
మానవాళికి ఉపయోగపడే పరిశోధనలు చేయండి
ఉస్మానియా యూనివర్సిటీ: యూనివర్సిటీలలో నూతన పరిశోధనలకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని, విద్యార్థులు, పరిశోధకులు మానవాళికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. బుధవారం ఓయూ క్యాంపస్ సైన్స్ కాలేజీ ఫిజిక్స్ విభాగంలో మల్టీ ఫంక్షనల్ మెటీరియల్స్ ఫర్ సొసైటల్ అప్లికేషన్స్ అనే అంశంపై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. కార్యక్రమానికి వీసీ ప్రొ.కుమార్ అధ్యక్షత వహించగా ఓయూ ఛాన్స్‌లర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. సమాజ అవసరాలు తీర్చేలా పరిశోధనలు జరగాలని అన్నారు. పరిశోధన ఫలాలు ప్రధానంగా గిరిజనులకు చేరాలన్నారు. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో విభిన్న విభాగాలు కలసి పనిచేయాలని, తద్వారా నాణ్యతమైన ఉత్పత్తులు చౌకగా లభిస్తాయన్నారు. పరిశోధనలలో ఓయూ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడుతోందని వీసీ ప్రొ.కుమార్ అన్నారు. అంతరం సదస్సు సావనీర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సదస్సు చైర్మన్, హెడ్ ప్రొ.శ్రీనివాస్, ఏఆర్‌సీఐ డైరెక్టర్ డా.విజయ్, ఎఎండీ డైరెక్టర్ ధీరజ్ పాండే, ప్రొ.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
– గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ