
అపార్ ఐడీతో విద్యార్థులకు మేలు
బంజారాహిల్స్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 75 శాతం విద్యార్థులకు అపార్ ఐడీ క్రియేట్ చేసి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడం తెలంగాణలోని ఇతర యూనివర్సిటీలకు మార్గదర్శిగా నిలవడం గర్వంగా ఉందని ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీరాం వెంకటేష్ కొనియాడారు. అంబేద్కర్ వర్సిటీలో ‘అపార్ అమలు’ అనే అంశంపై రెండు రోజుల పాటు జరిగిన సదస్సు మంగళవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీరాం వెంకటేష్ మాట్లాడుతూ డీజీ లాకర్, అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్, అపార్ ఐడీ వంటివి విద్యార్థి తాను చదువుకున్న విద్యా సంబంధిత విషయాలకు సంబంధించి కీలకమైన అంశాలుగా పేర్కొన్నారు. విద్యార్థి తన విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నాక ఉద్యోగం కోసం ఏ సంస్థ దగ్గరకు వెళ్లినా సర్టిఫికెట్ల పరిశీలన సులభం అవుతుందన్నారు. ఆ సర్టిఫికెట్ ఒరిజినలా, లేక ఫేక్ సర్టిఫికెటా అనేది కూడా తేలిపోతుందన్నారు. రానున్న రోజుల్లో కూడా తెలంగాణలోని అన్ని విశ్వ విద్యాలయాల్లో అపార్ ఐడీలను రూపొందించి విద్యార్థులకు సహాయకారిగా నిలవడానికి, అవసరమైన శిక్షణ కోసం ఆర్థికపరమైన సహాయాన్ని అందించడానికి తెలంగాణ ఉన్నత విద్యామండలి సిద్ధంగా ఉందని వెల్లడించారు. త్వరలోనే తెలంగాణలోని అన్ని ప్రైవేటు విద్యా సంస్థలకు కూడా ఆయా విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలలకు అపార్ ఐడీ నమోదుపై అవగాహన పెంపొందిస్తూ శిక్షణను ఇవ్వనున్నట్లు వెల్లడించారు. యూనివర్సిటీ ఉపకులపతి ఘంటా చక్రపాణి మాట్లాడుతూ అపార్ ఐడీ నమోదు, అవగాహన పెంపొందించడానికి, శిక్షణ ఇవ్వడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి అంబేడ్కర్ వర్సిటీ సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వ సంస్థలకు నామమాత్రపు రుసుముతో , ప్రైవేటు విద్యా సంస్థలకు ఉన్నత విద్యా మండలి నిర్దేశించిన ప్రకారం రుసుముతో శిక్షణ కార్యక్రమాలు సీఎస్టీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సెంటర్ ఫర్ స్టాఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్ (సీఎస్టీడీ) డైరెక్టర్ పరాంకుశం వెంకటరమణ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అధ్యాపకులు రాజశేఖర్, అంబేడ్కర్ వర్సిటీ కంప్యూటర్ సెంటర్ ఇన్‌ఛార్జి వసంత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ సెమినార్‌లో తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాల విద్యాశాఖ, ఇంటర్మీడియెట్ బోర్డు, టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగాల నుంచి 60 మంది ప్రతినిధులు తమ అనుభవాలు, సమస్యల పరిష్కారానికి అవసరమైన మెలకువలను నేర్చుకున్నట్లు వివరించారు. ఈ సెమినార్‌లో పాల్గొన్నవారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.
ఉన్నత విద్యామండలి కార్యదర్శి
శ్రీరాం వెంకటేష్
Comments
Please login to add a commentAdd a comment