
‘ఎస్టేట్స్’ దూకుడు!
సాక్షి, సిటీబ్యూరో: ఆర్థిక సంవత్సరం ముగియవస్తుండటంతో ఆదాయ లక్ష్యాలను చేరుకునేందుకు జీహెచ్‌ఎంసీలోని వివిధ విభాగాలు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. ప్రభుత్వం ఆస్తిపన్ను బకాయిల వడ్డీలపై 90 శాతం రాయితీ కూడా ఇవ్వడంతో ట్యాక్స్ సెక్షన్ సెలవుల్లేకుండా పని చేస్తోంది. దాంతోపాటు ట్రేడ్ లైసెన్సుల విభాగం, ఎస్టేట్స్ విభాగాలు సైతం టార్గెట్లు చేరుకునేందుకు ముమ్మరంగా పర్యటిస్తూ దూకుడు పెంచాయి. ముఖ్యంగా, ఇటీవలి కాలం వరకు తన ఆస్తులేమిటో, ఎంతమొత్తం రావాలో కూడా పెద్దగా పట్టించుకోని ఎస్టేట్స్ విభాగం దూకుడు పెంచింది. ఆ విభాగానికి నగరంలోని పలు ప్రాంతాల్లో షాపింగ్ కాంప్లెక్స్‌లు, మార్కెట్లు ఉండటం తెలిసిందే. వాటిలో వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు ఎంతో ఆదాయాన్ని పొందుతున్నప్పటికీ, జీహెచ్‌ఎంసీకి చెల్లించాల్సిన నామమాత్రపు అద్దెలు మాత్రం చెల్లించడం లేదు. ఈ నేపథ్యంలో అద్దెల్ని కచ్చితంగా వసూలు చేయాలని భావించిన ఎస్టేట్స్ అధికారులు నిబంధనల మేరకు నోటీసులు, హియరింగ్‌లు వంటివి నిర్వహించారు. అంతిమంగా దుకాణాలను సీజ్ చేసే చర్యలు చేపట్టారు. ఈ నెల 8వ తేదీన తొలుత ఈ చర్యలు ప్రారంభించాక, కొద్దిమేర ఫలితం కనిపించింది. తిరిగి మళ్లీ పరిస్థితి షరామామూలుగా మారడంతో మంగళ, బుధ వారాల్లో సంబంధిత అధికారులు, సిబ్బంది దూకుడు పెంచారు. ప్రముఖ వాణిజ్య ప్రాంతాల్లో , భారీ వ్యాపాలు జరిగే ప్రాంతాల్లో ఉన్న కాంప్లెక్స్‌లలో భారీ బకాయిల అద్దెలున్న దుకాణాలను సీజ్ చేశారు.
● వీటితోపాటు సికింద్రాబాద్ ఓల్డ్ జైల్ కాంప్లెక్స్, పుత్లిబౌలి తదితర ప్రాంతాల్లోనూ కొన్ని షాపుల్ని సీజ్ చేశారు. వెరసి మొత్తం 223కు పైగా దుకాణాల్ని సీజ్ చేశారు.
● దీంతో దిగివచ్చిన వ్యాపారులు చెల్లించాల్సిన అద్దెల బకాయిల్లో కొంత చెల్లించి, మిగతా త్వరలో చెల్లిస్తామని వేడుకున్నారు. పుత్లిబౌలిలోని రెండు దుకాణాల నుంచే రూ.2.36 లక్షలు వసూలైంది. అలా రెండు రోజుల్లో రూ. 46 లక్షల అద్దెలు వసూలయ్యాయి. సీజ్ చేసిన మిగతా దుకాణాల నుంచీ అద్దెలు రాగలవని అధికారులు ఆశిస్తున్నారు. అలా ప్రస్తుతం సీజ్ చేసిన దుకాణాల నుంచి రూ. కోటికి పైగా వచ్చే అవకాశముందని చెబుతున్నారు.
అద్దెలు చెల్లించని దుకాణాల సీజ్
● చర్యలతో దిగివస్తున్న నిర్వాహకులు
● రెండు రోజుల్లో 223 దుకాణాలకు పైగా సీజ్
● రూ. కోటికి పైగా ఆదాయం
సీజ్ చేసిన దుకాణాలు ఇలా.. ఎక్కడ ఎన్ని
కోఠి సబ్‌వే 67
సుల్తాన్‌బజార్ కాంప్లెక్స్ 53
పటాన్‌చెరు 56
మంగళ్‌హాట్ మార్కెట్ 24
కుషాయిగూడ 23