
పూజారికి జీవిత ఖైదు
ప్రియురాలి హత్య కేసులో
రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు
శంషాబాద్ రూరల్/రంగారెడ్డి జిల్లా కోర్టులు: తనకు వివాహం జరిగిందనే విషయాన్ని దాచి.. ఆలయానికి వచ్చే మరో మహిళతో ప్రేమాయణం సాగించాడు. ప్రియురాలు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో.. ఆమెను వదిలించుకునేందుకు హత్య చేసిన పూజారికి కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. రెండేళ్ల క్రితం సంచలనం సృష్టించిన ఈ కేసు తీర్పు బుధవారం వెలువడింది. ఇన్‌స్పెక్టర్ కె.నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని సరూర్‌నగర్‌లో వెంకటేశ్వర కాలనీలో నివసించే పూజారి వెంకట సూర్యసాయి కృష్ణ (36)కు గతంలోనే పెళ్లి జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన కారుగంటి అప్సర (30) తరచూ ఇతను పూజారిగా ఉన్న ఆలయానికి వస్తుండేది. ఆమెతో చనువు పెంచుకున్న సాయి కృష్ణ ప్రేమాయణం సాగించాడు. తనకు వివాహం అయిందనే విషయం దాచిపెట్టి ఆమెతో వివాహేతర సంబంధాన్ని ఏర్పర్చుకున్నాడు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని సాయి కృష్ణపై అప్సర ఒత్తిడి చేయగా.. ఆమెను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు.
కారులో తీసుకొచ్చి..
కోయంబత్తూరు తీసుకెళ్లాలని అప్సర సాయికృష్ణను కోరగా.. ఇదే అదనుగా భావించి ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్సరను 2023 జూన్ 3న సరూర్‌నగర్ నుంచి రాత్రి తన కారులో శంషాబాద్ తీసుకొచ్చి.. అక్కడే ఓ రెస్టారెంట్‌లో భోజనం చేశారు. ఆ తర్వాత నర్కూడలోని నవరంగ్ వెంచరులోకి తీసుకెళ్లగా.. అప్సర కారులోనే నిద్రలోకి జారుకుంది. ఈ సమయంలో ఆమె ముఖంౖపై కవర్ కప్పి ఊపిరి ఆడకుండా చేశాడు. స్పృహ కోల్పోయిన అప్సర తలపై రాయితో బాది హత్య చేశాడు. ఈ క్రమంలో అప్సర మిస్సింగ్ కేసు దర్యాప్తులో ఈ దురాఘతం వెలుగు చూసింది. అప్పటి ఇన్‌స్పెక్టర్ ఎ.శ్రీధర్‌కుమార్ చార్జ్‌షీట్ ఫైల్ చేయగా.. బాధితురాలి తరఫున ఈ కేసును పీపీ రవికుమార్ కోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసులో సాయి కృష్ణను ముద్దాయిగా నిర్ధారించిన రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయమూర్తి వై.జయప్రసాద్ బుధవారం అతడికి జీవిత ఖైదు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన కోర్టు డ్యూటీ ఆఫీసర్ ఏఎస్‌ఐ రామిరెడ్డి, కానిస్టేబుల్ ఎండీ.ఖాజాపాషాను ఇన్‌స్పెక్టర్ కె.నరేందర్‌రెడ్డి అభినందించారు. ఈ తీర్పుతో తన కూతురు ఆత్మకు శాంతి కలిగిందని, చివరకు న్యాయమే గెలిచిందని అప్సర తండ్రి శ్రీధర్ శర్మ ఆనందం వ్యక్తంచేశారు.

పూజారికి జీవిత ఖైదు