
పది వేల మందితో మళ్లీ వస్తాం
ఇబ్రహీంపట్నం/యాచారం: పది వేల మంది నిరుపేదలతో మరోసారి రామోజీ ఫిలిం సిటీకి వస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ హెచ్చరించారు. యాజమాన్యం ఆక్రమించిన పేదల ఇళ్ల స్థలాలను వదిలేసే వరకూ పోరాటం కొనసాగిస్తామని స్పష్టంచేశారు. ఫిలింసిటీ వద్ద ఆందోళన నిర్వహించిన సీపీఎం నేతలను అరెస్టు చేసిన పోలీసులు వీరిని ఇబ్రహీంపట్నం, యాచారం పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదలకు మంజూరు చేసిన ఇళ్ల స్థలాల వద్దకు వెళ్తున్న లబ్ధిదారులను పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని..ఆ భూములతో పోలీసులకు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. 2007లో అప్పటి ప్రభుత్వం సుమారు 600 మందికి 20 ఎకరాల్లో 60 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించి సర్టిఫికెట్లు ఇచ్చిందని.. అప్పటి నుంచి ఈ భూములు రామోజీ కబ్జాలోనే ఉన్నాయని ఆరోపించారు. ఈ సమస్యను పరిష్కరించాలని పలుమార్లు రెవెన్యూ అధికారులకు మొర పెట్టుకున్నా ఫలితంలేకపోవడంతో వారి స్థలాల్లోకి లబ్ధిదారులు వెళ్లారన్నారు. పోలీసులు రామోజీ యాజమాన్యానికి తొత్తులుగా మారి పేదలను అడ్డుకుంటున్నారని..రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకోవాల్సిన విషయంలో పోలీసులు తలదూర్చడం తగదన్నారు. రామోజీ కబంధ హస్తాల్లో ఉన్న మరో 300 ఎకరాల ప్రభుత్వ భూమిని సైతం బయటకు తీస్తామని అన్నారు. పేదల భూములు కబ్జా పెట్టిన రామోజీ యాజమాన్యంపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. పేదల పక్షాన పోరాడుతున్న తమపై కేసులు బనాయించడం సరికాదన్నారు.
నేడు, రేపు ఆందోళనలు: సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య
పోలీసుల అక్రమ అరెస్ట్‌లను నిరసిస్తూ గురు, శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పోలీసుల తోపులాటలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు పి.జగన్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. బుగ్గరాములు, సామేల్, జగదీశ్, జగన్, జంగయ్య, కిషన్, వెంకటేశ్, నర్సిరెడ్డి, ఎల్లేశ్, తులసిగారి నర్సింహ, అరుణ, స్వప్న, ప్రకాశ్‌కారత్, చరణ్, ఆనంద్, శ్రీకాంత్, శివ యాదగిరి, నర్సింహ తదితరులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. పోలీసుల కస్టడీలో ఉన్న వారిని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పి.అంజయ్యపరామర్శించారు. అరెస్టులతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరన్నారు.
పేదల భూముల్లో గుడిసెలు వేస్తాం
రెవెన్యూ సంబంధిత విషయంలో పోలీసుల జోక్యం తగదు
రామోజీ యాజమాన్యంపై కేసులు పెట్టాలి
త్వరలో పది వేల మందితోగుడిసెలు వేస్తాం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ