
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
రాంగోపాల్‌పేట్: మితిమీరిన వేగంతో వచ్చిన ఓ కారు ఇద్దరు యువకులను బలి తీసుకుంది. బుధవారం ఉదయం మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ పరశురాం కథనం ప్రకారం.. బన్సీలాల్‌పేట్ చాచా నెహ్రూ నగర్‌కు చెందిన ఏడుకొండలు కుమారుడు గంటాడి దేవీ ప్రణయ్ (18), బన్సీలాల్‌పేట్ బీజేఆర్ నగర్‌కు చెందిన ఎర్రా హర్షిత్ (21) స్నేహితులు. వీరిద్దరూ మారేడుపల్లిలోని పెస్టోమెన్ అనే పెస్ట్ కంట్రోల్ సంస్థలో పని చేస్తున్నారు. రాత్రి విధులు ముగించుకున్న వీరు.. తమ యజమాని చెందిన ద్విచక్ర వాహనంపై ప్యారడైజ్ హోటల్‌కు వచ్చి టీ తాగారు. అనంతరం ఉదయం 4.40 గంటలకు జిమ్‌కు వెళ్లేందుకు ఎస్‌డీ రోడ్డు మీదుగా ప్యాట్నీ వైపు బైక్‌పై వస్తున్నారు. అదే సమయంలో కాప్రాకు చెందిన కొమురయ్య తాజ్‌హోటల్ వైపు వేగంగా కారు నడుపుతూ వచ్చి వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో బైక్ నడుపుతున్న దేవీ ప్రణయ్ తలకు, ఇతర భాగాలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనుక కూర్చున్న హర్షిత్‌కు తీవ్ర గాయాలు కావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మృతి చెందాడు. కారు డ్రైవర్ కొమురయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం