మహిళ అనుమానాస్పద మృతి
భర్తే కొట్టి చంపాడని మృతురాలి బంధువుల ఆరోపణ
చాదర్‌ఘాట్: అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్‌ఐ రవిరాజ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అక్బర్‌బాగ్ డివిజన్ జమున టవర్స్‌లో 106 సింగం వినయ్, శిరీష(32) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కుమార్తె. శిరీష ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో నర్సుగా పని చేస్తుండగా, ఆమె భర్త వినయ్ ప్రైవేట్ ఉద్యోగి. ఆదివారం శిరీషకు గుండెపోటు వచ్చిందని ఆమె మేనమామ మధుకర్‌కు శిరీష స్నేహితురాలు సమాచారం అందించింది. దీంతో మధుకర్ ఆమె ఇంటికి వెళ్లేలోగా వినయ్ ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. శిరీషను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించాడు. దీంతో వినయ్ శిరీష మృతదేహాన్ని తీసుకుని అంబులెన్స్‌లో తన స్వగ్రామమైన దోమలపెంటకు బయలుదేరి వెళ్లాడు. దీనిపై అనుమానం వచ్చిన మధుకర్ చాదర్‌ఘాట్ పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే స్పందించిన పోలీసులు అంబులెన్స్ డ్రైవర్‌కు ఫోన్ చేసి మృతదేహాన్ని వెనక్కి రప్పించారు. కాగా శిరీష శరీరంపై గాయాలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. శిరీషను ఆమె భర్త వినయ్ కొట్టి చంపాడని మేనమామ మధుకర్ ఆరోపిస్తున్నారు. శిరీషపై అనుమానం పెంచుకున్న వినయ్ తరచూ ఆమెను వేధించేవాడని తెలిపాడు. 2017లో వారు ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు తెలిపాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న చాదర్‌ఘాట్ పోలీసులు ఆమె భర్త వినయ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు పేర్కొన్నారు.