సారూ.. జరచూడరూ! | - | Sakshi
Sakshi News home page

సారూ.. జరచూడరూ!

Mar 3 2025 6:36 AM | Updated on Mar 3 2025 6:36 AM

సారూ.. జరచూడరూ!

సారూ.. జరచూడరూ!

చార్మినార్‌: పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభమైంది. దీంతో పాటు పాతబస్తీలో పార్కింగ్‌ సమస్య కూడా మొదలైంది. ఇక నెల రోజుల పాటూ పాతబస్తీలో రంజాన్‌ మార్కెట్‌ కొనసాగుతుంది. దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన వివిధ రకాల వస్తువులు ఇక్కడి రంజాన్‌ మార్కెట్‌లో లభిస్తాయి. దీంతో పాతబస్తీ చార్మినార్‌ పరిసరాల్లో జోరుగా రంజాన్‌ మార్కెట్‌ ఉంటుంది. వివిధ ప్రాంతాలను చెందిన వినియోగదారులు తమకు నచ్చిన వస్తువులను ఖరీదు చేయడానికి పాతబస్తీకి భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు. అయితే.. పాతబస్తీ రంజాన్‌ మార్కెట్‌కు వచ్చే వినియోగదారుల సౌకర్యార్థం పార్కింగ్‌ అందుబాటులో లేకుండాపోయింది. రంజాన్‌ ఉపవాస దీక్షల సందర్బంగా రోజుకు ఐదుసార్లు నమాజ్‌ చేసే ముస్లింలు సైతం మక్కా మసీదుకు పెద్ద ఎత్తున తరలి వస్తారు. వీరందరి వాహనాలను పార్కింగ్‌ చేసుకోవడానికి ఇప్పటి వరకు సరైన పార్కింగ్‌ లాట్‌లు అందుబాటులో లేవు. నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి దారుషిఫా, నయాపూల్‌, పురానా పూల్‌ ద్వారా పాతబస్తీలోకి అడుగుపెట్టే వాహనదారులకు పార్కింగ్‌ సమస్యలు రంజాన్‌ మాసంలో మరింత జటిలం కానున్నాయి.

మల్టీ లెవల్‌ పార్కింగ్‌ సిస్టం ఏమాయే?

చార్మినార్‌– మక్కా మసీదు సమీపంలోని పంచ్‌ మహల్లాలో జీహెచ్‌ఎంసీ మల్టీ లెవల్‌ పార్కింగ్‌ సౌకర్యం ఏర్పాటు చేయడానికి ఏడేళ్ల క్రితం ఇక్కడి ఆర్టీసీ బస్టాండ్‌ను కూల్చివేసి ఏడేళ్లు గడుస్తున్నా.. ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నిధులు సైతం మంజూరు కావడంతో హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ గత సార్వత్రిక ఎన్నిలకు ముందు శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు జరగలేదు. దీంతో పాటు మోతి గల్లీలోని నిజాం కాలం నాటి ట్రెజరీ భవనాన్ని తొలగించిన సంబంధిత అధికారులు ఇక్కడ కూడా మల్టీ లెవల్‌ పార్కింగ్‌ నిర్మాణాలు చేపడతామని హడావుడి చేశారు. ఏడేళ్లు గడిచిపోయినా ఏమీ జరగలేదు. ఇలా పాతబస్తీకి వచ్చే సందర్శకులు, వినియోగదారులు, వాహనదారులకు తమ వాహనాలను ఎక్కడ పార్కింగ్‌ చేసుకోవాలో తెలియని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి.

రంజాన్‌ మార్కెట్‌ ప్రారంభంతో మరిన్ని సమస్యలు..

ఇక సాధారణ రోజుల్లో తలెత్తే పార్కింగ్‌ సమస్యలతో పాటు.. ఈ నెల రోజుల పాటు కొనసాగే రంజాన్‌ మార్కెట్‌లో అధికంగా ఉంటాయి. అత్యధిక సంఖ్యలో వచ్చే వాహనాల పార్కింగ్‌కు తాత్కాలికంగానైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అవసంరం ఉంది. గత రంజాన్‌ మార్కెట్‌ సందర్భంగా పాతబస్తీలోని కొన్ని ఖాళీ స్థలాలను ఎంపిక చేసి తాత్కాలికంగా ఉచిత పార్కింగ్‌ అంటూ రంజాన్‌ ప్రారంభానికి ముందే ప్రకటించేవారు సంబంధిత లా అండ్‌ ఆర్డర్‌, ట్రాఫిక్‌ పోలీసులు. అయితే.. ఆదివారం నంంచి రంజాన్‌ మాసం ప్రారంభమైనప్పటికీ.. పాతబస్తీలో అవసరమైన మేరకు పార్కింగ్‌ స్థలాలను అందుబాటులోకి తీసుకురాకపోవడంతో స్థానిక వ్యాపారులతో పాటు వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లాడ్‌బజార్‌లో సౌకర్యం లేకపోవడంతో..

లాడ్‌బజార్‌లోని గాజుల దుకాణాలను సందర్శించడానికి దూరపు ప్రాంతాల నుంచి షాపింగ్‌ కోసం వచ్చే వినియోగదారులకు సరైన పార్కింగ్‌ సౌకర్యం లేకపోవడంతో తమకు నిరాశ కలుగుతోందని స్థానిక వ్యాపారులు అంటున్నారు. తమ కోసం ప్రత్యేకంగా పార్కింగ్‌ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని గాజుల వ్యాపారులు కోరుతున్నారు. సరైన పార్కింగ్‌ లేకపోవడంతో తమ వాహనాలను ఎక్కడ పార్కు చేసుకోవాలో తెలియక వినియోగదారులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందంటున్నారు. పార్కింగ్‌ కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయిస్తే ఈ రంజాన్‌ మాసంలో ఆశించిన స్థాయిలో వ్యాపారాభివృద్ది జరుగుతుందని కోరుతున్నారు. ప్రత్యేకంగా కారు పార్కింగ్‌ ఏర్పాటు చేయాని వారు సూచిస్తున్నారు.

రంజాన్‌ మార్కెట్‌లో పార్కింగ్‌ తిప్పలు

పాతబస్తీలో మొదలైన సందడి

ఈ నెల రోజులూ ఇక ఇక్కట్లు

ఊసే లేని మల్టీ లెవల్‌ పార్కింగ్‌ హామీ

తాత్కాలిక సౌకర్యం కల్పించాలంటున్న వాహనదారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement