
భారీ బందోబస్తు
శ్రీరామ నవమి శోభాయాత్రకు
నగర కొత్వాల్ సీవీ ఆనంద్
అబిడ్స్: శ్రీరామ నవమి శోభాయాత్రకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేపడుతున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఈ నెల 6న సీతారామ్‌బాగ్ నుంచి హనుమాన్ టేక్డీ వరకు కొనసాగే శోభాయాత్రకు ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో అన్ని విధాలా ఏర్పాట్లు చేపడతామని వెల్లడించారు. గురువారం సీతారామ్‌బాగ్‌లోని ద్రౌపది గార్డెన్‌లో జరిగిన పలు శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ఆదివారం సీతారామ్‌బాగ్ ఆలయం నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్రను శాంతియుతంగా, సంతోషంగా చేపట్టాలని సూచించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శోభాయాత్ర ప్రారంభించేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలన్నారు. శోభాయాత్రలో డీజేలకు బదులుగా సౌండ్ బాక్సులు వాడుకోవాలని సీపీ పేర్కొన్నారు. సుమారు 20 వేల మంది పోలీసులతో శోభాయాత్రకు బందోబస్తుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సమావేశంలో అడిషనల్ సీపీ విక్రమ్‌సింగ్ మాన్, జాయింట్ సీపీ ట్రాఫిక్ జోయల్ డేవిస్, డీసీపీలు జి.చంద్రమోహన్, బి.బాలస్వామి, చైతన్య కుమార్, జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ రఘుప్రసాద్, వాటర్‌బోర్డు అధికారి అమరేందర్ రెడ్డి, డీఎఫ్‌ఓ వెంకన్న, శోభాయాత్ర ఛైర్మన్ భగవంతరావు, వీహెచ్‌పీ రాష్ట్ర ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, ఇతర నాయకులు గోవింద్‌రాఠి, ఆనంద్ సింగ్, కృష్ణ, శ్రీరామ్ వ్యాస్, మెట్టు వైకుంఠం, ఆనంద్‌కుమార్ గౌడ్, పప్పుమాత్రే తదితరులు పాల్గొన్నారు. కాగా..శోభాయాత్ర రూట్‌ను నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌తో పాటు పలువురు అధికారులు పరిశీలించారు. సీతారామ్‌బాగ్ నుంచి బోయిగూడ కమాన్, మంగళ్‌హాట్, పురానాపూల్, బేగంబజార్ ఛత్రి, సిద్దిఅంబర్‌బజార్, గౌలిగూడ, కోఠి హనుమాన్ టేక్డీ వరకు అధికారుల బృందం శోభాయాత్ర ఏర్పాట్లపై పరిశీలన చేపట్టారు.