చెత్త వేస్తే .. ఇక ఈ–చలాన్
యూపీఐ ద్వారానే పెనాల్టీల చెల్లింపులు
● యాప్ రూపొందించిన జీహెచ్‌ఎంసీ
● త్వరలో అందుబాటులోకి ..
సాక్షి,సిటీబ్యూరో: ఒక్కో విభాగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్న జీహెచ్‌ఎంసీ.. డంపర్‌బిన్లలో చెత్త దాదాపు 75 శాతం నిండగానే అలర్ట్ చేసేలా ఆధునిక డంపర్‌బిన్లను అందుబాటులోకి తెస్తోంది. చెత్త తరలింపునకే కాకుండా ఎక్కడ పడితే అక్కడ చెత్త, నిర్మాణ.. కూల్చివేతల వ్యర్థాలు, ఇతరత్రా వ్యర్థాలు వేసే వారికి విధించే పెనాల్టీలకు ఇకపై ఈ–చలాన్‌లను జారీ చేయనుంది. అంతేకాదు, చెల్లింపులు సైతం మాన్యువల్‌గా కాకుండా యూపీఐ చెల్లింపులే స్వీకరించనుంది. ఇందుకు గాను జీహెచ్‌ఎంసీ త్వరలో ప్రత్యేక యాప్‌ను వినియోగంలోకి తేనుంది. ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ ద్వారా ఈ యాప్‌ను రూపొందించారు.
నిధులు పక్కదారి పట్టకుండా..
స్వచ్ఛ కార్యక్రమాల అమల్లో భాగంగా జీహెచ్‌ఎంసీ బహిరంగ ప్రదేశాల్లో చెత్తాచెదారం వేసేవారితో పాటు నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాలు వేసే వారికి పెనాల్టీలు విధిస్తోంది. పెనాల్టీలను చలాన్ బుక్‌ల ద్వారా క్షేత్రస్థాయిలోని అధికారులు జారీ చేస్తున్నారు. అధికారులు తమ ఇష్టానుసారం పెనాల్టీలు విధించడం, ఎక్కువ పెనాల్టీ వసూలు చేసి జీహెచ్‌ఎంసీ పుస్తకాల్లో మాత్రం తక్కువ మొత్తాలు రాస్తూ తమ జేబులు నింపుకునే పనులకు పాల్పడుతున్నారు. దీంతో ప్రజలు చెల్లిస్తున్న పెనాల్టీల సొమ్ము మొత్తం జీహెచ్‌ఎంసీ ఖజానాకు చేరడం లేదు. చలాన్ బుక్‌ల ద్వారా జారీ చేసిన వాటిలో ఎన్నింటికి పెనాల్టీలు వసూలయ్యాయో వంటి సమాచారం సైతం ఉండటం లేదు. ఈ నేపథ్యంలో వాహన నిబంధనలు ఉల్లంఘించే వారికి ట్రాఫిక్ పోలీసుల ఈ–చలాన్ ల మాదిరిగా వ్యర్థాలు వేసేవారికి క్షేత్రస్థాయిలోని ఏఎంఓహెచ్‌లు, డీఈఈలు, ఏసీపీలు, తదితర అధికారులు ఈ–చలాన్‌లు జారీ చేయనున్నారు. రెండు మూడు రోజుల్లో యాప్‌పై సంబంధిత అధికారులకు శిక్షణ ఇచ్చిన తర్వాత యాప్‌ను వినియోగంలోకి తెస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సీఎన్ రఘుప్రసాద్(పారిశుధ్యం) తెలిపారు. ఏ ఉల్లంఘనకు ఎంత పెనాల్టీ విధించాలో యాప్ ద్వారా ఆటోమేటిక్‌గానే జనరేట్ అవుతుందన్నారు. పెనాల్టీలను యూపీఐ ద్వారానే చెల్లించాల్సి ఉంటుందన్నారు. తద్వారా క్షేత్రస్థాయిలోని అధికారులు ఇకపై ఇష్టారాజ్యంగా వ్యవహరించే వీలుండదు.
చార్మినార్ జోన్‌కు అధికంగా..
గతంలో స్వచ్ఛ ర్యాంకింగ్స్ కోసం డంపర్‌బిన్లను తొలగించిన జీహెచ్‌ఎంసీ అధికారులు అవి లేనిదే చెత్త సమస్యలు తీరవని గ్రహించి తిరిగి వాటిని ఏర్పాటు చేస్తున్నారు.ఆటోమేటిక్‌గా చెత్త పూర్తిగా నిండకముందే అలర్ట్ చేసే సాంకేతికతతో కూడిన డంపర్‌బిన్లను దాదాపు వెయ్యి చెత్త వల్నరబుల్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 260 డంపర్‌బిన్లు సమకూర్చుకోగా రంజాన్ మాసాన్ని దృష్టిలో ఉంచుకుని చార్మినార్ జోన్‌కు అధికంగా 134 డంపర్‌బిన్లు తరలించారు. వాటిల్లో 121 బిన్లను వల్నరబుల్ ప్రాంతాల్లో ఉంచారు. ఖైరతాబాద్‌జోన్‌కు 20 బిన్లు తరలించగా, వాటిల్లో ఆరింటిని వల్నరబుల్‌ప్రాంతాల్లో అమర్చారు. మిగతా వాటిని ఏర్పాటు చేసే పనుల్లో ఉన్నారు.
శానిటరీ జవాన్లా మజాకా ?
జీహెచ్‌ఎంసీలో ఉన్న 269 మంది శానిటరీ జవాన్లలో 139 మందిని ఇటీవల బదిలీ చేయడం తెలిసిందే. వారు బదిలీ అయిన స్థానాల్లోకి వెళ్లక ముందే స్థానిక కార్పొరేటర్ల నుంచి మొదలు పెడితే.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ దాకా తమ పరిధిలోని శానిటరీ జవాన్ల బదిలీ నిలిపివేయాలంటూ సంబంధిత ఉన్నతాధికారుల వద్దకు క్యూలు కడుతున్నారు. స్వచ్ఛ ర్యాంకింగ్ కోసం కేంద్ర బృందం నగరంలో పర్యటిస్తున్న తరుణంలో పారిశుధ్యం బాగుండాలనే తలంపుతో కమిషనర్ శానిటరీ జవాన్లను బదిలీ చేసినట్లు తెలుస్తోంది. వారిలో చాలామందికి రాజకీయ అండదండలుండటంతో చేయాల్సిన పనులు చేయడం లేరు. రెగ్యులర్ ఉద్యోగులైన శానిటరీ జవాన్లు తమ పనుల్ని ఔట్‌సోర్సింగ్‌పై నియమితులైన శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లకు అప్పగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఒకే చోట పనిచేస్తున్న శానిటరీ జవాన్లలో గత 35 ఏళ్లుగా ఒకేచోట పని చేస్తున్నవారు కూడా ఉండటం విశేషం.
సీఅండ్ డీ వ్యర్థాల ద్వారా
దాదాపు నాలుగునెలల నుంచి నిర్మాణ, కూల్చివేతల(సీఅండ్‌డీ) వ్యర్థాలను క్షేత్రస్థాయిలో గుర్తించి పెనాల్టీలు విధిస్తున్న టౌన్‌ప్లానింగ్ ఏసీపీలు ఇప్పటి వరకు రూ. 54,15,792 పెనాల్టీలు విధించారు. ఒక్క కాప్రా సర్కిల్‌లోనే రూ.7,27,500 పెనాల్టీలు విధించారు.
చెత్త వేసిన వారికి..
రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసిన వారికి జనవరి ఒకటో తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు రూ.2,33,600 పెనాల్టీలు విధించారు.
ఈ–చలాన్ యాప్ అందుబాటులోకి వస్తే పెనాల్టీల మొత్తం ఇంకా పెరిగే అవకాశంతోపాటు, ఉల్లంఘనులు చెల్లించే సొమ్ము నేరుగా జీహెచ్‌ఎంసీ ఖజానాలోనే జమ అవుతుంది.
చెత్త వేస్తే .. ఇక ఈ–చలాన్