సాక్షి, సిటీబ్యూరో: వాట్సాప్ ద్వారా కాల్స్ చేసి, తక్కువ ధరకు బంగారం విక్రయిస్తానంటూ వల వేసి, అందినకాడికి దండుకుని మోసం చేస్తున్న నేరగాడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. సరూర్‌నగర్ ప్రాంతానికి చెందిన జాలె చంద్రశేఖర్‌రెడ్డి ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్‌లకు బానిసగా మారాడు. ఇతర వ్యసనాలకూ ఉన్న ఇతగాడు తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం సైబర్ నేరగాడి అవతారం ఎత్తాడు. స్నేహితులు, పరిచయస్తుల ద్వారా నగరానికి చెందిన అనేక మంది ఫోన్ నెంబర్లు సేకరించిన ఇతగాడు వారికి వాట్సాప్ కాల్ చేసి తానో బంగారం వ్యాపారిగా పరిచయం చేసుకుంటాడు. ముంబైలో తక్కువ ధరలకు బంగారాన్ని ఖరీదు చేస్తుంటానని, దాన్ని మార్కెట్ రేటు కంటే తక్కువగా విక్రయిస్తానని నమ్మబలుకుతాడు. ఎదుటి వారిని పూర్తిగా నమ్మించడం కోసం వారికి తెలిసిన కొందరి పేర్లు చెప్తాడు. ఇలా కోఠిలో నివసిస్తున్న ఓ వృద్ధుడికి (75) గత ఏడాది డిసెంబర్‌లో కాల్ చేశాడు. ఆరు తులాల బంగారం రూ.5 లక్షలకు విక్రయిస్తానని నమ్మించాడు. ఆయన నుంచి అడ్వాన్స్‌గా ఆ మొత్తం తన బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకున్నాడు. ఆపై బాధితుడు తన బంగారం విషయంపై చంద్రశేఖర్‌కు ఫోన్ చేసి అడుగుతుండగా... క్రిస్మస్ పండుగతో పాటు ఇతర సాకులు చెప్పి తప్పించుకున్నాడు. తీవ్రంగా ఒత్తిడి చేయగా... ఈ ఏడాది జనవరి 15న నేరుగా వచ్చి బంగారం ఇస్తానని చెప్పాడు. అలా చేయకపోవడంతో బాధితుడు పదేపదే ఫోన్లు చేసినా స్పందించడం మానేశాడు. దీంతో తాను మోసపోయినట్లు తెలుసుకున్న బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇన్‌స్పెక్టర్ కె.ప్రసాదరావు నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేసి ఆదివారం నిందితుడిని అరెస్టు చేసింది.
నగరవాసి నుంచి రూ.5 లక్షలు స్వాహా
నిందితుడిని అరెస్టు చేసిన సైబర్ కాప్స్
Comments
Please login to add a commentAdd a comment