రేపటి నుంచి ప్రారంభం●
● గ్రేటర్‌లో 579 పరీక్ష కేంద్రాలు
● హాజరవనున్న 4,64,445 మంది విద్యార్థులు
● సీసీ కెమెరా నిఘాలో ప్రశ్నపత్రాల ఓపెన్, జవాబు పత్రాల సీల్
● క్యూఆర్ కోడ్ ద్వారా కేంద్రాల
లొకేషన్ వెసులుబాటు
● సందేహాల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 040–29700934
సాక్షి, సిటీబ్యూరో: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది. బుధవారం నుంచి ప్రథమ సంవత్సరం, గురువారం నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఆరంభం కానున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల పరిధిలో దాదాపు 4,46,445 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందుకోసం సుమారు 579 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు.
● ఎండలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో కేంద్రాల వద్ద ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. – తాగునీటి సదుపాయంతోపాటు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. – విద్యార్థులు అస్వస్థతకు గురైతే సత్వర సేవలందించేందుకు వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లను నియమించారు.
● విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు 144 సెక్షన్ అమలు చేయనున్నారు.
25 మంది చొప్పున సీటింగ్
ఇంటర్ పరీక్ష కేంద్రంలో ఒక్కో గదిలో 25 మంది చొప్పున కూర్చునే విధంగా సీటింగ్ ఏర్పాటు చేశారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఇన్విజిలేటర్లను నియమించారు. మాస్ కాపీయింగ్ అరికట్టేందుకు తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంట్ అధికారులు, సిట్టింగ్, ఫ్లయింగ్, స్క్వాడ్ బృందాలను నియమించారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో సిట్టింగ్ స్క్వాడ్ 10, ఫ్లయింగ్ స్క్వాడ్ 4 బృందాలు, రంగారెడ్డి జిల్లాలో సిట్టింగ్ స్క్వాడ్ 5, ఫ్లయింగ్ స్క్వాడ్ 4, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 5 సిట్టింగ్, 6 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను రంగంలో దింపనున్నారు. వీరితో పాటు జిల్లాకు డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ (డీఈసీ)లో ఐదుగురు సభ్యులు, ఇద్దరు హైపవర్ కమిటీ సభ్యుల చొప్పున నియమించారు. పరీక్ష కేంద్రానికి పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొచ్చే ప్రశ్నపత్రాల సీల్ తీయడం మొదలుకుని, విద్యార్థులు రాసిన సమాధాన పత్రాలను సీల్ వరకు సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణలోనే ప్రక్రియను పూర్తి చేయనున్నారు. చీఫ్ సూపరింటెండెంట్ తప్ప మిగతా వారికి మొబైల్ ఫోన్ అనుమతి ఉండదు. పరీక్ష కేంద్రాల్లోకి సంబంధిత అధికారి జారీ చేసిన ఐడీ కార్డులు ఉంటేనే తప్ప ఇతరులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు. సందేహాల కోసం టోల్‌ఫ్రీ నెంబర్ 040– 29700934 సంప్రదించవచ్చు.
పరీక్ష కేంద్రం చిరునామా కోసం
విద్యార్థులు పరీక్ష కేంద్రం చిరునామా ఈజీగా తెలుసుకునే విధంగా ఎగ్జామ్ సెంటర్ లోకేటర్ యాప్‌ను అందుబాటులో తెచ్చారు. ఆండ్రాయిడ్ ఫోన్లో ప్లే స్టోర్‌కు వెళ్లి ఐపీఈ ఎగ్జామ్ సెంటర్ లొకేటర్ యాప్‌ను డౌన్‌లౌడ్ చేసుకుని నో యువర్ ఎగ్జామ్ సెంటర్ అప్షన్‌లో కాలేజీ కోడ్/విద్యార్థి పేరు టైప్ చేస్తే సెంటర్ అడ్రస్ సులువుగా తెలుస్తుందని అదికారులు వెల్లడించారు. అదేవిధంగా హాల్ టికెట్‌పై గల క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే అడ్రస్ వెంటనే వస్తుందన్నారు.
పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోవాలి
విద్యార్థులు హడావుడిగా కాకుండా..సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు ప్రయత్నించాలి. పరీక్ష కేంద్రాల అడ్రస్ తెలుసుకుని ఒకరోజు ముందే సందర్శిస్తే బాగుంటుంది. పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశాం. తాగునీరు, వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాం.
– ఒడ్డెన్న, జిల్లా ఇంటర్ బోర్డు అధికారి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment