సారీ
అమ్మా.. నాన్నా..
బెట్టింగులకు దూరంగా ఉండలేకపోతున్నా
● క్రికెట్‌లో డబ్బులు పోవడంతో మనస్తాపం
● రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య
మేడ్చల్ రూరల్: నేను సూసైడ్ చేసు కోవాలని డిసైడయ్యా.. దయచేసి నన్ను డిస్ట్రబ్ చేయకండి.. నేను డబ్బు ల విషయంలో ఆత్మహత్యకు పాల్పడడం లేదు. నా మైండ్ సెట్ కంట్రోల్ కావడం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. అమ్మా.. నాన్నా.. అండ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్.. సారీ.. అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టి సోమేష్‌కుమార్ అనే యువకుడు గౌడవెల్లి గ్రామ పరిధిలో రైలు కిందపడి తనువు చాలించిన ఘటన చోటుచేసుకుంది. మృతుడి కుటుంబీకులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. ఏపీలోని అనకాపల్లి జిల్లా చోడవరం మండలం భోగాపురం గ్రామానికి చెందిన రమణ, కనకమ్మ దంపతులు బతుకుదెరువు కోసం 25 ఏళ్ల క్రితం నగరానికి వలసవచ్చి గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు సోమేశ్‌కుమా ర్ (29) కొంపల్లి సమీపంలో ఉన్న ఓ కంపెనీ వేర్‌హౌస్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. క్రికెట్ బెట్టింగులకు బానిసైన సోమేశ్ రూ.లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్నాడు. గతంలో కుటుంబీకులు సోదరి వివా హం కోసం దాచిన డబ్బులు సైతం బెట్టింగ్స్‌లో కోల్పోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు కుమారుడిని మందలించారు. బెట్టింగ్ కారణంగా రూ.3.5 లక్షల వరకు అప్పులు చేయడంతో వాటిని తల్లిదండ్రులే చెల్లించారు. దీంతో మళ్లీ బెట్టింగులకు పాల్పడనంటూ చెప్పిన సోమేశ్‌కుమార్ ఇటీవల ఐపీఎల్ క్రికెట్ మొదలవ్వడంతో మళ్లీ బెట్టింగుల వైపు మళ్లాడు. గత సోమవారం రాత్రి జరిగిన లక్నో– ఢిల్లీ మ్యాచ్ సందర్భంగా రూ.లక్ష క్రికెట్ బెట్టింగ్ యాప్‌లో బెట్టింగ్ వేశాడు. దురదృష్టవశాత్తు ఢిల్లీ మ్యాచ్ గెలవడంతో ఒక్క రోజే రాత్రికిరాత్రి రూ.లక్ష పోగొట్టుకున్నాడు. ఆ మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.