
శివారు ప్రాంతాల్లోని ఆలయాలే టార్గెట్
బంగారు, వెండి ఆభరణాల అపహరణ
దొంగిలించిన సొత్తుతో జల్సాలు
అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులకు చిక్కిన దుండగులు
20 కిలోల వెండి బిస్కెట్లు స్వాధీనం
అబ్దుల్లాపూర్‌మెట్: చోరీలు పాల్పడేందుకు సాంకేతికతను ఎంచుకున్నారీ దుండగులు. గ్రామ శివారుల్లో ఉండే దేవాలయాలనే లక్ష్యంగా చేసుకున్నారు. గూగుల్‌మ్యాప్‌లో అప్‌లోడ్ చేసే దేవతామూర్తులకు అలంకరించిన బంగారు, వెండి ఆభరణాలను అపహరించేందుకు పక్కా ప్రణాళికతో తెగబడ్డారు. నగర శివారులోని ఘట్‌కేసర్, దుండిగల్, బీబీనగర్, ఇబ్రహీంపట్నం, జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ల పరిధుల్లోని దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు దుండగులు ఎట్టకేలకు వాహన తనిఖీ చేపడుతున్న అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులకు చిక్కారు.
సీఐ అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో మంగళవారం తెల్లవారుజామున వాహన తనిఖీ చేపడుతున్న పోలీసులకు ఓ ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తుల తీరు అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో వారిని అదుపులోకి తీసుకుని బ్యాగును తనిఖీ చేయగా అందులో బిస్కెట్ల రూపంలో ఉన్న 20 కిలోల వెండి కనిపించింది. దుండగులిద్దరినీ స్టేషన్‌కు తీసుకుని విచారించగా మేడ్చల్‌లోని పోలీస్ క్వార్టర్స్ వెనకాల నివసించే మహ్మద్ ఇంతియాజ్ షరీఫ్, మెదక్ జిల్లా శివ్వంపేట మండలం నవాబ్‌పేట గ్రామానికి చెందిన రంగా వేణులుగా గుర్తించారు. ఇద్దరు వ్యసనాలు, జల్సాలకు అలవాటు పడి ఎలాగైనా అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దేవాలయల్లో దొంగతనాలకు పాల్పడాలని నిర్ణయించుకున్నారు. అందుకు గూగుల్‌మ్యాప్‌ను వినియోగించుకున్నారు.
విజయవాడలో విక్రయించి
నివాస గృహాలకు దూరంగా, గ్రామ శివారుల్లో ఉండే ఆలయాలను టార్గెట్‌గా చేసుకుని చోరీలకు పాల్పడుతూ బంగారు, వెండి ఆభరణాలను అపహరించుకు పోయారు. వాటిని కరిగించి బిస్కెట్ల రూపంలో విజయవాడలో విక్రయించి సొమ్ము చేసుకుంటూ జల్సాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఇటీవల మండలంలోని పిగ్లీపూర్ గ్రామంలోని అభయాంజనేయస్వామి దేవాలయంలో దొంగతనం చేసిన వెండి ఆభరణాలను కరిగించి బిస్కెట్లుగా మార్చి విజయవాడలో విక్రయించేందుకు వెళ్తుండగా పోలీసులకు చిక్కారు. పిగ్లీపూర్‌తో పాటు ఘట్‌కేసర్, దుండిగల్, బీబీనగర్, ఇబ్రహీంపట్నం, జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ల పరిధుల్లోని దేవాలయాల్లో పలు దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు దుండగుల నుంచి 20 కిలోల వెండి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment