
సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి ముట్టడికి యత్నం
బంజారాహిల్స్: లంబాడీ ఎమ్మెల్యేలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తూ లంబాడీల లడాయి సేవాలాల్ బంజారా సంఘం ఆధ్వర్యంలో గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించారు. దాదాపు 50 మంది లంబాడా మహిళలు సీఎం ఇంటి ముట్టడికి యత్నించగా వారిని అడ్డుకున్న పోలీసులు బలవంతంగా వాహనంలో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సేవాలాల్ బంజారా సంఘం నాయకులు మాట్లాడుతూ అగ్రకుల ఆధిపత్యంలో నలిగిపోతున్న లంబాడీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించి గుర్తింపునివ్వాలన్నారు. రాష్ట్రంలోని 45 నియోజకవర్గాల్లో లక్షల సంఖ్యలో లంబాడాల ఓట్లు ఉన్నాయని, గెలుపోటములను ప్రభావితం చేయగలిగిన సత్తా కల లంబాడాలకు ప్రభుత్వంలో భాగస్వామ్యం లేకపోవడం దారుణమన్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉన్న లంబాడీలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించుకున్నామన్నారు. లంబాడీలను విస్మరించడం తగదని, తమకు మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని కోరారు. లేని పక్షంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామన్నారు. అరైస్టె వారిలో నాయకులు సక్రిబాయి, కొర్ర చందునాయక్, లావుడియా ప్రసాద్ నాయక్, ధరావత్ గణేష్‌నాయక్, శాంతిబాయి, నాగునాయక్, కొర్ర లాలునాయక్, శ్యామలనాయక్, నునావత్ రాంబాబునాయక్, నాగరాజునాయక్, శ్రీనునాయక్, బానోత్ బాలాజీనాయక్ తదితరులు ఉన్నారు.