బంజారాహిల్స్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఆర్థిక శాస్త్ర విభాగం, తెలంగాణ రాష్ట్ర ఉన్నత మండలి, ఐసీఎస్‌ఎస్‌ఆర్–దక్షిణ భారతదేశ ప్రాంతీయ కేంద్రం ఆధ్వర్యంలో ‘భారతదేశంలో ఆర్ధిక సమాఖ్యవాదం: వికేంద్రీకరణ, అభివృద్ధి, ఆర్ధిక గతిశీలత’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు మంగళవారం ప్రారంభమైంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (న్యూఢిల్లీ) విశిష్ట అధ్యాపకులు పినాకి చక్రవర్తి ముఖ్యఅతిథిగా హాజరై సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 16వ ఆర్థిక సంఘం కోవిడ్ తర్వాత వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఆర్థిక అభివృద్ధి, నిర్వహణపై దృష్టి సారించిందన్నారు. రాష్ట్రాలు ఆర్థిక స్వయం ప్రతిపత్తి పొందడానికి పన్ను వికేంద్రీకరణను 42 శాతానికి ఆర్థిక కమిషన్ పెంచిందని వెల్లడించారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, అంబేడ్కర్ వర్సిటీ ఉపకులపతి ఘంటా చక్రపాణి మాట్లాడుతూ సామాజిక ధర్మంలో భాగంగా సమాజంలోని అన్ని వర్గాలకు అంబేడ్కర్ విశ్వవిద్యాలయం సేవలు అందిస్తుందన్నారు. గత దశాబ్ద కాలంగా కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు జరగాల్సిన స్థాయిలో చేయకున్నా దక్షిణ భారతదేశం అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. ఉత్తర–దక్షిణ ప్రాంతాలకు నిధుల కేటాయింపులపై సమగ్ర చర్చ జరగాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సభ్యులు అరవింద్ వారియర్, విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ పుష్పా చక్రపాణి, సామాజిక శాస్త్రాల విభాగ డీన్ వడ్డాణం శ్రీనివాస్, కృస్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జాతీయ సదస్సులో నిపుణులు