కాచిగూడ: సమాజ పరివర్తనే ప్రధాన లక్ష్యంగా సంఘ్ పనిచేస్తోందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) తెలంగాణ ప్రాంత కార్యదర్శి కాచం రమేష్ అన్నారు. బుధవారం బర్కత్‌పుర కేశవ నిలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ ప్రాంత సంఘ్ చాలక్ బర్ల సురేందర్ రెడ్డితో కలిసి ఆయాన మాట్లాడుతూ బెంగళూర్‌లో ఇటీవల జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత ప్రతినిధుల సభలో చేసిన తీర్మానాలు, సంఘ్ శతాబ్ది సంవత్సరం సందర్భంగా తెలంగాణ, దేశ వ్యాప్తంగా చేపట్టనున్న ప్రత్యేక కార్యక్రమాలను వివరించారు. నూరేళ్ళ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా సంఘ్ ఆలోచనలు, భావాలను సమాజం వద్దకు తీసుకెళ్లేలా వచ్చే నవంబర్–డిసెంబర్–జనవరి నెలల్లో దేశంలో ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి వెళ్లడానికి జన సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. సమాజ పరివర్తనకు సంబంధించిన అంశాలను ప్రజలకు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రతి లక్ష మంది ఒక యూనిట్‌గా హిందూ సమాజ ఉత్సవాలు చేస్తామని, ఇందులో స్థానిక నేతలు, హిందూ సంస్థలకు భాగస్వామ్యం కల్పించి హిందుత్వాన్ని, ధర్మాన్ని సమాజంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు.