
బాల్యానికి మూడు‘ముళ్లు’
సాక్షి, సిటీబ్యూరో: ఎగుమతుల ఖిల్లా.. రంగారెడ్డి జిల్లా బాల్య వివాహాలకు నిలయంగా మారుతోంది. ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో దూసుకుపోతూ అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఉమ్మడి జిల్లాలోని పలువురు బాలికలు మూడు ముళ్ల బంధంలో చిక్కుకుంటున్నారు. 18 ఏళ్ల వయసు నిండక ముందే పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. తల్లిదండ్రులు తమకు ఇష్టం లేని పెళ్లిళ్లు చేస్తుండటంతో అధికారులను ఆశ్రయిస్తున్నారు. 2024 జనవరి నుంచి నవంబర్ చివరి వరకు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు వెయ్యి బాల్య వివాహాలను అడ్డుకోగా, వీటిలో కేవలం గ్రేటర్ జిల్లాల పరిధిలోనే 248 కేసులు ఉండటం గమనార్హం.
అవగాహన కల్పిస్తున్నా..
బాల్య వివాహాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. పిల్లలకు త్వరగా పెళ్లి చేసి, బాధ్యతల భారాన్ని తగ్గించుకోవాలనే సామాజిక దురాచారం నుంచి తల్లిదండ్రులు ఇంకా బయటపడటం లేదు. ఉన్నత చదువులు చదువుకుని, మంచి ఉద్యోగం సంపాదించి సొంతకాళ్లపై నిలబడాలనే బాలికల ఆలోచనను మొగ్గలోనే తుంచేస్తున్నారు. బాల్య వివాహాల రద్దు కోసం ప్రభుత్వాలు బలమైన చట్టాలను తీసుకొచ్చినప్పటికీ.. తల్లిదండ్రుల్లో ఉన్న బలహీనత బాలికల పాలిట శాపంగా మారుతోంది. కొంత మంది తల్లిదండ్రుల ఒత్తిడికి తలొగ్గి తాళి కట్టించుకుంటుంటే.. మరికొంత మంది ఎదురు తిరుగుతున్నారు.
పలువురికి విముక్తి
బలవంతపు పెళ్లిని నిలిపివేయించాలని కోరుతూ పోలీసులను, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆశ్రయిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా 94 బాల్య వివాహాలను అడ్డుకోగా, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 54 చొప్పున అడ్డుకున్నారు. హైదరాబాద్‌లో 46 మంది బాలికలకు బాల్య వివాహాల నుంచి విముక్తి కల్పించారు.
జిల్లా అడ్డుకున్న
బాల్య వివాహాలు
వికారాబాద్ 94
రంగారెడ్డి 54
మేడ్చల్ 54
హైదరాబాద్ 46
18 ఏళ్లు నిండక ముందే పెళ్లి పీటల పైకి..
గ్రేటర్ జిల్లాల పరిధిలో ఆగని బాల్య వివాహాలు
తరచూ వెలుగు చూస్తున్న ఘటనలు