
రోజు రోజుకూ పెరిగిపోతున్న పెండెన్సీ
సాక్షి, సిటీబ్యూరో:
జలమండలి ట్యాంకర్ల పెండెన్సీ నానాటికీ పెరిగిపోతోంది. ముదురుతున్న ఎండలు.. అడుగంటుతున్న భూగర్భ జలాలతో తిప్పలు తప్పడంలేదు. తాగునీటితో పాటు నిత్యావసరాలకు సైతం ట్యాంకర్ల తాకిడి పెరిగింది. బుకింగ్ నుంచి డెలివరీ సమయం తగ్గించేందుకు సంబంధిత అధికారులు ఒక వైపు తీవ్ర కసరత్తు చేస్తున్నా... మరోవైపు బుకింగ్ పెండెన్సీ తారస్థాయికి చేరుతోంది. జలమండలి పరిధిలో మొత్తం 75 ఫిల్లింగ్ స్టేషన్లు ఉండగా.. 20 స్టేషన్లు మినహా మిగతా వాటిలో 24 నుంచి 48 గంటలు దాటితే కాని ట్యాంకర్లు డెలివరీ కానీ పరిస్థితి నెలకొంది. డోయెన్స్ ఫిల్లింగ్ స్టేషన్‌లో ఐదు రోజులు, ఎల్లారెడ్డిగూడెంలో నాలుగు రోజులు, షాపూర్‌నగర్, గచ్చిబౌలి–2, గాజుల రామారాం, మణికొండ, ఫతేనగర్‌లలో మూడు రోజులు, మిగతా ఫిల్లింగ్ స్టేషన్లలో ట్యాంకర్ల డెలివరీకి 48 గంటల సమయం పడుతున్నట్లు జలమండలి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ట్యాంకర్ యజమానుల చేతివాటం
డిమాండ్ పెరగడంతో ట్యాంకర్ యజమానులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వినియోగదారులకు తెలియకుండానే వారి క్యాన్ నెంబర్ పేరిట ట్యాంకర్‌ను బుక్ చేసి వాణిజ్య అవసరాలకు తరలిస్తున్నారు. మరోవైపు కొందరు వినియోగదారుల సహకారంతో ట్యాంకర్లను బుక్ చేసి బ్లాక్‌లో డెలివరీ చేయడం పరిపాటిగా మారింది. వాస్తవంగా మాదాపూర్, బంజారాహిల్స్, మూసాపేట, మణికొండ, జూబ్లీహిల్ తదితర ప్రాంతాల నుంచి ట్యాంకర్ల డిమాండ్ పెరుగుతోంది. రోజువారీగా సెక్షన్ల పరిధిలో అత్యధికంగా ఐదు వందలపైగా ట్యాంకర్లు బుకింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
అవసరానికి మించిన వినియోగంతో..
గత ఏడాదితో పోల్చితే ట్యాంకర్ల డిమాండ్ మార్చి నెలలో రెట్టింపు స్థాయిలో పెరిగింది. సాధారణంగా నగర పరిధిలో జనవరి నుంచి జూన్ రెండో వారం వరకు ట్యాంకర్లకు తాకిడి అధికంగానే ఉంటుంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రతి యేటా ట్యాంకర్ల డిమాండ్ కనీసం 20 నుంచి 100 శాతం పెరుగుతూ వస్తోంది. వచ్చే నెలలో ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. వాస్తవంగా నగరంలో తాగునీటికి ఇంత డిమాండ్ ఏర్పడడానికి కారణం.. అవసరానికి మించి నీటిని వినియోగించడమేనని జలమండలి అధికారులు పేర్కొంటున్నారు. మొత్తమ్మీద 13 లక్షల నల్లా కనెక్షన్లలో కేవలం 42 వేల గృహాలు ట్యాంకర్లు బుకింగ్ చేస్తున్నట్లు జలమండలి అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో 500 మంది.. 75 రోజుల్లో 31 వేల ట్యాంకర్లు, 22 వేల మంది 90 శాతం ట్యాంకర్లను అంటే.. 2.84 లక్షల ట్యాంకర్లను బుక్ చేసినట్లు తెలుస్తోంది.
సంఖ్య పెరిగినా..
వాటర్ ట్యాంకర్ల సంఖ్య పెరిగినా.. పెండెన్సీ మాత్రం తగ్గడం లేదు. వాస్తవంగా గతేడాది 69 ఫిల్లింగ్ స్టేషన్లు ఉండగా ఈ ఏడాది మరో ఆరు స్టేషన్లను పెంచారు. ఫిల్లింగ్ పాయింట్ల సంఖ్య 93 నుంచి 123కు పెరిగింది. ట్యాంకర్ల సంఖ్య 577 నుంచి 977కు చేరింది.