యాడ్ ●అంతా ఉత్తిదేనని తేల్చిన పోలీసులు సాక్షి, సిటీబ్యూరో: మేడ్చల్– మల్కాజిగిరి కలెక్టరేట్‌ను గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు పేల్చివేస్తామని ఓ ఆగంతకుడు జిల్లా కలెక్టర్ గౌతమ్‌కు మెయిల్ పెట్టాడు. దీంతో ఈ విషయంపై విచారణ చేయాలని కలెక్టర్ గౌతమ్ రాచకొండ పోలీసు కమిషనర్‌కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో డీసీపీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు మేడ్చల్ ఏసీపీ గురువారం మధ్యాహ్నం 3.45 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు మేడ్చల్ కలెక్టరేట్లోని వివిధ శాఖల్లో బాంబు స్క్వాడుతో తనిఖీలు చేపట్టారు. ఎక్కడా ఎలాంటి బాంబు జాడ లేకపోవటంతో.. ఉత్తుత్తి బెదిరింపులేనని పోలీసులు తేల్చారు. దీంతో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. కలెక్టర్ గౌతమ్‌కు గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపించారు? అనే అంశంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు నేపథ్యంలో పోలీసుల సూచనల మేరకు వివిధ విభాగాల జిల్లా ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది మధ్యాహ్నం 3 గంటలకు తమ కార్యాలయాల నుంచి బయటకు వెళ్లిపోయారు. బాంబు బెదిరింపు మెయిల్ మావోయిస్టు ముప్పాళ్ల లక్ష్మణరావు పేరిట రావటంతో పాటు.. అందులో ముస్లిం సంస్థలకు సంబంధించిన పేర్లతో సహా అన్నాడీఎంకే తదితర పార్టీలు, సంస్థల పేర్లు ఉండటంతో.. కావాలనే ఎవరో ఆగంతకుడు మెయిల్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చర్చోపచర్చలు.. మేడ్చల్ కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు మెయిల్ మెసేజ్‌పై పలు రకాలుగా చర్చ సాగుతోంది. జిల్లాలో పలువురు ఉన్నత స్థాయి అధికారులు తమ సమస్యలు విన్నవించేందుకు వచ్చిన ప్రజలకు సమయం కేటాయించక పోవటం వల్లే.. విసుగెత్తి ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాంబు బెదిరింపుపై విచారణ చేయాలని పోలీసులను ఆదేశించినట్లు కలెక్టర్ గౌతమ్ పేర్కొన్నారు. -
ఒక్క వానకే.. వణుకు..
చాదర్‌ఘాట్ రైల్వే బ్రిడ్జి కింద నీటమునిగిన ఆర్టీసీ బస్సుఎండల వేడిమితో, వేసవి తాపంతో అల్లాడుతున్న నగర ప్రజలకు ఒక్కసారిగా కురిసిన వాన ఎంతో ఉపశమనాన్నిచ్చినప్పటికీ, రాకపోకలు సాగించేవారికి తీవ్ర ఇబ్బందులు కలిగించింది. మాన్సూన్ యాక్షన్ప్లాన్ల పేరిట జీహెచ్ఎంసీ ప్రకటనలు తప్ప సమ్మర్‌లోని వానకే ప్రజలు అవస్థలు పడ్డారు. వరద నివారణకు తీసుకున్న చర్యలను వాన బట్టబయలు చేసింది. కేసీపీ గెస్ట్‌హౌస్ దగ్గర జలాశయాన్ని నిర్మించినప్పటికీ, ఎప్పటిలాగే రోడ్డు చెరువుగా మారింది. అలాంటి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ తొలిదశలో రూ. 100 కోట్లతో 50 నిర్మించేందుకు సిద్ధమయ్యారు. 11 ప్రాంతాల్లో 12 నిర్మాణాల పనులు ప్రారంభించారు. వాటి నీటి నిల్వ సామర్ధ్యం 90వేల లీటర్ల నుంచి 10 లక్షల లీటర్లు. వాటిల్లో నాలుగింటి నిర్మాణం మాత్రం పూర్తయింది. మిగతావి గత డిసెంబర్–జనవరిల్లోనే పూర్తిచేస్తామన్నా ఇంకా పూర్తికాలేదు. పూర్తయిన వాటివద్ద సైతం పరిస్థితి మారకపోవడంతో అధికారుల ప్లానింగ్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వర్షం కురిసిన వెంటనే ఆయా ప్రాంతాల్లో నీటిని తోడివేసేందుకు వెంటనే రంగంలోకి దిగే జీహెచ్ఎంసీ బృందాలు ఈసారి చాలా ప్రాంతాల్లో కనిపించలేదు. బంజారాహిల్స్‌లో నీట మునిగిన బైక్‌లు -
భారీ బందోబస్తు
శ్రీరామ నవమి శోభాయాత్రకునగర కొత్వాల్ సీవీ ఆనంద్ అబిడ్స్: శ్రీరామ నవమి శోభాయాత్రకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేపడుతున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఈ నెల 6న సీతారామ్‌బాగ్ నుంచి హనుమాన్ టేక్డీ వరకు కొనసాగే శోభాయాత్రకు ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో అన్ని విధాలా ఏర్పాట్లు చేపడతామని వెల్లడించారు. గురువారం సీతారామ్‌బాగ్‌లోని ద్రౌపది గార్డెన్లో జరిగిన పలు శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ఆదివారం సీతారామ్‌బాగ్ ఆలయం నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్రను శాంతియుతంగా, సంతోషంగా చేపట్టాలని సూచించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శోభాయాత్ర ప్రారంభించేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలన్నారు. శోభాయాత్రలో డీజేలకు బదులుగా సౌండ్ బాక్సులు వాడుకోవాలని సీపీ పేర్కొన్నారు. సుమారు 20 వేల మంది పోలీసులతో శోభాయాత్రకు బందోబస్తుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సమావేశంలో అడిషనల్ సీపీ విక్రమ్‌సింగ్ మాన్, జాయింట్ సీపీ ట్రాఫిక్ జోయల్ డేవిస్, డీసీపీలు జి.చంద్రమోహన్, బి.బాలస్వామి, చైతన్య కుమార్, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ రఘుప్రసాద్, వాటర్‌బోర్డు అధికారి అమరేందర్ రెడ్డి, డీఎఫ్ఓ వెంకన్న, శోభాయాత్ర ఛైర్మన్ భగవంతరావు, వీహెచ్‌పీ రాష్ట్ర ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, ఇతర నాయకులు గోవింద్‌రాఠి, ఆనంద్ సింగ్, కృష్ణ, శ్రీరామ్ వ్యాస్, మెట్టు వైకుంఠం, ఆనంద్‌కుమార్ గౌడ్, పప్పుమాత్రే తదితరులు పాల్గొన్నారు. కాగా..శోభాయాత్ర రూట్‌ను నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌తో పాటు పలువురు అధికారులు పరిశీలించారు. సీతారామ్‌బాగ్ నుంచి బోయిగూడ కమాన్, మంగళ్‌హాట్, పురానాపూల్, బేగంబజార్ ఛత్రి, సిద్దిఅంబర్‌బజార్, గౌలిగూడ, కోఠి హనుమాన్ టేక్డీ వరకు అధికారుల బృందం శోభాయాత్ర ఏర్పాట్లపై పరిశీలన చేపట్టారు. -
మూసీ నదిలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు
కాపాడిన హైడ్రా, జీహెచ్ఎంసీ రెస్క్యూ టీం చైతన్యపురి: చైతన్యపురి డివిజన్ నర్సింహస్వామి ఆలయం సమీపంలో మూసీ నది మధ్యలో ఉన్న శివాలయం వద్ద పనికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు వరద నీటిలో చిక్కుకున్నారు. గురువారం ఆలయం వద్ద దిమ్మకట్టేందుకు వీరయ్యతో పాటు మరో వ్యక్తి వెళ్లాడు. సాయంత్రం కురిసిన భారీ వర్షానికి మూసీలో ప్రవాహం పెరిగి నీటిమట్టం పెరిగింది. నది బయటికి వచ్చేందుకు దారిలేక తెలిసిన వారికి ఫోన్లో సమాచారం ఇచ్చారు. స్థానిక కార్పొరేటర్ రంగానర్సింహ గుప్తా, సరూర్‌నగర్ డిప్యూటి కమిషనర్ సుజాత అక్కడకు చేరుకున్నారు. హైడ్రా, జీహెచ్ ఎంసి రెస్క్యూ టీంను రంగంలోకి దింపి రాత్రి 8 గంటలకు మూసీ మధ్యలో చిక్కుకున్న ఇద్దరిని క్షేమంగా కాపాడారు. -
‘ఫ్యూచర్’కు ఫెన్సింగ్
● ఫార్మా భూ బాధిత గ్రామాల్లో మోహరించిన పోలీసులు ● సర్వే చేసి కంచె పనులు చేపట్టిన అధికారులు ● అడ్డుకునేందుకు యత్నించిన రైతులను స్టేషన్‌కు తరలించిన సిబ్బంది యాచారం: భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఫార్మాసిటీకి సేకరించిన భూములను గురువారం అధికారులు సర్వే చేసి చుట్టూ ఫెన్సింగ్ వేసే పనులు ప్రారంభించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో ఫార్మాసిటీ కోసం 7,640 ఎకరాల అసైన్డ్, పట్టా భూములను సేకరించారు. అప్పట్లో సేకరించిన కొన్ని సర్వే నంబర్లల్లోని భూముల చుట్టూ ఫెన్సింగ్ వేసి మిగిలిన భూములను వదిలేశారు. పరిహారం పొంది ఫార్మాసిటీకి భూములిచ్చిన రైతులు సదరు భూములకు ఫెన్సింగ్ లేకపోవడంతో నాలుగేళ్లుగా పంటలు సాగు చేసుకుంటున్నారు. ఫార్మాసిటీకి సేకరించిన భూముల్లోనే ప్రస్తుత ప్రభుత్వం ఫ్యూచర్‌సిటీ నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ప్రముఖ సంస్థలకు భూములు అప్పగించే సమయంలో రైతులు కబ్జాలో ఉంటే కష్టతరమని భావించిన ప్రభుత్వం గురువారం యాచారం తహసీల్దార్ అయ్యప్ప, హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ సీఐ కృష్ణంరాజు ఆధ్వర్యంలో భూములను సర్వే చేసి ఫెన్సింగ్ వేసే పనులను ప్రారంభించారు. రైతులు ఆందోళన చేస్తారని ముందు జాగ్రత్తగా రాచకొండ సీపీ ఆదేశాల మేరకు భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. గ్రామాల చుట్టూ పోలీసు పహారా నర్కర్తమేడిపల్లి గ్రామాన్ని పోలీసులు గురువారం ఉదయమే తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, మరో ఇద్దరు ఏసీపీలు, ఎనిమిది మంది సీఐలు, 15 మంది ఎస్ఐలు, 150 మందికి పైగా పోలీస్ సిబ్బంది, 40 మందికి పైగా టీజీఐఐసీ, రెవెన్యూ, సర్వే సిబ్బంది, 20కి పైగా జేసీబీలు, ఇతర యంత్రాలు, 50 మందికి పైగా కూలీలు సర్వే చేసే భూమి వద్దకు చేరుకున్నారు. అధికారులు సర్వే పనులు ప్రారంభించిన వెంటనే రైతులు అడ్డుకునేందుకు యత్నించారు. తమ అంగీకారం లేకుండానే పరిహారం డబ్బులు అథారిటీలో జమ చేశారని, కోర్టులో కేసులు నడుస్తున్నా సర్వే చేయడం, ఫెన్సింగ్ వేయడం సరికాదని పనులకు ఆటంకం కలిగించే ప్రయత్నం చేయగా వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్‌కు తరలించారు. అనంతరం మాజీ సర్పంచ్‌లు పాశ్ఛ భాషా, శ్రీనివాస్‌రెడ్డి, మొరుగు రమేష్ తదితరులు తీవ్ర గందరగోళం సృష్టించడంతో వారిని సైతం అడ్డుకున్నారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడం, రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నక్కర్తమేడిపల్లి గ్రామంలోని సర్వే పనులను అడ్డుకోవడానికి నానక్‌నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల నుంచి వస్తున్న రైతులను నియంత్రించేందుకు నక్కర్తమేడిపల్లి–నానక్‌నగర్, నక్కర్తమేడిపల్లి–సరికొండ రోడ్లపై పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్లాట్లకు కబ్జాలు చూపండి ఫార్మాసిటీకి సేకరించిన భూములకు పరిహారం ఇచ్చారు. ప్లాట్ల పంపిణీ చేసి కబ్జాలు చూపేవరకు సర్వే, ఫెన్సింగ్ పనులు ఆపాలని రైతులు ఆందోళన చేపట్టారు. కలెక్టర్, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ ఇందుకు హామీ ఇవ్వాలని రైతులు పట్టుబట్టారు. విషయం తెలుసుకున్న ఆర్డీఓ అనంత్‌రెడ్డి ఘటనా స్థలానికి వచ్చిన వెంటనే రైతులు చుట్టుముట్టారు. మూడేళ్ల కింద ప్లాట్ల సర్టిఫికెట్లు ఇచ్చి నేటికి కబ్జా చూపించలేదు. ఫెన్సింగ్ వేసి మోసం చేస్తారా.. అంటూ నిలదీశారు. ఫార్మా ప్లాట్లకు లాటరీలు తీసి రిజిస్ట్రేషన్లు చేసి కబ్జాలు చూపిస్తామని హామీ ఇచ్చారు. కోర్టులో కేసులున్న భూములకు సర్వే చేసి, ఫెన్సింగ్ వేయమని హామీ ఇచ్చారు. ఆ తర్వాత అంతా నిశ్శబ్ధం ఆర్డీఓ అనంత్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, గ్రీన్ ఫార్మాసిటీ సీఐ కృష్ణంరాజు రైతులతో మాట్లాడుతూ వారికి నచ్చజెబుతున్న సమయంలోనే ఫార్మాకు సేకరించిన భూముల చుట్టు సర్వే, ఫెన్సింగ్ పనులను చేపట్టారు. రైతులను అటుగా వెళ్లనీయకుండా కట్టడి చేశారు. కొందరు రైతులు రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డికి, ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డికి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి ఫిర్యాదు చేశారు. కోర్టు కేసులున్న భూములు, రైతుల వద్దకు వెళ్లవద్దని, పరిహారం పొందిన భూములనే సర్వే చేసి ఫెన్సింగ్ వేయాలని అధికారులకు సూచించారు. మధ్యాహ్నం వరకే రైతులు ఆందోళనలు, ధర్నాలు చేపట్టి ఆ తర్వాత అటు వైపు వెళ్లలేదు. దీంతో అధికారులు సాయంత్రం 6 గంటల వరకు సర్వే చేసి ఫెన్సింగ్ పనులు చేపట్టారు. -
లీజు ముగిసినా క్వారీని వదలట్లేదు
సాక్షి, సిటీబ్యూరో: మేడ్చల్ జిల్లా గాజులరామారంలోని క్వారీపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. గ్రామంలో క్వారీ లీజు గడువు ముగిసినా యజమానులు అక్కడ నుంచి ఖాళీ చేయకుండా స్థలం కబ్జాకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఇటీవల హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఆరా తీసేందుకు వెళ్లిన రంగనాథ్ సమీపంలోని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ భూముల కబ్జాలను పరిశీలించారు. ఆ ప్రాంతంలో దాదాపు 400ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని, వాటిని కబ్జా కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆ ప్రాంతంలో 78 ఎకరాలను లీజుకు తీసుకున్న వారితో హైడ్రా కమిషనర్ వచ్చే వారం కీలక సమావేశం నిర్వహించనున్నారు. గాజులరామారం నుంచి శేరిలింగంపల్లి వెళ్లిన ఆయన నల్లగండ్ల చెరువు నాలాను పరిశీలించారు. నాలా విస్తీర్ణం తగ్గకుండా చూడాలని, అక్కడ పోసిన మట్టిని తొలగించాలని వెర్టెక్స్ నిర్మాణ సంస్థను ఆదేశించారు. ఈ సందర్భంగా నాలాతో పాటు బఫర్ జోన్‌కూ ఆటంకం లేకుండా నిర్మాణాలు చేయపడతామని నిర్మాణ సంస్థ హామీ ఇచ్చింది. గోపన్నపల్లి, పుప్పాలగూడలకు వెళ్లిన కమిషనర్ మేల్లకుంట, మామాసానికుంటలను పరిశీలించారు. సర్వే నంబర్ల ప్రకారం చెరువుల హద్దులపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఆయన క్షేత్రస్థాయిలో సమీక్షించారు. ● హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదులు ● గాజులరామారంలో పర్యటించిన రంగనాథ్ ● మరో మూడు ప్రాంతాలకు వెళ్లి పరిశీలనలు -
బలహీనత ఖరీదు రూ.1.57 లక్షలు!
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ యువకుడి చిన్న బలహీతన రూ.1.57 లక్షలు నష్టపోవడానికి కారణమైంది. ఆన్లైన్లో కనిపించిన ఎస్కార్ట్ సర్వీస్ ప్రకటనకు ఆకర్షితుడైన సదరు యువకుడు సైబర్ నేరగాళ్ల వలకు చిక్కాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న యువకుడిని నిర్ణీత మొత్తం చెల్లిస్తే ఏకాంత సేవలు అందిస్తాం అంటూ ఆన్లైన్లో వచ్చిన ప్రకటన ఆకర్షించింది. అందులో ఉన్న ఫోన్ నెంబర్లో సంప్రదించగా... ఈ సేవల కోసం రూ.4 వేలు చెల్లించాలని అవతలి వారు చెప్పారు. తొలుత తమకు రూ.500 చెల్లించాలని, ఆపై తాము సేవలు అందించే యువతితో పాటు చేరుకోవాల్సిన హోటల్ వివరాలు అందిస్తామన్నారు. అక్కడకు వెళ్లిన తర్వాత మిగిలిన మొత్తం ఇవ్వాలని సూచించారు. దీంతో సదరు యువకుడు వారు సూచించిన ఖాతాకు రూ.500 చెల్లించాడు. ఆపై ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు మిగిలిన మొత్తం కూడా బదిలీ చేయించుకున్నారు. అంతటితో ఆగకుండా యువకుడి నుంచి వీలున్నంత ఎక్కువ గుంజాలని పథకం వేశారు. దీనిని అమలులో పెడుతూ సెక్యూరిటీ డిపాజిట్, ఐడీ వెరిఫికేషన్ పేమెంట్, పోలీస్ వెరిఫికేషన్ అండ్ సేఫ్టీ పేమెంట్ పేరుతో డబ్బు వసూలు చేశారు. అతడికి అనుమానం వచ్చిన ప్రతిసారీ రూ.4 వేలు మినహా మిగిలింది రిఫండ్ అవుతుందని నమ్మించారు. ఓ దశలో రెండు నిమిషాల్లో రిఫండ్ మొత్తం వస్తుందంటూ మరికొంత, వేగంగా రిఫండ్ కావాలంటే తప్పదంటూ రెట్టింపు మొత్తం బదిలీ చేయించుకున్నారు. ఇలా మొత్తం రూ.1,57,381 బదిలీ చేయించుకున్న తర్వాత ‘ప్రాసెస్ పూర్తయింది. నగదు రిఫండ్ చేయడానికి మీ బ్యాంకు ఖాతా వివరాలు పంపండి. మీ బుకింగ్ ఐడీ, హోటల్ పేరు, రూమ్ నెంబర్ తదితరాలు లోకంటో.కామ్ అనే వెబ్సైట్లో పొందుపరుస్తాం’ అనే సందేశాన్ని యువకుడికి పంపారు. దీంతో అనుమానించిన అతగాడు ఇంటర్నెట్లో సెర్చ్ చేసి తాను మోసపోయినట్లు గుర్తించాడు. సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఆన్లైన్లో ఎస్కార్ట్ సర్వీస్ ప్రకటనలు ఆకర్షితుడైన నగరానికి చెందిన యువకుడు రిఫండ్ అంటూ ఎర వేసి ఆ మొత్తం స్వాహా సీసీఎస్‌లో కేసు నమోదు -
సిగరెట్లు అమ్మడం లేదన్నందుకు..
మేడ్చల్‌రూరల్: సిగరెట్లు అమ్మడం లేదని చెప్పినందుకు హోటల్లో పని చేసి వ్యక్తితో పాటు యజమాని, అతడి కుమారుడు, కుమార్తైపె దాడి చేసిన సంఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. స్థానిక వినాయక్‌నగర్ కాలనీకి చెందిన రాజేశ్ చతుర్వేది సోమారం గ్రామ పరిధిలోని రిలాన్స్ గోదాం సమీపంలో హోటల్ నిర్వహిస్తున్నాడు. సదరు హోటల్లో దివాకర్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. గత నెల 30న రాత్రి సమీపంలోని బండమైలారం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు హోటల్‌కు వచ్చి సిగరెట్లు కావాలని అడిగారు. సిగరెట్లు అమ్మడం లేదని దివాకర్ చెప్పడంతో ఆగ్రహానికి లోనైన వారు అతడిపై దాడి చేశారు. దీనిపై అతను యజమాని రాజేశ్ చతుర్వేదికి సమాచారం అందించడంతో అతను తన కుమార్తె శివానీ, కుమారుడు కృష్ణతో కలిసి హోటల్ వద్దకు వచ్చి వారికి సర్దిచెప్పి పంపించారు. ఆ తర్వాత కొద్ది సేపటికే అక్కడికి వచ్చిన 20 మంది యువకులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో రాజేశ్ చతుర్వేదితో పాటు అతడి కుమార్తె, కుమారుడికి గాయాలయ్యాయి. అడ్డుగా వచ్చిన రాకేశ్ చతుర్వేది అనే వ్యక్తిపై కూడా వారు దాడి చేశారు. ఈ విషయం ఎవరికై నా చెపితే చంపుతానని బెదిరించారు. ఈ విషయమై బాధితులు మర్నాడు మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హోటల్ నిర్వాహకులపై దాడి -
అప్రమత్తంగా ఉండాలి
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సాక్షి, సిటీబ్యూరో: నగరంలో కురుస్తున్న అకాల వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు.గురువారం సాయంత్రం భారీ వర్షాల నేపథ్యంలో మేయర్ జోనల్ కమిషనర్ల తో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులను అప్రమత్తం చేశారు. ఇంజనీరింగ్ ఐఆర్టీ వాహనాలను రంగంలోకి దింపినట్లు తెలిపారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతేనే బయటికి రావాలని, రోడ్డుపై నిలిచిన నీటిలో చిన్న పిల్లలు, వృద్ధులు వెళ్లకూడదని, మ్యాన్ హోల్స్ తెరవ వద్దని మేయర్ సూచించారు. అత్యవసరమైతే జీహెచ్ఎంసీ కాల్ సెంటర్‌కు ఫోన్ చేయాలన్నారు. సమష్టి కృషితోనే సత్ఫలితాలు సాక్షి, సిటీబ్యూరో: సీవరేజ్ ఓవర్ ఫ్లో ఫ్రీ సిటీ హైదరాబాద్ లక్ష్యంగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్ రెండో విడత విజయవంతంగా పూర్తయిందని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ అందరి సమష్టి కృషితో సత్ఫలితాలు ఇచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో ఇంతకు మించి కష్టపడతామని వెల్లడించారు. ఇదే స్ఫూర్తి తో జున్ నాటికి మిగతా మాన్ హోళ్లను కూడా డీ సిల్టింగ్ పూర్తి చేయాలని సూచించారు. ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. వర్షాకాలంలోగా సీవరేజ్ పైపులైన్లు, మ్యాన్ హోళ్లలో వ్యర్థాలు లేకుండా చూడాలన్నారు. అక్టోబర్ 2 నుంచి మార్చి 30 వరకు 180 రోజులు డీ సిల్టింగ్ పనులు చేపట్టారు. ఫలితంగా ఇప్పటి వరకు 24,146 ప్రాంతాల్లో 3,185 కిలో మీటర్ల సీవరేజ్ పైపులైన్, 2.50 లక్షల మ్యాన్ హోళ్లలో డీ–సిల్టింగ్ పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. స్పెషల్ డ్రైవ్ పకడ్బందీగా అమలు చేసేందుకు గత మూడేళ్లలో వచ్చిన సీవరేజ్ ఫిర్యాదులను విశ్లేషించినట్లు చెప్పారు. ప్రధానంగా వినియోగదారుల ఇళ్లల్లో చోకేజీ, రోడ్లపై సీవరేజ్ ఓవర్ ఫ్లో సమస్యలను గుర్తించామని, రోజూ వచ్చే ఫిర్యాదుల్లో 60 శాతం ఇవే రావడంతో వాటిపై దృష్టి సారించి పరిష్కరించినట్లు ఆయన వివరించారు. డ్రగ్స్ విక్రయిస్తున్న యువకుడి అరెస్టు బంజారాహిల్స్: డ్రగ్స్ విక్రయిస్తున్న యువకుడిని స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–11 తాడిపత్రి బిర్యానీ సెంటర్ సెంటర్ వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు బైక్‌పై అనుమానాస్పదంగా తిరుగుతున్న వెస్ట్‌గోదావరి జిల్లా, భీమవరానికి చెందిన కోపర్తి సాయి మణికంఠ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని తనిఖీ చేయగా 07 గ్రాముల కొకై న్, 3.7 గ్రాముల ఎక్టసీ పిల్స్ లభించాయి. ఓ పెడ్లర్ నుంచి కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తెలిపాడు. పోలీసులు అతడి వద్ద నుంచి మత్తు పదార్థాలు, బైక్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పాస్టర్ ప్రవీణ్ కుటుంబాన్ని పరామర్శించిన సునీల్ కుమార్ కాప్రా: రాజమహేంద్రవరం సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల కుటుంబాన్ని అంబేడ్కర్ ఇండియా మిషన్ అధ్యక్షుడు, సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ పరామర్శించారు. గురువారం కాప్రా డివిజన్ ఈశ్వరిపురి కాలనీలోని వారి నివాసానికి వెళ్లిన సునీల్‌కుమార్ ప్రవీణ్ పగడాల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రవీణ్ తల్లి మరియమ్మ, సోదరుడు ఆంటోని కిషోర్, సోదరి జ్యోతితో మాట్లాడి అంబేడ్కర్ ఇండియా మిషన్(ఏఐఎం) అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సునీల్‌కుమార్‌తో పాటు కిషోర్, మదిర శేషయ్య, ఎం విల్సన్ ఉన్నారు. నేరాల నియంత్రణకు కార్డన్ సెర్చ్ డీసీపీ పద్మజారెడ్డి జవహర్‌నగర్: కార్పొరేషన్ పరిధి వికలాంగుల కాలనీలో రాచకొండ సీపీ సుధీర్‌బాబు ఆదేశాల మేరకు మల్కాజిగిరి డీసీపీ పద్మజారెడ్డి ఆధ్వర్యంలో 120 మంది పోలీసులతో కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 24 బ్లాకుల్లో 200 ఇళ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీసీపీ పద్మజారెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు శాంతియుత వాతావరణం కల్పించడం కోసం పోలీసులు నిరంతరం పనిచేస్తున్నారన్నారు. నేరాల నియంత్రణ కోసం కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామన్నారు. జవహర్‌నగర్‌లో గంజాయి విక్రయించినా, సేవించినా పోలీసులకు సమాచారం అందించాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై చట్టరిత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సెర్చ్‌లో 202 వాహనాలను సీజ్‌చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్రమంగా అమ్ముతున్న 17 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుషాయిగూడ ఏసీపీ మహేష్, జవహర్‌నగర్ ఇన్స్పెక్టర్ సైదయ్య, అడ్మిన్ ఎస్సై ఇద్రీస్‌అలీ, రామునాయక్, లక్ష్మయ్య, వేణు, పోలీసులు తదితరులున్నారు. ● సీవరేజీ స్పెషల్ డ్రైవ్ విజయవంతం ● జలమండలి ఎండీ అశోక్ రెడ్డి -
‘ఆర్డర్ల బాధితుడి’కి నగదు రిఫండ్
సాక్షి, సిటీబ్యూరో: నగర వ్యాపారిని ఫోన్ ద్వారా సంప్రదించి, భారీ ఆర్డర్ల పేరుతో ఎర వేసి, మోసం చేసి, రూ.9.5 లక్షలు కాజేసిన కేసులో ఆ మొత్తాన్ని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు రిఫండ్ చేయించారు. దీనికి సంబంధించిన డీడీని అదనపు సీపీ పి.విశ్వప్రసాద్ బుధవారం బాధితుడికి అందజేశారు. ఇంటర్నెట్ ద్వారా నగర వ్యాపారి ఫోన్ నెంబర్ సంగ్రహించిన సైబర్ నేరగాళ్లు ఆయన ఉత్పత్తులకు ఉత్తరాదిలో మార్కెటింగ్ చేస్తామని నమ్మించారు. దీనికోసం తమ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకుని, దేశ, విదేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నట్లు నకిలీ ఈ–మెయిల్స్ సృష్టించారు. సరుకు సరఫరాకు ముందు తమకు రూ.9.5 లక్షల చెల్లించాలని చెప్పిన సైబర్ నేరగాళ్లు ఆ మొత్తం తమ ఖాతాల్లో వేయించుకుని మోసం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నమోదైన కేసును ఏసీపీ ఆర్జీ శివమారుతి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ కె.ప్రసాద్‌రావు దర్యాప్తు చేశారు. కీలక నిందితులు అమర్నాథ్ సింగ్, రణ్వీర్ సింగ్‌లను అరెస్టు చేసి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలతో ఆ ఇద్దరూ బాధితుడి నుంచి కాజేసిన మొత్తం తిరిగి ఇచ్చేందుకు అంగీకరించారు. దీనికి సంబంధించిన డిమాండ్ డ్రాఫ్ట్‌ను పోలీసుల ద్వారా బాధితుడికి అందజేశారు. -
అల్మాస్‌గూడలో హైడ్రా పంజా
● రోడ్లను ఆక్రమించి ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్ స్టేడియం కూల్చివేత ● మూసిన మూడు రోడ్లు, పార్కు స్థలానికి విముక్తి ● హైడ్రా సీఐపై దాడికి భూ యజమానుల యత్నం బడంగ్పేట్: కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్‌గూడలో హైడ్రా పంజా విసిరింది. రోడ్లను ఆక్రమించి నిర్మించిన బాక్స్ క్రికెట్ స్టేడియాన్ని నేలమట్టం చేసి కాలనీవాసులకు విముక్తి కల్పించింది. వివరాలు ఇలా ఉన్నాయి. అల్మాస్‌గూడలో బోయపల్లి కుటుంబీకులు 1982లో జీపీ లే అవుట్ చేశారు. కాలనీకి బోయపల్లి ఎన్క్లేవ్ అని పేరుపెట్టారు. సర్వే నంబర్ 39,40,41,42,44లో 5.7 ఎకరాల లే అవుట్ ఉండగా అందులో మూడు రోడ్లు, 236 గజాల పార్కు స్థలం చూపించి ప్లాట్లు విక్రయించారు. భూ యజమానులు మూడు లింక్ రోడ్లతో పాటు పార్కు జాగా ఆక్రమించి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. ఆక్రమించిన రోడ్ల స్థానంలో బాక్స్ క్రికెట్ స్టేడియం నిర్మించారు. దీనిపై కాలనీవాసులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో రెండు రోజుల క్రితం హైడ్రా అధికారులు లే అవుట్‌ను పరిశీలించి కబ్జాను నిర్ధారించారు. గురువారం హైడ్రా సీఐ తిరుమలేశ్ నేతృత్వంలో 40 మందికి పైగా సిబ్బంది యంత్రాలతో అక్కడికి చేరుకున్నారు. -
డ్రగ్స్, గంజాయి స్వాధీనం
శ్రీనగర్‌కాలనీ: ఎస్టీఎఫ్ పోలీసులు గురువారం వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి డ్రగ్స్, గంజాయి స్వాధీనం చేసుకుని ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఎర్రగడ్డ మెట్రోస్టేషన్ సమీపంలో కొందరు యువకులు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్టీఎఫ్ బీ టీమ్ సీఐ భిక్షారెడ్డి నేతృత్వంలో దాడి చేసి ఎస్కే అహ్మద్ రహీమ్, మహ్మద్ ఫక్రుద్దీన్ అనే యువకులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 2.78 గ్రాముల ఎండిఎంఏ, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సౌదీఅరేబియాకు చెందిన సఫార్, బెంగళూరుకు చెందిన సప్లయర్ ఇబ్రహీం జహీర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ధూల్‌పేటలో.... లోయర్ ధూల్‌పేటలో జుంగూర్ బస్తీలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో ఎస్టీఎఫ్ బీ టీమ్ ఎకై ్సజ్ అధికారులు దాడులు నిర్వహించి 1.3కిలోల గంజాయిని స్వాదీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కునాల్‌సింగ్, వినోద్‌సింగ్, హేమబాయిలను అరెస్ట్ చేసి వారి నుంచి నాలుగు సెల్ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అనికేష్సింగ్, ఆర్తిబాయి, నరేన్, గణేష్‌సింగ్ పరారీలో ఉన్నారని వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దాడుల్లో ఎస్సైలు బాలరాజు, సంద్య, కానిస్టేబుళ్లు యాదగిరి, అనీఫ్, నితిన్, మహేశ్వర్, శ్రీనివాసరెడ్డి, కౌసిక్ పాల్గొన్నారు. -
మెట్రో రెండో దశపై కేంద్రం నజర్
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రెండో దశ ప్రాజెక్టుపైన కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రెండో దశలో ప్రతిపాదించిన మొదటి 5 కారిడార్ల డీపీఆర్‌లపైన సంబంధిత మంత్రిత్వ శాఖల అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో పాటు అధికారుల బృందం రెండు రోజుల క్రితం ఢిల్లీలో పర్యటించింది. డీపీఆర్లలోని సాంకేతిక అంశాలపైన చర్చలు జరిగినట్లు తెలిసింది. వివిధ మార్గాల్లో చేపట్టనున్న కారిడార్లపై కేంద్ర అధికారులు తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకే హెచ్ఏంఆర్ఎల్ అధికారులతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. మెట్రో రెండో దశలో ప్రభుత్వం మొదట 76.4 కిలోమీటర్లతో 5 కారిడార్ల నిర్మాణానికి ప్రణాళికలను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 5 కారిడార్లపైన హెచ్‌ఏఎంఆర్‌ఎల్ సమగ్రమైన ప్రాజెక్టు నివేదికను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో కేంద్రానికి అందజేసింది. కేంద్రం నుంచి ఆమోదం లభిస్తే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. సుమారు రూ.24 వేల కోట్ల అంచనాలతో రెండో దశలో మొదటి 5 కారిడార్లను ప్రతిపాదించారు. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ప్రాజెక్టు డీపీఆర్‌లలో సాంకేతిక అంశాలపైన చర్చలు సాధారణమైన అంశమేనని, కేంద్ర కేబినెట్ దీనిపైన దృష్టి సారించినప్పుడే కీలకమైన ముందడుగు పడ్డట్లుగా భావించాలని హెచ్‌ఏఎంఆర్‌ఎల్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఏప్రిల్‌లో నార్త్, ఫ్యూచర్ సిటీల డీపీఆర్‌లు.. మరోవైపు నార్త్‌సిటీలో ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు, ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట్ వరకు ప్రతిపాదించిన రెండు కారిడార్లతో పాటు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్‌సిటీలోని స్కిల్ యూనివర్సిటీ వరకు మెట్రో రెండో దశ ‘బి’ విభాగంలో ప్రతిపాదించిన కారిడార్లకే ఏప్రిల్‌లో డీపీఆర్‌లను ఖరారు చేసి రాష్ట్ర ప్రభుత్వ అనుమతికి పంపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెలాఖరుకే అందజేయాల్సి ఉండగా ప్రాజెక్టుపైన సర్వేలు, అధ్యయనాల దృష్ట్యా ఏప్రిల్‌లో డీపీఆర్‌లు పూర్తి చేసే అవకాశం ఉంది.‘బి’ విభాగంలో ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు 23 కిలోమీటర్లు, శామీర్‌పేట్ ఓఆర్ఆర్ వరకు 22 కిలోమీటర్లు, ఫ్యూచర్‌సిటీ కారిడార్ 41 కిలోమీటర్ల చొప్పున నిర్మించనున్న సంగతి తెలిసిందే. రెండో దశలో రెండు విభాగాలుగా మొత్తం 8 కారిడార్లలో 190.4 కిలోమీటర్ల వరకు మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. డీపీఆర్‌లపై స్పష్టత ఢిల్లీలో ఎన్వీఎస్ రెడ్డి పర్యటన సాంకేతిక అంశాలపై అధికారులతో చర్చలు రెండోదశ మొదటి 5 కారిడార్లలో 76.4 కిలోమీటర్లు నార్త్, ఫ్యూచర్సిటీలపై వచ్చే నెలలో డీపీఆర్‌లు -
ఈ లైన్.. ఫైన్!
ఓహెచ్ లైన్ల స్థానంలో ఇక యూజీ కేబుళ్లు జీహెచ్ఎంసీ పరిధిలో విద్యుత్ నెట్వర్క్ ఇలా.. 33/11కేవీ సబ్స్టేషన్లు 498 33కేవీ యూజీ కేబుల్ 1,280 కి.మీ 33కేవీ ఓవర్‌హెడ్ లైన్స్ 3,725 కి.మీ 11 కేవీ ఓవర్‌హెడ్ లైన్స్ 21,643 కి.మీ పవర్ ట్రాన్స్ఫార్మర్లు 1,022 11కేవీ యూజీ కేబుల్ 957 డీటీఆర్లు 1,50,992 ఇంటర్మీడియట్ స్తంభాలు 58,271 ● ఆసక్తిగల ఏజెన్సీల నుంచి డీపీఆర్‌ల ఆహ్వానం ● గ్రేటర్లో 900 కిలోమీటర్ల ఓవర్‌హెడ్ విద్యుత్ లైన్లు ● అండర్ గ్రౌండ్ కేబుల్స్‌కు రూ.520 కోట్లు అవసరం ● డిస్కంకు నేడు డీపీఆర్‌లు సమర్పించనున్న ఏజెన్సీలు సాక్షి, సిటీబ్యూరో: ఇళ్లపై వేలాడుతూ ప్రమాదకరంగా మారిన ఓవర్‌హెడ్ (ఓహెచ్) విద్యుత్ లైన్ల స్థానంలో అండర్ గ్రౌండ్ (యూజీ) కేబుల్స్ వేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు డిలైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను తయారు చేసి సమర్పించాల్సిందిగా కోరుతూ డిస్కం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. ఆరు ప్రముఖ అధ్యయన సంస్థలు ఇందుకు ముందుకు వచ్చినట్లు తెలిసింది. 900 కిలోమీటర్ల ఓహెచ్ లైన్ల స్థానంలో యూజీ కేబుళ్లును వేసేందుకు రూ.520 కోట్ల వరకు ఖర్చు అవుతున్నట్లు అంచనా. ఆయా ఏజెన్సీలు రూపొందించిన నివేదికను శుక్రవారం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు సమర్పించనున్నాయి. ఓవర్‌హెడ్ లైన్ రహిత నగరంగా.. ● గ్రేటర్లో ప్రస్తుతం 60 లక్షలకుపైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 52 లక్షలకుపైగా గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం ప్రతిరోజూ గరిష్ట విద్యుత్ డిమాండ్ 60 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. వచ్చే వేసవిలో విద్యుత్ డిమాండ్ 100 మిలియన్ యూనిట్లకు చేరే అవకాశం లేకపోలేదు. పాతబస్తీ సహా ప్రధాన బస్తీల్లో ఇప్పటికీ నిజాం కాలం నాటి ఓవర్‌హెడ్ లైన్లు, ఇనుప స్తంభాలే దర్శనమిస్తున్నాయి. ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ లైన్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. ● చిన్నపాటి ఈదురుగాలితో కూడిన వర్షానికే తెగిపడుతున్నాయి. విద్యుత్ అంతరాయాలతో పాటు అనేక మంది మృత్యువాతకు కారణమవుతున్నాయి. లైన్ల కింద అనేక చోట్ల భారీ భవంతులు వెలిశాయి. ఇంటిపై దుస్తులను ఆరవేసేందుకు వెళ్లిన మహిళలు, పతంగ్‌లను ఎగరేసేందుకు వెళ్లిన పిల్లలు ఓవర్‌హెడ్ లైన్‌కు ఆనుకుని విద్యుత్ షాక్‌తో మృతి చెందుతున్న ఘటనలు సైతం విదితమే. ఓవర్‌హెడ్ లైన్ల స్థానంలో యూజీ కేబుళ్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలను నివారించడంతో పాటు విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత మెరుగుపర్చవచ్చని డిస్కం భావిస్తోంది. హైదరాబాద్‌ను ఓవర్‌హెడ్ లైన్ రహిత నగరంగా అంతర్జాతీయ పటంలో చూపింవచ్చని యోచిస్తోంది. ప్రాధాన్య క్రమంలో పనులు.. ● హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా ప్రమాదకరంగా మారిన బహిరంగ విద్యుత్లైన్ల (ఓవర్‌హెడ్)ను తొలగించి, వాటిస్థానంలో అండర్ గ్రౌండ్ (యూజీ) కేబుళ్లను వేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఇప్పటికే సుమారు 900 కిలోమీటర్ల ఓవర్ హెడ్ (ఓహెచ్) లైన్లు ఉన్నట్లు గుర్తించింది. ఆయా ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ కేబుళ్ల ఏర్పాటుకు రూ.520 కోట్లకు పైగా ఖర్చు కానుందని అంచనా వేసింది. డీపీఆర్ సమర్పించిన ఏజెన్సీలకే పనులను అప్పగించాలని యోచిస్తోంది. ● గ్రేటర్ మొత్తంగా ఒకే సమయంలో కాకుండా ప్రాధాన్య క్రమంలో పనులు చేపట్టనున్నట్లు రెండు రోజుల క్రితం అసెంబ్లీలో విద్యుత్ శాఖ మంత్రి ప్రకటించడం తెలిసిందే. పేదలు ఎక్కువగా నివసించే నందినగర్, వారాసిగూడ, రాంనగర్, చిలకలగూడ, ఎన్టీఆర్ నగర్, ఇందిరా పార్కు, అశోక్‌నగర్, పద్మారావునగర్, గాంధీనగర్, ఖైరతాబాద్, నాంపల్లి, రాజేంద్రనగర్, బోరబండ, శ్రీరామ్‌నగర్, లెనిన్‌నగర్, మన్సూరాబాద్, నాగోలు, అడ్డగుట్ట, మెహిదీపట్నం, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో ప్రమాదకరంగా మారిన లైన్లను మార్చే అవకాశం ఉంది. -
హైడ్రా సీఐపై దాడికి యత్నం
బాక్స్ క్రికెట్ స్టేడియాన్ని కూల్చివేస్తుండగా భూమికి సంబంధించిన వ్యక్తులు అడ్డుకునే యత్నం చేశారు. హైడ్రా సీఐ తిరుమలేశ్‌తో వాగ్వాదానికి దిగారు. ఒక దశలో దాడికి యత్నించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అదే రీతిలో సీఐ బదులివ్వడంతో భూ యజమానులు వెనక్కి తగ్గారు. హైడ్రా సిబ్బంది వెంటనే జేసీబీతో క్రికెట్ స్టేడియాన్ని ధ్వంసం చేసి చదును చేశారు. లేఅవుట్లో చూపించిన పార్కు స్థలంలో టౌన్ ప్లానింగ్ అధికారులతో ఇది పార్కు స్థలం అంటూ బోర్డు పాతించారు. దాడికి యత్నించిన వారిపై కేసులు నమోదు చేయనున్నట్లు సీఐ తిరుమలేశ్ తెలిపారు. అనంతరం కాలనీవాసులు సీఎం రేవంత్‌రెడ్డికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు. -
24 గంటల్లో వాటర్ ట్యాంకర్ల డెలివరీ
సాక్షి,సిటీబ్యూరో: వాటర్ ట్యాంకర్లను పెండెన్సీ లేకుండా 24 గంటల్లో డెలివరీ చేసేలా చర్యలు తీసుకున్నట్లు జలమండలి ఒక ప్రకటనలో వెల్లడించింది. వాటర్ ట్యాంకర్ల పెండెన్సీపై ‘సాక్షి’ లో గురువారం ప్రచురితమైన ‘‘ట్యాంకర్.. ఫికర్!’’ కథనంపై స్పందించిన జలమండలి వివరణ ఇచ్చింది. ఈ నెల 25,26 తేదీల్లో బుకింగ్ జరిగిన ట్యాంకర్లను ఎలాంటి పెండెన్సీ లేకుండా 24 పని గంటల్లోనే క్లియర్ చేసినట్లు పేర్కొంది. మొత్తం ఫిల్లింగ్ స్టేషన్లలో రోజువారీగా సగటున 9049 నుంచి 9080 వరకు ట్యాంకర్ల బుకింగ్ జరుగుతుందని, అందులో 86 నుంచి 112 వరకు బుకింగ్ లు మాత్రమే వివిధ కారణాలతో పెండింగ్ పడుతున్నట్లు తెలిపింది. ట్యాంకర్ల డిమాండ్ దృష్ట్యా డెలివరీలను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పసికందును కన్నతల్లే చంపేసింది మైలార్‌దేవ్‌పల్లి: నీళ్ల బకెట్లో పడి 14 రోజుల పసికందు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే చిన్నారిని తల్లే నీటి బకెట్లో వేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మైలార్దేపల్లి ఇన్స్పెక్టర్ నరేందర్ గురువారం వివరాలు వెల్లడించారు. తమిళనాడు ప్రాంతానికి ముదిలాని మణి, ఆరోగ్య విజ్జి(30) భార్యాభర్తలు అలీనగర్‌లోని ఓ కంపెనీలో పని చేస్తూ అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కుమారుడు, 14 రోజుల కుమార్తె ఉన్నారు. మణికి రెండు కిడ్నీలు పాడైపోవడంతో అతడి చికిత్స కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. దీంతో గత కొన్నాళ్లుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో పాప జన్మించడంతో ఆమె పోషణ విషయమై ఆరోగ్య విజ్జి ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 25న భర్త పనికి వెళ్లిన సమయంలో విజ్జి తన కుమార్తెను బాత్రూమ్లోని నీటి బకెట్లో పడేసి హత్య చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించింది. గురువారం నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఓపెన్‌టాప్ జీపులో వెళ్తూ పిస్టల్ తిప్పుతూ.. న్యూసెన్స్‌కు పాల్పడిన యువకులపై కేసు నమోదు బంజారాహిల్స్: ఓపెన్ టాప్ జీపులో వెళుతూ.. గాలిలో పిస్టల్ తిప్పుతూ న్యూసెన్స్‌కు పాల్పడిన యువకులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం మధ్యాహ్నం బంజారాహిల్స్ రోడ్డునెంబర్–1లోని సెర్వి హోటల్ సమీపంలో కొందరు యువకులు నెంబర్ ప్లేట్ లేని ఓపెన్ టాప్ జీపులో వెళ్తున్నారు. వాహనాన్ని నిర్లక్ష్యంగా నడుపుకుంటూ వెళ్లడంతో పాటు ఓ యువకుడు పిస్టల్‌ను గాలిలో తిప్పుతూ వెళ్తున్నాడు. ఇన్‌స్ట్రాగాంలో ఈ వీడియో వైరల్ అయ్యింది. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ బ్లూ కోల్ట్ కానిస్టేబుల్ శ్రీకాంత్ అధికార ట్యాబ్‌లో ఈ వీడియోతో కూడిన ఇన్‌స్ట్రాగాం లింక్‌ను గమనించాడు. దీనిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయుధాల చట్టం ఉల్లంఘించి పిస్టల్‌ను గాలిలో తిప్పుతూ ప్రజలకు భయభ్రాంతులకు గురిచేశారని, వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భవనం పైనుంచి దూకి నవ వధువు ఆత్మహత్య ముషీరాబాద్: భర్త, అత్తింటి వేధింపులు తాళలేక ఓ నవ వధువు భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భోలక్ పూర్ లో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భోలక్‌పూర్‌కు చెందిన సౌజన్యకు మూసాపేటకు చెందిన జిమ్ నిర్వాకుడు శబరీష్ యాదవ్‌తో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. అయితే సౌజన్యకు గుండెలో రంధ్రం ఉందని, చెప్పకుండా పెళ్లి చేశారని ఆమె భర్త, అతడి కుటుంబ సభ్యులు సౌజన్యను తరచూ వేధిస్తున్నారు. ఈ విషయం దాచినందుకు అదనపు కట్నం తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నారు. పలుమార్లు ఆమెను పుట్టింటికి పంపారు. బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి అత్తింటికి వెళ్లిన సౌజన్యను తమ ఇంటికి రావొద్దంటూ అక్కడినుంచి వెల్లగొట్టారు. దీంతో మనస్తాపం చెందిన సౌజన్య పుట్టింటికి వచ్చి మూడంతస్తుల భవనం పైనుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించగా కొద్దిసేపటికి మృతి చెందినట్లు ముషీరాబాద్ పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లి పుష్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని మహిళ దారుణ హత్య సనత్‌నగర్: గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం వెలుగులోకి వచ్చింది. ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నల్లగొండకు చెందిన నాగరాజు బతుకు దెరువు నిమిత్తం కుటుంబంతో సహా నగరానికి వలసవచ్చాడు. అయితే భార్యతో గొడవల కారణంగా ఆమెను వదిలేసి ఒక్కడే ఉంటున్నాడు. కూలీగా పని చేస్తూ ఫుట్‌పాత్‌లపై నిద్రించేవాడు. ఈ నేపథ్యంలో అతడికి ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పరిసరాల్లో భిక్షాటన చేసుకునే మహిళతో పరిచయం ఏర్పడింది. బుధవారం రాత్రి ఇద్దరూ కలిసి భరత్‌నగర్ బ్రిడ్జి కిందికి వెళ్లి ఏకాంతంగా గడిపారు. అనంతరం నాగరాజు ఆమెను తీవ్రంగా కొట్టడంతో అక్కడికక్కడే మరణించింది. దీనిపై సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న సనత్‌నగర్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు నాగరాజును అరెస్టు చేశారు. అయితే మృతురాలి వివరాలు తెలియరాలేదు. ఆమె సంబంధీకులు ఎవరైనా ఉంటే సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని ఇన్స్పెక్టర్ తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జీహెచ్ఎంసీలో 50 మందిపై వేటు
రిటైరయ్యాక కొనసాగుతున్న అధికారులు ఇక ఇళ్లకే సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ అధికారం, ఉద్యోగం నుంచి రిటైరయ్యాక సైతం వివిధ పేర్లతో మున్సిపల్ పరిపాలన శాఖలోని వివిధ విభాగాల్లో కొనసాగుతున్న వారిని వెంటనే పంపించాల్సిందిగా తాజాగా వెలువడిన ఉత్తర్వుతో జీహెచ్ఎంసీలోని దాదాపు యాభై మంది ఇక ఇళ్లకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. జీహెచ్ఎంసీలో ఇలా కొనసాగుతున్న వారిలో అడిషనల్ డైరెక్టర్, డిప్యూటీ కమిషనర్, డిప్యూటీ సిటీప్లానర్, సూపరింటెండెంట్, ఆర్డీఓ, ఈఈ, సూపరింటెండెంట్ల స్థాయిల నుంచి దిగువ స్థాయిల వరకు ఉన్నారు. వీరు రీ అపాయింట్మెంట్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ల పేరిట తిరిగి జీహెచ్ఎంసీలోనే కొనసాగుతున్నారు. కొందరు కొన్ని ‘కీ’లక స్థానాల్లో ఉండి చక్రం తిప్పుతున్న వారు సైతం ఉన్నారు. ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం మేరకు వారి గడువు 2024లోనే ముగిసిపోవాల్సి ఉండగా, చాలామంది ఇప్పటికీ కొనసాగుతున్నారు. కొందరిని మాత్రం గడువు ముగిసిన వెంటనే ఉండటానికి వీల్లేదంటూ పంపించిన సంబంధిత అధికారులు.. చాలామంది ఇంకా కొనసాగుతున్నా పట్టించుకోలేదు. దీన్ని టాప్ ప్రయారిటీగా పేర్కొంటూ వెంటనే పంపించాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేయడంతో వీరు ఇక ఇళ్లకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. 30న ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఉగాది పంచాంగ శ్రవణం నిజాంపేట్: బాచుపల్లి, క్రాంతినగర్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రముఖ మీడియా సంస్థ ‘సాక్షి’ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించనున్నట్లు సాక్షి– ఉగాది పంచాంగ శ్రవణం కమిటీ సభ్యులు పేర్కొన్నారు. గురువారం వారు మాట్లాడుతూ ఈ నెల 30న బాచుపల్లి, క్రాంతినగర్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రఖ్యాత నర్తకి యామినిరెడ్డి బృందం కళాత్మక కూచిపూడి నృత్యం, సిద్ధాంతి చక్రవర్తులు శ్రీవత్స్యాచార్యుల పంచాంగ పఠనం, ఆధ్యాత్మిక ప్రసంగాలు, అన్నదాన కార్యక్రమాలు ఉంటాయన్నారు. ప్రముఖ సంస్థ భారతీ సిమెంట్స్ ఈ కార్యక్రమానికి స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. -
ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ
దుండిగల్: విద్యుత్ కేబుల్ లైన్ మార్చడానికి లంచం డిమాండ్ చేసిన విద్యుత్ శాఖ ఏఈని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ పరిధిలోని డీపోచంపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ ఏఈగా విధులు నిర్వర్తిస్తున్న సురేందర్‌రెడ్డి 11కేవీ విద్యుత్ లైన్ మార్చడానికి, ఓ భవనానికి కేబుల్ లైన్ వేయడానికి సదరు భవన యజమాని నుంచి రూ.30 వేలు డిమాండ్ చేశాడు. ఈ విషయమై సదరు భవన యజమాని ఏసీబీ అధికారులను సంప్రదించారు. అధికారులు సూచించిన విధంగా గురువారం ఏఈ సుందర్‌రెడ్డికి ఆయన కార్యాలయంలో నగదు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. -
ఏటీఎంలలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
లింగోజిగూడ: శివారు ప్రాంతాల ఏటీఎంలే లక్ష్యంగా చేసుకోని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.4 లక్షల నగదు, కారు, వివిధ రకాల పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఎల్బీనగర్ సీపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ కమిషనర్ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు. రాజస్తాన్‌లోని డీగ్ జిల్లా సందీక గ్రామానికి చెందిన రాహుల్ అలియాజ్ రాహుల్ ఖాన్, మధ్యప్రదేశ్‌లో జేసీబీ మెకానిక్‌గా పని చేస్తున్న సందీక గ్రామానికి చెందిన జాహుల్ భాదన్ ఖాన్, జల్పల్లి షాజహాన్ కాలనీకి చెందిన ఎండీ సర్ఫారాజ్లు ఓ ముఠాగా ఏర్పడి ఏటీఎంలలో చోరీలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు గత ఫిబ్రవరి 22 నుంచి 26 రావిర్యాల, పహడీషరీఫ్, బాలాపూర్, జల్పల్లి, బీబీనగర్, భువనగిరి, మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతాల్లోని ఏటీఎంల వద్ద రెక్కీ నిర్వహించారు. చివరకు రావిర్యాల, మైలార్‌దేవ్‌పల్లి ఏటీఎంలలో చోరీ చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈమేరకు ఫిబ్రవరి 26న మరికొందరు స్నేహితుల సాయంతో రావిర్యాల ఎస్బీఐ ఏటీంలో రూ.29 లక్షల 69 వేల 900 ఎత్తుకెళ్లారు. అక్కడి నుంచి మైలార్దేవ్ పల్లి, మధుబాన్ కాలనీలో మరో ఎస్బీఐ ఏటీఎంలో చోరికి ప్రయత్నించగా మిషన్‌లో మంటలు రావడంతో అక్కడి నుంచి నాందేడ్ మహారాష్ట్ర మీదుగా పారిపోయారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాహుల్‌ఖాన్, ముస్తాఖీన్ ఖాన్, వహీద్‌ఖాన్, షకీల్ ఖాన్‌లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.4 లక్షల నగదు, కారు, చోరీకి ఉపయోగించిన వస్తువులు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. -
మానవాళికి ఉపయోగపడే పరిశోధనలు చేయండి
ఉస్మానియా యూనివర్సిటీ: యూనివర్సిటీలలో నూతన పరిశోధనలకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని, విద్యార్థులు, పరిశోధకులు మానవాళికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. బుధవారం ఓయూ క్యాంపస్ సైన్స్ కాలేజీ ఫిజిక్స్ విభాగంలో మల్టీ ఫంక్షనల్ మెటీరియల్స్ ఫర్ సొసైటల్ అప్లికేషన్స్ అనే అంశంపై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. కార్యక్రమానికి వీసీ ప్రొ.కుమార్ అధ్యక్షత వహించగా ఓయూ ఛాన్స్లర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. సమాజ అవసరాలు తీర్చేలా పరిశోధనలు జరగాలని అన్నారు. పరిశోధన ఫలాలు ప్రధానంగా గిరిజనులకు చేరాలన్నారు. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో విభిన్న విభాగాలు కలసి పనిచేయాలని, తద్వారా నాణ్యతమైన ఉత్పత్తులు చౌకగా లభిస్తాయన్నారు. పరిశోధనలలో ఓయూ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడుతోందని వీసీ ప్రొ.కుమార్ అన్నారు. అంతరం సదస్సు సావనీర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సదస్సు చైర్మన్, హెడ్ ప్రొ.శ్రీనివాస్, ఏఆర్‌సీఐ డైరెక్టర్ డా.విజయ్, ఎఎండీ డైరెక్టర్ ధీరజ్ పాండే, ప్రొ.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. – గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ -
ఎంసీఈఎంఈని సందర్శించిన ఆర్మీ చీఫ్
కంటోన్మెంట్: టెక్నాలజీ పరంగా భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆర్మీ సంసిద్ధంగా ఉండాలని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (సీఓఏఎస్) జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. బుధవారం ఆయన సికింద్రాబాద్‌లోని మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ (ఎంసీఈఎంఈ)ని సందర్శించారు. ‘ఆత్మ నిర్భర్’లో భాగంగా ఎంసీఈఎంఈ పరిధిలోని ల్యాబరేటరీల్లో రూపొందించిన అధునాత పరికరాలు, చేపట్టిన ప్రాజెక్టులను పరిశీలించారు. డ్రోన్లు, అటానమస్ రోబోటిక్స్, క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఈఎంఈ టెక్నీషియన్స్ సామర్థ్యాన్ని పరిశీలించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఈఎంఈలో చోటు చేసుకుంటున్న మార్పుల పట్ల సీఓఏఎస్ సంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. -
మూడంచెల్లో..
చెత్త సమస్యల పరిష్కారానికి జీహెచ్ఎంసీ తిప్పలు సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ విభాగాలకు సంబంధించిన సమస్యలకు ఎంతో కొంత పరిష్కారం చూపగలుగుతున్నప్పటికీ, చెత్త సమస్యలు మాత్రం తీరడం లేదు. ఏళ్ల తరబడిగా ఉన్న ఈ సమస్య పరిష్కారానికి వివిధ చర్యలు చేపడుతున్నట్లు చెబుతున్నప్పటికీ, తగిన ఫలితాలంటూ కనిపించడం లేదు. ఇంటింటి నుంచి చెత్త సేకరణ సవ్యంగా జరగకపోవడంతో రోడ్ల వెంబడి బహిరంగ ప్రదేశాల్లో చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి. వీటిపై నిత్యం ఫిర్యాదులందుతున్నాయి. సోషల్ మీడియా వేదికగానూ ఫొటోలతో సహా ప్రజలు వీటిపై ఫిర్యాదు చేస్తుండటంతో ఆన్లైన్ మానిటరింగ్ విధాన్ని ప్రవేశపెట్టారు. అయినప్పటికీ ఫలితం కనిపించకపోవడంతో ఇప్పుడిక మూడు పర్యాయాలు చెత్త తరలింపును పరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే రూ.1000 జరిమానాలు విధిస్తున్నా, ఇక్కడ చెత్త వేయొద్దని మైకుల్లో హెచ్చరిస్తున్నా సమస్య పరిష్కారం కాలేదు. చెత్త వేసేవారికి ఈ– పెనాల్టీల విధానాన్ని సైతం అందుబాటులోకి తెచ్చారు. వీటి వల్ల జీహెచ్ఎంసీకి పెనాల్టీల రూపేణా ఆదాయం వస్తున్నప్పటికీ, ఎక్కడ పడితే అక్కడ ఉన్న చెత్త సమస్య సమసిపోలేదు. మూడు పర్యాయాలు.. ఈ నేపథ్యంలో రోడ్ల వెంబడి చెత్త కనిపించకుండా ఉండేందుకు మూడుసార్లు పర్యవేక్షణతో, ఎక్కడ చెత్త తరలించలేదో గుర్తించి సంబంధిత సిబ్బంది, అధికారులను అప్రమత్తం చేయడం ద్వారా పరిష్కరించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల ప్రవేశపెట్టిన ఈ విధానంలో మూడు అంశాల్ని పరిశీలిస్తున్నారు. 1. ఇంటింటి నుంచి చెత్త తరలించే స్వచ్ఛ ఆటోలు ఎన్ని గైర్హాజరవుతున్నాయో గుర్తించడం. 2. చెత్తను సర్కిళ్లలోని సమీప ట్రాన్స్ఫర్ స్టేషన్లకు తరలించాల్సిన ఆటోల్లో ఎన్ని పని చేయడం లేదో గుర్తించడం. 3. బహిరంగ ప్రదేశాల్లో చెత్తకుప్పలు గుట్టలుగా పోగయ్యే ప్రాంతాలను గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్‌గా గుర్తిస్తున్నారు. వాటిలో ఎన్నింటిని క్లీన్ చేసిందీ, ఎన్ని చేయనిదీ గుర్తిస్తున్నారు. ఈ పనుల్ని కేవలం రోజుకు ఒక్కసారి మాత్రమే కాకుండా మూడు పర్యాయాలు పర్యవేక్షిస్తున్నట్లు శానిటేషన్ విభాగం అడిషనల్ కమిషనర్ సీఎన్ రఘుప్రసాద్ తెలిపారు. ఆమేరకు.. ఉదయం 8గంటలలోగా ఎన్ని స్వచ్ఛ ఆటోలు, ట్రాన్స్ఫర్ స్టేషన్ల ఆటోలు తమ పని పూర్తిచేసింది గుర్తిస్తారు. పని చేయని ఆటోల సిబ్బందిని అలర్ట్ చేస్తారు. అలాగే జీవీపీల్లో ఎన్నింటిని శుభ్రం చేయలేదో గుర్తించి సంబంధిత సిబ్బందిని అప్రమత్తం చేస్తారు. తిరిగి మధ్యాహ్నం 1.30 గంటలకు మరోసారి పరిశీలిస్తారు. ఆ తర్వాత 2.30 గంటలకు మరోమారు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారు. ఉన్నతాధికారులు కార్యాలయాల నుంచే పరిశీలించేందుకు రియల్‌టైమ్‌లో ఆయా ప్రాంతాలు కనిపించేలా వెబ్‌పోర్టల్ నిర్వహిస్తున్నారు. తొలిదశలో ఉదయం 8 గంటలలోగా 30 శాతం కంటే తక్కువ పనిచేసిన వారిపై తగిన చర్యలు తీసుకోనున్నారు. తద్వారా ఒకేసారి కాకున్నా క్రమేపీ చెత్త సమస్యలు పరిష్కారమవుతాయని అధికారులు భావిస్తున్నారు. రోజుకు మూడుసార్లు పరిశీలించే యోచన -
రోజు రోజుకూ పెరిగిపోతున్న పెండెన్సీ
సాక్షి, సిటీబ్యూరో: జలమండలి ట్యాంకర్ల పెండెన్సీ నానాటికీ పెరిగిపోతోంది. ముదురుతున్న ఎండలు.. అడుగంటుతున్న భూగర్భ జలాలతో తిప్పలు తప్పడంలేదు. తాగునీటితో పాటు నిత్యావసరాలకు సైతం ట్యాంకర్ల తాకిడి పెరిగింది. బుకింగ్ నుంచి డెలివరీ సమయం తగ్గించేందుకు సంబంధిత అధికారులు ఒక వైపు తీవ్ర కసరత్తు చేస్తున్నా... మరోవైపు బుకింగ్ పెండెన్సీ తారస్థాయికి చేరుతోంది. జలమండలి పరిధిలో మొత్తం 75 ఫిల్లింగ్ స్టేషన్లు ఉండగా.. 20 స్టేషన్లు మినహా మిగతా వాటిలో 24 నుంచి 48 గంటలు దాటితే కాని ట్యాంకర్లు డెలివరీ కానీ పరిస్థితి నెలకొంది. డోయెన్స్ ఫిల్లింగ్ స్టేషన్లో ఐదు రోజులు, ఎల్లారెడ్డిగూడెంలో నాలుగు రోజులు, షాపూర్‌నగర్, గచ్చిబౌలి–2, గాజుల రామారాం, మణికొండ, ఫతేనగర్‌లలో మూడు రోజులు, మిగతా ఫిల్లింగ్ స్టేషన్లలో ట్యాంకర్ల డెలివరీకి 48 గంటల సమయం పడుతున్నట్లు జలమండలి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ట్యాంకర్ యజమానుల చేతివాటం డిమాండ్ పెరగడంతో ట్యాంకర్ యజమానులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వినియోగదారులకు తెలియకుండానే వారి క్యాన్ నెంబర్ పేరిట ట్యాంకర్‌ను బుక్ చేసి వాణిజ్య అవసరాలకు తరలిస్తున్నారు. మరోవైపు కొందరు వినియోగదారుల సహకారంతో ట్యాంకర్లను బుక్ చేసి బ్లాక్‌లో డెలివరీ చేయడం పరిపాటిగా మారింది. వాస్తవంగా మాదాపూర్, బంజారాహిల్స్, మూసాపేట, మణికొండ, జూబ్లీహిల్ తదితర ప్రాంతాల నుంచి ట్యాంకర్ల డిమాండ్ పెరుగుతోంది. రోజువారీగా సెక్షన్ల పరిధిలో అత్యధికంగా ఐదు వందలపైగా ట్యాంకర్లు బుకింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అవసరానికి మించిన వినియోగంతో.. గత ఏడాదితో పోల్చితే ట్యాంకర్ల డిమాండ్ మార్చి నెలలో రెట్టింపు స్థాయిలో పెరిగింది. సాధారణంగా నగర పరిధిలో జనవరి నుంచి జూన్ రెండో వారం వరకు ట్యాంకర్లకు తాకిడి అధికంగానే ఉంటుంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రతి యేటా ట్యాంకర్ల డిమాండ్ కనీసం 20 నుంచి 100 శాతం పెరుగుతూ వస్తోంది. వచ్చే నెలలో ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. వాస్తవంగా నగరంలో తాగునీటికి ఇంత డిమాండ్ ఏర్పడడానికి కారణం.. అవసరానికి మించి నీటిని వినియోగించడమేనని జలమండలి అధికారులు పేర్కొంటున్నారు. మొత్తమ్మీద 13 లక్షల నల్లా కనెక్షన్లలో కేవలం 42 వేల గృహాలు ట్యాంకర్లు బుకింగ్ చేస్తున్నట్లు జలమండలి అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో 500 మంది.. 75 రోజుల్లో 31 వేల ట్యాంకర్లు, 22 వేల మంది 90 శాతం ట్యాంకర్లను అంటే.. 2.84 లక్షల ట్యాంకర్లను బుక్ చేసినట్లు తెలుస్తోంది. సంఖ్య పెరిగినా.. వాటర్ ట్యాంకర్ల సంఖ్య పెరిగినా.. పెండెన్సీ మాత్రం తగ్గడం లేదు. వాస్తవంగా గతేడాది 69 ఫిల్లింగ్ స్టేషన్లు ఉండగా ఈ ఏడాది మరో ఆరు స్టేషన్లను పెంచారు. ఫిల్లింగ్ పాయింట్ల సంఖ్య 93 నుంచి 123కు పెరిగింది. ట్యాంకర్ల సంఖ్య 577 నుంచి 977కు చేరింది. -
మానవాళికి ఉపయోగపడే పరిశోధనలు చేయండి
ఉస్మానియా యూనివర్సిటీ: యూనివర్సిటీలలో నూతన పరిశోధనలకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని, విద్యార్థులు, పరిశోధకులు మానవాళికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. బుధవారం ఓయూ క్యాంపస్ సైన్స్ కాలేజీ ఫిజిక్స్ విభాగంలో మల్టీ ఫంక్షనల్ మెటీరియల్స్ ఫర్ సొసైటల్ అప్లికేషన్స్ అనే అంశంపై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. కార్యక్రమానికి వీసీ ప్రొ.కుమార్ అధ్యక్షత వహించగా ఓయూ ఛాన్స్లర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. సమాజ అవసరాలు తీర్చేలా పరిశోధనలు జరగాలని అన్నారు. పరిశోధన ఫలాలు ప్రధానంగా గిరిజనులకు చేరాలన్నారు. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో విభిన్న విభాగాలు కలసి పనిచేయాలని, తద్వారా నాణ్యతమైన ఉత్పత్తులు చౌకగా లభిస్తాయన్నారు. పరిశోధనలలో ఓయూ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడుతోందని వీసీ ప్రొ.కుమార్ అన్నారు. అంతరం సదస్సు సావనీర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సదస్సు చైర్మన్, హెడ్ ప్రొ.శ్రీనివాస్, ఏఆర్‌సీఐ డైరెక్టర్ డా.విజయ్, ఎఎండీ డైరెక్టర్ ధీరజ్ పాండే, ప్రొ.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. – గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ -
పత్తర్‌గట్టీ భవనం పెచ్చులూడి..ఇరువురికి గాయాలు
దూద్ బౌలి: పాతబస్తీలోని చారిత్రక కట్టడం పత్తర్‌గట్టీ భవనం పెచ్చులూడి ఇరువురికి స్వల్ప గాయాలయ్యాయి. బుధవారం రాత్రి వందలాది మంది రంజాన్ షాపింగ్‌లో మునిగి ఉండగా..అకస్మాత్తుగా పత్తర్‌గట్టీ భవనంలోని ఓ షాపు కిటికీ పైనుంచి గచ్చు పెచ్చులు ఊడిపడగా షాపు ముందున్న ఓ చిరువ్యాపారి, మరో యువకుడు గాయపడ్డారు. సమాచారం అందుకున్న చార్మినార్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పురావస్తు శాఖ అధికారులు చారిత్రాత్మక కట్టడం అయినా పత్తర్‌గట్టి భవనాన్ని పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
‘ఎస్టేట్స్’ దూకుడు!
సాక్షి, సిటీబ్యూరో: ఆర్థిక సంవత్సరం ముగియవస్తుండటంతో ఆదాయ లక్ష్యాలను చేరుకునేందుకు జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాలు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. ప్రభుత్వం ఆస్తిపన్ను బకాయిల వడ్డీలపై 90 శాతం రాయితీ కూడా ఇవ్వడంతో ట్యాక్స్ సెక్షన్ సెలవుల్లేకుండా పని చేస్తోంది. దాంతోపాటు ట్రేడ్ లైసెన్సుల విభాగం, ఎస్టేట్స్ విభాగాలు సైతం టార్గెట్లు చేరుకునేందుకు ముమ్మరంగా పర్యటిస్తూ దూకుడు పెంచాయి. ముఖ్యంగా, ఇటీవలి కాలం వరకు తన ఆస్తులేమిటో, ఎంతమొత్తం రావాలో కూడా పెద్దగా పట్టించుకోని ఎస్టేట్స్ విభాగం దూకుడు పెంచింది. ఆ విభాగానికి నగరంలోని పలు ప్రాంతాల్లో షాపింగ్ కాంప్లెక్స్‌లు, మార్కెట్లు ఉండటం తెలిసిందే. వాటిలో వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు ఎంతో ఆదాయాన్ని పొందుతున్నప్పటికీ, జీహెచ్ఎంసీకి చెల్లించాల్సిన నామమాత్రపు అద్దెలు మాత్రం చెల్లించడం లేదు. ఈ నేపథ్యంలో అద్దెల్ని కచ్చితంగా వసూలు చేయాలని భావించిన ఎస్టేట్స్ అధికారులు నిబంధనల మేరకు నోటీసులు, హియరింగ్‌లు వంటివి నిర్వహించారు. అంతిమంగా దుకాణాలను సీజ్ చేసే చర్యలు చేపట్టారు. ఈ నెల 8వ తేదీన తొలుత ఈ చర్యలు ప్రారంభించాక, కొద్దిమేర ఫలితం కనిపించింది. తిరిగి మళ్లీ పరిస్థితి షరామామూలుగా మారడంతో మంగళ, బుధ వారాల్లో సంబంధిత అధికారులు, సిబ్బంది దూకుడు పెంచారు. ప్రముఖ వాణిజ్య ప్రాంతాల్లో , భారీ వ్యాపాలు జరిగే ప్రాంతాల్లో ఉన్న కాంప్లెక్స్‌లలో భారీ బకాయిల అద్దెలున్న దుకాణాలను సీజ్ చేశారు. ● వీటితోపాటు సికింద్రాబాద్ ఓల్డ్ జైల్ కాంప్లెక్స్, పుత్లిబౌలి తదితర ప్రాంతాల్లోనూ కొన్ని షాపుల్ని సీజ్ చేశారు. వెరసి మొత్తం 223కు పైగా దుకాణాల్ని సీజ్ చేశారు. ● దీంతో దిగివచ్చిన వ్యాపారులు చెల్లించాల్సిన అద్దెల బకాయిల్లో కొంత చెల్లించి, మిగతా త్వరలో చెల్లిస్తామని వేడుకున్నారు. పుత్లిబౌలిలోని రెండు దుకాణాల నుంచే రూ.2.36 లక్షలు వసూలైంది. అలా రెండు రోజుల్లో రూ. 46 లక్షల అద్దెలు వసూలయ్యాయి. సీజ్ చేసిన మిగతా దుకాణాల నుంచీ అద్దెలు రాగలవని అధికారులు ఆశిస్తున్నారు. అలా ప్రస్తుతం సీజ్ చేసిన దుకాణాల నుంచి రూ. కోటికి పైగా వచ్చే అవకాశముందని చెబుతున్నారు. అద్దెలు చెల్లించని దుకాణాల సీజ్ ● చర్యలతో దిగివస్తున్న నిర్వాహకులు ● రెండు రోజుల్లో 223 దుకాణాలకు పైగా సీజ్ ● రూ. కోటికి పైగా ఆదాయం సీజ్ చేసిన దుకాణాలు ఇలా.. ఎక్కడ ఎన్ని కోఠి సబ్వే 67 సుల్తాన్‌బజార్ కాంప్లెక్స్ 53 పటాన్చెరు 56 మంగళ్‌హాట్ మార్కెట్ 24 కుషాయిగూడ 23 -
పూజారికి జీవిత ఖైదు
ప్రియురాలి హత్య కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు శంషాబాద్ రూరల్/రంగారెడ్డి జిల్లా కోర్టులు: తనకు వివాహం జరిగిందనే విషయాన్ని దాచి.. ఆలయానికి వచ్చే మరో మహిళతో ప్రేమాయణం సాగించాడు. ప్రియురాలు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో.. ఆమెను వదిలించుకునేందుకు హత్య చేసిన పూజారికి కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. రెండేళ్ల క్రితం సంచలనం సృష్టించిన ఈ కేసు తీర్పు బుధవారం వెలువడింది. ఇన్స్పెక్టర్ కె.నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని సరూర్‌నగర్‌లో వెంకటేశ్వర కాలనీలో నివసించే పూజారి వెంకట సూర్యసాయి కృష్ణ (36)కు గతంలోనే పెళ్లి జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన కారుగంటి అప్సర (30) తరచూ ఇతను పూజారిగా ఉన్న ఆలయానికి వస్తుండేది. ఆమెతో చనువు పెంచుకున్న సాయి కృష్ణ ప్రేమాయణం సాగించాడు. తనకు వివాహం అయిందనే విషయం దాచిపెట్టి ఆమెతో వివాహేతర సంబంధాన్ని ఏర్పర్చుకున్నాడు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని సాయి కృష్ణపై అప్సర ఒత్తిడి చేయగా.. ఆమెను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. కారులో తీసుకొచ్చి.. కోయంబత్తూరు తీసుకెళ్లాలని అప్సర సాయికృష్ణను కోరగా.. ఇదే అదనుగా భావించి ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్సరను 2023 జూన్ 3న సరూర్‌నగర్ నుంచి రాత్రి తన కారులో శంషాబాద్ తీసుకొచ్చి.. అక్కడే ఓ రెస్టారెంట్లో భోజనం చేశారు. ఆ తర్వాత నర్కూడలోని నవరంగ్ వెంచరులోకి తీసుకెళ్లగా.. అప్సర కారులోనే నిద్రలోకి జారుకుంది. ఈ సమయంలో ఆమె ముఖంౖపై కవర్ కప్పి ఊపిరి ఆడకుండా చేశాడు. స్పృహ కోల్పోయిన అప్సర తలపై రాయితో బాది హత్య చేశాడు. ఈ క్రమంలో అప్సర మిస్సింగ్ కేసు దర్యాప్తులో ఈ దురాఘతం వెలుగు చూసింది. అప్పటి ఇన్స్పెక్టర్ ఎ.శ్రీధర్‌కుమార్ చార్జ్‌షీట్ ఫైల్ చేయగా.. బాధితురాలి తరఫున ఈ కేసును పీపీ రవికుమార్ కోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసులో సాయి కృష్ణను ముద్దాయిగా నిర్ధారించిన రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయమూర్తి వై.జయప్రసాద్ బుధవారం అతడికి జీవిత ఖైదు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన కోర్టు డ్యూటీ ఆఫీసర్ ఏఎస్ఐ రామిరెడ్డి, కానిస్టేబుల్ ఎండీ.ఖాజాపాషాను ఇన్స్పెక్టర్ కె.నరేందర్‌రెడ్డి అభినందించారు. ఈ తీర్పుతో తన కూతురు ఆత్మకు శాంతి కలిగిందని, చివరకు న్యాయమే గెలిచిందని అప్సర తండ్రి శ్రీధర్ శర్మ ఆనందం వ్యక్తంచేశారు. -
పది వేల మందితో మళ్లీ వస్తాం
ఇబ్రహీంపట్నం/యాచారం: పది వేల మంది నిరుపేదలతో మరోసారి రామోజీ ఫిలిం సిటీకి వస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ హెచ్చరించారు. యాజమాన్యం ఆక్రమించిన పేదల ఇళ్ల స్థలాలను వదిలేసే వరకూ పోరాటం కొనసాగిస్తామని స్పష్టంచేశారు. ఫిలింసిటీ వద్ద ఆందోళన నిర్వహించిన సీపీఎం నేతలను అరెస్టు చేసిన పోలీసులు వీరిని ఇబ్రహీంపట్నం, యాచారం పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదలకు మంజూరు చేసిన ఇళ్ల స్థలాల వద్దకు వెళ్తున్న లబ్ధిదారులను పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని..ఆ భూములతో పోలీసులకు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. 2007లో అప్పటి ప్రభుత్వం సుమారు 600 మందికి 20 ఎకరాల్లో 60 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించి సర్టిఫికెట్లు ఇచ్చిందని.. అప్పటి నుంచి ఈ భూములు రామోజీ కబ్జాలోనే ఉన్నాయని ఆరోపించారు. ఈ సమస్యను పరిష్కరించాలని పలుమార్లు రెవెన్యూ అధికారులకు మొర పెట్టుకున్నా ఫలితంలేకపోవడంతో వారి స్థలాల్లోకి లబ్ధిదారులు వెళ్లారన్నారు. పోలీసులు రామోజీ యాజమాన్యానికి తొత్తులుగా మారి పేదలను అడ్డుకుంటున్నారని..రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకోవాల్సిన విషయంలో పోలీసులు తలదూర్చడం తగదన్నారు. రామోజీ కబంధ హస్తాల్లో ఉన్న మరో 300 ఎకరాల ప్రభుత్వ భూమిని సైతం బయటకు తీస్తామని అన్నారు. పేదల భూములు కబ్జా పెట్టిన రామోజీ యాజమాన్యంపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. పేదల పక్షాన పోరాడుతున్న తమపై కేసులు బనాయించడం సరికాదన్నారు. నేడు, రేపు ఆందోళనలు: సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య పోలీసుల అక్రమ అరెస్ట్‌లను నిరసిస్తూ గురు, శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పోలీసుల తోపులాటలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు పి.జగన్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. బుగ్గరాములు, సామేల్, జగదీశ్, జగన్, జంగయ్య, కిషన్, వెంకటేశ్, నర్సిరెడ్డి, ఎల్లేశ్, తులసిగారి నర్సింహ, అరుణ, స్వప్న, ప్రకాశ్‌కారత్, చరణ్, ఆనంద్, శ్రీకాంత్, శివ యాదగిరి, నర్సింహ తదితరులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. పోలీసుల కస్టడీలో ఉన్న వారిని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పి.అంజయ్యపరామర్శించారు. అరెస్టులతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరన్నారు. పేదల భూముల్లో గుడిసెలు వేస్తాం రెవెన్యూ సంబంధిత విషయంలో పోలీసుల జోక్యం తగదు రామోజీ యాజమాన్యంపై కేసులు పెట్టాలి త్వరలో పది వేల మందితోగుడిసెలు వేస్తాం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ -
ఆర్డర్ల పేరుతో అందినంత స్వాహా
సాక్షి, సిటీబ్యూరో: నగర వ్యాపారిని ఫోన్ ద్వారా సంప్రదించి, భారీ ఆర్డర్ల పేరుతో ఎర వేసి, మోసం చేసిన కేసులో ఇద్దరు సైబర్ నేరగాళ్లను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలో పట్టుబడిన వీరిపై దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 17 కేసులు నమోదై ఉన్నట్లు గుర్తించామని డీసీపీ దార కవిత బుధవారం వెల్లడించారు. ఇంటర్నెట్ ద్వారా నగర వ్యాపారి ఫోన్ నెంబర్ సంగ్రహించిన సైబర్ నేరగాళ్లు సంప్రదించారు. ఆయన ఉత్పత్తులకు ఉత్తరాదిలో మార్కెటింగ్ చేస్తామని, భారీ ఆర్డర్లు తెస్తామంటూ నమ్మబలికారు. దీనికోసం తమ వద్ద రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. వీరి మాట నమ్మిన వ్యాపారి రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించారు. ఆపై వ్యాపారి ఉత్పత్తులకు దేశ, విదేశాల్లో భారీ డిమాండ్ ఉన్నట్లు, వారి నుంచి ఆర్డర్లు వస్తున్నట్లు సైబర్ నేరగాళ్లు నకిలీ ఈ–మెయిల్స్ సృష్టించారు. ఇవన్నీ నిజమేనని సదరు వ్యాపారి నమ్మారు. ఆ సరుకు సరఫరాకు ముందు తమకు రూ.9.5 లక్షల చెల్లించాలని చెప్పిన సైబర్ నేరగాళ్లు ఆ మొత్తం తన ఖాతాలో పడిన తర్వాత స్పందించడం మానేశారు. దీంతో మోసపోయినట్లు తెలుసుకున్న బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ కె.ప్రసాద్‌రావు నేతృత్వంలో కానిస్టేబుళ్లు జి.క్రాంతి కుమార్ రెడ్డి, ఎ.సతీష్, ఎస్.శ్రీనివాస్‌రెడ్డి, జె.వెంకటేష్, జి.రాకేష్‌లతో కూడిన బృందం దీన్ని దర్యాప్తు చేసింది. బ్యాంకు ఖాతాలతో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి ముందుకు వెళ్లిన అధికారులు ఢిల్లీలో ఓ డమ్మీ కంపెనీకి సీఈఓగా ఉన్న అమర్నాథ్ సింగ్, మార్కెటింగ్ హెడ్‌గా పని చేస్తున్న రణ్వీర్ సింగ్ బాధ్యులని తేల్చారు. అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం వీరిని అరెస్టు చేసింది. వీరిపై మహారాష్ట్ర, పంజాబ్‌ల్లో రెండేసి, రాజస్థాన్‌లో 5, హర్యానా, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ల్లో ఒక్కోటి చొప్పున కేసులు ఉన్నట్లు గుర్తించారు. నగరవాసికి టోకరా వేసినసైబర్ నేరగాళ్లు ఢిల్లీలో ఇద్దరిని అరెస్టు చేసినసిటీ సైబర్ కాప్స్ -
ఏటీఎంలలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
లింగోజిగూడ: శివారు ప్రాంతాల ఏటీఎంలే లక్ష్యంగా చేసుకోని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.4 లక్షల నగదు, కారు, వివిధ రకాల పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఎల్బీనగర్ సీపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ కమిషనర్ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు. రాజస్తాన్‌లోని డీగ్ జిల్లా సందీక గ్రామానికి చెందిన రాహుల్ అలియాజ్ రాహుల్ ఖాన్, మధ్యప్రదేశ్‌లో జేసీబీ మెకానిక్‌గా పని చేస్తున్న సందీక గ్రామానికి చెందిన జాహుల్ భాదన్ ఖాన్, జల్పల్లి షాజహాన్ కాలనీకి చెందిన ఎండీ సర్ఫారాజ్లు ఓ ముఠాగా ఏర్పడి ఏటీఎంలలో చోరీలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు గత ఫిబ్రవరి 22 నుంచి 26 రావిర్యాల, పహడీషరీఫ్, బాలాపూర్, జల్పల్లి, బీబీనగర్, భువనగిరి, మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతాల్లోని ఏటీఎంల వద్ద రెక్కీ నిర్వహించారు. చివరకు రావిర్యాల, మైలార్‌దేవ్‌పల్లి ఏటీఎంలలో చోరీ చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈమేరకు ఫిబ్రవరి 26న మరికొందరు స్నేహితుల సాయంతో రావిర్యాల ఎస్బీఐ ఏటీంలో రూ.29 లక్షల 69 వేల 900 ఎత్తుకెళ్లారు. అక్కడి నుంచి మైలార్దేవ్ పల్లి, మధుబాన్ కాలనీలో మరో ఎస్బీఐ ఏటీఎంలో చోరికి ప్రయత్నించగా మిషన్‌లో మంటలు రావడంతో అక్కడి నుంచి నాందేడ్ మహారాష్ట్ర మీదుగా పారిపోయారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాహుల్‌ఖాన్, ముస్తాఖీన్ ఖాన్, వహీద్‌ఖాన్, షకీల్ ఖాన్‌లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.4 లక్షల నగదు, కారు, చోరీకి ఉపయోగించిన వస్తువులు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. -
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం
గచ్చిబౌలి: రాష్ట్రంలో కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. బుధవారం గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో సీ్త్రనిధి 12వ సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మొదలైన సీ్త్రనిధి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుందన్నారు. అవకాశాలు ఇస్తే మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తారని, కోటిమంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. కోవిడ్‌లో తల్లిదండ్రులను కోల్పోయిన యువతులను సీ్త్రనిధి సభ్యులుగా చేర్చి ఆదుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అమ్మాయిలు గౌరవంగా ఉండే విధంగా మహిళాఆర్మీ కృషి చేస్తుందని, అందుకు త్వరలోనే మార్యదర్శకాలు రూపొందిస్తామని చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా సీ్త్ర నిధికి భవనం కేటాయిస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. సీ్త్రనిధి బ్యాంక్‌పై సెర్ప్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రవిందర్‌రావు రూపొందించిన పాటను మంత్రి సీతక్క ఆవిష్కరించారు. అనంతరం డివిడెండ్ ఫండ్ చెక్‌ను మహిళా సమాఖ్య సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈఆర్పీ సీఈఓ దివ్య, సీ్త్రనిధి అధ్యక్షురాలు ఇందిర, ఎండీ విద్యాసాగర్‌రెడ్డి, కోశాధికారి సరస్వతి, కొమురంభీం అడిషనల్ కలెక్టర్ దీపక్‌తివారి, వరంగల్ అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, కోఆపరేటివ్ సొసైటీస్ రిజిస్ట్రార్ సురేంద్రమోహన్, మెప్మా మిషన్ డైరెక్టర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
సమాజ పరివర్తనే సంఘ్ ప్రధాన లక్ష్యం
కాచిగూడ: సమాజ పరివర్తనే ప్రధాన లక్ష్యంగా సంఘ్ పనిచేస్తోందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) తెలంగాణ ప్రాంత కార్యదర్శి కాచం రమేష్ అన్నారు. బుధవారం బర్కత్‌పుర కేశవ నిలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ ప్రాంత సంఘ్ చాలక్ బర్ల సురేందర్ రెడ్డితో కలిసి ఆయాన మాట్లాడుతూ బెంగళూర్‌లో ఇటీవల జరిగిన ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రతినిధుల సభలో చేసిన తీర్మానాలు, సంఘ్ శతాబ్ది సంవత్సరం సందర్భంగా తెలంగాణ, దేశ వ్యాప్తంగా చేపట్టనున్న ప్రత్యేక కార్యక్రమాలను వివరించారు. నూరేళ్ళ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా సంఘ్ ఆలోచనలు, భావాలను సమాజం వద్దకు తీసుకెళ్లేలా వచ్చే నవంబర్–డిసెంబర్–జనవరి నెలల్లో దేశంలో ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి వెళ్లడానికి జన సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. సమాజ పరివర్తనకు సంబంధించిన అంశాలను ప్రజలకు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రతి లక్ష మంది ఒక యూనిట్‌గా హిందూ సమాజ ఉత్సవాలు చేస్తామని, ఇందులో స్థానిక నేతలు, హిందూ సంస్థలకు భాగస్వామ్యం కల్పించి హిందుత్వాన్ని, ధర్మాన్ని సమాజంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
రాంగోపాల్‌పేట్: మితిమీరిన వేగంతో వచ్చిన ఓ కారు ఇద్దరు యువకులను బలి తీసుకుంది. బుధవారం ఉదయం మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ పరశురాం కథనం ప్రకారం.. బన్సీలాల్‌పేట్ చాచా నెహ్రూ నగర్‌కు చెందిన ఏడుకొండలు కుమారుడు గంటాడి దేవీ ప్రణయ్ (18), బన్సీలాల్‌పేట్ బీజేఆర్ నగర్‌కు చెందిన ఎర్రా హర్షిత్ (21) స్నేహితులు. వీరిద్దరూ మారేడుపల్లిలోని పెస్టోమెన్ అనే పెస్ట్ కంట్రోల్ సంస్థలో పని చేస్తున్నారు. రాత్రి విధులు ముగించుకున్న వీరు.. తమ యజమాని చెందిన ద్విచక్ర వాహనంపై ప్యారడైజ్ హోటల్‌కు వచ్చి టీ తాగారు. అనంతరం ఉదయం 4.40 గంటలకు జిమ్‌కు వెళ్లేందుకు ఎస్డీ రోడ్డు మీదుగా ప్యాట్నీ వైపు బైక్‌పై వస్తున్నారు. అదే సమయంలో కాప్రాకు చెందిన కొమురయ్య తాజ్‌హోటల్ వైపు వేగంగా కారు నడుపుతూ వచ్చి వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో బైక్ నడుపుతున్న దేవీ ప్రణయ్ తలకు, ఇతర భాగాలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనుక కూర్చున్న హర్షిత్‌కు తీవ్ర గాయాలు కావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మృతి చెందాడు. కారు డ్రైవర్ కొమురయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఫ్లాగ్ డే ఫండ్‌కు ఎస్బీఐ భారీ విరాళం
సాక్షి, సిటీబ్యూరో: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని హైదరాబాద్ సర్కిల్ ఉద్యోగులు తెలంగాణ సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి రూ. 37.16 లక్షలు విరాళంగా అందించి తమ దాతృత్వాన్ని, సామాజిక బాధ్యత పట్ల నిబద్ధతను ప్రదర్శించారు. ఇందులో భాగంగా ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ సాయుధ దళాల పతాక దినోత్సవ నిధి చైర్పర్సన్, తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు రూ. 37,16,500 విలువైన చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో సైనిక్ వెల్ఫేర్ (తెలంగాణ) డైరెక్టర్ కల్నల్ రమేష్ కుమార్, జితేంద్ర కుమార్ శర్మ డీజీఎం, సీఎస్ఓ కెప్టెన్ సంజయ్ అపగే పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఎస్బీఐ సిబ్బంది సామాజిక చొరవను అభినందించారు. నగరానికి నిధుల కేటాయింపు అంతంతే.. – అసెంబ్లీలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరం నుంచి రాష్ట్ర ఖాజానాకు సింహభాగం ఆదాయం వచ్చి చేరుతున్నా..బడ్జెట్లో నిధుల కేటాయింపు మాత్రం మొక్కుబడిగా ఉందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్లో జీహెచ్ఎంసీ, జలమండలికి, ఇతర సంస్థలకు నామమాత్రంగా నిధులు కేటాయించారని గుర్తు చేశారు. వాటర్‌బోర్డుకు కేవలం రూ. 3,383 కోట్ల కేటాయించారని, అందులో 3,083 కోట్ల అప్పుల చెల్లింపు, ఉచిత నీటి రియింబర్స్‌మెంట్ కింద రూ.300 కోట్ల కేటాయించారని గుర్తు చేశారు. అభివృద్ధి పనులుకు ఏ మాత్రం కేటాయించలేదని పేర్కొన్నారు. డ్రైనేజీ వ్యవస్థ మెరుగు కోసం తక్షణమే రూ. 1500 కోట్ల కేటాయించాలన్నారు. జీహెచ్ఎంసీకి నిధులు కేటాయిపు పెంచాలన్నారు. నగర అభివృద్ధికి పెద్దపీట వేయాలన్నారు. విద్యారంగ సమస్యలు తక్షణమే పరిష్కారించాలని, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు మంజూరు చేయాలని రాజశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
పటిష్టంగా మాన్సూన్ యాక్షన్ ప్లాన్
● వేసవిలో అగ్ని ప్రమాదాలు తలెత్తకుండా చర్యలు ● సమన్వయ సమావేశంలో జీహెచ్ఎంసీ, హైడ్రా కమిషనర్లు సాక్షి, సిటీబ్యూరో: రానున్న వర్షాకాలంలో నగరంలో ప్రజల కష్టాలను తొలగించే విధంగా మాన్సూన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఫైర్ సేఫ్టీ, మాన్సూన్ యాక్షన్ ప్లాన్, నాలాల్లో పూడికతీత, నాలాల వద్ద భద్రత ఏర్పాట్లు, చెరువుల పునరుద్ధరణ అంశాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో కలిసి ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. వర్షాకాలంలో ఎదురయ్యే పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నగరంలో గుర్తించిన 141 నీటి నిల్వ ప్రాంతాల వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. భవిష్యత్తులో నీటి నిల్వ ప్రాంతాలు లేకుండా శాశ్వత పరిష్కారం చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో సమస్యలకు ఆస్కారం లేకుండా పూడికతీత పనులు వర్షాకాలం లోపు పూర్తి చేయాలని సూచించారు. ప్రజల భద్రతకు, ట్రాఫిక్ అంతరాయం లేకుండా సంబంధిత విభాగాల అధికారులు సమన్వయంతో సమష్టిగా పని చేయాలని పేర్కొన్నారు. చెరువులపై దృష్టి సారించాలి.. నగరంలోని చెరువుల సంరక్షణ, పునరుద్ధరణలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వర్షాలప్పుడు నీరు పొంగిపొర్లకుండా నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలని లేక్స్ అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల వారిని ఎప్పడికప్పుడు అప్రమత్తం చేయాలని, నాలాల్లో ప్రమాదాలు సంభవించకుండా నాలా ఆడిట్ చర్యలు తీసుకోవాలని, ఆ పనులకు సర్కిల్‌కు ఒక ప్రత్యేక అధికారిని బాధ్యులను చేయాలని ఇలంబర్తి సూచించారు. అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించాలి వేసవిలో అగ్ని ప్రమాదాలు నివారించేందుకు నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలని రంగనాథ్ సూచించారు. నివాస, వాణిజ్య భవన యజమానులు, నిర్వాహకులకు అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలతో అవగాహన కల్పించాలని చెప్పారు. -
రూ.1.30 కోట్ల నగదు పట్టివేత
చాంద్రాయణగుట్ట: ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.1.30 కోట్ల నగదును చాంద్రాయణగుట్ట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ గురునాథ్ తెలిపిన వివరాల ప్రకారం..చాంద్రాయణగుట్ట పూల్‌బాగ్ జంక్షన్ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో అటుగా వచ్చిన కియా కారును నిలిపి తనిఖీ చేయగా మహ్మద్ యూసుఫుద్దీన్, సయ్యద్ అబ్దుల్ హదీల వద్ద రూ.1.30 కోట్ల నగదు లభ్యమయ్యింది. డబ్బుకు సంబంధించిన వివరాలు కోరగా, రియల్ ఎస్టేట్ వ్యాపారులమని, ల్యాండ్ కొన్నామని, అందుకు చెల్లించాల్సి ఉందని వారు పేర్కొన్నారు. సరైన పత్రాలు చూపని కారణంగా ఐటీ అధికారులకు అప్పగించారు. ట్రేడింగ్ ఫ్రాడ్‌లో అకౌంట్ సప్లయర్ అరెస్టు సాక్షి, సిటీబ్యూరో: ట్రేడింగ్ ఫ్రాడ్ చేసే సైబర్ నేరగాళ్లకు అవసరమైన బ్యాంకు ఖాతాలు అందిస్తున్న గుర్గావ్ వాసిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇతడిపై దేశంలో 43 కేసులు, రాష్ట్రంలో ఆరు కేసులు ఉన్నట్లు డీసీపీ దార కవిత మంగళవారం తెలిపారు. రాజస్థాన్‌కు చెందిన హిమాన్షు స్వామి ప్రస్తుతం గుర్గావ్లో నివసిస్తున్నాడు. ఇతడు పవన్ జైన్‌తో కలిసి బ్యాంకు ఖాతాలు సమీకరిస్తూ సైబర్ నేరగాళ్లకు అందిస్తున్నాడు. నగరానికి చెందిన ఓ వ్యక్తికి సోషల్‌మీడియా ద్వారా ఎర వేసిన సైబర్ నేరగాళ్లు ట్రేడింగ్ పేరుతో రూ.20 లక్షలు స్వాహా చేశారు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు హిమాన్షు, పవన్ పాత్రను గుర్తించారు. గుర్గావ్ వెళ్లిన ప్రత్యేక బృందం హిమాన్షును అరెస్టు చేసింది. పరారీలో ఉన్న పవన్ కోసం గాలిస్తోంది. బస్సు కింద పడి మహిళ మృతి బొల్లారం: ఉద్యోగానికి బయలుదేరిన మహిళ యాక్సిడెంట్‌కు గురై మృతిచెందిన ఘటన తిరుమలగిరి పోలీసు స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. తిరుమలగిరి పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. సాఫ్ట్వేర్ ఉద్యోగిని త్రివేణి కుమారి(43) అల్వాల్ ఎంఈఎస్ కాలనీలో నివాసం ఉంటోంది. మంగళవారం ఉదయం ఆఫీసుకు వెళ్లేందుకు లాల్‌బజార్ బస్టాప్‌కు బయలుదేరింది. ఈ క్రమంలో ఆమెను ఓ కారు ఢీకొట్టడడంతో రోడ్డుపై పడిపోయింది. అదే సమయంలో ఈసీఐఎల్ నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్న కంటోన్మెంట్ డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు ఆమె పైనుంచి వెళ్లింది. దీంతో త్రివేణి కుమారి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కారు, బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే తన భార్య మృతి చెందిందని త్రివేణి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ డ్రైవర్ నరేశ్, కారు డ్రైవర్ రమేశ్‌లపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కోయంబత్తూర్‌లో ఘరానా మోసగాడి అరెస్ట్ గచ్చిబౌలి: బంగారం కొనుగోలు పేరిట ఘరానా మోసానికి పాల్పడిన కేటుగాడిని తమిళనాడు పోలీసులు కోయంబత్తూర్‌లో అరెస్ట్ చేశారు. కమిషన్ ఇస్తానని చెప్పి గత శుక్రవారం రఫీ నుంచి 18 వేల డాలర్లు, చంద్రశేఖర్ నుంచి 500 గ్రాముల బంగారం తీసుకొని ఉడాయించాడు. బాధితుల ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా ప్రత్యేక బృందాలు తమిళనాడుకు వెళ్లాయి. ఈ మేరకు నిందితుడు పగులు హసన్‌ను సోమవారం కోయంబత్తూర్‌లో అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి అక్కడి పోలీసులు బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. పీటీ వారెంట్‌పై హసన్‌ను హైదరాబాద్ తీసుకొచ్చేందుకు గచ్చిబౌలి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. తాను ధనవంతుడినని, పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయని ఫైవ్‌స్టార్ హోటల్‌కు వచ్చేవారిని నమ్మిస్తాడు. బంగారం కొనుగోలు, డాలర్ల ఎక్స్చేంజ్ పేరిట మోసాలకు పాల్పడడం అతని నైజం. తెలంగాణ, తమిళనాడు, కర్నాటకలో మోసాలకు పాల్పడినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. బాలికపై లైంగిక దాడి: పోక్సో కేసు నమోదు హిమాయత్‌నగర్: ఇంటర్ చదువుతున్న ఓ బాలికకు మాయ మాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడిన నారాయణగూడ, దత్తానగర్‌కు చెందిన చతుర్వాల రోహిత్ సింగ్(21)ను మంగళవారం నారాయణగూడ పోలీసులు ఆరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే ఓ మైనర్ బాలిక స్థానికంగా ఉన్న కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ఇదే క్రమంలో ప్రైవేట్ ఉద్యోగం చేసున్న రోహిత్ సింగ్‌తో కొన్ని నెలల క్రితం ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ నెల 23న బాలికను ఇంట్లో నుంచి బయటకు పిలిపించిన రోహిత్ సింగ్ ముషీరాబాద్‌లోని ఓ గదికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టాగా నేరాన్ని ఒప్పుకున్నాడు. పోక్సో చట్టం కింద అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. -
వేడి నీటి బకెట్లో పడి నాలుగేళ్ల బాలుడి మృతి
జవహర్‌నగర్: వేడి నీటి బకెట్లో పడిన బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందిన ఘటన జవహర్‌నగర్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సైదయ్య తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్‌నగర్ కార్పొరేషన్ మార్కెట్ లైన్లో కాటి నర్సింహ, సుమలత దంపతులు ఇద్దరు కుమారులతో ఉంటున్నారు. నర్సింహ కూలిపనులు చేస్తుంటాడు. ఇద్దరు పిల్లలను చూసుకునేందుకు సుమలత తల్లి పుల్లమ్మ నర్సింహ ఇంటికి వచ్చింది. ఈ నెల 23న పుల్లమ్మ సమీపంలోని బంధువుల ఇంటికి నర్సింహ, సుమలతల చిన్న కుమారుడు బన్నీ(4)ని తీసుకుని వెళ్లింది. అప్పటికే ఆ ఇంట్లో హీటర్‌తో వేడి చేసిన నీటిని పెట్టి అక్కడే ఉంచారు. ఆ సమయంలో అక్కడే ఆడుకుంటున్న బన్నీ వేడి నీటి బకెట్లో పడిపోవడంతో ఛాతీ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం బాలుడు మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి బన్నీ మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నికలో ఎంఐఎందే గెలుపు?
సాక్షి, సిటీబ్యూరో: త్వరలో జరగనున్న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవల ముగిసిన ఎమ్మెల్సీల ఎన్నికల్లో తమకు సహకరిస్తే హైదరాబాద్ స్ధానాన్ని ఇవ్వనున్నట్లు అధికార కాంగ్రెస్ ఎంఐఎంకు హామీ ఇచ్చినట్లు రాజకీయ ప్రచారం జరిగింది. ఆ లెక్కన కాంగ్రెస్ తమ అభ్యర్థిని పోటీకి దింపదు. ఒకవేళ అలా కాకుండా కాంగ్రెస్ తమ అభ్యర్థిని బరిలో దింపినా ఆ పార్టీకి తగినంత బలం లేదు. ఆ మాటకొస్తే.. ఒక్క ఎంఐఎంకు తప్ప మిగతా పార్టీలు వేటికి కూడా ఈ ఎన్నికల్లో గెలిచేంత బలం లేదు. ఈ ఎన్నికలో ప్రజలు ఎన్నుకున్న హైదరాబాద్ జిల్లా పరిధిలోని కార్పొరేటర్లు, లోక్‌సభ సభ్యులతో పాటు ఇక్కడ ఓటర్ల జాబితాలో పేరుండి జిల్లాను ఆప్షన్‌గా ఎంచుకున్న రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు ఓట్లు వేసేందుకు అర్హత కలిగి ఉంటారని సంబంధిత అధికారులు తెలిపారు. ప్రస్తుతం ముసాయిదా ఓటర్ల జాబితా మేరకు 110 మంది ఓటర్లున్నారు. వారిలో 81 మంది కార్పొరేటర్లు, 15 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు లోక్‌సభ సభ్యులు, నలుగురు రాజ్యసభ సభ్యులు, ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఉన్నట్లు సమాచారం. తుది జాబితా వెలువడేందుకు వచ్చే నెల 10వ తేదీ వరకు గడువున్నట్లు బల్దియా వర్గాల సమాచారం. ఇటీవల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారు జాబితాలో చేరనున్నారు. ఓటర్లు పెరిగే అవకాశముంది. ఎంఐఎంకే మెజార్టీ.. ఏ లెక్కన చూసుకున్నా అత్యధిక ఓటర్ల బలం ఎంఐఎంకే ఉంటుంది. దాదాపు యాభై మంది ఓటర్ల బలం ఆ ఒక్క పార్టీకి మాత్రమే ఉంది. మిగతా ఏ ఒక్క పార్టీకి కూడా అంత బలం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో మిగతా ఏ రెండు పార్టీలూ పొత్తులతో పోటీ చేసే అవకాశాలే లేవని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నిక అనేది పేరుకు మాత్రమేననే అభిప్రాయాలున్నాయి. అసలు పోలింగ్ జరిగేంతదాకా ఈ ప్రక్రియ సాగే అవకాశాలు కూడా లేవు. త్వరలో పదవీకాలం పూర్తికానున్న ఎంఎస్ ప్రభాకర్‌రావు ఎన్నిక సైతం పోటీ లేకుండానే ఏకగ్రీవం కావడం తెలిసిందే. అప్పట్లో బీఆర్ఎస్కు ఎంఐఎం మద్దతునిచ్చింది. ఇప్పుడు ఎంఐఎంకు కాంగ్రెస్ మద్దతునిస్తూ తమ అభ్యర్థిని పోటీకి నిలపదనే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన ప్రభాకర్‌రావు ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉండటం తెలిసిందే. కాంగ్రెస్ మద్దతు ఇచ్చినా.. ఇవ్వకున్నా.. పార్టీల వారీగా ఓట్ల బలాల ప్రకారం.. -
చిట్టీల పుల్లయ్య చిక్కాడు!
సాక్షి, సిటీబ్యూరో: ఆంధ్రప్రదేశ్ నుంచి నగరానికి వలసవచ్చి, కూలీగా జీవితం ప్రారంభించి, చిట్టీల వ్యాపారంలోకి దిగి, అధిక వడ్డీ ఆశ చూపి దాదాపు రూ.100 కోట్ల మేర కాజేసిన పుల్లయ్యను సిటీ సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. గత నెల 21 నుంచి పరారీలో ఉన్న ఇతగాడిని బెంగళూరులో అదుపులోకి తీసుకున్న అధికారులు పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని చందన లక్ష్మింపల్లి గ్రామానికి చెందిన పుల్లయ్య తన స్వగ్రామంలోనూ చిట్టీల వ్యాపారం చేసి పలువురిని మోసం చేశాడు. దాదాపు 18 ఏళ్ల క్రితం నగరానికి వలసవచ్చిన ఇతగాడు బీకే గూడ దాసారం బస్తీలో చిన్న గుడిసె వేసుకుని జీవించాడు. కుమారుడు రామాంజనేయులు తాపీ మేసీ్త్రగా, పుల్లయ్య తాపీ పనిలో కూలీగా పని చేసే వాడు. ఇలా స్థానికులతో పాటు దాసారం బస్తీలో ఉండే రిక్షా కార్మికులతో పరిచయాలు పెంచుకున్నాడు. 15 ఏళ్ల క్రితం చిట్టీల వ్యాపారం ప్రారంభించిన ఇతగాడు బిల్డర్లకు ఫైనాన్స్ కూడా చేశాడు. పశ్చిమ మండలంలోని ఎస్సార్‌నగర్, బల్కంపేట, బీకేగూడ, సనత్‌నగర్ తదితర ప్రాంతాలకు చెందిన దాదాపు 500 మంది ఇతడికి ఖాతాదారులుగా మారారు. రూ.5 లక్షల నుంచి రూ.కోటి వరకు విలువైన చిట్టీలు వేశాడు. ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తూ నమ్మకం సంపాదించుకున్న పుల్లయ్య ఆపై ఆ మొత్తాలు తమ వద్దే ఉంచి, వడ్డీలు తీసుకునేలా చేశాడు. ఇలా దాదాపు రూ.100 కోట్ల వరకు కాజేసిన ఇతగాడు గత నెల 21న కుటుంబంతో సహా పారిపోయాడు. బాధితులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎస్సార్‌నగర్‌లో నమోదైన కేసునూ ఈ విభాగానికే బదిలీ చేశారు. ముమ్మరంగా గాలించిన అధికారులు పుల్లయ్యను బెంగళూరులో పట్టుకున్నారు. ఈ కేసులో అతడి భార్య, కుమారుడు సైతం నిందితులుగా ఉండటంతో వారి కోసం గాలిస్తున్నారు. కాజేసిన సొమ్మును పుల్లయ్య ఎక్కడకు మళ్లించాడు? తదితర వివరాలు ఆరా తీస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో పంచాయతీ కార్యదర్శి మృతి కొత్తూరు: రోడ్డు ప్రమాదంలో ఓ పంచాయతీ కార్యదర్శి మృతి చెందిన సంఘటన మున్సిపల్ పరిధిలోని తిమ్మాపూర్‌లో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని రామంతాపూర్‌కు చెందిన సక్కుబాయి (38), పాండు దంపతులు. సక్కుబాయి మహేశ్వరం మండలం ఎన్డీతండా పంచాయతీ కార్యదర్శిగా, పాండు అంబర్‌పేట్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. మంగళవారం ఇద్దరూ కలిసి సక్కుబాయి అమ్మగారి గ్రామమైన కొందుర్గుకు స్కూటీపై వచ్చారు. గ్రామంలో గతంలో వారు కొనుగోలు చేసిన వ్యవసాయ క్షేత్రంలో చేపడుతున్న పండ్లతోట పనులు చూసి తిరుగుపయనమయ్యారు. మార్గమధ్యలో తిమ్మాపూర్ వద్దకు రాగానే హెచ్‌పీ పెట్రోల్‌బంకు వద్ద ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ట్రాక్టర్ బోల్తా పడింది. అదే సమయంలో లారీ అదుపుతప్పి పక్కనుంచి వెళ్తున్న వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీచక్రాలు బైకుపై నుంచి వెళ్లడంతో సక్కుబాయి అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్ర గాయాలైన పాండును చికిత్స నిమిత్తం శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రమాదం కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. స్కూల్ బస్‌లో మంటలు తుర్కయంజాల్: షార్ట్ సర్క్యూట్‌తో స్కూల్ బస్‌లో మంటలు చెలరేగిన ఘటన సాగర్ రహదారిపై మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. నాదరగ్గుల్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు చెందిన బస్సు (టీజీ08 యూ1796) ఇంజాపూర్‌లో విద్యార్థులను దింపేసి, తిరిగి వెళ్తుండగా గుర్రంగూడ వద్ద డ్రైవర్ సీటు కిందినుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సు దిగి, తోటి వాహనదారుల సహాయంతో మంటలను ఆర్పేసే ప్రయత్నం చేయడంతో పాటు ఫైరిజింన్కు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. ప్రమాదం జరిగిన సమయంలో విద్యార్థులు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో సాగర్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బెంగళూరులో పట్టుకున్న సీసీఎస్ పోలీసులు పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం గాలింపు భర్తకు తీవ్ర గాయాలు విద్యార్థులను దింపేసి వస్తుండగా ఘటన సాగర్ రహదారిపై ట్రాఫిక్ జామ్ -
సారీ
అమ్మా.. నాన్నా.. బెట్టింగులకు దూరంగా ఉండలేకపోతున్నా ● క్రికెట్లో డబ్బులు పోవడంతో మనస్తాపం ● రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య మేడ్చల్ రూరల్: నేను సూసైడ్ చేసు కోవాలని డిసైడయ్యా.. దయచేసి నన్ను డిస్ట్రబ్ చేయకండి.. నేను డబ్బు ల విషయంలో ఆత్మహత్యకు పాల్పడడం లేదు. నా మైండ్ సెట్ కంట్రోల్ కావడం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. అమ్మా.. నాన్నా.. అండ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్.. సారీ.. అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టి సోమేష్‌కుమార్ అనే యువకుడు గౌడవెల్లి గ్రామ పరిధిలో రైలు కిందపడి తనువు చాలించిన ఘటన చోటుచేసుకుంది. మృతుడి కుటుంబీకులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. ఏపీలోని అనకాపల్లి జిల్లా చోడవరం మండలం భోగాపురం గ్రామానికి చెందిన రమణ, కనకమ్మ దంపతులు బతుకుదెరువు కోసం 25 ఏళ్ల క్రితం నగరానికి వలసవచ్చి గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు సోమేశ్కుమా ర్ (29) కొంపల్లి సమీపంలో ఉన్న ఓ కంపెనీ వేర్‌హౌస్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. క్రికెట్ బెట్టింగులకు బానిసైన సోమేశ్ రూ.లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్నాడు. గతంలో కుటుంబీకులు సోదరి వివా హం కోసం దాచిన డబ్బులు సైతం బెట్టింగ్స్‌లో కోల్పోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు కుమారుడిని మందలించారు. బెట్టింగ్ కారణంగా రూ.3.5 లక్షల వరకు అప్పులు చేయడంతో వాటిని తల్లిదండ్రులే చెల్లించారు. దీంతో మళ్లీ బెట్టింగులకు పాల్పడనంటూ చెప్పిన సోమేశ్‌కుమార్ ఇటీవల ఐపీఎల్ క్రికెట్ మొదలవ్వడంతో మళ్లీ బెట్టింగుల వైపు మళ్లాడు. గత సోమవారం రాత్రి జరిగిన లక్నో– ఢిల్లీ మ్యాచ్ సందర్భంగా రూ.లక్ష క్రికెట్ బెట్టింగ్ యాప్‌లో బెట్టింగ్ వేశాడు. దురదృష్టవశాత్తు ఢిల్లీ మ్యాచ్ గెలవడంతో ఒక్క రోజే రాత్రికిరాత్రి రూ.లక్ష పోగొట్టుకున్నాడు. ఆ మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆయిల్ వ్యాపారులే టార్గెట్
సాక్షి, సిటీబ్యూరో: హోల్‌సేల్ ఆయిల్ వ్యాపారులను టార్గెట్‌గా చేసుకుని వరుస మోసాలకు పాల్పడి, ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న ఇద్దరు మోసగాళ్లను సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ఒకరిపై 9 వారెంట్లు, మరొకరిపై నాలుగు వారెంట్లు పెండింగ్‌లో ఉన్నట్లు అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు మంగళవారం వెల్లడించారు. ఓల్డ్ మలక్‌పేట హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన టి.సాయినందకిషోర్ 2006 నుంచి నేరబాట పట్టాడు. తానో రిటైల్ ఆయిల్ వ్యాపారినంటూ హోల్‌సేల్ వ్యాపారుల దగ్గరకు వెళ్తాడు. తొలుత చిన్నచిన్న మొత్తంలో ఖరీదు చేసి పక్కాగా చెల్లింపులు చేస్తాడు. ఆపై ట్యాంకర్లు బుక్ చేసుకుని, వాటిని మార్కెట్లో విక్రయించి, అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 2017లో ఆజంపురకు చెందిన మహ్మద్ అబ్దుల్ రహీం ఇతడితో జట్టుకట్టాడు. వీళ్లిద్దరూ కలిసి ఇదే పంథాలో మోసాలు చేశారు. 25 నేరాలను నందకిషోర్ ఒక్కడే చేయగా.. మరో పది నేరాలు రహీంతో కలిసి చేశాడు. వీరిపై హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, నల్లగొండల్లో కేసులు నమోదై ఉన్నాయి. 2006 నాటి కేసుల్లోనూ నందకిషోర్ కోర్టు వాయిదాలకు హాజరుకాకపోవడంతో 9 వారెంట్లు జారీ అయ్యాయి. రహీంపై మరో నాలుగు వారెంట్లు ఉన్నాయి. పోలీసుల నిఘా తప్పించుకోవడానికి ఏడు మారుపేర్లతో చెలామణి అయిన నంద కిషోర్ ప్రస్తుతం ఘట్కేసర్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో క్యాంటీన్ నిర్వహిస్తున్నాడు. రహీం ర్యాపిడో డ్రైవర్ అవతారం ఎత్తాడు. వీరి కదలికలపై సౌత్–ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ ఎస్.సైదాబాబు నేతృత్వంలో ఎస్సైకు పి.సాయిరాం, షేక్ కవియుద్దీన్, ఎం.మధు వలపన్ని ఇరువురినీ అదుపులోకి తీసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం బంజారాహిల్స్, రామ్‌గోపాల్‌పేట ఠాణాలకు అప్పగించారు. ట్యాంకర్లు బుక్ చేసుకుని భారీ మోసాలు ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ద్వయం చాకచక్యంగా పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ టీమ్ -
నిందితుడి రిమాండ్
న్యాయవాది హత్య కేసులోసంతోష్నగర్: న్యాయవాదిని హత్య చేసిన కేసులో నిందితుడిని ఐఎస్ సదన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. చంపాపేట్ ఈస్ట్ మారుతీనగర్‌కు చెందిన ఎర్రబాపు ఇజ్రాయిల్ (56)కు సంతోష్‌నగర్‌లోని శ్రీనివాస అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లాట్ ఉంది. ఇజ్రాయిల్ శ్రీనివాస అపార్ట్మెంట్లో ఎలాంటి ఎలక్ట్రికల్ పని ఉన్నా తూర్పు మారుతీనగర్ శ్మశాన వాటిక గదిలో ఉండే గులాం దస్తగిరీ (49)ని పిలిపించి చేయించేవాడు. కాగా.. శ్రీనివాస అపార్ట్మెంట్లో ఓ వ్యక్తి, ఆయన భార్య వాచ్మెన్లుగా పని చేస్తున్నారు. దీంతో దస్తగిరీ అపార్ట్‌మెంట్‌కు రాకపోకలు సాగిస్తున్న సమయంలో సదరు మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకున్న న్యాయవాది ఇజ్రాయిల్ వాచ్మెన్ దంపతులను వారి స్వగ్రామానికి పంపించాడు. అనంతరం దస్తగిరీ తరచూ న్యాయవాది ఇజ్రాయిల్ వద్దకు వచ్చి వాచ్‌మెన్‌ను హత్య చేస్తే తనకు బెయిల్ ఇప్పించాలని కోరేవాడు. దంపతులను తిరిగి పిలిపించి తమను కలపాలని దస్తగిరీ సూచించగా.. దానికి న్యాయవాది ఇజ్రాయిల్ నిరాకరించారు. దీంతో ఇజ్రాయిల్‌పై కక్ష పెంచుకున్న దస్తగిరీ ఆయన కదలికలను కొన్ని రోజులుగా గమనించడం ప్రారంభించాడు. ఇందులో భాగంగా ఈ నెల 24 ఉదయం 8.50 గంటల సమయంలో న్యాయవాది ఇజ్రాయిల్ మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లి తిరిగి తన యాక్టివాపై తిరిగి ఇంటి వస్తున్నాడు. న్యూ మారుతీనగర్ కాలనీలో కాపు కాసి వేచి ఉన్న దస్తగిరీ.. ఇజ్రాయిల్‌పై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో తీవ్ర గాయాలకు గురైన ఇజ్రాయిల్‌ను స్థానికులు, కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారుడ. దీనిపై న్యాయవాది ఇజ్రాయిల్ కూతురు ద్రాక్షవల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం నిందితుడు గులాం దస్తగిరీని అరెస్ట్ చేసి, అతని నుంచి కత్తి, సెల్‌ఫోన్, హోండా యాక్టివా ద్విచక్ర వాహనం, హెల్మెట్, కంటి అద్దాలు, చెప్పులను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. -
నీటి బకెట్లో పడి 13 రోజుల పసికందు మృతి
అనుమానాస్పద రీతిలో ఘటన మైలార్‌దేవ్‌పల్లి: పదమూడు రోజుల పసికందు నీటి బకెట్లో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన విజ్జి, ముదలి మణి దంపతులు ఐదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం బండ్లగూడ ప్రాంతానికి వచ్చారు. అలీనగర్ కాలనీలోని జయ అండ్ కో బిస్కెట్ కంపెనీలో పని చేస్తూ వర్కర్స్ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. ముదలి మణి 13 రోజుల క్రితం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మంగళవారం ఉదయం భర్త పనికి వెళ్లాడు. ముదలి మణి బిడ్డను మంచంపై పడుకోబెట్టి బాత్రూంలోకి వెళ్లింది. కొద్ది సేపటి తర్వాత వచ్చి చూసేసరికి పాప కనిపించలేదు. దీంతో ఆందోళనకు గురై చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికింది. అనంతరం నీటి బకెట్లో పాప పడి ఉన్నట్లు గమనించింది. వెంటనే స్థానికుల సహాయంతో పసికందును ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. 13 రోజుల పసికందు బకెట్లో పడే అవకాశం లేదంటూ ఈ ఘటనపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
దక్షిణాది రాష్ట్రాలకు నిధుల కేటాయింపులు పెరగాలి
బంజారాహిల్స్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఆర్థిక శాస్త్ర విభాగం, తెలంగాణ రాష్ట్ర ఉన్నత మండలి, ఐసీఎస్ఎస్ఆర్–దక్షిణ భారతదేశ ప్రాంతీయ కేంద్రం ఆధ్వర్యంలో ‘భారతదేశంలో ఆర్ధిక సమాఖ్యవాదం: వికేంద్రీకరణ, అభివృద్ధి, ఆర్ధిక గతిశీలత’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు మంగళవారం ప్రారంభమైంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (న్యూఢిల్లీ) విశిష్ట అధ్యాపకులు పినాకి చక్రవర్తి ముఖ్యఅతిథిగా హాజరై సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 16వ ఆర్థిక సంఘం కోవిడ్ తర్వాత వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఆర్థిక అభివృద్ధి, నిర్వహణపై దృష్టి సారించిందన్నారు. రాష్ట్రాలు ఆర్థిక స్వయం ప్రతిపత్తి పొందడానికి పన్ను వికేంద్రీకరణను 42 శాతానికి ఆర్థిక కమిషన్ పెంచిందని వెల్లడించారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, అంబేడ్కర్ వర్సిటీ ఉపకులపతి ఘంటా చక్రపాణి మాట్లాడుతూ సామాజిక ధర్మంలో భాగంగా సమాజంలోని అన్ని వర్గాలకు అంబేడ్కర్ విశ్వవిద్యాలయం సేవలు అందిస్తుందన్నారు. గత దశాబ్ద కాలంగా కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు జరగాల్సిన స్థాయిలో చేయకున్నా దక్షిణ భారతదేశం అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. ఉత్తర–దక్షిణ ప్రాంతాలకు నిధుల కేటాయింపులపై సమగ్ర చర్చ జరగాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సభ్యులు అరవింద్ వారియర్, విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ పుష్పా చక్రపాణి, సామాజిక శాస్త్రాల విభాగ డీన్ వడ్డాణం శ్రీనివాస్, కృస్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జాతీయ సదస్సులో నిపుణులు -
దైవ ఉద్యమానికి సహకరించండి
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును కోరిన రంగరాజన్ మొయినాబాద్: దైవానికి రాజ్యాంగ బద్ధమైన అధికారాల కోసం చిలుకూరు బాలాజీ ఆలయం నుంచి జరుగుతున్న ఉద్యమానికి సహకరించాలని అర్చకుడు రంగరాజన్.. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును కోరారు. ఈ మేరకు బుధవారం నగరంలోని వెంకయ్యనాయుడు నివాసంలో ఆయనను కలిసి విన్నవించారు. అనంతరం స్వామివారి శేషవస్త్రం అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు. దేశంలో రామరాజ్య పునఃస్థాపన రాజ్యాంగబద్ధంగా జరగాలని.. సుప్రీం కోర్టుకు తన పరిధి గురించి తెలిపేవిధంగా పిటిషన్స్ కమిటీ రఘురామకృష్ణకు సమర్పించిన లేఖ గురించి వెంకయ్యనాయుడుకు వివరించారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారని రంగరాజన్ తెలిపారు. -
ప్లాట్‌ఫాంపైనే ప్రసవం
అండగా నిలిచిన ఆర్పీఎఫ్ మహిళా పోలీసులు సికింద్రాబాద్: ప్లాట్‌ఫాంపై ప్రసవ వేదనకు గురవుతున్న ఓ మహిళకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు అండగా నిలిచారు. అంబులెన్స్‌ను రప్పించారు. అప్పటికే సమయం మించిపోవడంతో మహిళా కానిస్టేబుళ్ల సహాయంతో అవసరమైన ఏర్పాట్లు చేయించి సదరు మహిళ సుఖ ప్రసవం వరకు అండగా నిలిచి తమ ఉదారత్వాన్ని చాటుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. దుండిగల్‌లో నివాసం ఉంటున్న ఒడిశాకు చెందిన ఇటుక బట్టీ కార్మికురాలు తబ్బా మహ్జీ (21) నిండు గర్భిణి. భర్తతో కలిసి జనరల్ టికెట్‌తో విశాఖపట్నం వెళ్లేందుకు మంగళవారం రాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చింది. ఆరో నంబర్ ప్లాట్‌ఫాంపై ఆగి ఉన్న విశాఖపట్నం రైలు ఎక్కేందుకు సమాయత్తమవుతున్న సమయంలో మహ్‌జీకి పురిటి నొప్పులు వచ్చాయి. ప్రసవ వేదనకు గురవుతున్న సదరు మహిళ పరిస్థితిని అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ ఎస్ఐ మహేక్ గుర్తించారు. సమీపంలో బందోబస్తు విధుల్లో ఉన్న ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లను రప్పించి మహ్‌జీకి అండగా ఉంచి అంబులెన్స్‌ను రప్పించారు. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడంతో రైల్వేస్టేషన్‌కు చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది మహ్‌జీకి ప్రసవం చేశారు. తబ్బా మహ్జీ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. మెరుగైన వైద్యం కోసం తల్లీబిడ్డలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
15 రోజులు.. 4 చోరీలు
లాలాపేట: బీఫార్మసీ పూర్తి చేసినా..జల్సాల కోసం చోరీలకు తెగబడుతున్న కరడుగట్టిన దొంగ శంకర్‌నాయక్‌ను మరోసారి పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఓయూ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అతన్ని మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. అనంతరం ఈస్ట్‌జోన్ డీసీపీ బాలస్వామి తదితరులు మాట్లాడుతూ శంకర్ నాయక్ దొంగతనాల చిట్టా విప్పారు. ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీలపై అందిన పలువురి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టగా విశ్వసనీయ సమాచారంతో శంకర్ నాయక్‌తో పాటు మరో దొంగను ఎల్బీనగర్లో అరెస్ట్ చేసి రూ.9 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే వందకు పైగా దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి..ఈ మధ్యనే బెయిల్‌పై బయటకు వచ్చిన శంకర్‌నాయక్..15 రోజుల వ్యవధిలోనే 4 చోరీలకు పాల్పడిన్నట్లు పోలీసులు వివరించారు. ఓయూ పీఎస్‌తో పాటు పటాన్చెరు, మియాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇళ్ల తాళాలు పగులకొట్టి చోరీలు చేసినట్లు విచారణలో తేలిందన్నారు. శంకర్‌నాయక్ నుంచి 11 తులాల బంగారు ఆభరణాలతో పాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. దొంగిలించిన వస్తువుల వివరాలను పేపర్‌పై రాసి గోడకు అతికించడంతో పాటు..ఏ ఇంట్లో ఎలా..ఏమేం చోరీ చేశాడో కూడా శంకర్ నాయక్ తన డైరీలో రాసుకుంటాడని పోలీసులు వివరించారు. కరడుగట్టిన దొంగ శంకర్‌నాయక్ అరెస్టు ఇప్పటికే వందకుపైగా దొంగతనాలు.. పలుమార్లు జైలుకు సైతం.. -
మంచినీటి ట్యాంకర్లకు మహా డిమాండ్!
సాక్షి, సిటీబ్యూరో: నలు దిశలా విస్తరిస్తున్న హైదరాబాద్ మహనగర పరిధిలో వాటర్ ట్యాంకర్లకు యేటా డిమాండ్ పెరుగుతోంది. గత ఐదేళ్లలో ట్యాంకర్ల బుకింగ్ తీరును పరిశీలిస్తే సుమారు 50 శాతం పైగా పెరిగినట్లు జలమండలి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కొత్తగా ఏర్పాటవుతున్న బహుళ అంతస్తుల భవనాలతో విచ్చలవిడిగా..అత్యంత లోతుగా బోర్ల తవ్వకాలు జరిగి భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. వేసవి వచ్చిందంటే నీటి వినియోగం మరింత పెరిగి ట్యాంకర్లకు డిమాండ్ రెట్టింపు అవుతోంది. మొత్తం మీద సుమారు 42 వేల బహుళ అంతస్తుల భవన సముదాయాల నుంచి అత్యధికంగా వాటర్ ట్యాంకర్ల బుకింగ్ జరుగుతున్నట్లు ఇటీవల జలమండలి గుర్తించింది. హఫీజ్‌పేట, శేరిలింగంపల్లి, ఎస్ఆర్నగర్, కూకట్పల్లి, మణికొండ, నిజాంపేట్ డివిజన్ పరిధిలోని పలు సెక్షన్ల పరిధిలో సుమారు 500 నుంచి 10 వేలవరకు ట్యాంకర్ల బుకింగ్ జరుగుతున్నట్లు సమాచారం. గత ఐదేళ్లలో ఇలా.. మహానగర పరిధిలో వాటర్ ట్యాంకర్ల డిమాండ్ పరిశీలిస్తే..జనవరి నుంచి జూన్న రెండో వారం వరకు ట్యాంకర్లకు తాకిడి అధికంగానే ఉంటుంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రతి యేటా ట్యాంకర్ల డిమాండ్ కనీసం 10 నుంచి 15 శాతం పెరుగుతూ వస్తోంది. గత ఐదేళ్లలో డిమాండ్ పరిశీలిస్తే ఈ ఏడాది జనవరి నుంచే తాకిడి పెరిగింది. గతేడాదితో పోల్చితే అదనంగా సుమారు 46 శాతం ఎగబాకింది. అదేవిదంగా ఫిబ్రవరి నెలలో సైతం అదే విధంగా నమోదైంది. సాధారణంగా మార్చి నెలలో ట్యాంకర్లకు డిమాండ్ కనీసం 30 నుంచి 50 శాతం వరకు అదనంగా ఉంటుంది. అయితే ఈ సారి మార్చి నుంచి మూడు నెలల పాటు ఉష్ణోగ్రత అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ట్యాంకర్లకు డిమాండ్ కూడా ఈసారి అదనంగా 60 నుంచి70 శాతం ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా ట్యాంకర్లు, ఫిల్లింగ్స్టేషన్లు, ఫిల్లింగ్ పాయింట్లను పెంచి నీటిని సరఫరా చేసేవిధంగా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టారు. ● మాదాపూర్ ఫిల్లింగ్ స్టేషనన్‌లో ఆరు ఫిల్లింగ్ పాయింట్స్, 80 ట్యాంకర్లు ఉన్నాయి. రోజుకి 600 ట్రిప్పులు డెలివరీ జరుగుతోంది. 80 శాతం బుకింగ్స్‌ను 6 నుంచి 12 గంటల్లో డెలివరీ చేస్తుండగా..మిగిలిన 20 శాతం 24 గంటల్లో డెలివరీ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో 1200 బుకింగ్స్ వచ్చినా డెలివరీ చేసే సామర్థ్యం ఉందని జలమండలి అధికారులు పేర్కొంటున్నారు. ● బంజారాహిల్స్ ఫిల్లింగ్ స్టేషన్లో 8 ఫిల్లింగ్ పాయింట్స్, 44 ట్యాంకర్లు ఉండగా.. రోజుకి 300 ట్రిప్పులు డెలివరీ చేస్తున్నారు. ఎర్రగడ్డ ఫిల్లింగ్ స్టేషన్‌న్‌లో 4 ఫిల్లింగ్ పాయింట్స్, 29 ట్యాంకర్లు ఉండగా రోజుకి 150 ట్రిప్పులు డెలివరీ చేస్తున్నారు. -
బైకులు దొంగిలిస్తున్న మైనర్ అరెస్ట్
చార్మినార్: గుట్టు చప్పుడు కాకుండా ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న మైనర్ నిందితున్ని అరెస్టు చేసి జువైనల్ హోంకు తరలించినట్లు చార్మినార్ ఏసీపీ చంద్రశేఖర్, హుస్సేనీ ఆలం ఇన్స్పెక్టర్ సురేందర్ తెలిపారు. నిందితుని వద్ద నుంచి ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. పరారీలో ఉన్న మరో మైనర్ నిందితుని కోసం వెతుకుతున్నామన్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలోని పంచమహల్లాలో నివాసముంటున్న మహమ్మద్ ఎజాజ్ ఈ నెల 5వ తేదీన రంజాన్ ప్రార్థనలు ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చి తన ద్విచక్ర వాహనాన్ని ఇంటి ముందు పార్క్ చేశాడు. అర్ధరాత్రి ఒంటి గంటకు పరిశీలించగా పార్క్ చేసిన ద్విచక్ర వాహనం కనిపించలేదు. వెంటనే పరిసర వీధుల్లో వెతికినా.. ప్రయోజనం కనిపించకపోవడంతో.. ఈ నెల 6న హుస్సేనీ ఆలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా ఈ నెల 11న దొంగిలించిన వాహనంపై అనుమానాస్పదంగా వెళ్తున్న ఓ మైనర్ హుస్సేనీ ఆలం పోలీసులకు చిక్కాడు. వెంటనే విచారణ కొనసాగించిన పోలీసులకు ద్విచక్ర వాహనాల దొంగతనాలు వెలుగు చూశాయి. తన స్నేహితుడైన మైనర్ నిందితునితో కలిసి వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఐదు ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. దీంతో హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి, చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, మీర్‌పేట పరిధిలో ఒకటి, మొగల్పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి.. చొప్పున 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని మైనర్‌ను జ్యువైనల్ హోంకు తరలించారు. వీటి విలువ దాదాపు రూ.2.30 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. 5 ద్విచక్ర వాహనాలు స్వాధీనం -
‘ఈఎన్టీ’లో సిబ్బంది కొరతను పరిష్కరించాలి
సుల్తాన్‌బజార్: కోఠి ఈఎన్టీ ఆసుపత్రిలో ఫార్మసిస్ట్, రేడియోగ్రాఫర్ల కొరత ఉందని, ఈ సమస్యను పరిష్కరించేవిధంగా కృషి చేయాలని టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేనికి ఈఎన్టీ టీఎన్జీఓస్ యూనియన్ అధ్యక్షుడు తూంకుంట రాజు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈఎన్టీ ఆసుపత్రిలో ఫార్మసిస్ట్, రేడియోగ్రాఫర్ల ఉద్యోగుల కొరత ఉన్నందున రోజు 1,500 నుంచి రెండు వేలమంది రోగులకు మందులు అందించడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని పేర్కొన్నారు. తద్వారా మెడికల్ స్టోర్స్, సబ్స్టోర్స్ నిర్వహించడంలో సిబ్బందికి పనిభారం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలకు కావాల్సిన మిషనరీలను నిర్వహించేందుకు సైతం ఇబ్బందులకు గురికావాల్సి వస్తోందన్నారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని మారం జగదీశ్వర్, ముజీబ్ హుస్సేనిలు హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి భాస్కర్, కోశాధికారి రవి, సునీల్, సురేందర్ రెడ్డి, అర్షద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
7 సబ్జెక్టుల్లో హెచ్‌సీయూ అదుర్స్
రాయదుర్గం: ప్రపంచంలోనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) అత్యుత్తమ వర్సిటీగా గుర్తింపు దక్కించుకుంది. లండన్‌కు చెందిన క్వాక్వరెల్లి సైమండ్స్ (క్యూఎస్) సంస్థ బుధవారం వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్– 2025ను విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 100 ప్రాంతాల్లో కొనసాగుతున్న 1,700 కంటే ఎక్కువ విశ్వవిద్యాలయాలలో పని తీరు ఆధారంగా సర్వే చేసి ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. 2025 సంవత్సరానికి గాను మన హెచ్‌సీయూ ఏడు సబ్జెక్టుల్లో మంచి ర్యాంకింగ్ సాధించినట్లు అందులో పేర్కొంది. సబ్జెక్టుల వారీగా.. ఇంగ్లిష్ లాంగ్వేజ్– లిటరేచర్‌లో 251– 300 ర్యాంకింగ్, లింగ్విస్టిక్స్‌లో 301–350, సోషియోలజీలో 310–375, కెమిస్ట్రీలో 451–500, ఎకనామిక్స్ అండ్ ఎకనామెట్రిక్స్లో 501–550, ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమీలో 601–675, బయాలాజికల్ సైన్సెస్‌లో 651–700 ర్యాంకింగ్‌లను హెచ్‌సీయూ సాధించింది. ఈ సందర్భంగా మరింతగా శ్రమించి హెచ్‌సీయూ ఉనికిని విస్తరిస్తామని వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ బీజేరావు స్పష్టం చేశారు. భవిష్యత్తులో అన్ని సబ్జెక్టులలో మెరుగైన ప్రతిభ చాటేందుకు కృషి చేస్తామన్నారు. -
నకిలీ కస్టమర్ కేర్ నంబర్‌తో మోసం
సాక్షి, సిటీబ్యూరో: గూగుల్‌లో కనిపించిన నకిలీ కస్టమర్ కేర్ నంబర్‌ను నమ్మి నష్టపోయిన ఉదంతం ఇది. సంస్థ ప్రతినిధులుగా మాట్లాడిన అవతలి వాళ్లు ఏపీకే ఫైల్ పంపి రూ.1.9 లక్షలు కాజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నగరానికి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి.. ఎండల తీవ్రత పెరగటంతో తన ఏసీకి మరమ్మతులు చేయించాలని భావించారు. దీంతో ఓ కంపెనీ కస్టమర్ కేర్ నంబర్ కోసం ఆన్లైన్లో సెర్చ్ చేశారు. అందులో లభించిన ఓ నకిలీ నంబర్‌ను అసలైనదిగా భావించి ఫోన్ చేశారు. దీంతో ఆ కాల్ నంబర్ పొందుపరిచిన సైబర్ నేరగాళ్లకు చేరింది. ఆయనతో సంప్రదింపులు జరిపిన కేటుగాళ్లు.. మరమ్మతు కోసం ఎగ్జిక్యూటివ్‌ను పంపుతామని అంగీకరించారు. దానికోసం కొన్ని వివరాలు పొందుపరచాలంటూ లింకు పంపారు. ఆ లింకులో సైబర్ నేరగాడు ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్ (ఏపీకే) ఫైల్ నిక్షిప్తం చేశారు. బాధితుడు పొరపాటున లింక్ క్లిక్ చేశాడు. అందులో వ్యక్తిగత వివరాలు పొందుపరిచి, రూ.10 చెల్లించాలని ఉండటంతో అనుమానం వచ్చి ఆ పని చేయలేదు. అయితే.. ఏపీకే ఫైల్స్‌లో నిక్షిప్తం చేసిన మాల్వేర్ అప్పటికే ఆయన ఫోన్లో నిక్షిప్తమైంది. అది ఇన్‌స్టల్ కావడంతోనే ఆ ఫోన్ మొత్తం నేరగాళ్ల అధీనంలోకి వెళ్లింది. ఇలా ఫోన్ ద్వారా జరిగే లావాదేవీలతో పాటు వచ్చే ఎస్సెమ్మెస్‌లు సైతం యాక్సెస్ చేయగలిగిన సైబర్ నేరగాళ్లు బాధితుడి నెట్ బ్యాంకింగ్ నుంచి ఆర్థిక లావాదేవీలు చేస్తూ, ఓటీపీలను వినియోగించి రూ.1.9 లక్షలు కాజేశారు. మరుసటి రోజు తన సెంట్రల్ బ్యాంక్ ఖాతాను పరిశీలించిన బాధితుడికి ఈ విషయం తెలిసింది. దీంతో సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఏపీకే ఫైల్స్‌ను సైబర్ నేరగాళ్లు లింకులు, సందేశాలు సహా వివిధ రూపాల్లో పంపిస్తారని, వీటిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. ఏదైనా సందేశం, లింకు వచ్చినప్పుడు క్షుణ్ణంగా పరిశీలించాలని దాని చివరలో.. ఏపీకే అనే అక్షరాలతో ఉన్న ఫైల్ కనిపిస్తే ఇన్‌స్టల్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వెంటనే డిలీట్ చేయాలని సూచిస్తున్నారు. కస్టమర్ కేర్ నంబర్ల కోసం ఆయా కంపెనీల అధికారిక వెబ్సైట్ల పైనే ఆధారపడాలని, గూగుల్‌లో కనిపించే అన్ని నంబర్లను గుడ్డిగా నమ్మవద్దని సూచిస్తున్నారు. ఏపీకే ఫైల్ పంపి రూ.1.9 లక్షలు స్వాహా -
ఓయూలో ఉమెన్స్ డే వేడుకలు
పాల్గొన్న మంత్రి సీతక్క ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ ఆర్ట్స్ కాలేజీలో బుధవారం జరిగిన మహిళా దినోత్సవంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కాలేజీలో ప్రమోటింగ్ ఉమెన్ రైట్స్, జెండర్ ఈక్వాలిటీ, ఫాస్టరింగ్ ఎంపవర్మెంట్ అనే అంశంపై సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి ప్రిన్సిపాల్ ప్రొ.కాశీం అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క మాట్లాడారు. అనంతరం సావనీర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్య మండలి సెక్రటరీ ప్రొ.శ్రీరామ్ వెంకటేష్, వీసీ ప్రొ.కుమార్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీ కుముదిని, ఐసీఎస్ఎస్ఆర్ డైరెక్టర్ ప్రొ.సుధాకర్ రెడ్డి, యూజీసీ డీన్ ప్రొ.లావణ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు. కాగా.. ఓయూ ఆర్ట్స్ కాలేజీ కార్యక్రమానికి హాజరైన మంత్రి సీతక్కకు జార్జిరెడ్డి పీడీఎస్‌యూ, ఎస్ఎఫ్ఐ, ఇతర విద్యార్థి సంఘాల నాయకులు వర్సిటీ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాలు సమర్పించారు. -
వడివడిగా అడుగులు.. కొంగర కుర్దులో ఏఐ సిటీ
సాక్షి, హైదరాబాద్: ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఫ్యూచర్‌సిటీ అభివృద్ధి సంస్థ (ఎఫ్‌సీడీఏ)ను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ ప్రాంతంలో కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు భూ సేకరణ ప్రక్రియ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా 625 ఎకరాలను సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. వేర్వేరు చోట్ల గుర్తించిన భూముల్లో ఒకచోట ఏఐ సిటీని ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. మరోచోట ఇతర ఐటీ కంపెనీల హబ్‌గా తీర్చేదిద్దేలా ప్రతిపాదనలు తయారు చేసింది. ఫ్యూచర్ సిటీ కోసం ప్రత్యేక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్న పట్టణాభివృద్ధి సంస్థ.. ఫార్మా, ఐటీ, లైఫ్ సైన్సెస్, స్పోర్ట్స్ హబ్‌లకు స్థలాలను నిర్దేశించింది. ఇటీవల నాగిరెడ్డిపల్లిలో భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం తాజాగా మహేశ్వరం, కందుకూరు మండలాల్లోనూ మరికొంత భూమిని సమీకరిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే గ్రీన్‌ఫీల్డ్ రహదారికి శరవేగంగా భూ సేకరణ జరుపుతున్న సర్కారు.. ప్రస్తుతం నయా నగరిలో ప్రాజెక్టుల స్థాపనకు అవసరమైన భూ సేకరణ చేపడుతోంది. ఫ్యూచర్ సిటీలో భూ లభ్యతపై క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తున్న రెవెన్యూ యంత్రాంగం.. అసైన్డ్ భూముల వివరాలను సేకరిస్తోంది.ఐటీ, పారిశ్రామిక పార్కుల కోసం..మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామ పరిధిలోని కొంగరకుర్దు సర్వే నంబర్ 289లోని 94 మంది రైతుల నుంచి 275.12 ఎకరాలు సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ భూముల్లో ఐటీ, ఇండస్ట్రీయల్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు అందులో పేర్కొంది. అయితే.. ప్రతిపాదిత భూములను ఏఐ సిటీకి కేటాయించనున్నట్లు తెలిసింది. 200 ఎకరాల విస్తీర్ణంలో ఈ సిటీని అభివృద్ధి చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతిపాదిత రతన్ టాటా గ్రీన్‌ఫీల్డ్ రహదారికి సమీపంలో ఉన్న అసైన్డ్ భూములను సేకరించి.. ఏఐ సిటీ కోసం కేటాయించనున్నట్లు తెలుస్తోంది. అలాగే.. కందుకూరు మండలం తిమ్మాయిపల్లి సర్వే నంబర్ 9లోని 439 మంది రైతుల నుంచి 350.22 ఎకరాల భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. భూములు కోల్పోయిన రైతులకు తగిన పరిహారం కూడా చెల్లించనున్నట్లు పేర్కొంది.రోడ్డుకు ఇరువైపులా హద్దురాళ్లు..మీర్ఖాన్పేట వద్ద యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీకి శంకుస్థాపన చేసిన ప్రభుత్వం.. భవన నిర్మాణ పనులను మేఘా సంస్థకు అప్పగించింది. పనులు కూడా చకచకా సాగుతున్నాయి. మరో వైపు ఓఆర్ఆర్ ఎగ్టిట్ 13 నుంచి మీర్ఖాన్ పేట మీదుగా ఆర్ఆర్ఆర్ వరకు 300 ఫీట్ల గ్రీన్ఫిల్డ్ రోడ్డు నిర్మాణానికి భూ సేకరణ చేపట్టింది. దారి పొడవునా.. రోడ్డుకు ఇరువైపులా హద్దురాళ్లను కూడా పాతే పనిలో నిమగ్నమైంది. మొదటి దశలో రావిరాల నుంచి మీర్ఖాన్పేట వరకు 19.2 కిలోమీటర్లకు రూ.1,665 కోట్లు మంజూరు చేసింది. అదేవిధంగా మీర్ఖాన్ే టు నుంచి ఆర్ఆర్ఆర్ వరకు 22.30 కిలోమీటర్లకు రూ.2365 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. ఆ మేరకు టెక్నికల్ బిడ్లను ఆహ్వానించింది. -
గూగుల్‌ను వాడి.. గుడులలో దోపిడీ!
అబ్దుల్లాపూర్‌మెట్: చోరీలు పాల్పడేందుకు సాంకేతికతను ఎంచుకున్నారీ దుండగులు. గ్రామ శివారుల్లో ఉండే దేవాలయాలనే లక్ష్యంగా చేసుకున్నారు. గూగుల్మ్యాప్లో అప్లోడ్ చేసే దేవతామూర్తులకు అలంకరించిన బంగారు, వెండి ఆభరణాలను అపహరించేందుకు పక్కా ప్రణాళికతో తెగబడ్డారు. నగర శివారులోని ఘట్కేసర్, దుండిగల్, బీబీనగర్, ఇబ్రహీంపట్నం, జవహర్‌నగర్ పోలీస్స్టేషన్ల పరిధుల్లోని దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు దుండగులు ఎట్టకేలకు వాహన తనిఖీ చేపడుతున్న అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులకు చిక్కారు. సీఐ అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో మంగళవారం తెల్లవారుజామున వాహన తనిఖీ చేపడుతున్న పోలీసులకు ఓ ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తుల తీరు అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో వారిని అదుపులోకి తీసుకుని బ్యాగును తనిఖీ చేయగా అందులో బిస్కెట్ల రూపంలో ఉన్న 20 కిలోల వెండి కనిపించింది. దుండగులిద్దరినీ స్టేషన్‌కు తీసుకుని విచారించగా మేడ్చల్‌లోని పోలీస్ క్వార్టర్స్ వెనకాల నివసించే మహ్మద్ ఇంతియాజ్ షరీఫ్, మెదక్ జిల్లా శివ్వంపేట మండలం నవాబ్‌పేట గ్రామానికి చెందిన రంగా వేణులుగా గుర్తించారు. ఇద్దరు వ్యసనాలు, జల్సాలకు అలవాటు పడి ఎలాగైనా అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దేవాలయల్లో దొంగతనాలకు పాల్పడాలని నిర్ణయించుకున్నారు. అందుకు గూగుల్‌మ్యాప్‌ను వినియోగించుకున్నారు.విజయవాడలో విక్రయించినివాస గృహాలకు దూరంగా, గ్రామ శివారుల్లో ఉండే ఆలయాలను టార్గెట్‌గా చేసుకుని చోరీలకు పాల్పడుతూ బంగారు, వెండి ఆభరణాలను అపహరించుకు పోయారు. వాటిని కరిగించి బిస్కెట్ల రూపంలో విజయవాడలో విక్రయించి సొమ్ము చేసుకుంటూ జల్సాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఇటీవల మండలంలోని పిగ్లీపూర్ గ్రామంలోని అభయాంజనేయస్వామి దేవాలయంలో దొంగతనం చేసిన వెండి ఆభరణాలను కరిగించి బిస్కెట్లుగా మార్చి విజయవాడలో విక్రయించేందుకు వెళ్తుండగా పోలీసులకు చిక్కారు. పిగ్లీపూర్తో పాటు ఘట్కేసర్, దుండిగల్, బీబీనగర్, ఇబ్రహీంపట్నం, జవహర్‌నగర్ పోలీస్స్టేషన్ల పరిధుల్లోని దేవాలయాల్లో పలు దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు దుండగుల నుంచి 20 కిలోల వెండి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. -
అపార్ ఐడీతో విద్యార్థులకు మేలు
బంజారాహిల్స్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 75 శాతం విద్యార్థులకు అపార్ ఐడీ క్రియేట్ చేసి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడం తెలంగాణలోని ఇతర యూనివర్సిటీలకు మార్గదర్శిగా నిలవడం గర్వంగా ఉందని ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీరాం వెంకటేష్ కొనియాడారు. అంబేద్కర్ వర్సిటీలో ‘అపార్ అమలు’ అనే అంశంపై రెండు రోజుల పాటు జరిగిన సదస్సు మంగళవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీరాం వెంకటేష్ మాట్లాడుతూ డీజీ లాకర్, అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్, అపార్ ఐడీ వంటివి విద్యార్థి తాను చదువుకున్న విద్యా సంబంధిత విషయాలకు సంబంధించి కీలకమైన అంశాలుగా పేర్కొన్నారు. విద్యార్థి తన విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నాక ఉద్యోగం కోసం ఏ సంస్థ దగ్గరకు వెళ్లినా సర్టిఫికెట్ల పరిశీలన సులభం అవుతుందన్నారు. ఆ సర్టిఫికెట్ ఒరిజినలా, లేక ఫేక్ సర్టిఫికెటా అనేది కూడా తేలిపోతుందన్నారు. రానున్న రోజుల్లో కూడా తెలంగాణలోని అన్ని విశ్వ విద్యాలయాల్లో అపార్ ఐడీలను రూపొందించి విద్యార్థులకు సహాయకారిగా నిలవడానికి, అవసరమైన శిక్షణ కోసం ఆర్థికపరమైన సహాయాన్ని అందించడానికి తెలంగాణ ఉన్నత విద్యామండలి సిద్ధంగా ఉందని వెల్లడించారు. త్వరలోనే తెలంగాణలోని అన్ని ప్రైవేటు విద్యా సంస్థలకు కూడా ఆయా విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలలకు అపార్ ఐడీ నమోదుపై అవగాహన పెంపొందిస్తూ శిక్షణను ఇవ్వనున్నట్లు వెల్లడించారు. యూనివర్సిటీ ఉపకులపతి ఘంటా చక్రపాణి మాట్లాడుతూ అపార్ ఐడీ నమోదు, అవగాహన పెంపొందించడానికి, శిక్షణ ఇవ్వడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి అంబేడ్కర్ వర్సిటీ సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వ సంస్థలకు నామమాత్రపు రుసుముతో , ప్రైవేటు విద్యా సంస్థలకు ఉన్నత విద్యా మండలి నిర్దేశించిన ప్రకారం రుసుముతో శిక్షణ కార్యక్రమాలు సీఎస్టీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సెంటర్ ఫర్ స్టాఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ (సీఎస్టీడీ) డైరెక్టర్ పరాంకుశం వెంకటరమణ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అధ్యాపకులు రాజశేఖర్, అంబేడ్కర్ వర్సిటీ కంప్యూటర్ సెంటర్ ఇన్‌ఛార్జి వసంత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ సెమినార్లో తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాల విద్యాశాఖ, ఇంటర్మీడియెట్ బోర్డు, టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగాల నుంచి 60 మంది ప్రతినిధులు తమ అనుభవాలు, సమస్యల పరిష్కారానికి అవసరమైన మెలకువలను నేర్చుకున్నట్లు వివరించారు. ఈ సెమినార్లో పాల్గొన్నవారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీరాం వెంకటేష్ -
‘మల్టీలెవెల్ పార్కింగ్’ పనులు చకచకా
బంజారాహిల్స్: బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు సమీపంలో పార్కింగ్ సమస్యను నివారించేందుకు మల్టీ లెవెల్ పార్కింగ్ నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పార్కు పక్కనే ఉన్న జీహెచ్ఎంసి స్థలంలో ఈ నిర్మాణం గత రెండు వారాల నుంచి ముమ్మరంగా జరుగుతున్నది. ఆరు అంతస్తులలో నిర్మాణం జరుగుతున్న ఈ మల్టీ లెవెల్ పార్కింగ్‌లో ఒక్కో ఫ్లోర్లో 12 కార్లు పార్కింగ్ చేయవచ్చు. ఇలా మొత్తం ఆరు ఫ్లోర్లలో 72 కార్లు పార్కు చేసుకునే అవకాశం ఉంటుంది. హైదరాబాద్‌కు చెందిన నవనిర్మాణ ఏజెన్సీ ఈ పనులు చేస్తున్నది. రూ.రెండున్నర కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పార్కింగ్ నిర్మాణంలో హైడ్రాలిక్ పద్ధతిలో లిఫ్ట్ సౌకర్యం ఉంటుంది. పార్కింగ్ కోసం కారు రాగానే ఈ హైడ్రాలిక్ లిఫ్ట్‌లో ఏ ఫ్లోర్లో ఖాళీగా ఉంటే ఆ ఫ్లోర్ లోకి కారు తీసుకెళ్లి పార్కింగ్ చేస్తారు. కారు పార్కింగ్ చేసిన తర్వాత ఒక చిప్‌ను కారు యజమానికి ఇస్తారు. వాకర్లు, ఇతర పనుల కోసం వచ్చిన వారు తమ కార్లు పార్క్ చేసిన తర్వాత..పని పూర్తికాగానే వెళ్తే డ్రైవర్ కారును కిందికి తెప్పిస్తాడు. ప్రస్తుతం ఇలాంటి మల్టీ లెవెల్ పార్కింగ్ వ్యవస్థ బెంగళూరు, చైన్నెలో మాత్రమే ఉంది. హైదరాబాద్‌లో మొట్టమొదటిసారిగా కేబీఆర్ పార్కు పక్కన నిర్మిస్తున్నారు. దీని చుట్టూ కేఫెలు, ఇతర దుకాణాలు కూడా ఏర్పాటు చేస్తారు. పార్కింగ్ ప్రాంతం అంతా సుందరంగా తీర్చిదిద్దుతారు. ఇప్పటికే ఫుట్‌పాత్‌పై ఉన్న బస్సు షెల్టర్లను నోటీసులు అందజేసి తొలగించారు. ఇక్కడ కొనసాగుతున్న కడక్ చాయ్‌తో పాటు 1980 మిలిటరీ హోటల్ కూడా తొలగించనున్నారు. ఈ రెండు దుకాణాలకు నోటీసులు జారీ చేశారు. ఇక్కడ మల్టీ లెవెల్ పార్కింగ్ వ్యవస్థ నిర్మాణం పూర్తయిన తర్వాత పరిసరాలన్నీ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించారు. కేబీఆర్ పార్క్ వద్ద ఆరు అంతస్తుల్లో నిర్మాణం 72 కార్లు పార్కింగ్ చేసుకునే అవకాశం -
పేలిన సిలిండర్
గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా మూసాపేట: అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా సిలిండర్ పేలడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా పరిసర ప్రాంతవాసులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కూకట్పల్లి బాగ్అమీర్ కాలనీలో హరి శంకర్ త్యాగి అనే వ్యక్తి ఎలక్ట్రికల్ అండ్ గ్యాస్ సర్వీస్ షాపును నిర్వహిస్తున్నాడు. మంగళవారం షాపులో పెద్ద సిలిండర్ నుంచి చిన్న సిలిండర్‌లోకి గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. షట్టర్ పైభాగం రేకులు, షట్టర్లు ఎగిరి రోడ్డుపై పడ్డాయి. ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. షాపు పూర్తిగా ధ్వంసమైంది. రీఫిల్లింగ్ చేస్తున్న హరి శంకర్‌కు కాళ్లు, చేతులు కాలిపోయాయి. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. జనావాసాల మధ్య అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్నందుకు అతనిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఒకరికి తీవ్ర గాయాలు -
కీసరగుట్ట ఆలయ హుండీ లెక్కింపు
కీసర: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో కీసరగుట్ట రామలింగేశ్వరస్వామి దేవస్థానానికి రూ.92,49,961 ఆదాయం సమకూరింది. ప్రసాదాలు, వివిధ ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాల టికెట్ల విక్రయం ద్వారా రూ.63,51,060 ఆదాయం రాగా, హుండీ ఆదాయం రూ.28,98,901 వచ్చిందని, ఆలయ చైర్మన్ తటాకం నారాయణ, ఈవో సుధాకర్‌రెడ్డి ప్రకటించారు. మంగళవారం దేవాలయం మహామండపంలో హుండీని లెక్కించారు. ఈ ఆదాయాన్ని స్వామిపేరిట కీసర ఎస్బీఐ బ్యాంకులో డిపాజిట్ చేయనున్నట్లు వారు తెలిపారు. గతేడాది బ్రహ్మోత్సవాల కంటే ఈసారి సుమారు రూ.14,70,436ల మేర ఆదాయం పెరిగిందన్నారు. ఫౌండర్ ఫ్యామిలీ సభ్యులు, ఆలయ ట్రస్టు బోర్డు సభ్యులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపాలిటీలకు నిధుల పంట!
సాక్షి, సిటీబ్యూరో: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని పురపాలక సంఘాల్లో జీవో 51, అమృత్ పథకాల్లో మంజూరైన పనులపై తెలంగాణ పట్టణ ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ చల్లా నర్సింహారెడ్డి సమీక్షించారు. మంగళవారం తన కార్యాలయంలో ఇంజినీరింగ్ సిబ్బందితో పనుల ప్రగతిపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన ఇప్పటికే జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను ఇంజినీరింగ్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై సూచనలు ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఫీల్డ్ విజిట్ నిర్వహించి పురపాలక సంఘాలు, స్థానిక ఎమ్మెల్యేలతో సమీక్షించనున్నట్లు తెలిపారు. పురపాలక సంఘాలకు కొత్తగా మంజూరైన పనులు, వాటికి సంబంధించిన నిధులను వివరించారు. అమృత్ 2.0 ప్యాకేజీ–3 కింద సంగారెడ్డి, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్‌నగర్ డివిజన్లకు రూ.130 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజనీర్లు విశ్వనాధ్ రాజు, చిన్నారావు, వెంకటేశ్వర్లు, జ్యోతిర్మయి, ఈఈలు విజయభాస్కర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ సందీప్, రమణ మూర్తి పాల్గొన్నారు. జీఓ 51, అమృత్ పథకాల కింద భారీగా మంజూరు జీవో 51 పథకం కింద మంజూరైన నిధులిలా.. పురపాలక సంఘం మంజూరైన నిధులు (రూ.ల్లో) పెద్ద అంబర్‌పేట రూ.15 కోట్లు షాద్ నగర్ రూ.61 కోట్లు ఇబ్రహీంపట్నం రూ.15 కోట్లు శంకర్ పల్లి రూ.36 కోట్లు కొత్తూరు రూ.37 కోట్లు ఆమనగల్ రూ.25 కోట్లు జల్పల్లి రూ.10 కోట్లు శంషాబాద్ రూ.20 కోట్లు ఆదిభట్ల రూ.10 కోట్లు తుర్కయంజాల్ రూ.25 కోట్లు బడంగ్పేట్ రూ.15 కోట్లు జిల్లెలగూడ రూ.15 కోట్లు తుక్కుగూడ రూ.15 కోట్లు తాండూర్ రూ.49 కోట్లు వికారాబాద్ రూ.8 కోట్లు పరిగి రూ.4 కోట్లు కొడంగల్ రూ.9 కోట్లు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.25 కోట్లు మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.15 కోట్లు అమృత్ పథకంలో మంజూరైన నిధులిలా.. పురపాలక సంఘం మంజూరైన నిధులు కొడంగల్ రూ.3 కోట్లు పరిగి రూ.11 కోట్లు వికారాబాద్ రూ.8 కోట్లు తాండూరు రూ.20 కోట్లు శంకర్ పల్లి రూ.25 కోట్లు ఆమనగల్ రూ.23 కోట్లు కొత్తూరు రూ.13 కోట్లు షాద్‌నగర్ రూ.20 కోట్లు మేడ్చల్ సర్కిల్‌కు రూ.27 కోట్లు -
నేపాల్‌లో ఆ ఇద్దరు నేరగాళ్లు!
సాక్షి, సిటీబ్యూరో: కర్నాటకలోని బీదర్, నగరంలోని అఫ్జల్‌గంజ్‌లో తుపాకులతో విరుచుకుపడిన ఇద్దరు దుండగులు అమన్ కుమార్, అలోక్ కుమార్ దేశ సరిహద్దులు దాటి నేపాల్ పారిపోయినట్లు నగర పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది జనవరి 16 ఈ రెండు నేరాలకు పాల్పడిన బీహారీ ద్వయం పశ్చిమ బెంగాల్ మీదుగా నేపాల్ వెళ్లినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. నేరచరితులైన వీళ్లు గతంలోనూ ఇలా దేశం దాటి, పోలీసుల హడావుడి తగ్గిన తర్వాత మళ్లీ తిరిగి వచ్చారని అధికారులు చెప్తున్నారు. మీర్జాపూర్ నుంచి మారణకాండ... బిహార్‌లోని వైశాలి జిల్లా ఫతేపూర్ పుల్వారియాకు చెందిన అమన్ కుమార్, అలోక్ కుమార్, చందన్ కుమార్, రాజీవ్ సాహ్నిలతో ఈ ముఠా ఏర్పడింది. వాహనాలపై తిరుగుతూ, పట్టణ శివార్లలో రెక్కీ చేసి, ఏటీఎం మిషన్లలో నగదు నింపే వాహనాలనే టార్గెట్‌గా చేసుకోవడం వీరి నైజం. అలోక్ కుమార్ నేతృత్వంలో సాగే ఈ ముఠా 2023 సెప్టెంబర్ 12న ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో పంజా విసిరింది. సెక్యూరిటీ గార్డు జై సింగ్‌ను హత్య చేసి రూ.40 లక్షలు దోచుకుపోయింది. యూపీ పోలీసులు దాదాపు ఏడాది పాటు గాలించి గత ఏడాది సెప్టెంబర్‌లో చందన్ కుమార్‌ను ముంబైలో, రాజీవ్ సాహ్నిని వైశాలిలో పట్టుకున్నారు. అప్పట్లో అమన్, అలోక్‌లు వైశాలి జిల్లాలోని మహిసౌర్ జనధన్ వద్ద ఉన్నట్లు గుర్తించారు. వీరి కోసం వెళ్లగా..పోలీసుల కళ్లు గప్పి నేపాల్ పారిపోయారు. బిహార్‌లోనూ అనేక నేరాలు చేసి... యూపీ పోలీసుల హడావుడి తగ్గిన తర్వాత ఈ ద్వయం నేపాల్ నుంచి బీహార్ చేరుకుంది. అప్పటికే తమ వద్ద ఉన్న డబ్బు అయిపోవడంతో మళ్లీ నేరాలు మొదలెట్టింది. ఈ ఏడాది జనవరిలో నగరానికి వచ్చి, షెల్డర్ తీసుకుంది. అదే నెల 16న బీదర్‌లో పంజా విసిరింది. ఎస్బీఐ ఏటీఎం మిషన్లలో నగదు నింపే సీఎంఎస్ సంస్థ ఉద్యోగిని గిరి వెంకటేష్‌ను చంపి, శివకుమార్‌ను గాయపరిచి రూ.83 లక్షలతో ఉడాయించింది. నగరంలో షెల్టర్ తీసుకున్న అమన్, అలోక్ నగదుతో తిరిగి ఇక్కడికే వచ్చి నేరానికి వాడిన ద్విచక్ర వాహనాన్ని ఎంజీబీఎస్ పార్కింగ్‌లో ఉంచారు. అఫ్జల్‌గంజ్‌లోని రోషన్ ట్రావెల్స్ నుంచి ప్రైవేట్ బస్సులో రాయ్‌పూర్ వెళ్లేందుకు అమిత్‌కుమార్ పేరుతో టిక్కెట్ బుక్ చేసుకుంది. అక్కడ జరిగిన పరిణామాలతో మేనేజర్ జహంగీర్‌ను కాల్చడం, పారిపోవడం జరిగిపోయాయి. ఆధారాలు దొరక్కుండా ప్రయాణాలు... అఫ్జల్‌గంజ్ నుంచి ఆటోలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లిన వీళ్లు... అక్కడ నుంచి గజ్వేల్ వెళ్లడానికి మరో ఆటో మాట్లాడుకున్నారు. అనివార్య కారణాలతో తిరుమలగిరిలో దిగేసి... ఇంకో ఆటోలో మియాపూర్ వెళ్లారు. ఆపై తిరుపతి వెళ్లే ఏపీఎస్ఆర్టీసీ ఎక్కి కడపలో దిగిపోయారు. మరో బస్సులో నెల్లూరు, అట్నుంచి చైన్నె వెళ్లారు. చైన్నె నుంచి రైలులో కోల్‌కతా చేరుకున్న ఈ ద్వయం పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి ప్రాంతం నుంచి నేపాల్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వీరిపై ఇప్పటికే యూపీ పోలీసులు రూ.2 లక్షలు, కర్నాటక పోలీసులు రూ.5 లక్షలు రివార్డు ప్రకటించారు. త్వరలో హైదరాబాద్ అధికారులూ రివార్డు ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అమన్ కుమార్ జనవరిలో బీదర్, అఫ్జల్గంజ్ల్లో కాల్పులు చైన్నె మీదుగా పశ్చిమ బెంగాల్‌కు బిహారీలు అక్కడి నుంచి దేశ సరిహద్దులు దాటిన వైనం గతంలోనూ ఇలా చేసిన అమన్, అలోక్ ద్వయం -
హాల్‌టికెట్ కోసం విద్యార్థి ఆందోళన
● పూర్తి ఫీజు చెల్లించకపోవడంతో యాజమాన్యం నిరాకరణ ● విషయం వైరల్ కావడంతో ఇచ్చేసిన వైనంమీర్పేట: ఇంటర్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం అవుతుండగా పరీక్షకు సిద్ధం కావాల్సిన ఓ విద్యార్థి హాల్‌టికెట్ ఇవ్వాలని కళాశాల ఎదుట బైఠాయించాడు. ఈ సంఘటన మీర్‌పేట పరిధిలో చోటు చేసుకుంది. వివరాలివీ.. మీర్‌పేట జిల్లెలగూడకు చెందిన వెంకట పవన్ బాలాపూర్ చౌరస్తాలోని శ్రీ వాగ్ధేవి జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పూర్తి ఫీజు చెల్లించలేకపోయాడు. దీంతో కళాశాల యాజమాన్యం హాల్‌టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ క్రమంలో వెంకట పవన్ మంగళవారం రూ.5వేలు చెల్లించాడు. పూర్తి ఫీజు చెల్లిస్తే గానీ హాల్‌టికెట్ ఇచ్చేది లేదని తెగేసి చెప్పింది. దీంతో పవన్ కళాశాల ఎదుటే కూర్చొని హాల్‌టికెట్ ఇవ్వాలని వేడుకున్నాడు. విషయం కాస్తా స్థానికంగా వైరల్ కావడంతో యాజమాన్యం రూ.5వేలు తిరిగిచ్చేయడంతో పాటు హాల్‌టికెట్ అందజేసింది. -
పోర్టికో కూలిన ఘటనపై విచారణకు ఆదేశం
8 మందితో కూడిన కమిటీ నియామకం రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని నూతన పరిపాలన భవనం పోర్టికో కుప్పకూలిన ఘటనపై విచారణకు వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ బీజే రావు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఒక నోటిఫికేషన్‌ను హెచ్‌సీయూ రిజిష్ట్రార్ డాక్టర్ దేవేష్ నిగమ్ విడుదల చేశారు. 8 మందితో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో చైర్మన్‌గా స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ప్రొఫెసర్ వై. సురేష్, సభ్యులుగా ప్రొఫెసర్ మల్లయ్య, ఎస్.సూర్యప్రకాశ్, బాషా, శివాజీ, రామ్‌శేషు, పి.శ్రీనివాసరావు, జీవీ రెడ్డి నియమితులయ్యారు. పోర్టికో కూలిన అంశంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి సమగ్ర నివేదికను నెల రోజుల్లోగా అందించాలని వైస్ చాన్స్‌లర్ ఆదేశించారు. గత నెల 27న పోర్టికో కుప్పకూలిన ప్రమాదంలో 11 మంది కార్మికులకు గాయాలైన విషయం విదితమే. -
గాంధీ ఆస్పత్రిలో ఇదేం దుస్థితి?
గాంధీఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిలో పరిపాలన అస్తవ్యస్తంగా మారిందని, పేదలకు మెరుగైన వైద్యం అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన గాంధీ ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు చేశారు. అవుట్ పేషెంట్ విభాగాలన్నింటా కలియతిరిగారు. రోగులు, రోగి సహాయకులతో మాట్లాడారు. వైద్య సేవలు, సమస్యలు, సౌకర్యాలపై ఆరా తీశారు. డాక్టర్ల అటెండెన్స్ రిజిస్టర్ తెప్పించుకుని పరిశీలించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా పలువురు ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు విధులకు గైర్హాజరైనట్లు గుర్తించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు చేపట్టాలని, షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరాలని అక్కడే ఉన్న డీఎంఈ, గాంధీ సూపరింటెండెంట్లకు ఆదేశించారు.అసలేం జరుగుతోంది?నర్సింగ్ సిబ్బంది అటెండెన్స్ రిజస్టర్ అందుబాటులో లేకపోవడంతో విస్మయం వ్యక్తం చేశారు. గాంధీ ఆస్పత్రిలో ఏం జరుగుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేడియాలజీ విభాగంలోని ఎక్స్‌రే, ఎమ్మారై, సీటీస్కాన్ తదితర వార్డులు, రెండో అంతస్తులోని జనరల్ మెడిసిన్ ఇన్‌పేషెంట్ వార్డును పరిశీలించారు. అనంతరం మాతాశిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్)లోని సంతాన సాఫల్య కేంద్రాన్ని (ఐవీఎఫ్ ) సందర్శించారు. ఇప్పటి వరకు ఎంతమందికి సేవలు అందించారు, సక్సెస్ రేట్ ఎంత, ప్రస్తుతం ఎంత మంది ఉన్నారు, విధి నిర్వహణలో ఉన్న వైద్యులు, సిబ్బంది సంఖ్య ఎంత అంటూ ఆరా తీయగా.. ఒక్కదానికి సరైన సమాధానం ఇవ్వకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఐవీఎఫ్ సెంటర్‌కు సంబంధించిన వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డీఎంఈని ఆదేశించారు.సీరియస్‌గా రివ్యూ చేయాలి..గాంధీ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలపై సీరియస్‌గా రివ్యూ చేయాల్సిన అవసరం ఉందని మంత్రి రాజనర్సింహ అభిప్రాయపడ్డారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గాంధీలో కొనసాగుతున్న అభివృద్ధి, నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మెడికల్, నాన్ మెడికల్ ఉద్యోగులు చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. గాంధీలో సమస్యలు, లోపాలపై వారం రోజుల్లో రివ్యూ సమావేశం నిర్వహిస్తానని వివరించారు.చీటీపై రాసిస్తే చిటికెలో పరిష్కారం!గాంధీభవన్‌కు వచ్చి నీ సమస్యను చీటీపై రాసిస్తే చిటికెలో పరిష్కారం దొరుకుతుందని ఓ దివ్యాంగురాలికి మంత్రి దామోదర్ రాజనర్సింహ భరోసా ఇచ్చారు. మంగళవారం గాంధీఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు చేసి తిరిగి వెళ్తున్న క్రమంలో దివ్యాంగ వృద్ధురాలు రాజనర్సింహను కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. సదరం సర్టిఫికెట్ కోసం ఏళ్ల తరబడిగా తెలంగాణ భవన్ చుట్టూ తిరిగినా ఫలి తం లేకుండాపోయిందని, ప్రస్తుతం తనకు సదరం ధ్రువీకరణ పత్రం ఇప్పించాలని వేడుకుంది. తెలంగాణ భవన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని.. ఇప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వమని, గాంధీ భవన్‌కు వచ్చి చీటీపై రాసిస్తే సమస్యకు చిటికెలో పరిష్కా రం దొరకుతుందని మంత్రి ఆమెకు వివరించారు. ఓపీ చీటీపై తన ఫోన్ నంబరు రాసి ఇచ్చారు. ఫోన్ చేసి తన క్యాంపు కార్యాలయానికి వస్తే సమస్యను పరిష్కరిస్తానన్నారు. ఆమె వివరాలు అడిగి తెలుసుకుని కొంత నగదు ఆర్థిక సాయంగా అందించి ఔదార్యాన్ని చాటుకున్నారు మంత్రి రాజనర్సింహ. -
బస్ షెల్టర్ బాలేదా?
ఇక్కడ కనిపిస్తున్న బస్ షెల్టర్ల దృశ్యాలు ఇప్పటివి కావు. పరిస్థితులు మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటున్నాయి. పేరుకు మాత్రం ప్రజల కోసమని బస్ షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నప్పటికీ.. అవి ప్రజలకు ఉపయోగపడటం కంటే ప్రకటనలు ఏర్పాటు చేస్తున్న యాడ్ ఏజెన్సీలకే బాగా పనికొస్తున్నాయి. రాత్రుళ్లలో ప్రజలకు చీకట్లే ఉంటున్నా, వాటి ఆదాయం మాత్రం జిగేల్‌మంటోంది. సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో బస్సులను నడిపేది ఆర్టీసీ అయినా, బస్షెల్టర్లను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేస్తుంది. ప్రజల సదుపాయార్థమని వీటిని ఏర్పాటు చేస్తున్నప్పటికీ, అవి ప్రజలకు ఉపయోగపడటం లేదు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతున్నారే తప్ప ప్రయాణికుల వాటితో సదుపాయం ఒనగూరడంలేదు. ఇదే తరుణంలో ప్రముఖ వాణిజ్యప్రాంతాల్లో, ప్రధాన రహదారులపై ఉన్న షెల్టర్లు వాటిని ఏర్పాటు చేసిన ఏజెన్సీలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. బస్షెల్టర్లు ఏర్పాటు చేసేటప్పుడే ఆసక్తి ఉన్న ఏజెన్సీలన్నీ పాల్గొనేందుకు వీల్లేకుండా నచ్చిన వారికి దక్కేలా టెండరు నిబంధనలు రూపొందిస్తున్నారు. కనీసం నిబంధనల మేరకై నా నిర్వహణ ఉంటోందా అంటే అదీ లేదు. ● ఈ నేపథ్యంలో బస్షెల్టర్లను ప్రజలకు సదుపాయంగా ఉంచాలని భావిస్తున్న జీహెచ్ఎంసీ.. బస్షెల్టర్లలో తమకు ఎదురవుతున్న ఇబ్బందుల్ని అక్కడి నుంచే ఫిర్యాదు చేసేందుకు వీలుగా అక్కడే క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేయనుంది. వాటిని స్కాన్ చేసి ఇబ్బందుల్ని ఫిర్యాదు చేస్తే, నిర్ణీత వ్యవధిలోగా (రెండు మూడు రోజుల్లోగా) వాటిని పరిష్కరించాలని భావిస్తోంది. లేని పక్షంలో సంబంధిత ఏజెన్సీకి పెనాల్టీలు విధించడంతో పాటు వాటిని వసూలు చేసేందుకూ తగిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. సంబంధిత క్యూఆర్ కోడ్లు సిద్ధమయ్యాయని, త్వరలోనే ప్రజల వినియోగానికి అందుబాటులో ఉంచనున్నట్లు సంబంధిత అధికారి తెలిపారు. అమలుకు నోచుకోని నిబంధనలు జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 1300కు పైగా బస్షెల్టర్లున్నాయి. నిబంధనల మేరకు వాటిని ఏర్పాటు చేసిన ఏజెన్సీలు గ్రేడ్లను బట్టి డస్ట్బిన్ల నుంచి మొదలు పెడితే బస్సులు సదరు షెల్టర్‌కు చేరుకోనున్న సమయాన్ని తెలిపేలా రియల్‌టైమ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి. కానీ ఏవీ ఏర్పాటు చేయకుండానే అవి ఆదాయం పొందుతున్నాయి. తాజాగా అందుబాటులోకి రానున్న క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి ఈ సమస్యల్ని ఫిర్యాదు చేయొచ్చు. ● కూర్చునేందుకు బెంచీలు, కుర్చీలు లేకుంటే.. ● ఉన్నా కూర్చునేందుకు వీల్లేకుండా విరిగిపోయి ఉంటే.. ● ఏరోజుకారోజు శుభ్రం చేయకుండా ఉంటే.. ● పైకప్పు లేకుంటే. ఉన్నా వానొస్తే తడవకుండా సరిగా లేకపోతే.. ● రాత్రుళ్లు లైట్లు వెలగని పక్షంలో.. ● బస్సుల నెంబర్లు, రూట్‌మ్యాప్‌లు లేకపోతే.. ● బస్‌షెల్టర్ గ్రేడ్‌ను బట్టి మొబైల్ చార్జింగ్ పాయింట్ లేనిపక్షంలో.. ● కాగితాలు వంటివి వేసేందుకు డస్ట్‌బిన్ లేకుంటే. ● పబ్లిక్ టాయ్‌లెట్ లేకపోతే.. ఫిర్యాదులు ఇకనైనా పరిష్కరిస్తారా ? ప్రయాణికుల నుంచే ఇబ్బందులు తెలుసుకునేందుకని ప్రస్తుతం క్యూఆర్ కోడ్ల ఏర్పాట్లకు సిద్ధమయ్యారు. వీటి ఏర్పాటుతోనైనా సమస్యలు తీరుతాయా? లేదా? అనేది మున్ముందు తెలుస్తుంది. మెహిదీపట్నంలోని బస్ షెల్టర్అక్కడే స్కాన్ చేసి ఫిర్యాదు చేయండి కొత్త విధానాన్ని అమల్లోకి తేనున్న బల్దియా రెండేళ్ల క్రితమే.. దాదాపు రెండేళ్ల క్రితం సెంట్రల్ అడ్వర్టయిజ్మెంట్ మానిటరింగ్ ప్లాట్ఫార్మ్ (క్యాంప్)పేరిట ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించేందుకు సంబంధిత అధికారులు ఆర్ఎఫ్పీ టెండర్లు పిలిచారు. రియల్‌టైమ్‌లో అధికారులే ఆన్లైన్ ద్వారా పర్యవేక్షిస్తూ బాగులేని వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. ట్విట్టర్ (ఎక్స్) వంటి వాటిద్వారా ప్రజలు ఫిర్యాదు చేసినా పరిష్కరిస్తామన్నారు. కానీ.. ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. బస్సుల రాకపోకలు తెలిసేలా సదుపాయం కల్పించేందుకని ఇటీవల మరో ఆర్ఎఫ్పీ ఆహ్వానించారు. ఇది ఏ మేరకు అమలు చేస్తారో తెలియదు. -
దుర్వినియోగాన్ని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు
ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న ట్రాఫిక్ విభాగం అధికారులు గడిచిన కొన్ని రోజులుగా అంబులెన్స్‌లపై అధ్యయనం చేశారు. ఫలితంగా సిటీలో సంచరిస్తున్న అన్ని అంబులెన్స్‌ల్లోనూ అత్యవసర వైద్యం అందించాల్సిన పేషెంట్లు ఉండట్లేదని తేలింది. ఉదాహరణకు గుండెపోటు వచ్చిన వ్యక్తికి ఇచ్చే ప్రాధాన్యం చేయి విరిగిన వ్యక్తికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే అంబులెన్స్‌లపై సమగ్ర విధానం రూపకల్పనకు నిర్ణయించారు. ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌లో ప్రత్యేకంగా ఓ సెల్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అత్యవసర పేషెంట్లను తరలిస్తున్న లేదా వారి కోసం వెళ్తున్న అంబులెన్స్‌ల వివరాలను ఆస్పత్రులు లేదా నిర్వాహకులు ఈ సెల్‌కు అందించేలా చేయనున్నారు. వాటి పూర్వాపరాలు పరిశీలించే ఇక్కడి అధికారులు అది ప్రయాణించే రూట్లోని జంక్షన్లను అప్రమత్తం చేస్తూ రిజిస్ట్రేషన్ నెంబర్ తదితరాలు అందిస్తారని, ఈ విధానంతో అటు అత్యవసర రోగులకు, ఇటు ప్రజలకు ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు. సాక్షి, సిటీబ్యూరో: నగరంలో సంచరిస్తున్న అంబులెన్స్‌ల కారణంగా సాధారణ వాహన చోదకులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అత్యవసరమైన పేషెంట్లను తరలిస్తున్న వాటికి మాత్రమే ‘గ్రీన్ లైట్’ విధానం అమలు చేస్తున్నారు. అవసరం లేకపోయినా, ఖాళీగా సంచరిస్తున్న సందర్భాల్లో సైరన్ వినియోగిస్తే ఆయా అంబులెన్స్ యజమానులపై కేసులు నమోదు చేస్తున్నారు. నగర ట్రాఫిక్ చీఫ్ జోయల్ డెవిస్ ఆదేశాల మేరకు సోమవారం నుంచి నగర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ ప్రారంభమైంది. అంబులెన్స్‌ల వ్యవహారంపై ట్రాఫిక్ బృందాలు ప్రత్యేక దృష్టి సారించాయి. మంగళవారం కొన్ని కేసులు నమోదయ్యాయి. ఇదే రోజు పెంపుడు కుక్కకు సంతాన నిరోధక ఆపరేషన్ కోసం.. రోగులను తీసుకువెళ్లాల్సిన అంబులెన్స్‌లో సైరన్ మోగించుకుంటూ వెళ్లిన డ్రైవర్‌ను పంజగుట్ట ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. అంబులెన్స్‌ను సీజ్ చేయడం గమనార్హం. ఆస్పత్రులున్న ప్రాంతాల్లో మరీ ఇబ్బంది.. సిటీలోని ఆసుపత్రులను నగర నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి రోగులు వస్తుంటారు. వీరిలో కొందరిని అంబులెన్స్‌ల్లో తరలిస్తుంటారు. ఈ కారణంగానే నగరంలోని ఏ చౌరస్తాను తీసుకున్నా సరాసరిన ప్రతి గంటకు కనిష్టంగా ఐదు అంబులెన్స్‌ను క్రాస్ చేస్తుంటాయి. ఆస్పత్రులు ఎక్కువగా ఉన్న బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిధుల్లో ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఏ ప్రాంతం నుంచి వచ్చే అంబులెన్స్ అయినా ఇక్కడికే చేరుకుంటుండటమే దీనికి కారణం. ప్రస్తుతం అన్ని అంబులెన్స్ల్నీ ఒకే తరహాలో పరిగణిస్తున్న ట్రాఫిక్ పోలీసులు సైరన్ వినిపిస్తే చాలు అప్రమత్తమవుతున్నారు. సదరు జంక్షన్లో మిగిలిన దిశల నుంచి వచ్చే ట్రాఫిక్‌ను ఆపి.. అంబులెన్స్ ఉన్న దిశలో వాటినే ముందుకు పంపిస్తున్నారు. ఇలా ఒకసారి ఆపిన చౌరస్తా మళ్లీ గాడిన పడటానికి కొన్ని నిమిషాల సమయం పడుతోంది. ఫలితంగా ఇతర వాహనచోదకులకు సమయం, ఇంధనం వృథా అవుతోంది. ఆ ప్రతిపాదనలకు ఆచరణ సాధ్యం కాక... సాధారణంగా అంబులెన్స్ అనగానే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని తరలిస్తోందనే భావన కలుగుతుంది. ఈ నేపథ్యంలో వీటికి నగర రోడ్లపై ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని గతంలో భావించారు. రహదారులపై కుడి వైపుగా అంబులెన్స్‌ల కోసం ప్రత్యేకంగా లైన్ ఏర్పాటు చేయాలని భావించారు. ఆపై వీటికి రేడియో ఫ్రీక్వెన్సీ (ఆర్ఎఫ్) ట్యాగ్స్ జారీ చేయడంతో పాటు సిగ్నల్స్‌కు రీడర్లను ఏర్పాటు చేయాలనుకున్నారు. ఫలితంగా ఓ చౌరస్తా వద్దకు అంబులెన్స్ వచ్చిన వెంటనే ఆర్ఎఫ్ ట్యాగ్ ద్వారా సిగ్నల్ గుర్తించి ఆ మార్గంలో గ్రీన్ లైట్ ఉంచేలా చేయాలని భావించారు. అయితే.. నగర రోడ్లపై ఈ రెండూ ఆచరణ సాధ్యం కాదని తేలడంతో ప్రస్తుతం ప్రతి అంబులెన్స్‌ను క్షేత్రస్థాయిలో ఉండే సిబ్బంది మాన్యువల్‌గా క్లియరెన్స్ ఇస్తున్నారు. ఇటీవల కాలంలో అంబులెన్స్‌ల సంచారం పెరగడంతో అనేక జంక్షన్లలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మంగళవారం తార్నాకలో అంబులెన్స్‌ను తనిఖీ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులుఅన్నీ తీవ్రమైన కేసులే ఉండట్లేదు.. సిటీలో సోమవారం నుంచి ప్రారంభమైన తనిఖీలు ఫలితంగా అనేక అంశాలు వెలుగులోకి.. అనవసరంగా సైరన్ మోగించిన వారిపై కేసులు -
స్టూడెంట్స్.. ఆల్ ది బెస్ట్!
నారాయణగూడలోని ఓ పరీక్ష కేంద్రంలో హాల్ టికెట్ నంబర్లు వేస్తున్న సిబ్బందినేటినుంచి ఇంటర్ పరీక్షలుఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రథమ సంవత్సరం కోసం హైదరాబాద్ జిల్లాలో 244 పరీక్ష కేంద్రాల్లో 85,753 మంది, రంగారెడ్డిలో 185 కేంద్రాల్లో 80,409, మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా పరిధిలోని 150 కేంద్రాల్లో 64,107 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇంటర్మీడియట్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. విద్యార్థులూ.. పరీక్షలు బాగా రాసి మంచి ఉత్తీర్ణత సాధించడమే మీ ముందున్న లక్ష్యం. ఆల్ ది బెస్ట్! – సాక్షి, సిటీబ్యూరో -
ఓఆర్ఆర్పై ఘోర ప్రమాదం
డీసీఎం వాహనాన్ని ఢీకొట్టిన కారు ● భర్త మృతి.. భార్య, కుమారుడికి తీవ్ర గాయాలు దుండిగల్: ఔటర్ రింగ్ రోడ్డుపై డీసీఎం వాహనాన్ని కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సతీష్ కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన కార్తీక్ (38) నగరంలోని నిజాంపేటలో నివాసముంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు భార్య సింధు, కుమారుడు కివి (3) ఉన్నారు. స్వగ్రామం వెళ్లిన కార్తీక్ భార్య, కుమారుడితో కలిసి తన కారులో తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో మల్లంపేట ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 5 వద్ద మంగళవారం ఉదయం 7.30 గంటల సమయంలో ముందు వెళ్తున్న డీసీఎం వాహనాన్ని అతివేగంతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జు నుజ్జు కావడంతో అందులో ఇరుక్కున్న కార్తీక్ అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య సింధు, కుమారుడు కివిలకు తీవ్ర గాయాలు కావడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. దుండిగల్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. మల్లంపేట ఎగ్జిట్ వద్ద దిగి కొన్ని నిమిషాల్లోనే ఇంటికి చేరుకోవాల్సి ఉండగా.. ఖమ్మం జిల్లా నుంచి రాత్రి సమయంలో ప్రయాణం చేయడం నిద్రమత్తులో ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
నడుస్తున్న కారులో అగ్ని కీలలు
రాజేంద్రనగర్: నడుస్తున్న కారు ఇంజిన్‌లోంచి పొగలు రావడంతో అప్రమత్తమైన యజమాని.. వాహనాన్ని పక్కకు నిలిపి పరిశీలిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే పై మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నగరానికి చెందిన ఉదయ్ కుమార్ తన మారుతీ సుజుకీ కారులో ఆరాంఘర్‌లోని పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే పైనుంచి మెహిదీపట్నం వైపు వెళ్తున్నాడు. ఫ్లై ఓవర్ 211వ పిల్లర్ వద్దకు రాగానే వాహనం ముందు భాగంలోని ఇంజిన్‌లోంచి పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఉదయ్ కుమార్.. పక్కకు ఆపి పరిశీలిస్తుండగా మంటలు చెలరేగి వాహనం మొత్తం అలుముకున్నాయి. నిమిషాల వ్యవధిలో కారు మంటల్లో చిక్కుకుంది. విషయం తెలుసుకున్న అత్తాపూర్ ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది. ఫ్లై ఓవర్‌పై ఈ ఘటన చోటు చేసుకోవడంతో వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో తెలిపారు. -
అధిక వడ్డీ ఆశ చూపి.. కస్టమర్లకు కుచ్చుటోపీ
● రూ.14 కోట్లు మోసం చేసిన కేటుగాడు ● అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు సాక్షి, సిటీబ్యూరో: అధిక వడ్డీ ఆశ చూపించి మోసం చేసిన కేటుగాణ్ని సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం (ఈఓడబ్ల్యూ) పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన కందుల శ్రీనివాస రావు నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలో వెల్ విజన్ గ్రూప్ పేరుతో పలు కంపెనీలను ఏర్పాటు చేశాడు. తన కంపెనీలో డిపాజిట్లు, పెట్టుబడులు పెడితే 200 శాతం అధిక వడ్డీ అందిస్తానని రకరకాల స్కీమ్‌లతో ప్రచారం చేశాడు. రూ.లక్ష డిపాజిట్ చేస్తే.. రోజుకు రూ.2 వేల చొప్పున వంద రోజుల పాటు రూ.2 లక్షలు, అలాగే.. రూ.6.50 లక్షలు డిపాజిట్ చేస్తే.. 121 గజాల స్థలంతో పాటు నెలకు రూ.32,500 చొప్పున 20 నెలల్లో రూ.6.50 లక్షలు రీఫండ్ చేస్తామని ప్రకటించాడు. టీవీ, వాషింగ్ మిషన్, ఏసీ వంటి వెల్ విజన్ గ్రూప్ గృహోపకరణాలను ఖరీదు చేసిన వారికి ఉత్పత్తి ఖరీదు మొత్తాన్ని వాయిదాల రూపంలో తిరిగి చెల్లిస్తామని ఆశ పెట్టాడు. ఉదాహరణకు రూ.30 వేలు పెట్టి టీవీ కొనుగోలు చేసే కస్టమర్‌కు టీవీతో పాటు నెలకు రూ.1,500 చొప్పున 20 నెలల్లో రూ.30 వేలు కస్టమర్‌కు రీఫండ్ చేస్తామని ప్రచారం చేశాడు. అత్యాశకు పోయిన సుమారు 200 మంది అమాయకులు రూ.14 కోట్లు డిపాజిట్లు చేశారు. కొన్ని నెలల పాటు వడ్డీ చెల్లించిన శ్రీనివాస రావు.. ఆ తర్వాత బిచాణా ఎత్తేశాడు. బాధితుల ఫిర్యాదుతో సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు శ్రీనివాస రావును అరెస్టు చేశారు. -
10 రోజుల్లో ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్
హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ సాక్షి, సిటీబ్యూరో: అన్ని విధాలుగా అర్హత కలిగి ఉండి..సకాలంలో ఫీజులు చెల్లించిన వారికి 10 రోజుల్లో ఎల్ఆర్ఎస్ అనుమతి పత్రాలను (ప్రొసీడింగ్స్)ను అందజేయనున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ అథారిటీ (హెచ్ఎండీఏ) కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. అక్రమ స్థలాల క్రమబద్ధీకరణ కోసం ప్రవేశపెట్టిన ఈ ఎల్ఆర్ఎస్ పథకం అమలులో సందేహాల నివృత్తి కోసం కాల్‌సెంటర్‌ను కూడా ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. స్థలాల క్రమబద్ధీకరణను పారదర్శకంగా చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ నెల 31వ తేదీ లోపు ఎల్ఆర్ఎస్ ఫీజుల్లో 25 శాతం రాయితీ లభిస్తుందన్నారు. ఎల్ఆర్ఎస్ ఫీజుతో పాటు ప్లాట్లలో ఓపెన్ స్పేస్ చార్జీలను (ప్రొ–రాటా) కూడా చెల్లించిన వాళ్లకు మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుందన్నారు. ఎల్ఆర్ఎస్–2020 పథకంలో భాగంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వాళ్లకు మాత్రమే ప్రస్తుతం స్థలాలను క్రమబద్ధీకరించుకొనే సదుపాయం ఉంది. తిరస్కరణకు గురయ్యే దరఖాస్తులపైన చెల్లించిన ఫీజులో 90 శాతం రీఫండ్ చేస్తారు. మిగతా 10 శాతం ప్రాసెసింగ్ చార్జీల కోసం కేటాయిస్తారు. చెరువులు, కుంటలు, తదితర నీటివనరులకు 200 మీటర్ల పరిధిలో ఉన్న ప్లాట్లకు మాత్రం రెవెన్యూ, నీటిపారుదల శాఖల అనుమతితోనే ఎల్ఆర్ఎస్లు లభిస్తాయి. నిషేధిత భూములు, సరస్సులు, నీటి వనరుల పరిధిలో లేకుండా, అన్ని విధాలుగా అర్హత కలిగిన ప్లాట్లకు ఆటోమేటిక్‌గా ఫీజు నోటీసులు అందుతాయి. సకాలంలో ఫీజులు చెల్లించిన వారికి 10 రోజుల్లో ఎల్ఆర్ఎస్ జారీ ప్రక్రియను పూర్తి చేసి ప్రొసీడింగ్స్ ఇవ్వనున్నట్లు కమిషనర్ వివరించారు. సందేహాల నివృత్తి ఇలా.. ● ఎల్ఆర్ఎస్ల దరఖాస్తులు ఏ దశలో ఉన్నా, ప్రొసీడింగ్ వివరాలు, ఫీజ్ వివరాలు, షార్ట్‌ఫాల్స్ తదితర వివరాల కోసం ఎల్ఆర్ఎస్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ● అలాగే హెచ్ఎండీఏ కాల్‌సెంటర్: 18005998838 నంబర్‌కు సంప్రదించవచ్చు. -
గ్రేటర్ జిల్లాల్లో సోమవారం పగటి ఉష్ణోగ్రతలు ఇలా.. (సెల్సియస్ డిగ్రీలు)
జిల్లా 2024 2025 మార్చి 3 మార్చి 3 హైదరాబాద్ 38.06 35.07 రంగారెడ్డి 37.01 36.02 మేడ్చల్ 38.03 35.09 వికారాబాద్ 38.02 36.04 గత వారం గ్రేటర్లో విద్యుత్ డిమాండ్ ఇలా... తేదీ సమయం మెగావాట్లు ఫిబ్రవరి 26 09.23 3306 27 18.55 3272 28 18.56 3398 మార్చి 01 19.02 3254 02 19.14 3017 03 18.00 3369 -
డెడ్‌లైన్ సండే!
ఆలోపు అక్రమ హోర్డింగ్స్ తొలగించండి ● నిర్వాహకులకు స్పష్టం చేసిన హైడ్రా కమిషనర్ ● ఏజెన్సీల ప్రతినిధులతో ప్రధాన కార్యాలయంలో భేటీ సాక్షి, సిటీబ్యూరో: నగర వ్యాప్తంగా అనుమతులు లేకుండా, అనుమతి గడువు ముగిసినా కొనసాగుతున్న అక్రమ హోర్డింగ్స్‌ను ఆదివారం లోపు తొలగించాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. అలా కాకుంటే తాము వాటిపై చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు. సోమవారం తన కార్యాలయంలో యాడ్ ఏజెన్సీల ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. దాదాపు మూడు నెలల క్రితమే తొలగింపు ప్రక్రియ చేపట్టామని, అయితే యాడ్ ఏజెన్సీల విజ్ఞప్తి మేరకు కొంత సమయం ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. రెండు నెలలుగా పలుమార్లు మున్సిపల్ కమిషనర్లు, యాడ్ ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు ఆయన గుర్తు చేశారు. ఈ హోర్డింగ్స్‌పై ప్రభుత్వం విధివిధానాలు రూపొందించాల్సి ఉండటంతో రెన్యూవల్స్ ఆగిపోయాయని పలువురు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కారణంగానే 2022–23 ఆర్థిక సంవత్సరానికి చెల్లించాల్సిన రుసుములు కూడా కట్టలేకపోయామని రంగనాథ్‌కు తెలిపారు. 2023 మార్చి 31 వరకూ చెల్లింపులు చేసిన హోర్డింగుల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకూ తొలగించమని హామీ ఇచ్చిన రంగనాథ్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని వారికి చెప్పారు. ఈ హోర్డింగ్స్ ద్వారా ప్రభుత్వానికి రూ.వందల కోట్ల ఆదాయం రావాల్సి ఉన్నా ప్రస్తుతం కేవలం రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్లు వరకే వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అక్రమ హోర్డింగుల తొలగింపు విషయంలో హైడ్రా ఎవరికీ, ఎలాంటి మినహాయింపులకు ఇవ్వదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదాయం పెంపు లక్ష్యంగా తాము పని చేస్తున్నామని రంగనాథ్ పునరుద్ఘాటించారు. హోర్డింగుల ఏర్పాటుతో పాటు ప్రకటనల రుసుం చెల్లింపు విషయంలో ప్రభుత్వం కొత్త విధానం తీసుకువస్తే ఆ ప్రకారం నడచుకోడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని యాడ్ ఏజెన్సీ ప్రతినిధులు హైడ్రా కమిషనర్‌కు తెలిపారు. బాలాపూర్‌లో అనుమతి లేని హోర్డింగ్స్‌ను తొలగిస్తున్నప్పుడు హైడ్రాపై ఆరోపణలు చేసిన అఖిల యాడ్ ఏజెన్సీ యజమాని తమను కూడా తప్పుదోవ పట్టించారని పలువురు రంగనాథ్‌కు తెలిపారు. అఖిల యాడ్ ఏజెన్సీ పేరిట మీర్‌పేటలో ఉన్న అనుమతులను చూపించిన యజమాని బాలాపూర్ చౌరస్తాలో అక్రమంగా హోర్డింగులను ఏర్పాటు చేసినట్టు హైడ్రా ఆధారాలను ఏజెన్సీల ప్రతినిధులకు చూపించింది. -
ఇంటర్ పరీక్షలకు
రేపటి నుంచి ప్రారంభం●● గ్రేటర్లో 579 పరీక్ష కేంద్రాలు ● హాజరవనున్న 4,64,445 మంది విద్యార్థులు ● సీసీ కెమెరా నిఘాలో ప్రశ్నపత్రాల ఓపెన్, జవాబు పత్రాల సీల్ ● క్యూఆర్ కోడ్ ద్వారా కేంద్రాల లొకేషన్ వెసులుబాటు ● సందేహాల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 040–29700934 సాక్షి, సిటీబ్యూరో: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది. బుధవారం నుంచి ప్రథమ సంవత్సరం, గురువారం నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఆరంభం కానున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల పరిధిలో దాదాపు 4,46,445 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందుకోసం సుమారు 579 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. ● ఎండలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో కేంద్రాల వద్ద ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. – తాగునీటి సదుపాయంతోపాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. – విద్యార్థులు అస్వస్థతకు గురైతే సత్వర సేవలందించేందుకు వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లను నియమించారు. ● విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు 144 సెక్షన్ అమలు చేయనున్నారు. 25 మంది చొప్పున సీటింగ్ ఇంటర్ పరీక్ష కేంద్రంలో ఒక్కో గదిలో 25 మంది చొప్పున కూర్చునే విధంగా సీటింగ్ ఏర్పాటు చేశారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఇన్విజిలేటర్లను నియమించారు. మాస్ కాపీయింగ్ అరికట్టేందుకు తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ అధికారులు, సిట్టింగ్, ఫ్లయింగ్, స్క్వాడ్ బృందాలను నియమించారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో సిట్టింగ్ స్క్వాడ్ 10, ఫ్లయింగ్ స్క్వాడ్ 4 బృందాలు, రంగారెడ్డి జిల్లాలో సిట్టింగ్ స్క్వాడ్ 5, ఫ్లయింగ్ స్క్వాడ్ 4, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 5 సిట్టింగ్, 6 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను రంగంలో దింపనున్నారు. వీరితో పాటు జిల్లాకు డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ (డీఈసీ)లో ఐదుగురు సభ్యులు, ఇద్దరు హైపవర్ కమిటీ సభ్యుల చొప్పున నియమించారు. పరీక్ష కేంద్రానికి పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొచ్చే ప్రశ్నపత్రాల సీల్ తీయడం మొదలుకుని, విద్యార్థులు రాసిన సమాధాన పత్రాలను సీల్ వరకు సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణలోనే ప్రక్రియను పూర్తి చేయనున్నారు. చీఫ్ సూపరింటెండెంట్ తప్ప మిగతా వారికి మొబైల్ ఫోన్ అనుమతి ఉండదు. పరీక్ష కేంద్రాల్లోకి సంబంధిత అధికారి జారీ చేసిన ఐడీ కార్డులు ఉంటేనే తప్ప ఇతరులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు. సందేహాల కోసం టోల్‌ఫ్రీ నెంబర్ 040– 29700934 సంప్రదించవచ్చు. పరీక్ష కేంద్రం చిరునామా కోసం విద్యార్థులు పరీక్ష కేంద్రం చిరునామా ఈజీగా తెలుసుకునే విధంగా ఎగ్జామ్ సెంటర్ లోకేటర్ యాప్‌ను అందుబాటులో తెచ్చారు. ఆండ్రాయిడ్ ఫోన్లో ప్లే స్టోర్‌కు వెళ్లి ఐపీఈ ఎగ్జామ్ సెంటర్ లొకేటర్ యాప్‌ను డౌన్‌లౌడ్ చేసుకుని నో యువర్ ఎగ్జామ్ సెంటర్ అప్షన్లో కాలేజీ కోడ్/విద్యార్థి పేరు టైప్ చేస్తే సెంటర్ అడ్రస్ సులువుగా తెలుస్తుందని అదికారులు వెల్లడించారు. అదేవిధంగా హాల్ టికెట్‌పై గల క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే అడ్రస్ వెంటనే వస్తుందన్నారు. పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోవాలి విద్యార్థులు హడావుడిగా కాకుండా..సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు ప్రయత్నించాలి. పరీక్ష కేంద్రాల అడ్రస్ తెలుసుకుని ఒకరోజు ముందే సందర్శిస్తే బాగుంటుంది. పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశాం. తాగునీరు, వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాం. – ఒడ్డెన్న, జిల్లా ఇంటర్ బోర్డు అధికారి, హైదరాబాద్ -
ఎండలు అలా.. కరెంటు ఇలా..!
గ్రేటర్లో పెరిగిన ఎండలు విద్యుత్ డిమాండ్ ౖపైపెకి..సోమవారం మధ్యాహ్నం ఎండతో నిర్మానుష్యంగా మారిన బషీర్‌బాగ్ చౌరస్తాసాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎండలు భగ్గున మండుతున్నాయి. సోమవారం హైదరాబాద్ జిల్లా షేక్‌పేటలో గరిష్టంగా 36.2 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఇండస్ట్రియల్ ఏరియాలో అత్యధికంగా 38.2 సెల్సియస్ డిగ్రీలు నమోదైంది. అదేవిధంగా మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో 38 డిగ్రీలు నమోదు కాగా, వికారాబాద్ జిల్లా మొమిన్‌పేటలో 38.1 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణంగా మధ్యాహ్నం 12 తర్వాత రికార్డయ్యే ఎండలు..ప్రస్తుతం ఉదయం 10 గంటలకే నమోదవుతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలకు ఉక్కపోత తోడవడంతో ఇంట్లోని ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్ల వినియోగం భారీగా పెరిగింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం గృహ విద్యుత్ వినియోగం 25 శాతం అధికంగా నమోదవుతున్నట్లు డిస్కం ఇప్పటికే స్పష్టం చే సింది. సోమవారం అత్యధికంగా 70 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఈ సీజన్లో ఇదే అత్యధికం. నేటి నుంచి మరో నాలుగు రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో విద్యుత్ డిమాండ్ కూడా అదేస్థాయిలో నమోదయ్యే అవకాశం లేకపోలేదు. మార్చి చివరి నాటికి వంద ఎంయూలకు దాటే అవకాశం ఉన్నట్లు డిస్కం ఇంజనీర్లు అంచనా వేశారు. ఆ మేరకు ముందస్తు ఏర్పాట్లు కూడా చేశారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త డాక్టర్ వెంకటి, డీఎంహెచ్ఓ, హైదరాబాద్ ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి తెలిపారు. ‘సాధారణంగా మనిషి శరీరం 37 డిగ్రీల ఉష్ణోగ్రతలను మాత్రమే తట్టుకుంటుంది. ఆపై నమోదయ్యే ఉష్ణోగ్రతలను తట్టుకోలేదు. ఎండకు చర్మం నల్లగా కమిలిపోవడంతో పాటు డిహైడ్రేషన్కు లోనవుతుంటారు. మూత్రంలో మంట, కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతుంటాయి. కాబట్టి ఎండల నుంచి కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లో వండిన ఆహారమే తీసుకోవాలి. నీళ్లు బాగా తాగాలి’ అని ఆయన పేర్కొన్నారు. గత వారం గ్రేటర్లో విద్యుత్ డిమాండ్ ఇలా... తేదీ సమయం మెగావాట్లు ఫిబ్రవరి 26 09.23 3306 27 18.55 3272 28 18.56 3398 మార్చి 01 19.02 3254 02 19.14 3017 03 18.00 3369 షేక్‌పేటలో గరిష్టంగా 36.2 డిగ్రీలు.. మహేశ్వరంలో 38.2 డిగ్రీలు నమోదు రికార్డు స్థాయిలో (70 ఎంయూలు) విద్యుత్ డిమాండ్ ఇష్టానుసారం ఎల్సీలు తీసుకుంటే..ఇక వేటే ఇష్టానుసారం ఎల్సీలు ఇక కుదరదు ముషారఫ్ ఫారూఖీ, సీఎండీ, ఎస్పీడీసీఎల్ గతంతో పోలిస్తే గృహ విద్యుత్ వినియోగం ప్రస్తుతం రెట్టింపైంది. ప్రతి ఇంట్లోనూ ఏసీ, కూలర్, రిఫ్రిజిరేటర్లు సర్వసాధారణమయ్యాయి. ఉదయం, మధ్యాహ్నంతో పోలిస్తే..సాయంత్రం వేళ విద్యుత్ డిమాండ్ అనుహ్యంగా పెరుగుతోంది. ఇలాంటి సమయంలో అనివార్యమైతే తప్ప...ఎల్సీ(లోడ్ రిలీఫ్)లు తీసుకోవద్దని సీఎండీ ముషారఫ్ ఫారూఖీ ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేశారు. రేపటి నుంచి 25 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా చూడాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఇంజనీర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. -
పుట్టిన వెంటనే వినికిడి పరీక్షలు చేయించాలి
సాక్షి, సిటీబ్యూరో: అప్పుడే పుట్టిన బిడ్డకు తప్పనిసరిగా వినికిడి పరీక్ష నిర్వహించాలని పర్యావరణ, దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ప్రపంచ హియరింగ్ డే సందర్భంగా జూబ్లీహిల్స్ మా ఈఎన్టీ ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. మనిషికి అందం, ఐశ్వర్యం ఉన్నా వినికిడి జ్ఞానం లేనపుడు ఆ జీవితం అంధకారంలో ఉన్నట్లు అనిపిస్తుందన్నారు.‘పిల్లలు మనం మాట్లాడినపుడు విని మాటలు నేర్చుకుంటారు. వినలేకపోతే మూగవారిగా మారిపోయే ప్రమాదం ఉంది. ఎదుటి వ్యక్తి చెప్పినపుడు మనకు ఆ మాట వినిపించకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. చికిత్సలు చేయించుకోవడానికి కొంత మందికి ఆర్థిక స్థోమత సహకరించకపోవచ్చు.అందుకే మూగ, చెవుడు చికిత్సలకు వైఎస్సార్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో రూ.7 లక్షల వరకు అందించింది. తరువాత వచ్చిన ప్రభు త్వం దీన్ని నిలిపివేసింది. మా ప్రభుత్వంలో పునరుద్ధరించడానికి ప్రతిపాదిస్తాం. ఆయన వైద్యుడు కాబట్టే మనిషి ఆరోగ్యం విలువ తెలిసిన వ్యక్తిగా ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చి, అందరికి నాణ్యమైన వైద్యం అందించారు. వైఎస్సార్‌కు రూపాయి డాక్టర్ అనే పేరుండేది’ అని మంత్రి గుర్తుచేశారు.ఆసుపత్రులు డబ్బులే కాకుండా పేదలకు కొంత సేవా దృక్పథంతో ఉచితంగా చికిత్సలు అందించా లని కోరారు. మా ఇంట్లోనూ వినికిడి సమస్య వంశపారంపర్యంగా(జెనిటిక్) వస్తుందని తెలిపారు. మా ఈఎన్టీ ఆసుపత్రి వైద్యుడు మేఘనాథ్ మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ సేవ్ ద ఫ్యూచర్ అనే నినాదంతో ఈ ఏడాది హియరింగ్ డే జరుపుకుంటోందన్నారు. కార్యక్రమంలో మా ఈఎన్టీ ఆసుపత్రి ఎండీ సునీత జీ కుమార్, వైద్యులు పాల్గొన్నారు. -
ప్రతి మెట్రో స్టేషన్ వద్ద సురక్షితంగా రోడ్డు దాటేలా పైవంతెనలు
స్కైవాక్స్‌ను ప్రోత్సహిస్తాం: మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆసక్తి చూపే సంస్థలకు అవకాశం ఇస్తామని వెల్లడిసాక్షి, సిటీబ్యూరో: మెట్రో స్టేషన్ల నుంచి నేరుగా వాణిజ్య భవనాల్లోకి రాకపోకలు సాగించేవిధంగా స్కైవాక్‌ల ఏర్పాటును ప్రోత్సహించేందుకు హైదరాబాద్ మెట్రో రైలు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం రాయదుర్గం మెట్రోస్టేషన్ నుంచి రహేజా మైండ్‌స్పేస్‌కు వెళ్లేందుకు అనుకూలంగా ఏర్పాటు చేసిన స్కైవాక్ తరహాలోనే అవసరమైన అన్ని మెట్రోస్టేషన్ల వద్ద అలాంటి స్కైవాక్‌లను అందుబాటులోకి తేనున్నారు. అలాగే ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు, వాహన కాలుష్య నియంత్రణకు కూడా ఈ స్కైవాక్‌లు దోహదం చేయనున్నాయి. ఈ మేరకు మెట్రో స్టేషన్ల నుంచి సమీపంలో వాణిజ్య, నివాస భవనాల సముదాయాలకు పైవంతెనల (స్కైవాక్స్) నిర్మాణాన్ని ప్రోత్సహించాలని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌లు నిర్ణయించారు. ఈ మేరకు ఇటీవల హెచ్ఎండీఏ కార్యాలయంలో జరిగిన కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ (సీఎంపీ) సమావేశంలో ఈ అంశంపైన చర్చించారు. ప్రస్తుతం పంజగుట్ట, హైటెక్ సిటీ, ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ల నుంచి నేరుగా మాల్స్‌లోకి వెళ్లేందుకు స్కైవాక్‌లు ఉన్నాయి. ఎల్అండ్టీ స్వయంగా వీటిని ఏర్పాటు చేసింది. అదే విధంగా జేబీఎస్, పెరేడ్ గ్రౌండ్ స్టేషన్లకు స్కైవాక్‌లు ఉన్నాయి. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి రహేజా మైండ్ స్పేస్ కాంప్లెక్స్ లోని 11 టవర్లకు స్కైవాక్ ద్వారా రాకపోకలు సాగించవచ్చు. పలు అంతర్జాతీయ సంస్థల్లో పనిచేస్తున్న వందలాది మందికి ఇది ఎంతో సౌకర్యంగా ఉంది. స్కైవాక్‌ల నిర్మాణానికి స్వాగతం... ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి రింగ్‌రోడ్డుకు అన్ని వైపులా రాకపోకలు సాగించేందుకు అనుగుణంగా హెచ్ఎండీఏ నిర్మించిన వలయాకారపు రోటరీ స్కైవాక్ మెట్రో ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతుందని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. ఇలా నగరంలోని వివిధ మెట్రోస్టేషన్ల వద్ద ఉన్న స్కైవాక్స్‌ను దృష్టిలో ఉంచుకొని మెట్రో స్టేషన్ల నుంచి స్కైవాక్‌ల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలు, ఐటీ కంపెనీలు, నివాస భవనాలు, వాణిజ్య సముదాయాల నుంచి ఇప్పటికే అనూహ్యమైన స్పందన లభిస్తోందన్నారు. ఈ క్రమంలో బాలానగర్ మెట్రో స్టేషన్ నుంచి సమీపంలో నిర్మాణంలో ఉన్న ఫీనిక్స్, ల్యాండ్ మార్క్ మాల్ కొత్తగా స్కైవాక్ నిర్మాణం కొనసాగుందన్నారు. అలాగే ఎల్బీనగర్ స్టేషన్ నుంచి సమీపంలో నిర్మాణంలో ఉన్న వాసవీ ఆనంద నిలయం నివాస భవనాల సముదాయానికి రాకపోకలు సాగించేందుకు వాసవి గ్రూప్ స్కైవాక్ నిర్మిస్తుందన్నారు. వాసవి ఆనందనిలయం కాంప్లెక్స్ మొత్తం 25 ఎకరాలలో ఒక్కో టవర్‌లో 33 అంతస్తులతో మొత్తం 12 టవర్లు నిర్మిస్తోందని చెప్పారు. మరోవైపు నగరంలో 69 కిలోమీటర్ల మేర విస్తరించిన మెట్రో కారిడార్లలోని 57 స్టేషన్లలో ప్రతి స్టేషన్‌కు రెండు వైపులా రోడ్డుకు ఒక వైపు నుంచి మరో వైపునకు చేరుకునేందుకు మెట్రో వంతెనలు ఉన్నాయని, పాదచారులు వాటిని వినియోగించుకొని సురక్షితంగా రోడ్డు దాటాలని ఎన్వీఎస్ కోరారు. ఇలా సంప్రదించండి.. మరికొన్ని సంస్థలు నాగోల్, ఉప్పల్ స్టేడియం, దుర్గం చెరువు, కూకట్పల్లి తదితర మెట్రో స్టేషన్ల నుంచి స్కైవాక్‌లు నిర్మించేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు. ప్రైవేట్ సంస్థలు మెట్రో స్టేషన్ల నుంచి స్కైవాక్‌లు నిర్మించదలిస్తే ఎల్అండ్టీ ప్రతినిధి కేవీ నాగేంద్ర ప్రసాద్‌ను (ఫోన్ నెంబర్ 9900093820) సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. -
మహిళ అనుమానాస్పద మృతి
భర్తే కొట్టి చంపాడని మృతురాలి బంధువుల ఆరోపణచాదర్ఘాట్: అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్ఐ రవిరాజ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అక్బర్‌బాగ్ డివిజన్ జమున టవర్స్‌లో 106 సింగం వినయ్, శిరీష(32) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కుమార్తె. శిరీష ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పని చేస్తుండగా, ఆమె భర్త వినయ్ ప్రైవేట్ ఉద్యోగి. ఆదివారం శిరీషకు గుండెపోటు వచ్చిందని ఆమె మేనమామ మధుకర్‌కు శిరీష స్నేహితురాలు సమాచారం అందించింది. దీంతో మధుకర్ ఆమె ఇంటికి వెళ్లేలోగా వినయ్ ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. శిరీషను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించాడు. దీంతో వినయ్ శిరీష మృతదేహాన్ని తీసుకుని అంబులెన్స్‌లో తన స్వగ్రామమైన దోమలపెంటకు బయలుదేరి వెళ్లాడు. దీనిపై అనుమానం వచ్చిన మధుకర్ చాదర్‌ఘాట్ పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే స్పందించిన పోలీసులు అంబులెన్స్ డ్రైవర్‌కు ఫోన్ చేసి మృతదేహాన్ని వెనక్కి రప్పించారు. కాగా శిరీష శరీరంపై గాయాలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. శిరీషను ఆమె భర్త వినయ్ కొట్టి చంపాడని మేనమామ మధుకర్ ఆరోపిస్తున్నారు. శిరీషపై అనుమానం పెంచుకున్న వినయ్ తరచూ ఆమెను వేధించేవాడని తెలిపాడు. 2017లో వారు ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు తెలిపాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న చాదర్‌ఘాట్ పోలీసులు ఆమె భర్త వినయ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు పేర్కొన్నారు. -
పాత లేఔట్లలోనే కబ్జాల జోరు
సాక్షి, సిటీబ్యూరో: రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పాత లేఔట్లలోనే కబ్జాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తమ ప్లాట్లతో పాటు ప్రజావసరాలకు ఉద్దేశించిన పార్కులు, రహదారులను కబ్జా చేసేస్తున్నారంటూ ఆయా లేఔట్లకు చెందిన పలువురు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీకి (హైడ్రా) ఫిర్యాదు చేస్తున్నారు. కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 49 ఫిర్యాదులు రాగా... అత్యధికం వీటికి సంబంధించినవే ఉన్నాయి. 1980–90 దశకాల్లో వేసిన లేఔట్లను మాయం చేసి, ఆ స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటున్న కబ్జారాయుళ్లు మళ్లీ విక్రయాలకు యత్నిస్తున్నారంటూ బాధితులు రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లారు. భూములకు ధరలు అమాంతం పెరగడంతో గతంలో తమకు అమ్మిన వాళ్లే కబ్జాలకు పాల్పడుతున్నారని వాపోయారు. పంచాయతీ లేఔట్లను వ్యవసాయ భూములుగా మార్చేసి సాగు చేసుకుంటున్నారనీ హైడ్రాకు కొన్ని ఫిర్యాదులు అందాయి. వీటిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందిస్తూ ఫిర్యాదుదారుల సమక్షంలోనే గూగుల్ మ్యాప్‌లు, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లను పరిశీలించారు. వాటిలో లభించిన సమాచారం ఆధారంగా సమగ్ర విచారణకు అధికారులను ఆదేశించారు. ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడుతామని కమిషనర్ హామీ ఇవ్వడంతో పలువురు సంతోషం వ్యక్తం చేశారు. ● రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ గ్రామంలో 1980 దశకంలో 2684 ప్లాట్లతో చాణక్యపురి లేఔట్ వేశారు. గత ఏడాది అందులోని 30 ఎకరాలు కబ్జాకు గురైనట్లు పలువురు ఫిర్యాదు చేశారు. అందులోని పార్కులు, రహదారులు కూడా కనుమరుగయ్యాయని ఆరోపించారు. ● రంగారెడ్డి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నం.58, 59లో ఉన్న ఎన్ఎంఆర్–దివ్యానగర్ లేఔట్లో తాము ప్లాట్లు కొన్నామని, ఇప్పుడవి కనిపించట్లేదని యజమానులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఇలా 66 ప్లాట్లు గల్లంతయ్యాయని, ఇప్పుడు అక్కడ వ్యవసాయం చేస్తున్నారని వాపోయారు. ● గచ్చిబౌలిలోని గోపన్నపల్లిలోని టీఎన్జీవో కాలనీలో ఉద్యోగులకు కేటాయించిన భూములు ఉన్నాయి. వీటిలో ఎనిమిది ఎకరాలను కొందరు కబ్జా చేసి ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేశారు. దీనిపై టీఎన్జీవో కాలనీ సంక్షేమ సంఘం (గచ్చిబౌలి) ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ● మేడ్చల్ జిల్లా చెంగిచర్ల గ్రామంలోని సర్వే నం.7, 10లో వేసిన శ్రీపురం కాలనీలో పార్కులు, రహదారులు కబ్జాకు గురయ్యాయని కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. హైడ్రా ప్రజావాణిలో 49 ఫిర్యాదులు -
‘ప్రత్యేక అభివృద్ధి’ పనులు పూర్తి చేయాలి
పురోగతిపై జిల్లా కలెక్టర్ అనుదీప్ సమీక్ష సాక్షి, సిటీబ్యూరో: ప్రత్యేక అభివృద్ధి నిధులతో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఇంజనీరింగ్ శాఖల ఆధ్వర్యంలో ఎస్డీఎఫ్ నిధులతో చేపట్టిన పనుల పురోగతి, పెండింగ్ పనులను సమీక్షించారు. సీడీఎఫ్ పథకం కింద 268 పనులకుగాను 79 పనులు పూర్తి కాగా, మరో 73 పనులు పురోగతిలో ఉన్నాయని, 10 పనులు టెండర్ దశలో ఉన్నాయని పేర్కొన్నారు. మిగిలిన 48 పనులకు స్థల పరిశీలన చేసి ప్రతిపాదనలు సిద్ధంగా ఉంచాలన్నారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, ఎక్కడైనా ఏజెన్సీలు ఇబ్బంది పెడితే తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పనులు పూర్తయిన వాటికి సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లు అందచేయాలని సూచించారు. ఎక్కడైనా స్థలం సమస్య, టెండర్ ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు ఉంటే నివేదిక రూపంలో అందజేయాలనీ కలెక్టర్ అధికారులకు సూచించారు. సమీక్షా సమావేశంలో సీపీవో డాక్టర్ సురేందర్, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
చెత్త వేస్తే .. ఇక ఈ–చలాన్
యూపీఐ ద్వారానే పెనాల్టీల చెల్లింపులు ● యాప్ రూపొందించిన జీహెచ్ఎంసీ ● త్వరలో అందుబాటులోకి .. సాక్షి,సిటీబ్యూరో: ఒక్కో విభాగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్న జీహెచ్ఎంసీ.. డంపర్‌బిన్లలో చెత్త దాదాపు 75 శాతం నిండగానే అలర్ట్ చేసేలా ఆధునిక డంపర్బిన్లను అందుబాటులోకి తెస్తోంది. చెత్త తరలింపునకే కాకుండా ఎక్కడ పడితే అక్కడ చెత్త, నిర్మాణ.. కూల్చివేతల వ్యర్థాలు, ఇతరత్రా వ్యర్థాలు వేసే వారికి విధించే పెనాల్టీలకు ఇకపై ఈ–చలాన్లను జారీ చేయనుంది. అంతేకాదు, చెల్లింపులు సైతం మాన్యువల్‌గా కాకుండా యూపీఐ చెల్లింపులే స్వీకరించనుంది. ఇందుకు గాను జీహెచ్ఎంసీ త్వరలో ప్రత్యేక యాప్‌ను వినియోగంలోకి తేనుంది. ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ ద్వారా ఈ యాప్‌ను రూపొందించారు. నిధులు పక్కదారి పట్టకుండా.. స్వచ్ఛ కార్యక్రమాల అమల్లో భాగంగా జీహెచ్ఎంసీ బహిరంగ ప్రదేశాల్లో చెత్తాచెదారం వేసేవారితో పాటు నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాలు వేసే వారికి పెనాల్టీలు విధిస్తోంది. పెనాల్టీలను చలాన్ బుక్‌ల ద్వారా క్షేత్రస్థాయిలోని అధికారులు జారీ చేస్తున్నారు. అధికారులు తమ ఇష్టానుసారం పెనాల్టీలు విధించడం, ఎక్కువ పెనాల్టీ వసూలు చేసి జీహెచ్ఎంసీ పుస్తకాల్లో మాత్రం తక్కువ మొత్తాలు రాస్తూ తమ జేబులు నింపుకునే పనులకు పాల్పడుతున్నారు. దీంతో ప్రజలు చెల్లిస్తున్న పెనాల్టీల సొమ్ము మొత్తం జీహెచ్ఎంసీ ఖజానాకు చేరడం లేదు. చలాన్ బుక్‌ల ద్వారా జారీ చేసిన వాటిలో ఎన్నింటికి పెనాల్టీలు వసూలయ్యాయో వంటి సమాచారం సైతం ఉండటం లేదు. ఈ నేపథ్యంలో వాహన నిబంధనలు ఉల్లంఘించే వారికి ట్రాఫిక్ పోలీసుల ఈ–చలాన్ ల మాదిరిగా వ్యర్థాలు వేసేవారికి క్షేత్రస్థాయిలోని ఏఎంఓహెచ్‌లు, డీఈఈలు, ఏసీపీలు, తదితర అధికారులు ఈ–చలాన్లు జారీ చేయనున్నారు. రెండు మూడు రోజుల్లో యాప్‌పై సంబంధిత అధికారులకు శిక్షణ ఇచ్చిన తర్వాత యాప్‌ను వినియోగంలోకి తెస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ సీఎన్ రఘుప్రసాద్(పారిశుధ్యం) తెలిపారు. ఏ ఉల్లంఘనకు ఎంత పెనాల్టీ విధించాలో యాప్ ద్వారా ఆటోమేటిక్‌గానే జనరేట్ అవుతుందన్నారు. పెనాల్టీలను యూపీఐ ద్వారానే చెల్లించాల్సి ఉంటుందన్నారు. తద్వారా క్షేత్రస్థాయిలోని అధికారులు ఇకపై ఇష్టారాజ్యంగా వ్యవహరించే వీలుండదు. చార్మినార్ జోన్‌కు అధికంగా.. గతంలో స్వచ్ఛ ర్యాంకింగ్స్ కోసం డంపర్బిన్లను తొలగించిన జీహెచ్ఎంసీ అధికారులు అవి లేనిదే చెత్త సమస్యలు తీరవని గ్రహించి తిరిగి వాటిని ఏర్పాటు చేస్తున్నారు.ఆటోమేటిక్‌గా చెత్త పూర్తిగా నిండకముందే అలర్ట్ చేసే సాంకేతికతతో కూడిన డంపర్బిన్లను దాదాపు వెయ్యి చెత్త వల్నరబుల్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 260 డంపర్బిన్లు సమకూర్చుకోగా రంజాన్ మాసాన్ని దృష్టిలో ఉంచుకుని చార్మినార్ జోన్‌కు అధికంగా 134 డంపర్బిన్లు తరలించారు. వాటిల్లో 121 బిన్లను వల్నరబుల్ ప్రాంతాల్లో ఉంచారు. ఖైరతాబాద్జోన్కు 20 బిన్లు తరలించగా, వాటిల్లో ఆరింటిని వల్నరబుల్ప్రాంతాల్లో అమర్చారు. మిగతా వాటిని ఏర్పాటు చేసే పనుల్లో ఉన్నారు. శానిటరీ జవాన్లా మజాకా ? జీహెచ్ఎంసీలో ఉన్న 269 మంది శానిటరీ జవాన్లలో 139 మందిని ఇటీవల బదిలీ చేయడం తెలిసిందే. వారు బదిలీ అయిన స్థానాల్లోకి వెళ్లక ముందే స్థానిక కార్పొరేటర్ల నుంచి మొదలు పెడితే.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ దాకా తమ పరిధిలోని శానిటరీ జవాన్ల బదిలీ నిలిపివేయాలంటూ సంబంధిత ఉన్నతాధికారుల వద్దకు క్యూలు కడుతున్నారు. స్వచ్ఛ ర్యాంకింగ్ కోసం కేంద్ర బృందం నగరంలో పర్యటిస్తున్న తరుణంలో పారిశుధ్యం బాగుండాలనే తలంపుతో కమిషనర్ శానిటరీ జవాన్లను బదిలీ చేసినట్లు తెలుస్తోంది. వారిలో చాలామందికి రాజకీయ అండదండలుండటంతో చేయాల్సిన పనులు చేయడం లేరు. రెగ్యులర్ ఉద్యోగులైన శానిటరీ జవాన్లు తమ పనుల్ని ఔట్‌సోర్సింగ్‌పై నియమితులైన శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లకు అప్పగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఒకే చోట పనిచేస్తున్న శానిటరీ జవాన్లలో గత 35 ఏళ్లుగా ఒకేచోట పని చేస్తున్నవారు కూడా ఉండటం విశేషం.సీఅండ్ డీ వ్యర్థాల ద్వారా దాదాపు నాలుగునెలల నుంచి నిర్మాణ, కూల్చివేతల(సీఅండ్‌డీ) వ్యర్థాలను క్షేత్రస్థాయిలో గుర్తించి పెనాల్టీలు విధిస్తున్న టౌన్‌ప్లానింగ్ ఏసీపీలు ఇప్పటి వరకు రూ. 54,15,792 పెనాల్టీలు విధించారు. ఒక్క కాప్రా సర్కిల్లోనే రూ.7,27,500 పెనాల్టీలు విధించారు. చెత్త వేసిన వారికి.. రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసిన వారికి జనవరి ఒకటో తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు రూ.2,33,600 పెనాల్టీలు విధించారు. ఈ–చలాన్ యాప్ అందుబాటులోకి వస్తే పెనాల్టీల మొత్తం ఇంకా పెరిగే అవకాశంతోపాటు, ఉల్లంఘనులు చెల్లించే సొమ్ము నేరుగా జీహెచ్ఎంసీ ఖజానాలోనే జమ అవుతుంది. -
ఎన్టీఆర్ ఘాట్ వద్ద కారు బీభత్సం
లక్డీకాపూల్ : నెక్లెస్ రోడ్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు డివైడర్‌ను ఢీ కొని ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ముప్పు తప్పింది. సోమవారం ఖైరతాబాద్ జంక్షన్ నుంచి సెక్రటేరియేట్ వైపు వెళుతున్న ఓ కారు అతివేగం కారణంగా ఎన్టీఆర్ ఘాట్ మలుపు వద్ద అదుపు తప్పింది. కారు డివైడర్‌పైకి దూసుకెళ్లి కరెంట్ పోల్‌ను ఢీకొనడంతో పోల్ రోడ్డపై అడ్డంగా విరిగిపడింది. ఈ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో విద్యుత్ స్తంభంతో పాటు రెండు చెట్లు ధ్వంస మయ్యాయి. కాగా కారు నడిపిన వ్యక్తి కూడా సురక్షితంగా బయటపడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కారు నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడా అనే కోణంలో విచారణ చేపట్టారు. ప్రమాదం అనంతరం కారు డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయినట్లు సమాచారం. రోడ్డు డివైడర్‌ను ఢీకొనిఫుట్పాత్ పైకి ఎక్కిన కారు.. -
ఆర్చిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ సీజ్
గోల్కొండ: ఎలాంటి అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల భవనంలో కొనసాగుతున్న ఓ పాఠశాలను సోమవారం విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. డిప్యూటీ ఈవో సి.హెచ్.వెంకటరమణ ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీసుల సమక్షంలో విద్యార్థులందరినీ ఇంటికి పంపి పాఠశాల గేట్లకు తాళం వేశారు. గత సంవత్సరం ప్రారంభమైన ఈ పాఠశాలకు ఎలాంటి అనుమతులు లేవని డిప్యూటీ ఈవో తెలిపారు. విద్యా శాఖ ఆర్జేడీ కార్యాలయం నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు స్కూల్‌ను సీజ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఐదంతస్తుల భవనంలో కొనసాగుతున్న ఈ పాఠశాలకు అగ్నిమాపక విభాగం అధికారుల అనుమతులు లేవని తెలిపారు. ట్రాఫిక్ అధికారులు, బల్దియా విభాగం నుంచి ఎలాంటి అనుమతులు లేవని, పాఠశాలకు గుర్తింపు సైతం లేదన్నారు. పలుమార్లు పాఠశాలకు వచ్చి ప్రిన్సిపాల్‌ను అనుమతుల విషయమై హెచ్చరించామని, అయినా యాజమాన్యం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ నేపథ్యంలో గత నెల 2న పాఠశాల ప్రిన్సిపాల్, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి, అనుమతులు లేనందున సదరు పాఠశాలలో పిల్లలను చేర్పించవద్దని ఇక్కడ ఉన్న పిల్లలను వేరే పాఠశాలలోకి మార్చుకోవాలని స్పష్టం చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల సూచనమేరకు పాఠశాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఆయన వెంట డిప్యూటీ తహసీల్దార్ వెంకట్‌రెడ్డి, డిప్యూటీ ఐఓఎస్ మహ్మద్ బషీర్‌తో పాటు విద్యాశాఖకు చెందిన సయ్యద్ జాఖేర్, మహ్మద్ నసీర్ తదితరులున్నారు. విద్య పేరుతో దోపిడీ... ఆర్చీడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం పిల్లల భద్రతను గాలికి వదిలేసి ఫీజుల పేరిట దోపిడీ చేస్తుందని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాలను సీజ్ చేసినట్లు తెలియడంతో నానల్‌నగర్ పరిసర ప్రాంతాల్లోని తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. గేట్లకు తాళం వేసి ఉండడం చూసి స్కూల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే వేలల్లో ఫీజులు చెల్లించామని విద్యా సంవత్సరం చివరలో తమ విద్యార్థుల భవిష్యత్తు ఏమిటని విద్యాశాఖ అధికారులను నిలదీశారు. వచ్చే నెలలో పరీక్షలు ఉన్నాయని దాని కోసం పిల్లలు కష్టపడి చదువుతున్నారని ఇప్పుడు పాఠశాలకు తాళం వేస్తే వారి పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలో కనీస సౌకర్యాలు లేవన్న విషయం తమకు తెలియదని ప్రభుత్వ గుర్తింపు ఉందని ఇప్పటి వరకు పాఠశాల యాజమాన్యం చెబుతూ వచ్చిందని వారు ఆరోపించారు. అనుమతులు లేకుండా నిర్వహణ పలు మార్లు విద్యాశాఖ అధికారుల హెచ్చరికలు పట్టించుకోని స్కూల్ యాజమాన్యం -
174 మంది జూనియర్ అసిస్టెంట్లకు పోస్టింగులు
సాక్షి,సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో 174 మంది జూనియర్ అసిస్టెంట్లకు సోమవారం నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పోస్టింగ్ ఆర్డర్లను అందజేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 4 ఉద్యోగాల రిక్రూట్మెంట్లో భాగంగా జీహెచ్ఎంసీకి కేటాయించిన వారిలో రిపోర్టు చేసిన 174 మందికి పోస్టింగ్ ఆర్డర్స్ అందజేశారు. వారిని ప్రధాన కార్యాలయంతోపాటు జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని రిలాక్స్ కావద్దని, ప్రతి ఉద్యోగి బాధ్యతగా, అంకితభావంతో పనిచేసి కార్పొరేషన్‌కు మంచి పేరు తీసుకురావాలని కోరారు. క్రమశిక్షణతో పనిచేసి ప్రజలకు మంచి సేవలు అందించినప్పుడే ఉద్యోగికి గుర్తింపుతో పాటు మరింత ఉన్నతంగా రాణిస్తారన్నారు. నగరంలో హెల్త్, శానిటేషన్ నిర్వహణ బాగుండాలని, ఆ విషయంలో ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పరిపాలన విభాగం అడిషనల్ కమిషనర్ వేణుగోపాల్, జాయింట్ కమిషనర్ శ్రీనివాస్,ఏఎంసీ జీవన్ కుమార్,తదితరులు పాల్గొన్నారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
గచ్చిబౌలి: ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సీహెచ్ వెంకన్న కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా, తోర్మామిడికి చెందిన కమలాపురం దేవిక(25) మాదాపూర్‌లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తోంది. మంచిర్యాల మార్కెట్ రోడ్డుకు చెందిన సద్గుర్తి శరత్ చంద్రతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీయడంతో పెద్దల అంగీకారంతో వారిరువురు గత ఆగస్టు 23న గోవాలో పెళ్లి చేసుకున్నారు. రాయదుర్గంలోని ప్రశాంత్‌హిల్స్‌లో నివాసం ఉంటున్నారు. కొద్ది రోజులుగా భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా వారి మధ్య గొడవ జరగడంతో దేవిక గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. బయటికి వెళ్లి తిరిగి వచ్చిన శరత్చంద్ర తలుపు తట్టినా దేవిక స్పందించకపోవడంతో నిద్రపోయి ఉంటుందని భావించాడు. సోమవారం ఉదయం 10 గంటలైనా దేవిక బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన శరత్ చంద్ర తలుపు విరగ్గొట్టి చూడగా ఆమె ఉరి వేసుకుని కనిపించింది. ఇరుగు పొరుగు సహాయంతో కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందింది. వర కట్నం కోసం శరత్చంద్ర తన కుమార్తెను వేధిస్తున్నాడని, ఈ కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని మృతురాలి తల్లి రామలక్ష్మి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కార్మికుల హక్కుల సాధనకు రాజీలేని పోరాటం
సాక్షి, సిటీబ్యూరో: కార్మికుల హక్కుల సాధనకు రాజీలేని పోరాటం చేయాలని వాటర్ వర్క్స్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు రాజీరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం సంజీవరెడ్డి నగర్‌లోని యూనియన్ ఆఫీస్‌లో ప్రధాన కార్యదర్శి శేఖర్ ఆధ్వర్యంలో రాజిరెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐక్యతతోనే సమస్యలు పరిష్కారమవుతాయని, అందుకు కలిసి కట్టుగా మందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు సతీష్ కుమార్,జనరల్ సెక్రెటరీ రాఘవేంద్ర రాజు పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో డీఈఈ
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ క్వాలిటీకంట్రోల్ విభాగంలో డిప్యూటీ ఈఈగా పనిచేస్తున్న ఎ.దశరథ్ ముదిరాజ్ ఫైల్స్ క్లియర్ చేయడానికి, వాటిని ఈఈకి పంపించేందుకు ఒక వ్యక్తిని రూ.20వేలు డిమాండ్ చేసి, తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. లంచం సొమ్మును స్వాధీనం చేసుకొని నాంపల్లి ఏసీబీ కేసుల కోర్టులో హాజరు పరిచారు. అడ్వాన్స్‌గా అంతకు ముందే రూ. 10వేలు తీసుకున్నట్లు ఏసీబీ పేర్కొంది. కంటోన్మెంట్లో సీబీఐ దాడులు! కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్లో సీబీఐ దాడులు కలకలం సృష్టించాయి. సికింద్రాబాద్ డిఫెన్స్ ఎస్టేట్స్ ఆఫీస్‌లో గత నెలలో సీబీఐ సోదాలు జరగడంతో ఇటు డీఈఓ కార్యాలయంతో పాటు కంటోన్మెంట్ ఉద్యోగుల్లోనూ వణుకు మొదలైంది. విశ్వసనీయ సమాచారం మేరకు రక్షణ భూముల్లో అక్రమ నిర్మాణాల అంశంతో పాటు డీఈఓ కార్యాలయ సిబ్బంది, రక్షణ భూముల కబ్జాదారుల నుంచి అక్రమ వసూళ్లపై ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ప్రాథమిక ఆధారాలతో ఫిర్యాదులు అందడంతోనే సీబీఐ అధికారులు దాడులు నిర్వహించినట్లు సమాచారం. దీంతో సదరు ఉద్యోగి కాల్ డేటా, బ్యాంకు లావాదేవీలు, కార్యాలయ సిబ్బంది సహకారంపై కూడా ఆరాతీసినట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి నర్సాపూర్ : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ఐ లింగం కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన సాయి నిఖిల్(21), అతడి మిత్రుడు మనీశ్ ఆదివారం మెదక్‌లో జరిగిన వారి మిత్రుడి వివాహానికి హాజరయ్యారు. రాత్రి ఇంటికి తిరిగి బయలుదేరారు. నర్సాపూర్ మీదుగా హైదరాబాద్ వెళ్తుండగా నర్సాపూర్ శివారులోని అయ్యప్ప దేవాలయం సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న రెయిలింగ్‌కు బైక్ ఢీకొట్టంది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న నిఖిల్ అక్కడికక్కడే మృతి చెందగా వెనుక కూర్చున్న మనీశ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి అనంతరం మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డికి తరలించారు. బైక్‌ను అతి వేగంగా అజాగ్రత్తగా నడిపినందునే అదుపుతప్పి ప్రమాదం జరిగిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ప్రేమ పేరుతో వంచన..యువకుడిపై కేసు
బంజారాహిల్స్: ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతితో చెట్టాపట్టాలేసుకుని తిరిగి..ఆమెను గర్భవతిని చేసి..ఆపై ముఖం చాటేసిన యువకుడిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే..గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన ఓ యువతి (25)కి అదే ప్రాంతానికి చెందిన ఎన్.శివాచారితో 2020 ఆగస్టులో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని శివాచారి నమ్మించడంతో ఆమె సన్నిహితంగా మెలిగింది. ఇటీవలే శివాచారి కేపీహెచ్‌బీకి మకాం మార్చగా యువతి కూడా బంజారాహిల్స్‌కు వచ్చి ఓ ఆస్పత్రిలో పనిచేస్తూ హాస్టల్లో ఉంటుంది. ఇక్కడ కూడా తరచూ కలుసుకునేవారు. ఆమె రెండుసార్లు గర్భం దాల్చగా, బలవంతంగా మాయమాటలు చెప్పి గర్భస్రావం చేయించాడు. గత నెల నుంచి శివాచారి ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు గమనించింది. లోతుగా ఆరా తీయగా శివాచారికి ఆరు నెలల క్రితమే మరో యువతితో నిశ్చితార్ధం జరిగినట్లుగా తెలిసింది. దీంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడింది. నాలుగు నెలల్లో పెళ్లి చేసుకుంటానని నమ్మించిన నిందితుడు పెళ్లి చేసుకోగా మరో యువతితో నిశ్చితార్ధం చేసుకోవడమే కాకుండా తమ ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడం లేదని, వాట్సప్ బ్లాక్ చేశాడని, తనను మోసం చేశాడని బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శివాచారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి మాచర్ల పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. పరీక్షల వేళ భయాందోళన వద్దు మొయినాబాద్‌రూరల్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు భయాందోళనకు గురికావొద్దని తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియెట్ ప్రైవేట్ కళాశాలల అసోసియేషన్ చైర్మన్ గౌరీ సతీష్ అన్నారు. మండల పరిధిలోని హిమాయత్‌నగర్‌లో ఆదివారం ఆయన మాట్లాడారు. ఈనెల 5 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఇంటర్‌బోర్డు నియమావళిని తూచా తప్పకుండా పాటించాలన్నారు. ఉదయం 8.45 గంటలలోపు వచ్చిన వారినే పరీక్షలకు అనుమతించనున్నారని, ఆ తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరని చెప్పారు. సమయాన్ని పాటి స్తూ విద్యార్థులు 30 నిమిషాల ముందే పరీక్ష కేంద్రాలకు వెళ్లాలని బోర్డు తొలిసారి నిబంధనలు అమలులోకి తెచ్చిందన్నారు. తల్లిదండ్రు లు విద్యార్థులను ప్రోత్సహిస్తూ.. పరీక్ష కేంద్రాలకు తగిన సమయానికి తీసుకెళ్లాలన్నారు. ఏవైనా సందేహాలుంటే 92402 05555 టో ల్‌ఫ్రీ నంబర్‌తో పాటు జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. క్రీడలను ప్రోత్సహించాలి హుడాకాంప్లెక్స్: బీసీసీఐ వద్ద ఉన్న నిధులను ఇతర క్రీడలకు మళ్లించి క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కిగౌడ్ అభిప్రాయపడ్డారు. హీరో సుమన్ 50 ఏళ్ల నట జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం ‘సుమన్ తల్వార్ లెజెండరీ కప్–2025’ పేరిట రాష్ట్ర స్థాయి ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మధుయాష్కి మాట్లాడుతూ.. యువత డ్రగ్స్, మద్యం ఇతర వ్యసనాల బారిన పడుతూ జీవితాలను పాడు చేసుకుంటున్నారని, క్రీడలను అలవాటు చేసుకోవడం ద్వారా వారి జీవితాలను క్రమశిక్షణగా తీర్చిదిద్దుకోవచ్చని సూచించారు. మద్యం తాగి వాంతులు చేసుకుని.. వలస కూలీ మృతిమొయినాబాద్: మద్యం తాగి వాంతులు చేసుకుని ఓ వలస కూలీ మృతి చెందాడు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధి అజీజ్‌నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిస్సా రాష్ట్రానికి చెందిన నీలాంచల్ బెహెర(33) బతుకు దెరువుకోసం 3 ఏళ్ల క్రితం అజీజ్‌నగర్‌కు వలస వచ్చాడు. సోడా కంపెనీలో కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో మద్యం తాగి పడుకున్నాడు. రాత్రి 8 గంటల సమయంలో అక్కడే పనిచేసే అతని బంధువు ఈశ్వర్ మహకుల్ భోజనం చేయడానికి నీలాంచల్‌ను నిద్ర లేపాడు. ఆ సమయంలో వాంతులు చేసుకుని మళ్లీ పడుకున్నాడు. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో నిద్రలేపే ప్రయత్నం చేయగా.. అతను లేవలేదు. వెంటనే స్థానిక భాస్కర ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచిగాంధీకి తీసుకెళ్లగా.. బెహెర చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
ప్రతి ఇంట్లో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకోండి
శంకర్పల్లి: పిల్లల తల్లిదండ్రులందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నా.. ప్రతి ఇంట్లో ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకోండని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ఐపీఎస్ మాజీ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. మండలంలోని దొంతాన్పల్లిలో ఆదివారం సక్సెస్ షోటోకాన్ కరాటే ఆధ్వర్యంలో నిర్వహించిన 9వ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరాటే నేర్చుకోవడం ఎంత ముఖ్యమో, దానిని నిత్యం సాధన చేయడం అంత కన్నా ముఖ్యమని తెలిపారు. ఫోన్లలో సోషల్ మీడియా, టీవీలు చూడడం తగ్గించి పుస్తక పఠనంపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో సక్సెస్ షోటోకాన్ కరాటే ప్రతినిధులు రవీందర్ కుమార్, అనిల్, రాజు, శ్రీనివాస్, నాయకులు శ్రీనివాస్, లక్ష్మణ్‌నాయక్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల అరెస్టు
అత్తాపూర్: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను అత్తాపూర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..చంద్రాయణగుట్టకు చెందిన మీర్ ముస్తఫా అలీ, ఎంఎం పహాడీకి చెందిన షేక్ ఖయ్యూమ్‌లు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేయడమే వత్తిగా మలుచుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు దాదాపు 80 కేసులు నమోదై ఉన్నాయి. వీరు తరచు దొంగతనాలు చేస్తూ పట్టుబడిన ప్రతిసారి బైయిల్‌పై బయటకు వస్తు తిరిగి అదే పంథాను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే గత నెల 25వ తేదీన టీఎస్12ఈఏ 4398 నెంబర్ గల వారి యాక్టివా స్కూటీకి డూప్లికేట్ టీఎస్09ఈవై 0733 నంబర్ ప్లేట్‌ను అతికించారు. అనంతరం సర్వారెడ్డి కాలనీకి చేరుకున్నారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోంచి బంగారు పుస్తెల తాడును తెంచుకుని పారిపోయి డూప్లికేట్ నెంబర్‌ప్లేట్, వారు ధరించిన బట్టలు, మాస్క్‌లను తొలగించి ఏమీ తెలియనట్లు ప్రయాణించారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా దొంగలించిన బంగారు గొలుసును జకియా సుల్తానా అనే మహిళకు ఇవ్వడంతో ఆమె విక్రయించిందన్నారు. ముగ్గు రు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 17.5 గ్రాముల బంగారం, యాక్టివా స్కూటీ, రూ.60 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
నెలరోజుల క్రితం ఆత్మహత్య?
గచ్చిబౌలి: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఆలస్యంగా లభ్యమైన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ ఆదివారం తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రాయదుర్గంలోని మహాప్రస్థానం ఎదురుగా ఉండే గుట్టవైపు వేపచెట్టుకు 35–40 ఏళ్ళ వయసున్న ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. శనివారం సాయంత్రం స్థానికులు అటువైపు వెళ్లగా దుర్వాసన రావడంతో గమనించి మొబైల్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని ఉండగా..మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతున్నట్లుగా గుర్తించారు. కింద ఒక బ్యాగు అందులో షర్టులు, ప్యాంట్లు, ఒక కంటి అద్దాలు పెట్టుకొనే బాక్సు ఉన్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు సుమోటోగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా దాదాపు నెల క్రితం ఈ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం -
తక్కువ ధరకు బంగారమంటూ టోకరా
సాక్షి, సిటీబ్యూరో: వాట్సాప్ ద్వారా కాల్స్ చేసి, తక్కువ ధరకు బంగారం విక్రయిస్తానంటూ వల వేసి, అందినకాడికి దండుకుని మోసం చేస్తున్న నేరగాడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. సరూర్‌నగర్ ప్రాంతానికి చెందిన జాలె చంద్రశేఖర్‌రెడ్డి ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్‌లకు బానిసగా మారాడు. ఇతర వ్యసనాలకూ ఉన్న ఇతగాడు తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం సైబర్ నేరగాడి అవతారం ఎత్తాడు. స్నేహితులు, పరిచయస్తుల ద్వారా నగరానికి చెందిన అనేక మంది ఫోన్ నెంబర్లు సేకరించిన ఇతగాడు వారికి వాట్సాప్ కాల్ చేసి తానో బంగారం వ్యాపారిగా పరిచయం చేసుకుంటాడు. ముంబైలో తక్కువ ధరలకు బంగారాన్ని ఖరీదు చేస్తుంటానని, దాన్ని మార్కెట్ రేటు కంటే తక్కువగా విక్రయిస్తానని నమ్మబలుకుతాడు. ఎదుటి వారిని పూర్తిగా నమ్మించడం కోసం వారికి తెలిసిన కొందరి పేర్లు చెప్తాడు. ఇలా కోఠిలో నివసిస్తున్న ఓ వృద్ధుడికి (75) గత ఏడాది డిసెంబర్లో కాల్ చేశాడు. ఆరు తులాల బంగారం రూ.5 లక్షలకు విక్రయిస్తానని నమ్మించాడు. ఆయన నుంచి అడ్వాన్స్‌గా ఆ మొత్తం తన బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకున్నాడు. ఆపై బాధితుడు తన బంగారం విషయంపై చంద్రశేఖర్‌కు ఫోన్ చేసి అడుగుతుండగా... క్రిస్మస్ పండుగతో పాటు ఇతర సాకులు చెప్పి తప్పించుకున్నాడు. తీవ్రంగా ఒత్తిడి చేయగా... ఈ ఏడాది జనవరి 15న నేరుగా వచ్చి బంగారం ఇస్తానని చెప్పాడు. అలా చేయకపోవడంతో బాధితుడు పదేపదే ఫోన్లు చేసినా స్పందించడం మానేశాడు. దీంతో తాను మోసపోయినట్లు తెలుసుకున్న బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ కె.ప్రసాదరావు నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేసి ఆదివారం నిందితుడిని అరెస్టు చేసింది. నగరవాసి నుంచి రూ.5 లక్షలు స్వాహా నిందితుడిని అరెస్టు చేసిన సైబర్ కాప్స్ -
ఖతర్నాక్ కాంతి దత్ !
సాక్షి, సిటీబ్యూరో: తృతీయ ఫైన్ జ్యువెలరీ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా భాగస్వామి అని, టాలీవుడ్, కోలీవుడ్ నటులు సమంత, కీర్తి సురేష్ బ్రాండ్ అంబాసిడర్లు అంటూ నమ్మించి వర్ధమాన వ్యాపారవేత్తల్ని మోసం చేయడంలో దిట్ట తోనంగి కాంతిదత్‌పై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో (సీసీఎస్) కేసు నమోదైంది. గత నెల 22న ఇది రిజిస్టర్ కాగా...ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఇతడిపై జూబ్లీహిల్స్‌తో పాటు సీసీఎస్‌లో కేసులు ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్లో జూబ్లీహిల్స్ అధికారులు అరెస్టు కూడా చేశారు. తాజాగా శేరిలింగంపల్లికి చెందిన సౌజన్య జూపల్లిని రూ.4.5 కోట్ల మేర మోసం చేసిన ఆరోపణలపై సీసీఎస్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విశాఖపట్నానికి చెందిన కాంతిదత్ ఫిల్మ్‌నగర్ పరిధిలోని షేక్‌పేటలో స్థిరపడ్డాడు. జూబ్లీహిల్స్ రోడ్ నం.36లో తృతీయ ఫైన్ జ్యువెలరీ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. ఇందులో భాగస్వామిగా ఉన్న వైజాగ్‌కు చెందిన శ్రీజరెడ్డి తిప్పల రూ.2.50 కోట్లు వెచ్చించారు. 2023 సెప్టెంబర్ 7న బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా చేతుల మీదుగా ఈ షోరూం ప్రారంభమైంది. దీని నిమిత్తం రూ.1.5 కోట్లు ఆమెకు ఇవ్వాలంటూ శ్రీజరెడ్డి దగ్గర తీసుకున్నాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఫోర్జరీ సంతకాలతో ఆమెను డైరెక్టర్ పదవి నుంచి తొలగించిన కాంతి దత్ తన తల్లిని నియమించాడు. శ్రీజ ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ ఠాణాలో కేసు నమోదైంది. ఇదిలా ఉండగా...కాంతి దత్ మొదట ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి నుంచి రూ.3.50 కోట్లు తీసుకుని తృతీయ జ్యువెలరీలో డైరెక్టర్‌గా చేర్చుకున్నాడు. ఈయనతో పాటు గౌతమ్ వ్యక్తిని కూడా నమ్మించి మోసగించడంతో వాళ్లు ఆయా ఠాణాల్లో ఫిర్యాదు చేశారు. గత ఏడాది డిసెంబర్లో జూబ్లీహిల్స్ పోలీసులు కాంతిదత్‌ను అరెస్టు చేశారు. ఆ సందర్భంలో ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డి కూడా ఓ వీడియో విడుదల చేస్తూ సస్టైన్ కార్ట్ వ్యాపారం పేరుతో తనను మోసం చేసినట్లు ఆరోపించారు. మొత్తమ్మీద పలువురి నుంచి దాదాపు రూ.40 కోట్లు తీసుకుని మోసం చేసినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. కాంతి దత్ చేతిలో తాను కూడా రూ.4.5 కోట్లకు మోసపోయానంటూ సౌజన్య గత నెల 21న సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్‌లో తన కుమార్తెను ట్యూషన్‌కు తీసుకువెళ్లినప్పుడు తాను నయోమీ రెస్టారెంట్లో కూర్చుంటానని, అక్కడే తనకు కాంతి దత్ పరిచయం అయ్యాడని ఆమె పోలీసులకు తెలిపారు. అలా మాయమాటలు చెప్పిన అతగాడు శ్రీ స్మేర హాస్పిటాలిటీ పేరుతో లిమిటెడ్ లయబులిటీ పార్ట్నర్షిప్ కంపెనీలో వాటా అంటూ ఆమెను ఆకర్షించాడు. ఈ కంపెనీ పేరుతో బంజారాహిల్స్‌లో నయోమీ రెస్టారెంట్ బ్రాంచ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పాడు. ఆపై దక్షిణ్ కథ సౌత్ ఇండియన్ రెస్టారెంట్, తృతీయ ఫైన్ జ్యువెలర్స్ పేర్లు చెప్పి 2023–24ల్లో దాదాపు రూ.4.5 కోట్ల వరకు సౌజన్య నుంచి తీసుకుని మోసం చేశాడు. ఎట్టకేలకు తాను మోసపోయానని గుర్తించిన బాధితులరాలు సీసీఎస్‌ను ఆశ్రయించడంతో కేసు నమోదైంది. సౌజన్య తన ఫిర్యాదుతో పాటు కాంతి దత్తో చేసిన లావాదేవీలకు సంబంధించిన పూర్తి ఆధారాలు అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మరోపక్క కాంతిదత్‌పై మాదాపూర్ ఠాణాలో గతంలో ఓ హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. బైక్ ట్యాక్సీ డ్రైవర్ రాజశేఖర్ మృతి చెందడంతో నమోదైన ఈ కేసులోనూ ఆయన అరెస్టు అయ్యారు. తృతీయ ఫైన్ జ్యువెలరీ పేరుతో సంస్థ ఏర్పాటు ప్రముఖ సినీ నటుల పేర్లు చెప్పి వరుస మోసాలు ఇప్పటికే ఇతడిపై జూబ్లీహిల్స్, సీసీఎస్‌లో కేసులు మరో బాధితురాలి ఫిర్యాదుతో తాజాగా ఇంకో కేసు.. -
ముగిసిన విజ్ఞాన్ వైభవ్
చివరి రోజు విద్యార్థులతో కిటకిటలాడిన స్టాల్స్ ఆకట్టుకున్న డ్రోన్ షో చందానగర్: గచ్చిబౌలి స్టేడియంలో విజ్ఞాన్ వైభవ్ ఎగ్జిబిషన్ –2025 ఆదివారంతో ముగిసింది. మూడు రోజులపాటు నిర్వహించిన యుద్ధ పరికరాల ప్రదర్శన విద్యార్థులను, యువతను ఎంతో ఆకట్టుకుంది. రక్షణ రంగానికి చెందిన అనేక అరుదైన ఆయుధాలు, పరికరాలు వివిధ స్టాల్స్‌లలో ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగాహన కల్పించారు. రక్షణరంగ ఉత్పత్తుల తయారీలో భారత్ మరో పదేళ్లలో ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా నిలుస్తుందని డీఆర్డీఓ ప్రతినిధులు పేర్కొన్నారు. మూడు రోజులపాటు వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు రక్షణరంగ పరిశోధన కేంద్రాలు, ఉత్పత్తి సంస్థలు తయారు చేసిన ఆయుధాలను తిలకించారు. కార్యక్రమంలో డీఆర్డీవో డ్రోన్ షో అందరినీ ఆకట్టుకుంది. ఇండియన్ ఆర్మీ అధికారులతో విద్యార్థులు ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. అంతరిక్షం నమూనా వద్ద యువతి -
ఫ్రెష్.. ఫిష్
పహాడీషరీఫ్: జల్పల్లి పెద్ద చెరువు చేపలకు గిరాకీ పెరిగింది. నెల రోజులుగా బర్డ్ ఫ్లూ వార్తల నేపథ్యంలో జనం చికెన్, గుడ్లు తినడాన్ని కొంత తగ్గించారు. ఈ నేపథ్యంలో మటన్, చేపల వైపు మొగ్గు చూపుతున్నారు. చికెన్ విక్రయాలు పడిపోవడంతో మటన్ వ్యాపారులు కిలోకు వెయ్యి రూపాయల చొప్పున వరకు విక్రయిస్తున్నారు. ఇంత డబ్బు వెచ్చిచలేని పేద, మధ్య తరగతి ప్రజలు ప్రత్యామ్నాయంగా చేపలు తినేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే స్వచ్ఛమైన నీటితో కూడిన జల్పల్లి చెరువులో కళ్ల ముందే పట్టుకొచ్చిన చేపలను విక్రయిస్తుండటంతో శని, ఆదివారాల్లో నగర శివారు ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి కొనుగోలు చేస్తున్నారు.రుచికరమైన చేపలకు పెట్టింది పేరు...పుష్కలమైన నీటితో నిండుకుండలా తొణికిసలాడుతున్న జల్పల్లి చెరువులో ప్రతీ శని, ఆదివారాల్లో తాజా చేపలను విక్రయిస్తుంటారు. 150 ఎకరాల మేర విస్తరించిన ఉన్న ఈ చెరువులోని చేపలు ఎంతో రుచికరంగా ఉంటాయి. దీంతో ఇక్కడ పెద్ద ఎత్తున చేపల విక్రయాలు కొనసాగుతుంటాయి. ప్రస్తుతం వీరి సంఖ్య రెట్టింపైంది. పాతబస్తీ, కాటేదాన్, శంషాబాద్ తదితర ప్రాంతాల ప్రజలు ఎక్కువగా వస్తుంటారు. పాంప్లెట్స్ రకం కిలో రూ.120 ఉండగా.. సాధారణ చేపలు కిలో రూ.150 చొప్పున విక్రయిస్తున్నారు. రవ్వ, బొచ్చ, కట్ల, గ్యాస్కిట్, కొర్రమీను తదితర రకాల చేపలు ఈ చెరువులో లభ్యమవుతున్నాయి.రెండు సంఘాల ఆధ్వర్యంలో.జల్పల్లి శ్రీరామ ఫిష్ సొసైటీ, పాతబస్తీ కందికల్ గేట్ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో రెండు గ్రూపుల పెంపకందారులు ఈ చెరువులో చేపలను పెంచి విక్రయిస్తుంటారు. ఈసారి తెలంగాణ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో 55 వేల చేప పిల్లలను ఉచితంగా అందజేశారు. వీటికి అదనంగా రెండు సంఘాల వారు ఆంధ్రప్రదేశ్‌లోని కూచిపూడి నుంచి 11 లక్షల చేప పిల్లలను తీసుకొచ్చి వదిలారు. నీరు సమృద్ధిగా ఉండడంతో చేపల తూకం కూడా గణనీయంగా పెరిగింది. ఒక్కో చేప ఒక కిలో నుంచి నాలుగు కిలోల వరకు తూగుతోంది. దీంతో పెంపకందారులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.ఎంతో రుచికరంచికెన్, గుడ్లు తినడం తగ్గించాం. బయట మార్కెట్లలో లభించే చేపలతో పోలిస్తే జల్పల్లి చెరువు చేపలు రుచికరంగా ఉంటాయి. కళ్ల ముందే చేపలను పట్టుకొచ్చి తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. కటింగ్ చేసేవారు కూడా ఇక్కడే అందుబాటులో ఉన్నారు. స్వచ్ఛమైన నీటిలో పెరిగిన చేపలు తినడమే ఆరోగ్యానికి మంచిదని ఈ చేపలకు ప్రాధాన్యమిస్తున్నాం. – రాజు, శ్రీరాంకాలనీగిరాకీ పెరిగిందిఇటీవల చేపల కోసం జల్పల్లి చెరువుకు వచ్చే వారి సంఖ్య బాగా పెరిగింది. డిమాండ్ ఉన్నప్పటికీ సాధారణ ధరకే విక్రయిస్తున్నాం. చెరువు నీరు కలుషితం కాకుండా కలిసికట్టుగా చూసుకుంటున్నాం. కులమతాలకతీతంగా ఫిష్ సొసైటీ ఏర్పాటు చేసుకున్నాం. చేప పిల్లలను వదిలినప్పటి నుంచి అవి పెరిగేంత వరకు అసోసియేషన్ సభ్యులందరు పర్యవేక్షిస్తుంటారు. – నర్సింహ, ఫిష్ సొసైటీ సభ్యుడు -
ఉత్సాహంగా డెసిబుల్ డాష్ రన్
గచ్చిబౌలి: వినికిడి సమస్యలపై అవగాహన పరుగును ఉత్సాహంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్, కేపీహెచ్బీలలోని మైక్రో కేర్ ఈఎన్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, మౌర్య ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం గచ్చిబౌలి స్టేడియం వద్ద 2కే, 5కే, 10కే రన్‌ను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, డాక్టర్ ప్రకాశ్ జెండా ఊపి ప్రారంభించారు. డెసిబుల్ డాష్ కేవలం పరుగు మాత్రమే కాదని, ఇది వినికిడి ఆరోగ్యం గురించి అవగాహన పెంచడానికి, వినికిడి సవాళ్లతో జీవిస్తున్న వారికి మద్దతునిచ్చే శక్తిమంతమైన ఉద్యమంగా నిర్వహిస్తున్నామన్నారు. రన్నర్లు, వైద్యులు, పారామెడికల్ నిపుణులు, ఐటీ ఉద్యోగులు, ఫార్మాస్యూటికల్ దిగ్గజాలు, క్రీడా ప్రముఖులు, సామాజికవేత్తలు, కళాకారులు, ప్రభావశీలురు, ప్రముఖ పౌరులు, రాజకీయ నాయకులు, ఆరోగ్య ఔత్సాహికులు పాల్గొంటున్నారని వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ అశ్విని అమరేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో జెండా ఊపి రన్‌ను ప్రారంభిస్తున్న నిర్వాహకులు -
ట్యాంకర్ల డెలివరీ టైమింగ్ తగ్గించాలి
సాక్షి, సిటీబ్యూరో: ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సేవలు అందించాలని ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం మాదాపూర్ ఫిల్లింగ్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ.. వేసవిలో నీటి డిమాండ్‌ను ఎదుర్కోవడానికి అధికారులంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. ట్యాంకర్ బుక్ చేసిన వెంటనే డెలివరీ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం సూక్ష్మ స్థాయి ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. అవసరమైతే అదనపు ట్యాంకర్లు, సిబ్బందిని సమకూర్చుకోవాలని చెప్పారు. మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఏమైనా అవసరాలుంటే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వాటిని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ట్యాంకర్ల సరఫరాపై ఆరా ట్యాంకర్ డ్రైవర్లతో ఎండీ మాట్లాడారు. ట్యాంకర్ బుకింగ్, డెలివరీ లాగ్ బుక్‌ను పరిశీలించారు. ట్యాంకర్ బుకింగ్ స్టేటస్, రోజుకి ఎన్ని ట్యాంకర్లు బుక్ అవుతున్నాయి? ఎన్ని డెలివరీ చేస్తున్నారు? తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. మాదాపూర్ ఫిల్లింగ్ స్టేషన్ లో 06 ఫిల్లింగ్ పాయింట్స్, 80 ట్యాంకర్లు ఉండగా.. రోజుకి 600 ట్రిప్పులు డెలివరీ చేస్తున్నారు. 80 శాతం బుకింగ్స్ ను 6 నుంచి 12 గంటల్లో డెలివరీ చేస్తుండగా.. మిగిలిన 20 శాతం 24 గంటల్లో డెలివరీ చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ 600 ట్రిప్పులు డెలివరీ చేస్తుండగా.. రాబోయే రోజుల్లో 1200 బుకింగ్స్ వచ్చినా డెలివరి చేసే సామర్థ్యం ఉందని జీఎం.. ఎండీ కి వివరించారు.ఈ కార్యక్రమంలో జీఎం, డీజీఎం, మేనేజర్ తదితరులు పాల్గొన్నారు. ఈడీ ఇన్స్పెక్షన్.. జలమండలి ఈడీ మయాంక్ మిట్టల్ ఆదివారం పలు ఫిల్లింగ్ స్టేషన్లను తనిఖీ చేశారు. షాపూర్‌నగర్, మౌలాలి, ఎల్లారెడ్డి గూడ ఫిల్లింగ్ స్టేషన్లకు వెళ్లారు. ట్యాంకర్ బుకింగ్ స్టేటస్, రోజుకి ఎన్ని ట్యాంకర్లు బుక్ అవుతున్నాయి? ఎన్ని డెలివరీ చేస్తున్నారు? తదితర వివరాలు తనిఖీ చేశారు. ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్ ఇన్చార్జిలతో మాట్లాడి వివరాలు కనుక్కున్నారు. నీటి సరఫరాలో అంతరాయం మసీద్ బండ సెక్షన్లో విద్యుత్ శాఖ నిర్వహణ పనులు చేపడుతోంది. దీంతో ఆ సెక్షన్ పరిధిలో ఉన్న ఫిల్లింగ్ స్టేషన్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చెయ్యడం ఆగింది. ఒకే ఫిల్లింగ్ స్టేషన్ తో (గ్రావిటీ ద్వారా నడిచే) నీటి సరఫరా చేస్తున్నారు. మాదాపూర్ ఫిల్లింగ్ స్టేషన్లో జలమండలి ఎండీ తనిఖీ జలమండలి ఎండీ అశోక్ రెడ్డి మాదాపూర్ ఫిల్లింగ్ స్టేషన్ తనిఖీ -
బాల్యానికి మూడు‘ముళ్లు’
సాక్షి, సిటీబ్యూరో: ఎగుమతుల ఖిల్లా.. రంగారెడ్డి జిల్లా బాల్య వివాహాలకు నిలయంగా మారుతోంది. ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో దూసుకుపోతూ అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఉమ్మడి జిల్లాలోని పలువురు బాలికలు మూడు ముళ్ల బంధంలో చిక్కుకుంటున్నారు. 18 ఏళ్ల వయసు నిండక ముందే పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. తల్లిదండ్రులు తమకు ఇష్టం లేని పెళ్లిళ్లు చేస్తుండటంతో అధికారులను ఆశ్రయిస్తున్నారు. 2024 జనవరి నుంచి నవంబర్ చివరి వరకు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు వెయ్యి బాల్య వివాహాలను అడ్డుకోగా, వీటిలో కేవలం గ్రేటర్ జిల్లాల పరిధిలోనే 248 కేసులు ఉండటం గమనార్హం. అవగాహన కల్పిస్తున్నా.. బాల్య వివాహాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. పిల్లలకు త్వరగా పెళ్లి చేసి, బాధ్యతల భారాన్ని తగ్గించుకోవాలనే సామాజిక దురాచారం నుంచి తల్లిదండ్రులు ఇంకా బయటపడటం లేదు. ఉన్నత చదువులు చదువుకుని, మంచి ఉద్యోగం సంపాదించి సొంతకాళ్లపై నిలబడాలనే బాలికల ఆలోచనను మొగ్గలోనే తుంచేస్తున్నారు. బాల్య వివాహాల రద్దు కోసం ప్రభుత్వాలు బలమైన చట్టాలను తీసుకొచ్చినప్పటికీ.. తల్లిదండ్రుల్లో ఉన్న బలహీనత బాలికల పాలిట శాపంగా మారుతోంది. కొంత మంది తల్లిదండ్రుల ఒత్తిడికి తలొగ్గి తాళి కట్టించుకుంటుంటే.. మరికొంత మంది ఎదురు తిరుగుతున్నారు. పలువురికి విముక్తి బలవంతపు పెళ్లిని నిలిపివేయించాలని కోరుతూ పోలీసులను, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆశ్రయిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా 94 బాల్య వివాహాలను అడ్డుకోగా, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 54 చొప్పున అడ్డుకున్నారు. హైదరాబాద్‌లో 46 మంది బాలికలకు బాల్య వివాహాల నుంచి విముక్తి కల్పించారు. జిల్లా అడ్డుకున్న బాల్య వివాహాలు వికారాబాద్ 94 రంగారెడ్డి 54 మేడ్చల్ 54 హైదరాబాద్ 46 18 ఏళ్లు నిండక ముందే పెళ్లి పీటల పైకి.. గ్రేటర్ జిల్లాల పరిధిలో ఆగని బాల్య వివాహాలు తరచూ వెలుగు చూస్తున్న ఘటనలు -
పరీక్షల వేళ ‘ఫీ’జులుం!
ముషీరాబాద్‌కు చెందిన ప్రకాశ్ చిరుద్యోగి. అతని కుమారుడు కొత్తపేటలోని కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. సెకండియర్ ఫీజు మొత్తం రూ.1.60 లక్షలు కాగా.. దశలవారీగా రూ.1.20 లక్షలు చెల్లించారు. గత నెల ప్రాక్టికల్ పరీక్షల నేపథ్యంలో ఫీజు చెల్లించాలని ఒత్తిడి పెరగడంతో రూ. 20 వేలు చెల్లించారు. మరో రూ.20 వేలు పెండింగ్‌లో కట్టాల్సి ఉంది. ఈ నెల 5 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కొంత ఫీజు పెండింగ్‌లో ఉండటంతో హాల్ టికెట్ ఇచ్చేందుకు కాలేజీ వర్గాలు నిరాకరించాయి. పరీక్షల తర్వాత చెల్లిస్తామని వేడుకుంటున్నప్పటికీ ఇది యాజమాన్యం నిర్ణయం అని చెప్పారు. ఇది ఒక ప్రకాశ్ ఎదుర్కొంటున్న సమస్య కాదు.. పూర్తి స్థాయి ఫీజులు క్లియర్ చేయని విద్యార్థుల తలిదండ్రులందరిదీను.సాక్షి, సిటీబ్యూరో: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష వేళ విద్యార్థులపై ఫీజుల ఒత్తిడి పెరిగింది. విద్యా సంవత్సరం పూర్తి స్థాయి ఫీజు చెల్లిస్తేనే హాల్ టికెట్ ఇస్తామని ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలు తేల్చి చెబుతున్నాయి. ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థుల వార్షిక పరీక్షల హాల్ టికెట్ల జారీని కాలేజీల లాగిన్‌కు ఇవ్వడం వాటికి కలిసి వచ్చినట్లయింది. విద్యా సంవత్సరం ఫీజులు ఎలాంటి పెండింగ్ లేకుండా పూర్తిగా వసూలు చేసేందుకు హాల్ టికెట్లకు ఫీజుల క్లియరెన్స్ మెలిక పెడుతున్నారు. దీంతో విద్యార్ధులు మానసిక వేదనకు గురవుతున్నారు. ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థులతో పాటు ఫస్టియర్ విద్యార్థులు సైతం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. పరీక్షల తర్వాత పెండింగ్‌ను క్లియర్ చేస్తామని చెబుతున్నా.. కాలేజీ యాజమాన్యాలు వినిపించుకోవడంలేద విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.కార్పొరేట్ల తీరు మరింత కఠినంవిద్యా సంవత్సరం ఫీజుల విషయంలో కార్పొరేట్ కాలేజీ తీరు మరింత కఠినంగా తయారైంది. మేనేజ్మెంట్ నిర్ణయమంటూ ఫీజులు చెల్లించనిదే హాల్ టికెట్లు ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నాయి. సామాన్య, మధ్య తరగతి వర్గాలకు ఇంటర్‌తో పాటు ఐఐటీ, మెడిసిన్ అంటూ వల విసిరి విద్యార్థులను చేర్చుకున్న కార్పొరేట్ కాలేజీలు ఫీజుల విషయంలో అసలు రూపం బయటపెడుతున్నారు. విద్యా సంవత్సరానికి కనీసం రూ.1.50 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నాయి. ఒకసారి ఫీజుల విషయంలో అంగీకరింపజేసి.. నెమ్మదిగా వసూళ్ల దిగుతున్నారు. కార్పొరేట్ వలలో చిక్కుకున్న పేద కుటుంబాలు ఫీజులు చెల్లించేందుకు అప్పులు చేయక తప్పడం లేదు. పరీక్షల సమయంలో ఒత్తిడి పెంచి పూర్తి స్థాయి ఫీజులు వసూళ్లకు పాల్పడుతుండటంతో పేద కుటుంబాలకు తలకు మించిన భారంగా తయారైంది. ఫీజుల ఒత్తిడితో విద్యార్థులు పరీక్షలపై సరిగా దృష్టి పెట్టలేకపోతున్నారని తల్లితండ్రులు ఆందోళన చెందుతున్నారు. -
పడమట పర్యాటక రాగం!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని చారిత్రక, పర్యాటక ప్రాంతాలను అనుసంధానం చేసే సరికొత్త ప్రాజెక్టు నిర్మాణానికి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) చర్యలు చేపట్టింది. దేశ, విదేశాలకు చెందిన పర్యాటకులను ఆకట్టుకొనేలా ప్రత్యేక టూరిస్ట్ సర్క్యూట్లకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ట్యాంక్‌బండ్, నెకె్ల్స్ రోడ్డు, పీపుల్స్ ప్లాజా వలయంలోని చారిత్రక, పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా వలయ రహదారి ఉన్నట్లుగానే పడమట వైపున సుమారు 31 కిలోమీటర్ల పరిధిలో ఒక సర్క్యూట్‌ను ఏర్పాటు చేయనున్నారు.సుమారు 180 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసిన ఎకో పార్కు, గాంధీజీ భారీ విగ్రహంతో పాటు పర్యాటకులు సందర్శించేలా అభివృద్ధి చేయనున్న బాపూఘాట్‌తో పాటు వివిధ ప్రాంతాలను ఈ వలయంలో రూపొందించనున్నారు. ఇందుకోసం మౌలిక వసతులు, రహదారుల విస్తరణ, ప్రత్యేక రవాణా సదుపాయాలను విస్తరించాలని అధికారులు భావిస్తున్నారు. ఎకో పార్కు నిర్మాణం ఇప్పటికే పూర్తయింది.త్వరలో దీన్ని ప్రారంభించనున్నారు. చారిత్రక తారామతి బారాదరితో పాటు, హిమాయత్‌సాగర్ ఫారెస్ట్ ట్రెక్ పార్కు తదితర ప్రాంతాలను ఈ వలయం అనుసంధానం చేయనుంది. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ)పద్ధతిలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. డిజైన్, నిర్మాణం, నిధుల కేటాయింపు, నిర్వహణ, బదిలీ (డీబీఎఫ్ఓటీ) మోడల్ గా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఇందుకోసం త్వరలోనే ఆసక్తుల వ్యక్తీకరణకు ఆన్లైన్ బిడ్డింగ్ నోటిఫికేషన్ వెలువడనుందని పేర్కొన్నారు.సర్క్యూట్‌లోని ప్రధాన ప్రాంతాలు..● ఈ కొత్త టూరిజం సర్క్యూట్లో ఎకోపార్క్ (కొత్వాల్‌గూడ, హిమాయత్ సాగర్ సమీపంలో), బాపూ ఘాట్, తారామతి బారాదరి, ఫారెస్ట్ ట్రెక్ పార్క్ (చిలుకూరు రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్) వంటి నాలుగు ప్రధాన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. మొత్తం 31 కిలోమీటర్ల పొడవున ఈ సర్క్యూట్ విస్తరించనుంది.● తారామతి బారాదరి నుంచి బాపూఘాట్‌కు 3.8 కిలో మీటర్లు, బాపూఘాట్ నుంచి ఎకోపార్కు (హిమాయత్‌సాగర్) 13.50 కి.మీ, హిమాయత్‌సాగర్ నుంచి ఫారెస్ట్ ట్రెక్ పార్కు (నార్సింగి) వరకు 7.5 కి.మీ, అక్కడి నుంచి తిరిగి తారామతి బారాదరి వరకు 6 కి.మీ చొప్పున ఈ సర్క్యూట్ విస్తరించి ఉంటుంది.పర్యాటకులను ఆకట్టుకునేలా..● ఈ సర్క్యూట్‌ను ఆధునిక పర్యాటక హంగులతో అభివృద్ధి చేయనున్నారు. దేశ, విదేశాలకు చెందిన పర్యాటకులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగించేలా రవాణా సదుపాయాలను ఏర్పాటు చేస్తారు.● భాగ్య నగర చరిత్రను, సంస్కృతిని ప్రతిబింబించేలా సర్క్యూట్‌ను అందంగా తీర్చిదిద్దుతారు. రెస్టరెంట్లు, షాపింగ్ సెంటర్లు తదితర అన్ని సదుపాయాలూ ఉంటాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో పర్యాటకులు వివిధ ప్రాంతాలను సందర్శించేవిధంగా ఏర్పాట్లు చేస్తారు.● పర్యాటక రంగం అభివృద్ధిని ప్రభుత్వం ప్రత్యేకంగా భావిస్తోంది. ఇప్పటికే మూసీ ప్రక్షాళనతో పాటు బాపూఘాట్‌ను సువిశాలమైన చారిత్రక సందర్శన స్థలంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.● ఈ క్రమంలో నగరాన్ని అన్ని రంగాలతో పాటు పర్యాటక రంగంలోనూ అంతర్జాతీయ స్థాయిలో నిలిపేందుకు ఇలాంటి సర్క్యూట్లు దోహదం చేస్తాయని అధికారులు భావిస్తున్నారు.● ప్రత్యేకమైన పర్యాటక ప్యాకేజీలతో వెస్ట్ హైదరాబాద్ టూరిజం సర్క్యూట్‌ను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా సందర్శించే విధంగా ప్రోత్సహిస్తారు.● ‘ఈ సర్క్యూట్ పూర్తయితే నగర పర్యాటక రంగం కొత్త శోభను సంతరించుకుంటుంది. అందుకే దేశీ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి చేయాలని భావిస్తున్నాం’ అని హెచ్ఎండీఏ అధికారి ఒకరు వివరించారు. -
సారూ.. జరచూడరూ!
చార్మినార్: పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. దీంతో పాటు పాతబస్తీలో పార్కింగ్ సమస్య కూడా మొదలైంది. ఇక నెల రోజుల పాటూ పాతబస్తీలో రంజాన్ మార్కెట్ కొనసాగుతుంది. దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన వివిధ రకాల వస్తువులు ఇక్కడి రంజాన్ మార్కెట్లో లభిస్తాయి. దీంతో పాతబస్తీ చార్మినార్ పరిసరాల్లో జోరుగా రంజాన్ మార్కెట్ ఉంటుంది. వివిధ ప్రాంతాలను చెందిన వినియోగదారులు తమకు నచ్చిన వస్తువులను ఖరీదు చేయడానికి పాతబస్తీకి భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు. అయితే.. పాతబస్తీ రంజాన్ మార్కెట్‌కు వచ్చే వినియోగదారుల సౌకర్యార్థం పార్కింగ్ అందుబాటులో లేకుండాపోయింది. రంజాన్ ఉపవాస దీక్షల సందర్బంగా రోజుకు ఐదుసార్లు నమాజ్ చేసే ముస్లింలు సైతం మక్కా మసీదుకు పెద్ద ఎత్తున తరలి వస్తారు. వీరందరి వాహనాలను పార్కింగ్ చేసుకోవడానికి ఇప్పటి వరకు సరైన పార్కింగ్ లాట్లు అందుబాటులో లేవు. నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి దారుషిఫా, నయాపూల్, పురానా పూల్ ద్వారా పాతబస్తీలోకి అడుగుపెట్టే వాహనదారులకు పార్కింగ్ సమస్యలు రంజాన్ మాసంలో మరింత జటిలం కానున్నాయి. మల్టీ లెవల్ పార్కింగ్ సిస్టం ఏమాయే? చార్మినార్– మక్కా మసీదు సమీపంలోని పంచ్ మహల్లాలో జీహెచ్ఎంసీ మల్టీ లెవల్ పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయడానికి ఏడేళ్ల క్రితం ఇక్కడి ఆర్టీసీ బస్టాండ్‌ను కూల్చివేసి ఏడేళ్లు గడుస్తున్నా.. ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిధులు సైతం మంజూరు కావడంతో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ గత సార్వత్రిక ఎన్నిలకు ముందు శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు జరగలేదు. దీంతో పాటు మోతి గల్లీలోని నిజాం కాలం నాటి ట్రెజరీ భవనాన్ని తొలగించిన సంబంధిత అధికారులు ఇక్కడ కూడా మల్టీ లెవల్ పార్కింగ్ నిర్మాణాలు చేపడతామని హడావుడి చేశారు. ఏడేళ్లు గడిచిపోయినా ఏమీ జరగలేదు. ఇలా పాతబస్తీకి వచ్చే సందర్శకులు, వినియోగదారులు, వాహనదారులకు తమ వాహనాలను ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలో తెలియని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. రంజాన్ మార్కెట్ ప్రారంభంతో మరిన్ని సమస్యలు.. ఇక సాధారణ రోజుల్లో తలెత్తే పార్కింగ్ సమస్యలతో పాటు.. ఈ నెల రోజుల పాటు కొనసాగే రంజాన్ మార్కెట్లో అధికంగా ఉంటాయి. అత్యధిక సంఖ్యలో వచ్చే వాహనాల పార్కింగ్‌కు తాత్కాలికంగానైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అవసంరం ఉంది. గత రంజాన్ మార్కెట్ సందర్భంగా పాతబస్తీలోని కొన్ని ఖాళీ స్థలాలను ఎంపిక చేసి తాత్కాలికంగా ఉచిత పార్కింగ్ అంటూ రంజాన్ ప్రారంభానికి ముందే ప్రకటించేవారు సంబంధిత లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు. అయితే.. ఆదివారం నంంచి రంజాన్ మాసం ప్రారంభమైనప్పటికీ.. పాతబస్తీలో అవసరమైన మేరకు పార్కింగ్ స్థలాలను అందుబాటులోకి తీసుకురాకపోవడంతో స్థానిక వ్యాపారులతో పాటు వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాడ్‌బజార్‌లో సౌకర్యం లేకపోవడంతో.. లాడ్‌బజార్‌లోని గాజుల దుకాణాలను సందర్శించడానికి దూరపు ప్రాంతాల నుంచి షాపింగ్ కోసం వచ్చే వినియోగదారులకు సరైన పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో తమకు నిరాశ కలుగుతోందని స్థానిక వ్యాపారులు అంటున్నారు. తమ కోసం ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని గాజుల వ్యాపారులు కోరుతున్నారు. సరైన పార్కింగ్ లేకపోవడంతో తమ వాహనాలను ఎక్కడ పార్కు చేసుకోవాలో తెలియక వినియోగదారులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందంటున్నారు. పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయిస్తే ఈ రంజాన్ మాసంలో ఆశించిన స్థాయిలో వ్యాపారాభివృద్ది జరుగుతుందని కోరుతున్నారు. ప్రత్యేకంగా కారు పార్కింగ్ ఏర్పాటు చేయాని వారు సూచిస్తున్నారు. రంజాన్ మార్కెట్లో పార్కింగ్ తిప్పలు పాతబస్తీలో మొదలైన సందడి ఈ నెల రోజులూ ఇక ఇక్కట్లు ఊసే లేని మల్టీ లెవల్ పార్కింగ్ హామీ తాత్కాలిక సౌకర్యం కల్పించాలంటున్న వాహనదారులు -
కొత్త రూట్లలో ఏసీ బస్సులు
సాక్షి, సిటీబ్యూరో: కొత్తగా రెండు రూట్లలో గ్రీన్ మెట్రో లగ్జరీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ఈ నెల 3వ తేదీ నుంచి నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు లింగంపల్లి నుంచి మెహిదీపట్నం (216 డబ్ల్యూ) రూట్లో ప్రతిరోజూ 4 బస్సులు రాకపోకలు సాగించనున్నాయి. లింగంపల్లి నుంచి మొదటి బస్సు ఉదయం 6.50 గంటలకు బయలుదేరుతుంది. చివరి బస్సు రాత్రి 10.10 గంటలకు బయలుదేరుతుంది. అలాగే.. మెహిదీపట్నం నుంచి మొదటి బస్సు ఉదయం 8 గంటలకు, చివరి బస్సు రాత్రి 11 గంటలకు మెహిదీపట్నం నుంచి లింగంపల్లికి బయలుదేరనుంది. ఈ రూట్లో నల్లగండ్ల, గోపన్‌పల్లి, విప్రో, ఖాజాగూడ, నానల్‌నగర్ మీదుగా రాకపోకలు సాగించనున్నాయి. అలాగే లింగంపల్లి– లక్ష్మీనగర్ జీఏఆర్ (216జీ) రూట్లో రెండు ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. లింగంపల్లిలో మొదటి బస్సు ఉదయం 6.15 గంటలకు చివరి బస్సు రాత్రి 9.05 గంటలకు బయలుదేరుతాయి. లక్ష్మీనగర్ జీఏఆర్ నుంచి మొదటి బస్సు ఉదయం 7.05 గంటలకు చివరి బస్సు రాత్రి 9.55 గంటలకు బయలుదేరుతాయి.