ప్రతి మెట్రో స్టేషన్‌ వద్ద సురక్షితంగా రోడ్డు దాటేలా పైవంతెనలు | - | Sakshi
Sakshi News home page

ప్రతి మెట్రో స్టేషన్‌ వద్ద సురక్షితంగా రోడ్డు దాటేలా పైవంతెనలు

Published Tue, Mar 4 2025 6:39 AM | Last Updated on Tue, Mar 4 2025 6:38 AM

ప్రతి

ప్రతి మెట్రో స్టేషన్‌ వద్ద సురక్షితంగా రోడ్డు దాటేలా పై

స్కైవాక్స్‌ను ప్రోత్సహిస్తాం: మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ఆసక్తి చూపే సంస్థలకు అవకాశం ఇస్తామని వెల్లడి

సాక్షి, సిటీబ్యూరో:

మెట్రో స్టేషన్‌ల నుంచి నేరుగా వాణిజ్య భవనాల్లోకి రాకపోకలు సాగించేవిధంగా స్కైవాక్‌ల ఏర్పాటును ప్రోత్సహించేందుకు హైదరాబాద్‌ మెట్రో రైలు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం రాయదుర్గం మెట్రోస్టేషన్‌ నుంచి రహేజా మైండ్‌స్పేస్‌కు వెళ్లేందుకు అనుకూలంగా ఏర్పాటు చేసిన స్కైవాక్‌ తరహాలోనే అవసరమైన అన్ని మెట్రోస్టేషన్ల వద్ద అలాంటి స్కైవాక్‌లను అందుబాటులోకి తేనున్నారు. అలాగే ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు, వాహన కాలుష్య నియంత్రణకు కూడా ఈ స్కైవాక్‌లు దోహదం చేయనున్నాయి. ఈ మేరకు మెట్రో స్టేషన్ల నుంచి సమీపంలో వాణిజ్య, నివాస భవనాల సముదాయాలకు పైవంతెనల (స్కైవాక్స్‌) నిర్మాణాన్ని ప్రోత్సహించాలని హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రోరైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి, హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌లు నిర్ణయించారు. ఈ మేరకు ఇటీవల హెచ్‌ఎండీఏ కార్యాలయంలో జరిగిన కాంప్రహెన్సివ్‌ మొబిలిటీ ప్లాన్‌ (సీఎంపీ) సమావేశంలో ఈ అంశంపైన చర్చించారు. ప్రస్తుతం పంజగుట్ట, హైటెక్‌ సిటీ, ఎర్రమంజిల్‌ మెట్రో స్టేషన్ల నుంచి నేరుగా మాల్స్‌లోకి వెళ్లేందుకు స్కైవాక్‌లు ఉన్నాయి. ఎల్‌అండ్‌టీ స్వయంగా వీటిని ఏర్పాటు చేసింది. అదే విధంగా జేబీఎస్‌, పెరేడ్‌ గ్రౌండ్‌ స్టేషన్‌లకు స్కైవాక్‌లు ఉన్నాయి. రాయదుర్గం మెట్రో స్టేషన్‌ నుంచి రహేజా మైండ్‌ స్పేస్‌ కాంప్లెక్స్‌ లోని 11 టవర్లకు స్కైవాక్‌ ద్వారా రాకపోకలు సాగించవచ్చు. పలు అంతర్జాతీయ సంస్థల్లో పనిచేస్తున్న వందలాది మందికి ఇది ఎంతో సౌకర్యంగా ఉంది.

స్కైవాక్‌ల నిర్మాణానికి స్వాగతం...

ఉప్పల్‌ మెట్రో స్టేషన్‌ నుంచి రింగ్‌రోడ్డుకు అన్ని వైపులా రాకపోకలు సాగించేందుకు అనుగుణంగా హెచ్‌ఎండీఏ నిర్మించిన వలయాకారపు రోటరీ స్కైవాక్‌ మెట్రో ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతుందని ఎన్వీఎస్‌ రెడ్డి చెప్పారు. ఇలా నగరంలోని వివిధ మెట్రోస్టేషన్ల వద్ద ఉన్న స్కైవాక్స్‌ను దృష్టిలో ఉంచుకొని మెట్రో స్టేషన్ల నుంచి స్కైవాక్‌ల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు, ఐటీ కంపెనీలు, నివాస భవనాలు, వాణిజ్య సముదాయాల నుంచి ఇప్పటికే అనూహ్యమైన స్పందన లభిస్తోందన్నారు. ఈ క్రమంలో బాలానగర్‌ మెట్రో స్టేషన్‌ నుంచి సమీపంలో నిర్మాణంలో ఉన్న ఫీనిక్స్‌, ల్యాండ్‌ మార్క్‌ మాల్‌ కొత్తగా స్కైవాక్‌ నిర్మాణం కొనసాగుందన్నారు. అలాగే ఎల్బీనగర్‌ స్టేషన్‌ నుంచి సమీపంలో నిర్మాణంలో ఉన్న వాసవీ ఆనంద నిలయం నివాస భవనాల సముదాయానికి రాకపోకలు సాగించేందుకు వాసవి గ్రూప్‌ స్కైవాక్‌ నిర్మిస్తుందన్నారు. వాసవి ఆనందనిలయం కాంప్లెక్స్‌ మొత్తం 25 ఎకరాలలో ఒక్కో టవర్‌లో 33 అంతస్తులతో మొత్తం 12 టవర్లు నిర్మిస్తోందని చెప్పారు. మరోవైపు నగరంలో 69 కిలోమీటర్ల మేర విస్తరించిన మెట్రో కారిడార్‌లలోని 57 స్టేషన్లలో ప్రతి స్టేషన్‌కు రెండు వైపులా రోడ్డుకు ఒక వైపు నుంచి మరో వైపునకు చేరుకునేందుకు మెట్రో వంతెనలు ఉన్నాయని, పాదచారులు వాటిని వినియోగించుకొని సురక్షితంగా రోడ్డు దాటాలని ఎన్వీఎస్‌ కోరారు.

ఇలా సంప్రదించండి..

మరికొన్ని సంస్థలు నాగోల్‌, ఉప్పల్‌ స్టేడియం, దుర్గం చెరువు, కూకట్‌పల్లి తదితర మెట్రో స్టేషన్ల నుంచి స్కైవాక్‌లు నిర్మించేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు ఎల్‌ అండ్‌ టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు. ప్రైవేట్‌ సంస్థలు మెట్రో స్టేషన్ల నుంచి స్కైవాక్‌లు నిర్మించదలిస్తే ఎల్‌అండ్‌టీ ప్రతినిధి కేవీ నాగేంద్ర ప్రసాద్‌ను (ఫోన్‌ నెంబర్‌ 9900093820) సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.

ప్రతి మెట్రో స్టేషన్‌ వద్ద సురక్షితంగా రోడ్డు దాటేలా పై1
1/1

ప్రతి మెట్రో స్టేషన్‌ వద్ద సురక్షితంగా రోడ్డు దాటేలా పై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement