
వడివడిగా అడుగులు..
తిమ్మాయిపల్లిలో ఐటీ పార్కు
625 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్
టెక్నికల్ బిడ్‌లకు ఆహ్వానం
ఫోర్త్‌సిటీ అభివృద్ధి పనులు చకచకా
సాక్షి, హైదరాబాద్: ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఫ్యూచర్‌సిటీ అభివృద్ధి సంస్థ (ఎఫ్‌సీడీఏ)ను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ ప్రాంతంలో కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు భూ సేకరణ ప్రక్రియ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా 625 ఎకరాలను సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. వేర్వేరు చోట్ల గుర్తించిన భూముల్లో ఒకచోట ఏఐ సిటీని ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. మరోచోట ఇతర ఐటీ కంపెనీల హబ్‌గా తీర్చేదిద్దేలా ప్రతిపాదనలు తయారు చేసింది. ఫ్యూచర్ సిటీ కోసం ప్రత్యేక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్న పట్టణాభివృద్ధి సంస్థ.. ఫార్మా, ఐటీ, లైఫ్ సైన్సెస్, స్పోర్ట్స్ హబ్‌లకు స్థలాలను నిర్దేశించింది.
ఇటీవల నాగిరెడ్డిపల్లిలో భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం తాజాగా మహేశ్వరం, కందుకూరు మండలాల్లోనూ మరికొంత భూమిని సమీకరిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే గ్రీన్‌ఫీల్డ్ రహదారికి శరవేగంగా భూ సేకరణ జరుపుతున్న సర్కారు.. ప్రస్తుతం నయా నగరిలో ప్రాజెక్టుల స్థాపనకు అవసరమైన భూ సేకరణ చేపడుతోంది. ఫ్యూచర్ సిటీలో భూ లభ్యతపై క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తున్న రెవెన్యూ యంత్రాంగం.. అసైన్డ్ భూముల వివరాలను సేకరిస్తోంది.
ఐటీ, పారిశ్రామిక పార్కుల కోసం..
మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామ పరిధిలోని కొంగరకుర్దు సర్వే నంబర్ 289లోని 94 మంది రైతుల నుంచి 275.12 ఎకరాలు సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ భూముల్లో ఐటీ, ఇండస్ట్రీయల్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు అందులో పేర్కొంది. అయితే.. ప్రతిపాదిత భూములను ఏఐ సిటీకి కేటాయించనున్నట్లు తెలిసింది. 200 ఎకరాల విస్తీర్ణంలో ఈ సిటీని అభివృద్ధి చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతిపాదిత రతన్ టాటా గ్రీన్‌ఫీల్డ్ రహదారికి సమీపంలో ఉన్న అసైన్డ్ భూములను సేకరించి.. ఏఐ సిటీ కోసం కేటాయించనున్నట్లు తెలుస్తోంది. అలాగే.. కందుకూరు మండలం తిమ్మాయిపల్లి సర్వే నంబర్ 9లోని 439 మంది రైతుల నుంచి 350.22 ఎకరాల భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. భూములు కోల్పోయిన రైతులకు తగిన పరిహారం కూడా చెల్లించనున్నట్లు పేర్కొంది.
రోడ్డుకు ఇరువైపులా హద్దురాళ్లు..
మీర్‌ఖాన్‌పేట వద్ద యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీకి శంకుస్థాపన చేసిన ప్రభుత్వం.. భవన నిర్మాణ పనులను మేఘా సంస్థకు అప్పగించింది. పనులు కూడా చకచకా సాగుతున్నాయి. మరో వైపు ఓఆర్‌ఆర్ ఎగ్టిట్ 13 నుంచి మీర్‌ఖాన్ పేట మీదుగా ఆర్‌ఆర్‌ఆర్ వరకు 300 ఫీట్ల గ్రీన్‌ఫిల్డ్ రోడ్డు నిర్మాణానికి భూ సేకరణ చేపట్టింది. దారి పొడవునా.. రోడ్డుకు ఇరువైపులా హద్దురాళ్లను కూడా పాతే పనిలో నిమగ్నమైంది. మొదటి దశలో రావిరాల నుంచి మీర్‌ఖాన్‌పేట వరకు 19.2 కిలోమీటర్లకు రూ.1,665 కోట్లు మంజూరు చేసింది. అదేవిధంగా మీర్‌ఖాన్‌ే టు నుంచి ఆర్‌ఆర్‌ఆర్ వరకు 22.30 కిలోమీటర్లకు రూ.2365 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. ఆ మేరకు టెక్నికల్ బిడ్‌లను ఆహ్వానించింది.
Comments
Please login to add a commentAdd a comment