● రూ.14 కోట్లు మోసం చేసిన కేటుగాడు
● అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు
సాక్షి, సిటీబ్యూరో: అధిక వడ్డీ ఆశ చూపించి మోసం చేసిన కేటుగాణ్ని సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం (ఈఓడబ్ల్యూ) పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన కందుల శ్రీనివాస రావు నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలో వెల్ విజన్ గ్రూప్ పేరుతో పలు కంపెనీలను ఏర్పాటు చేశాడు. తన కంపెనీలో డిపాజిట్లు, పెట్టుబడులు పెడితే 200 శాతం అధిక వడ్డీ అందిస్తానని రకరకాల స్కీమ్‌లతో ప్రచారం చేశాడు. రూ.లక్ష డిపాజిట్ చేస్తే.. రోజుకు రూ.2 వేల చొప్పున వంద రోజుల పాటు రూ.2 లక్షలు, అలాగే.. రూ.6.50 లక్షలు డిపాజిట్ చేస్తే.. 121 గజాల స్థలంతో పాటు నెలకు రూ.32,500 చొప్పున 20 నెలల్లో రూ.6.50 లక్షలు రీఫండ్ చేస్తామని ప్రకటించాడు. టీవీ, వాషింగ్ మిషన్, ఏసీ వంటి వెల్ విజన్ గ్రూప్ గృహోపకరణాలను ఖరీదు చేసిన వారికి ఉత్పత్తి ఖరీదు మొత్తాన్ని వాయిదాల రూపంలో తిరిగి చెల్లిస్తామని ఆశ పెట్టాడు. ఉదాహరణకు రూ.30 వేలు పెట్టి టీవీ కొనుగోలు చేసే కస్టమర్‌కు టీవీతో పాటు నెలకు రూ.1,500 చొప్పున 20 నెలల్లో రూ.30 వేలు కస్టమర్‌కు రీఫండ్ చేస్తామని ప్రచారం చేశాడు. అత్యాశకు పోయిన సుమారు 200 మంది అమాయకులు రూ.14 కోట్లు డిపాజిట్లు చేశారు. కొన్ని నెలల పాటు వడ్డీ చెల్లించిన శ్రీనివాస రావు.. ఆ తర్వాత బిచాణా ఎత్తేశాడు. బాధితుల ఫిర్యాదుతో సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు శ్రీనివాస రావును అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment