‘ప్రత్యేక అభివృద్ధి’ పనులు పూర్తి చేయాలి
పురోగతిపై జిల్లా కలెక్టర్ అనుదీప్ సమీక్ష
సాక్షి, సిటీబ్యూరో: ప్రత్యేక అభివృద్ధి నిధులతో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఇంజనీరింగ్ శాఖల ఆధ్వర్యంలో ఎస్‌డీఎఫ్ నిధులతో చేపట్టిన పనుల పురోగతి, పెండింగ్ పనులను సమీక్షించారు. సీడీఎఫ్ పథకం కింద 268 పనులకుగాను 79 పనులు పూర్తి కాగా, మరో 73 పనులు పురోగతిలో ఉన్నాయని, 10 పనులు టెండర్ దశలో ఉన్నాయని పేర్కొన్నారు. మిగిలిన 48 పనులకు స్థల పరిశీలన చేసి ప్రతిపాదనలు సిద్ధంగా ఉంచాలన్నారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, ఎక్కడైనా ఏజెన్సీలు ఇబ్బంది పెడితే తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పనులు పూర్తయిన వాటికి సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లు అందచేయాలని సూచించారు. ఎక్కడైనా స్థలం సమస్య, టెండర్ ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు ఉంటే నివేదిక రూపంలో అందజేయాలనీ కలెక్టర్ అధికారులకు సూచించారు. సమీక్షా సమావేశంలో సీపీవో డాక్టర్ సురేందర్, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
‘ప్రత్యేక అభివృద్ధి’ పనులు పూర్తి చేయాలి