
‘మల్టీలెవెల్ పార్కింగ్’ పనులు చకచకా
బంజారాహిల్స్: బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు సమీపంలో పార్కింగ్ సమస్యను నివారించేందుకు మల్టీ లెవెల్ పార్కింగ్ నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పార్కు పక్కనే ఉన్న జీహెచ్‌ఎంసి స్థలంలో ఈ నిర్మాణం గత రెండు వారాల నుంచి ముమ్మరంగా జరుగుతున్నది. ఆరు అంతస్తులలో నిర్మాణం జరుగుతున్న ఈ మల్టీ లెవెల్ పార్కింగ్‌లో ఒక్కో ఫ్లోర్‌లో 12 కార్లు పార్కింగ్ చేయవచ్చు. ఇలా మొత్తం ఆరు ఫ్లోర్లలో 72 కార్లు పార్కు చేసుకునే అవకాశం ఉంటుంది. హైదరాబాద్‌కు చెందిన నవనిర్మాణ ఏజెన్సీ ఈ పనులు చేస్తున్నది. రూ.రెండున్నర కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పార్కింగ్ నిర్మాణంలో హైడ్రాలిక్ పద్ధతిలో లిఫ్ట్ సౌకర్యం ఉంటుంది. పార్కింగ్ కోసం కారు రాగానే ఈ హైడ్రాలిక్ లిఫ్ట్‌లో ఏ ఫ్లోర్లో ఖాళీగా ఉంటే ఆ ఫ్లోర్ లోకి కారు తీసుకెళ్లి పార్కింగ్ చేస్తారు. కారు పార్కింగ్ చేసిన తర్వాత ఒక చిప్‌ను కారు యజమానికి ఇస్తారు. వాకర్లు, ఇతర పనుల కోసం వచ్చిన వారు తమ కార్లు పార్క్ చేసిన తర్వాత..పని పూర్తికాగానే వెళ్తే డ్రైవర్ కారును కిందికి తెప్పిస్తాడు. ప్రస్తుతం ఇలాంటి మల్టీ లెవెల్ పార్కింగ్ వ్యవస్థ బెంగళూరు, చైన్నెలో మాత్రమే ఉంది. హైదరాబాద్‌లో మొట్టమొదటిసారిగా కేబీఆర్ పార్కు పక్కన నిర్మిస్తున్నారు. దీని చుట్టూ కేఫెలు, ఇతర దుకాణాలు కూడా ఏర్పాటు చేస్తారు. పార్కింగ్ ప్రాంతం అంతా సుందరంగా తీర్చిదిద్దుతారు. ఇప్పటికే ఫుట్‌పాత్‌పై ఉన్న బస్సు షెల్టర్లను నోటీసులు అందజేసి తొలగించారు. ఇక్కడ కొనసాగుతున్న కడక్ చాయ్‌తో పాటు 1980 మిలిటరీ హోటల్ కూడా తొలగించనున్నారు. ఈ రెండు దుకాణాలకు నోటీసులు జారీ చేశారు. ఇక్కడ మల్టీ లెవెల్ పార్కింగ్ వ్యవస్థ నిర్మాణం పూర్తయిన తర్వాత పరిసరాలన్నీ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించారు.
కేబీఆర్ పార్క్ వద్ద ఆరు అంతస్తుల్లో నిర్మాణం
72 కార్లు పార్కింగ్ చేసుకునే అవకాశం
Comments
Please login to add a commentAdd a comment