రూ.1.30 కోట్ల నగదు పట్టివేత | - | Sakshi
Sakshi News home page

రూ.1.30 కోట్ల నగదు పట్టివేత

Published Wed, Mar 26 2025 9:18 AM | Last Updated on Wed, Mar 26 2025 9:16 AM

చాంద్రాయణగుట్ట: ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.1.30 కోట్ల నగదును చాంద్రాయణగుట్ట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌స్పెక్టర్‌ గురునాథ్‌ తెలిపిన వివరాల ప్రకారం..చాంద్రాయణగుట్ట పూల్‌బాగ్‌ జంక్షన్‌ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో అటుగా వచ్చిన కియా కారును నిలిపి తనిఖీ చేయగా మహ్మద్‌ యూసుఫుద్దీన్‌, సయ్యద్‌ అబ్దుల్‌ హదీల వద్ద రూ.1.30 కోట్ల నగదు లభ్యమయ్యింది. డబ్బుకు సంబంధించిన వివరాలు కోరగా, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులమని, ల్యాండ్‌ కొన్నామని, అందుకు చెల్లించాల్సి ఉందని వారు పేర్కొన్నారు. సరైన పత్రాలు చూపని కారణంగా ఐటీ అధికారులకు అప్పగించారు.

ట్రేడింగ్‌ ఫ్రాడ్‌లో

అకౌంట్‌ సప్లయర్‌ అరెస్టు

సాక్షి, సిటీబ్యూరో: ట్రేడింగ్‌ ఫ్రాడ్‌ చేసే సైబర్‌ నేరగాళ్లకు అవసరమైన బ్యాంకు ఖాతాలు అందిస్తున్న గుర్‌గావ్‌ వాసిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇతడిపై దేశంలో 43 కేసులు, రాష్ట్రంలో ఆరు కేసులు ఉన్నట్లు డీసీపీ దార కవిత మంగళవారం తెలిపారు. రాజస్థాన్‌కు చెందిన హిమాన్షు స్వామి ప్రస్తుతం గుర్‌గావ్‌లో నివసిస్తున్నాడు. ఇతడు పవన్‌ జైన్‌తో కలిసి బ్యాంకు ఖాతాలు సమీకరిస్తూ సైబర్‌ నేరగాళ్లకు అందిస్తున్నాడు. నగరానికి చెందిన ఓ వ్యక్తికి సోషల్‌మీడియా ద్వారా ఎర వేసిన సైబర్‌ నేరగాళ్లు ట్రేడింగ్‌ పేరుతో రూ.20 లక్షలు స్వాహా చేశారు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు హిమాన్షు, పవన్‌ పాత్రను గుర్తించారు. గుర్‌గావ్‌ వెళ్లిన ప్రత్యేక బృందం హిమాన్షును అరెస్టు చేసింది. పరారీలో ఉన్న పవన్‌ కోసం గాలిస్తోంది.

బస్సు కింద పడి

మహిళ మృతి

బొల్లారం: ఉద్యోగానికి బయలుదేరిన మహిళ యాక్సిడెంట్‌కు గురై మృతిచెందిన ఘటన తిరుమలగిరి పోలీసు స్టేషన్‌ పరిధిలోని చోటు చేసుకుంది. తిరుమలగిరి పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని త్రివేణి కుమారి(43) అల్వాల్‌ ఎంఈఎస్‌ కాలనీలో నివాసం ఉంటోంది. మంగళవారం ఉదయం ఆఫీసుకు వెళ్లేందుకు లాల్‌బజార్‌ బస్టాప్‌కు బయలుదేరింది. ఈ క్రమంలో ఆమెను ఓ కారు ఢీకొట్టడడంతో రోడ్డుపై పడిపోయింది. అదే సమయంలో ఈసీఐఎల్‌ నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్న కంటోన్మెంట్‌ డిపోకు చెందిన ఎలక్ట్రిక్‌ బస్సు ఆమె పైనుంచి వెళ్లింది. దీంతో త్రివేణి కుమారి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కారు, బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే తన భార్య మృతి చెందిందని త్రివేణి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ డ్రైవర్‌ నరేశ్‌, కారు డ్రైవర్‌ రమేశ్‌లపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కోయంబత్తూర్‌లో

ఘరానా మోసగాడి అరెస్ట్‌

గచ్చిబౌలి: బంగారం కొనుగోలు పేరిట ఘరానా మోసానికి పాల్పడిన కేటుగాడిని తమిళనాడు పోలీసులు కోయంబత్తూర్‌లో అరెస్ట్‌ చేశారు. కమిషన్‌ ఇస్తానని చెప్పి గత శుక్రవారం రఫీ నుంచి 18 వేల డాలర్లు, చంద్రశేఖర్‌ నుంచి 500 గ్రాముల బంగారం తీసుకొని ఉడాయించాడు. బాధితుల ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా ప్రత్యేక బృందాలు తమిళనాడుకు వెళ్లాయి. ఈ మేరకు నిందితుడు పగులు హసన్‌ను సోమవారం కోయంబత్తూర్‌లో అరెస్ట్‌ చేశారు. నిందితుడి నుంచి అక్కడి పోలీసులు బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. పీటీ వారెంట్‌పై హసన్‌ను హైదరాబాద్‌ తీసుకొచ్చేందుకు గచ్చిబౌలి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. తాను ధనవంతుడినని, పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయని ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు వచ్చేవారిని నమ్మిస్తాడు. బంగారం కొనుగోలు, డాలర్ల ఎక్స్చేంజ్‌ పేరిట మోసాలకు పాల్పడడం అతని నైజం. తెలంగాణ, తమిళనాడు, కర్నాటకలో మోసాలకు పాల్పడినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు.

బాలికపై లైంగిక దాడి:

పోక్సో కేసు నమోదు

హిమాయత్‌నగర్‌: ఇంటర్‌ చదువుతున్న ఓ బాలికకు మాయ మాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడిన నారాయణగూడ, దత్తానగర్‌కు చెందిన చతుర్వాల రోహిత్‌ సింగ్‌(21)ను మంగళవారం నారాయణగూడ పోలీసులు ఆరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివాసం ఉండే ఓ మైనర్‌ బాలిక స్థానికంగా ఉన్న కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. ఇదే క్రమంలో ప్రైవేట్‌ ఉద్యోగం చేసున్న రోహిత్‌ సింగ్‌తో కొన్ని నెలల క్రితం ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ నెల 23న బాలికను ఇంట్లో నుంచి బయటకు పిలిపించిన రోహిత్‌ సింగ్‌ ముషీరాబాద్‌లోని ఓ గదికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టాగా నేరాన్ని ఒప్పుకున్నాడు. పోక్సో చట్టం కింద అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement