ఖతర్నాక్‌ కాంతి దత్‌ ! | - | Sakshi
Sakshi News home page

ఖతర్నాక్‌ కాంతి దత్‌ !

Published Mon, Mar 3 2025 6:37 AM | Last Updated on Mon, Mar 3 2025 6:46 AM

ఖతర్నాక్‌ కాంతి దత్‌ !

ఖతర్నాక్‌ కాంతి దత్‌ !

సాక్షి, సిటీబ్యూరో: తృతీయ ఫైన్‌ జ్యువెలరీ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి, బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా భాగస్వామి అని, టాలీవుడ్‌, కోలీవుడ్‌ నటులు సమంత, కీర్తి సురేష్‌ బ్రాండ్‌ అంబాసిడర్లు అంటూ నమ్మించి వర్ధమాన వ్యాపారవేత్తల్ని మోసం చేయడంలో దిట్ట తోనంగి కాంతిదత్‌పై హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌లో (సీసీఎస్‌) కేసు నమోదైంది. గత నెల 22న ఇది రిజిస్టర్‌ కాగా...ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఇతడిపై జూబ్లీహిల్స్‌తో పాటు సీసీఎస్‌లో కేసులు ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్‌లో జూబ్లీహిల్స్‌ అధికారులు అరెస్టు కూడా చేశారు. తాజాగా శేరిలింగంపల్లికి చెందిన సౌజన్య జూపల్లిని రూ.4.5 కోట్ల మేర మోసం చేసిన ఆరోపణలపై సీసీఎస్‌ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విశాఖపట్నానికి చెందిన కాంతిదత్‌ ఫిల్మ్‌నగర్‌ పరిధిలోని షేక్‌పేటలో స్థిరపడ్డాడు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.36లో తృతీయ ఫైన్‌ జ్యువెలరీ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. ఇందులో భాగస్వామిగా ఉన్న వైజాగ్‌కు చెందిన శ్రీజరెడ్డి తిప్పల రూ.2.50 కోట్లు వెచ్చించారు. 2023 సెప్టెంబర్‌ 7న బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా చేతుల మీదుగా ఈ షోరూం ప్రారంభమైంది. దీని నిమిత్తం రూ.1.5 కోట్లు ఆమెకు ఇవ్వాలంటూ శ్రీజరెడ్డి దగ్గర తీసుకున్నాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఫోర్జరీ సంతకాలతో ఆమెను డైరెక్టర్‌ పదవి నుంచి తొలగించిన కాంతి దత్‌ తన తల్లిని నియమించాడు. శ్రీజ ఫిర్యాదుతో జూబ్లీహిల్స్‌ ఠాణాలో కేసు నమోదైంది. ఇదిలా ఉండగా...కాంతి దత్‌ మొదట ప్రవీణ్‌ కుమార్‌ అనే వ్యక్తి నుంచి రూ.3.50 కోట్లు తీసుకుని తృతీయ జ్యువెలరీలో డైరెక్టర్‌గా చేర్చుకున్నాడు. ఈయనతో పాటు గౌతమ్‌ వ్యక్తిని కూడా నమ్మించి మోసగించడంతో వాళ్లు ఆయా ఠాణాల్లో ఫిర్యాదు చేశారు. గత ఏడాది డిసెంబర్‌లో జూబ్లీహిల్స్‌ పోలీసులు కాంతిదత్‌ను అరెస్టు చేశారు. ఆ సందర్భంలో ప్రముఖ డిజైనర్‌ శిల్పారెడ్డి కూడా ఓ వీడియో విడుదల చేస్తూ సస్టైన్‌ కార్ట్‌ వ్యాపారం పేరుతో తనను మోసం చేసినట్లు ఆరోపించారు. మొత్తమ్మీద పలువురి నుంచి దాదాపు రూ.40 కోట్లు తీసుకుని మోసం చేసినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. కాంతి దత్‌ చేతిలో తాను కూడా రూ.4.5 కోట్లకు మోసపోయానంటూ సౌజన్య గత నెల 21న సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్‌లో తన కుమార్తెను ట్యూషన్‌కు తీసుకువెళ్లినప్పుడు తాను నయోమీ రెస్టారెంట్‌లో కూర్చుంటానని, అక్కడే తనకు కాంతి దత్‌ పరిచయం అయ్యాడని ఆమె పోలీసులకు తెలిపారు. అలా మాయమాటలు చెప్పిన అతగాడు శ్రీ స్మేర హాస్పిటాలిటీ పేరుతో లిమిటెడ్‌ లయబులిటీ పార్ట్‌నర్‌షిప్‌ కంపెనీలో వాటా అంటూ ఆమెను ఆకర్షించాడు. ఈ కంపెనీ పేరుతో బంజారాహిల్స్‌లో నయోమీ రెస్టారెంట్‌ బ్రాంచ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పాడు. ఆపై దక్షిణ్‌ కథ సౌత్‌ ఇండియన్‌ రెస్టారెంట్‌, తృతీయ ఫైన్‌ జ్యువెలర్స్‌ పేర్లు చెప్పి 2023–24ల్లో దాదాపు రూ.4.5 కోట్ల వరకు సౌజన్య నుంచి తీసుకుని మోసం చేశాడు. ఎట్టకేలకు తాను మోసపోయానని గుర్తించిన బాధితులరాలు సీసీఎస్‌ను ఆశ్రయించడంతో కేసు నమోదైంది. సౌజన్య తన ఫిర్యాదుతో పాటు కాంతి దత్‌తో చేసిన లావాదేవీలకు సంబంధించిన పూర్తి ఆధారాలు అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మరోపక్క కాంతిదత్‌పై మాదాపూర్‌ ఠాణాలో గతంలో ఓ హిట్‌ అండ్‌ రన్‌ కేసు నమోదైంది. బైక్‌ ట్యాక్సీ డ్రైవర్‌ రాజశేఖర్‌ మృతి చెందడంతో నమోదైన ఈ కేసులోనూ ఆయన అరెస్టు అయ్యారు.

తృతీయ ఫైన్‌ జ్యువెలరీ పేరుతో సంస్థ ఏర్పాటు

ప్రముఖ సినీ నటుల పేర్లు చెప్పి వరుస మోసాలు

ఇప్పటికే ఇతడిపై జూబ్లీహిల్స్‌, సీసీఎస్‌లో కేసులు

మరో బాధితురాలి ఫిర్యాదుతో తాజాగా ఇంకో కేసు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement