
నకిలీ కస్టమర్ కేర్ నంబర్‌తో మోసం
సాక్షి, సిటీబ్యూరో: గూగుల్‌లో కనిపించిన నకిలీ కస్టమర్ కేర్ నంబర్‌ను నమ్మి నష్టపోయిన ఉదంతం ఇది. సంస్థ ప్రతినిధులుగా మాట్లాడిన అవతలి వాళ్లు ఏపీకే ఫైల్ పంపి రూ.1.9 లక్షలు కాజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నగరానికి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి.. ఎండల తీవ్రత పెరగటంతో తన ఏసీకి మరమ్మతులు చేయించాలని భావించారు. దీంతో ఓ కంపెనీ కస్టమర్ కేర్ నంబర్ కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేశారు. అందులో లభించిన ఓ నకిలీ నంబర్‌ను అసలైనదిగా భావించి ఫోన్ చేశారు. దీంతో ఆ కాల్ నంబర్ పొందుపరిచిన సైబర్ నేరగాళ్లకు చేరింది. ఆయనతో సంప్రదింపులు జరిపిన కేటుగాళ్లు.. మరమ్మతు కోసం ఎగ్జిక్యూటివ్‌ను పంపుతామని అంగీకరించారు. దానికోసం కొన్ని వివరాలు పొందుపరచాలంటూ లింకు పంపారు. ఆ లింకులో సైబర్ నేరగాడు ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్ (ఏపీకే) ఫైల్ నిక్షిప్తం చేశారు. బాధితుడు పొరపాటున లింక్ క్లిక్ చేశాడు. అందులో వ్యక్తిగత వివరాలు పొందుపరిచి, రూ.10 చెల్లించాలని ఉండటంతో అనుమానం వచ్చి ఆ పని చేయలేదు.
అయితే.. ఏపీకే ఫైల్స్‌లో నిక్షిప్తం చేసిన మాల్‌వేర్ అప్పటికే ఆయన ఫోన్‌లో నిక్షిప్తమైంది. అది ఇన్‌స్టల్ కావడంతోనే ఆ ఫోన్ మొత్తం నేరగాళ్ల అధీనంలోకి వెళ్లింది. ఇలా ఫోన్ ద్వారా జరిగే లావాదేవీలతో పాటు వచ్చే ఎస్సెమ్మెస్‌లు సైతం యాక్సెస్ చేయగలిగిన సైబర్ నేరగాళ్లు బాధితుడి నెట్ బ్యాంకింగ్ నుంచి ఆర్థిక లావాదేవీలు చేస్తూ, ఓటీపీలను వినియోగించి రూ.1.9 లక్షలు కాజేశారు. మరుసటి రోజు తన సెంట్రల్ బ్యాంక్ ఖాతాను పరిశీలించిన బాధితుడికి ఈ విషయం తెలిసింది. దీంతో సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఏపీకే ఫైల్స్‌ను సైబర్ నేరగాళ్లు లింకులు, సందేశాలు సహా వివిధ రూపాల్లో పంపిస్తారని, వీటిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. ఏదైనా సందేశం, లింకు వచ్చినప్పుడు క్షుణ్ణంగా పరిశీలించాలని దాని చివరలో.. ఏపీకే అనే అక్షరాలతో ఉన్న ఫైల్ కనిపిస్తే ఇన్‌స్టల్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వెంటనే డిలీట్ చేయాలని సూచిస్తున్నారు. కస్టమర్ కేర్ నంబర్ల కోసం ఆయా కంపెనీల అధికారిక వెబ్‌సైట్ల పైనే ఆధారపడాలని, గూగుల్‌లో కనిపించే అన్ని నంబర్లను గుడ్డిగా నమ్మవద్దని సూచిస్తున్నారు.
ఏపీకే ఫైల్ పంపి రూ.1.9 లక్షలు స్వాహా
Comments
Please login to add a commentAdd a comment