ఫ్రెష్‌.. ఫిష్‌ | - | Sakshi
Sakshi News home page

ఫ్రెష్‌.. ఫిష్‌

Published Mon, Mar 3 2025 6:37 AM | Last Updated on Mon, Mar 3 2025 12:15 PM

-

జల్‌పల్లి చెరువు చేపలకు భలే గిరాకీ

పెద్ద ఎత్తున తరలివస్తున్న కొనుగోలుదారులు

స్వచ్ఛమైన, తాజా చేపలను విక్రయిస్తున్న పెంపకందారులు

చికెన్‌, మటన్‌కు ప్రత్యామ్నాయంగా చేపల వంటకాలు

పహాడీషరీఫ్‌: జల్‌పల్లి పెద్ద చెరువు చేపలకు గిరాకీ పెరిగింది. నెల రోజులుగా బర్డ్‌ ఫ్లూ వార్తల నేపథ్యంలో జనం చికెన్‌, గుడ్లు తినడాన్ని కొంత తగ్గించారు. ఈ నేపథ్యంలో మటన్‌, చేపల వైపు మొగ్గు చూపుతున్నారు. చికెన్‌ విక్రయాలు పడిపోవడంతో మటన్‌ వ్యాపారులు కిలోకు వెయ్యి రూపాయల చొప్పున వరకు విక్రయిస్తున్నారు. ఇంత డబ్బు వెచ్చిచలేని పేద, మధ్య తరగతి ప్రజలు ప్రత్యామ్నాయంగా చేపలు తినేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే స్వచ్ఛమైన నీటితో కూడిన జల్‌పల్లి చెరువులో కళ్ల ముందే పట్టుకొచ్చిన చేపలను విక్రయిస్తుండటంతో శని, ఆదివారాల్లో నగర శివారు ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి కొనుగోలు చేస్తున్నారు.

రుచికరమైన చేపలకు పెట్టింది పేరు...
పుష్కలమైన నీటితో నిండుకుండలా తొణికిసలాడుతున్న జల్‌పల్లి చెరువులో ప్రతీ శని, ఆదివారాల్లో తాజా చేపలను విక్రయిస్తుంటారు. 150 ఎకరాల మేర విస్తరించిన ఉన్న ఈ చెరువులోని చేపలు ఎంతో రుచికరంగా ఉంటాయి. దీంతో ఇక్కడ పెద్ద ఎత్తున చేపల విక్రయాలు కొనసాగుతుంటాయి. ప్రస్తుతం వీరి సంఖ్య రెట్టింపైంది. పాతబస్తీ, కాటేదాన్‌, శంషాబాద్‌ తదితర ప్రాంతాల ప్రజలు ఎక్కువగా వస్తుంటారు. పాంప్లెట్స్‌ రకం కిలో రూ.120 ఉండగా.. సాధారణ చేపలు కిలో రూ.150 చొప్పున విక్రయిస్తున్నారు. రవ్వ, బొచ్చ, కట్ల, గ్యాస్కిట్‌, కొర్రమీను తదితర రకాల చేపలు ఈ చెరువులో లభ్యమవుతున్నాయి.

రెండు సంఘాల ఆధ్వర్యంలో.
జల్‌పల్లి శ్రీరామ ఫిష్‌ సొసైటీ, పాతబస్తీ కందికల్‌ గేట్‌ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో రెండు గ్రూపుల పెంపకందారులు ఈ చెరువులో చేపలను పెంచి విక్రయిస్తుంటారు. ఈసారి తెలంగాణ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో 55 వేల చేప పిల్లలను ఉచితంగా అందజేశారు. వీటికి అదనంగా రెండు సంఘాల వారు ఆంధ్రప్రదేశ్‌లోని కూచిపూడి నుంచి 11 లక్షల చేప పిల్లలను తీసుకొచ్చి వదిలారు. నీరు సమృద్ధిగా ఉండడంతో చేపల తూకం కూడా గణనీయంగా పెరిగింది. ఒక్కో చేప ఒక కిలో నుంచి నాలుగు కిలోల వరకు తూగుతోంది. దీంతో పెంపకందారులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

ఎంతో రుచికరం
చికెన్‌, గుడ్లు తినడం తగ్గించాం. బయట మార్కెట్లలో లభించే చేపలతో పోలిస్తే జల్‌పల్లి చెరువు చేపలు రుచికరంగా ఉంటాయి. కళ్ల ముందే చేపలను పట్టుకొచ్చి తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. కటింగ్‌ చేసేవారు కూడా ఇక్కడే అందుబాటులో ఉన్నారు. స్వచ్ఛమైన నీటిలో పెరిగిన చేపలు తినడమే ఆరోగ్యానికి మంచిదని ఈ చేపలకు ప్రాధాన్యమిస్తున్నాం. – రాజు, శ్రీరాంకాలనీ

గిరాకీ పెరిగింది

ఇటీవల చేపల కోసం జల్‌పల్లి చెరువుకు వచ్చే వారి సంఖ్య బాగా పెరిగింది. డిమాండ్‌ ఉన్నప్పటికీ సాధారణ ధరకే విక్రయిస్తున్నాం. చెరువు నీరు కలుషితం కాకుండా కలిసికట్టుగా చూసుకుంటున్నాం. కులమతాలకతీతంగా ఫిష్‌ సొసైటీ ఏర్పాటు చేసుకున్నాం. చేప పిల్లలను వదిలినప్పటి నుంచి అవి పెరిగేంత వరకు అసోసియేషన్‌ సభ్యులందరు పర్యవేక్షిస్తుంటారు. – నర్సింహ, ఫిష్‌ సొసైటీ సభ్యుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement