
ఓఆర్‌ఆర్‌పై ఘోర ప్రమాదం
డీసీఎం వాహనాన్ని ఢీకొట్టిన కారు
● భర్త మృతి.. భార్య, కుమారుడికి తీవ్ర గాయాలు
దుండిగల్: ఔటర్ రింగ్ రోడ్డుపై డీసీఎం వాహనాన్ని కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సతీష్ కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన కార్తీక్ (38) నగరంలోని నిజాంపేటలో నివాసముంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు భార్య సింధు, కుమారుడు కివి (3) ఉన్నారు. స్వగ్రామం వెళ్లిన కార్తీక్ భార్య, కుమారుడితో కలిసి తన కారులో తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో మల్లంపేట ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 5 వద్ద మంగళవారం ఉదయం 7.30 గంటల సమయంలో ముందు వెళ్తున్న డీసీఎం వాహనాన్ని అతివేగంతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జు నుజ్జు కావడంతో అందులో ఇరుక్కున్న కార్తీక్ అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య సింధు, కుమారుడు కివిలకు తీవ్ర గాయాలు కావడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. దుండిగల్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. మల్లంపేట ఎగ్జిట్ వద్ద దిగి కొన్ని నిమిషాల్లోనే ఇంటికి చేరుకోవాల్సి ఉండగా.. ఖమ్మం జిల్లా నుంచి రాత్రి సమయంలో ప్రయాణం చేయడం నిద్రమత్తులో ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment