రిటైరయ్యాక కొనసాగుతున్న అధికారులు ఇక ఇళ్లకే
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ అధికారం, ఉద్యోగం నుంచి రిటైరయ్యాక సైతం వివిధ పేర్లతో మున్సిపల్ పరిపాలన శాఖలోని వివిధ విభాగాల్లో కొనసాగుతున్న వారిని వెంటనే పంపించాల్సిందిగా తాజాగా వెలువడిన ఉత్తర్వుతో జీహెచ్‌ఎంసీలోని దాదాపు యాభై మంది ఇక ఇళ్లకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. జీహెచ్‌ఎంసీలో ఇలా కొనసాగుతున్న వారిలో అడిషనల్ డైరెక్టర్, డిప్యూటీ కమిషనర్, డిప్యూటీ సిటీప్లానర్, సూపరింటెండెంట్, ఆర్‌డీఓ, ఈఈ, సూపరింటెండెంట్‌ల స్థాయిల నుంచి దిగువ స్థాయిల వరకు ఉన్నారు. వీరు రీ అపాయింట్‌మెంట్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ల పేరిట తిరిగి జీహెచ్‌ఎంసీలోనే కొనసాగుతున్నారు. కొందరు కొన్ని ‘కీ’లక స్థానాల్లో ఉండి చక్రం తిప్పుతున్న వారు సైతం ఉన్నారు. ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం మేరకు వారి గడువు 2024లోనే ముగిసిపోవాల్సి ఉండగా, చాలామంది ఇప్పటికీ కొనసాగుతున్నారు. కొందరిని మాత్రం గడువు ముగిసిన వెంటనే ఉండటానికి వీల్లేదంటూ పంపించిన సంబంధిత అధికారులు.. చాలామంది ఇంకా కొనసాగుతున్నా పట్టించుకోలేదు. దీన్ని టాప్ ప్రయారిటీగా పేర్కొంటూ వెంటనే పంపించాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేయడంతో వీరు ఇక ఇళ్లకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది.
30న ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఉగాది పంచాంగ శ్రవణం
నిజాంపేట్: బాచుపల్లి, క్రాంతినగర్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రముఖ మీడియా సంస్థ ‘సాక్షి’ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించనున్నట్లు సాక్షి– ఉగాది పంచాంగ శ్రవణం కమిటీ సభ్యులు పేర్కొన్నారు. గురువారం వారు మాట్లాడుతూ ఈ నెల 30న బాచుపల్లి, క్రాంతినగర్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రఖ్యాత నర్తకి యామినిరెడ్డి బృందం కళాత్మక కూచిపూడి నృత్యం, సిద్ధాంతి చక్రవర్తులు శ్రీవత్స్యాచార్యుల పంచాంగ పఠనం, ఆధ్యాత్మిక ప్రసంగాలు, అన్నదాన కార్యక్రమాలు ఉంటాయన్నారు. ప్రముఖ సంస్థ భారతీ సిమెంట్స్ ఈ కార్యక్రమానికి స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది.