
బస్ షెల్టర్ బాలేదా?
ఇక్కడ కనిపిస్తున్న బస్ షెల్టర్ల దృశ్యాలు ఇప్పటివి కావు. పరిస్థితులు మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటున్నాయి. పేరుకు మాత్రం ప్రజల కోసమని బస్ షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నప్పటికీ.. అవి ప్రజలకు ఉపయోగపడటం కంటే ప్రకటనలు ఏర్పాటు చేస్తున్న యాడ్ ఏజెన్సీలకే బాగా పనికొస్తున్నాయి. రాత్రుళ్లలో ప్రజలకు చీకట్లే ఉంటున్నా, వాటి ఆదాయం మాత్రం జిగేల్‌మంటోంది.
సాక్షి, సిటీబ్యూరో:
గ్రేటర్ నగరంలో బస్సులను నడిపేది ఆర్టీసీ అయినా, బస్‌షెల్టర్లను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేస్తుంది. ప్రజల సదుపాయార్థమని వీటిని ఏర్పాటు చేస్తున్నప్పటికీ, అవి ప్రజలకు ఉపయోగపడటం లేదు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతున్నారే తప్ప ప్రయాణికుల వాటితో సదుపాయం ఒనగూరడంలేదు. ఇదే తరుణంలో ప్రముఖ వాణిజ్యప్రాంతాల్లో, ప్రధాన రహదారులపై ఉన్న షెల్టర్లు వాటిని ఏర్పాటు చేసిన ఏజెన్సీలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. బస్‌షెల్టర్లు ఏర్పాటు చేసేటప్పుడే ఆసక్తి ఉన్న ఏజెన్సీలన్నీ పాల్గొనేందుకు వీల్లేకుండా నచ్చిన వారికి దక్కేలా టెండరు నిబంధనలు రూపొందిస్తున్నారు. కనీసం నిబంధనల మేరకై నా నిర్వహణ ఉంటోందా అంటే అదీ లేదు.
● ఈ నేపథ్యంలో బస్‌షెల్టర్లను ప్రజలకు సదుపాయంగా ఉంచాలని భావిస్తున్న జీహెచ్‌ఎంసీ.. బస్‌షెల్టర్లలో తమకు ఎదురవుతున్న ఇబ్బందుల్ని అక్కడి నుంచే ఫిర్యాదు చేసేందుకు వీలుగా అక్కడే క్యూఆర్ కోడ్‌లు ఏర్పాటు చేయనుంది. వాటిని స్కాన్ చేసి ఇబ్బందుల్ని ఫిర్యాదు చేస్తే, నిర్ణీత వ్యవధిలోగా (రెండు మూడు రోజుల్లోగా) వాటిని పరిష్కరించాలని భావిస్తోంది. లేని పక్షంలో సంబంధిత ఏజెన్సీకి పెనాల్టీలు విధించడంతో పాటు వాటిని వసూలు చేసేందుకూ తగిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. సంబంధిత క్యూఆర్ కోడ్‌లు సిద్ధమయ్యాయని, త్వరలోనే ప్రజల వినియోగానికి అందుబాటులో ఉంచనున్నట్లు సంబంధిత అధికారి తెలిపారు.
అమలుకు నోచుకోని నిబంధనలు
జీహెచ్‌ఎంసీ పరిధిలో దాదాపు 1300కు పైగా బస్‌షెల్టర్లున్నాయి. నిబంధనల మేరకు వాటిని ఏర్పాటు చేసిన ఏజెన్సీలు గ్రేడ్లను బట్టి డస్ట్‌బిన్ల నుంచి మొదలు పెడితే బస్సులు సదరు షెల్టర్‌కు చేరుకోనున్న సమయాన్ని తెలిపేలా రియల్‌టైమ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి. కానీ ఏవీ ఏర్పాటు చేయకుండానే అవి ఆదాయం పొందుతున్నాయి.
తాజాగా అందుబాటులోకి రానున్న క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేసి ఈ సమస్యల్ని ఫిర్యాదు చేయొచ్చు.
● కూర్చునేందుకు బెంచీలు, కుర్చీలు లేకుంటే..
● ఉన్నా కూర్చునేందుకు వీల్లేకుండా విరిగిపోయి ఉంటే..
● ఏరోజుకారోజు శుభ్రం చేయకుండా ఉంటే..
● పైకప్పు లేకుంటే. ఉన్నా వానొస్తే తడవకుండా సరిగా లేకపోతే..
● రాత్రుళ్లు లైట్లు వెలగని పక్షంలో..
● బస్సుల నెంబర్లు, రూట్‌మ్యాప్‌లు లేకపోతే..
● బస్‌షెల్టర్ గ్రేడ్‌ను బట్టి మొబైల్ చార్జింగ్ పాయింట్ లేనిపక్షంలో..
● కాగితాలు వంటివి వేసేందుకు డస్ట్‌బిన్ లేకుంటే.
● పబ్లిక్ టాయ్‌లెట్ లేకపోతే..
ఫిర్యాదులు ఇకనైనా పరిష్కరిస్తారా ?
ప్రయాణికుల నుంచే ఇబ్బందులు తెలుసుకునేందుకని ప్రస్తుతం క్యూఆర్ కోడ్‌ల ఏర్పాట్లకు సిద్ధమయ్యారు. వీటి ఏర్పాటుతోనైనా సమస్యలు తీరుతాయా? లేదా? అనేది మున్ముందు తెలుస్తుంది.
మెహిదీపట్నంలోని బస్ షెల్టర్
అక్కడే స్కాన్ చేసి ఫిర్యాదు చేయండి
కొత్త విధానాన్ని అమల్లోకి తేనున్న బల్దియా
రెండేళ్ల క్రితమే..
దాదాపు రెండేళ్ల క్రితం సెంట్రల్ అడ్వర్టయిజ్‌మెంట్ మానిటరింగ్ ప్లాట్‌ఫార్మ్ (క్యాంప్)పేరిట ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించేందుకు సంబంధిత అధికారులు ఆర్‌ఎఫ్‌పీ టెండర్లు పిలిచారు. రియల్‌టైమ్‌లో అధికారులే ఆన్‌లైన్ ద్వారా పర్యవేక్షిస్తూ బాగులేని వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. ట్విట్టర్ (ఎక్స్) వంటి వాటిద్వారా ప్రజలు ఫిర్యాదు చేసినా పరిష్కరిస్తామన్నారు. కానీ.. ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. బస్సుల రాకపోకలు తెలిసేలా సదుపాయం కల్పించేందుకని ఇటీవల మరో ఆర్‌ఎఫ్‌పీ ఆహ్వానించారు. ఇది ఏ మేరకు అమలు చేస్తారో తెలియదు.