
కాలేజీ లాగిన్‌లో ఇంటర్ హాల్ టికెట్లు
ఫీజు క్లియరెన్స్ కోసం తీవ్ర ఒత్తిళ్లు
పెండింగ్ ఉంటే హాల్ టికెట్లకు నిరాకరణ
మానసిక ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులు
ఇదీ ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల తీరు
ముషీరాబాద్‌కు చెందిన ప్రకాశ్ చిరుద్యోగి. అతని కుమారుడు కొత్తపేటలోని కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. సెకండియర్ ఫీజు మొత్తం రూ.1.60 లక్షలు కాగా.. దశలవారీగా రూ.1.20 లక్షలు చెల్లించారు. గత నెల ప్రాక్టికల్ పరీక్షల నేపథ్యంలో ఫీజు చెల్లించాలని ఒత్తిడి పెరగడంతో రూ. 20 వేలు చెల్లించారు. మరో రూ.20 వేలు పెండింగ్‌లో కట్టాల్సి ఉంది.
ఈ నెల 5 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కొంత ఫీజు పెండింగ్‌లో ఉండటంతో హాల్ టికెట్ ఇచ్చేందుకు కాలేజీ వర్గాలు నిరాకరించాయి. పరీక్షల తర్వాత చెల్లిస్తామని వేడుకుంటున్నప్పటికీ ఇది యాజమాన్యం నిర్ణయం అని చెప్పారు. ఇది ఒక ప్రకాశ్ ఎదుర్కొంటున్న సమస్య కాదు.. పూర్తి స్థాయి ఫీజులు క్లియర్ చేయని విద్యార్థుల తలిదండ్రులందరిదీను.
సాక్షి, సిటీబ్యూరో: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష వేళ విద్యార్థులపై ఫీజుల ఒత్తిడి పెరిగింది. విద్యా సంవత్సరం పూర్తి స్థాయి ఫీజు చెల్లిస్తేనే హాల్ టికెట్ ఇస్తామని ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలు తేల్చి చెబుతున్నాయి. ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థుల వార్షిక పరీక్షల హాల్ టికెట్ల జారీని కాలేజీల లాగిన్‌కు ఇవ్వడం వాటికి కలిసి వచ్చినట్లయింది. విద్యా సంవత్సరం ఫీజులు ఎలాంటి పెండింగ్ లేకుండా పూర్తిగా వసూలు చేసేందుకు హాల్ టికెట్లకు ఫీజుల క్లియరెన్స్ మెలిక పెడుతున్నారు. దీంతో విద్యార్ధులు మానసిక వేదనకు గురవుతున్నారు. ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థులతో పాటు ఫస్టియర్ విద్యార్థులు సైతం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. పరీక్షల తర్వాత పెండింగ్‌ను క్లియర్ చేస్తామని చెబుతున్నా.. కాలేజీ యాజమాన్యాలు వినిపించుకోవడంలేద విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
కార్పొరేట్‌ల తీరు మరింత కఠినం
విద్యా సంవత్సరం ఫీజుల విషయంలో కార్పొరేట్ కాలేజీ తీరు మరింత కఠినంగా తయారైంది. మేనేజ్‌మెంట్ నిర్ణయమంటూ ఫీజులు చెల్లించనిదే హాల్ టికెట్లు ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నాయి. సామాన్య, మధ్య తరగతి వర్గాలకు ఇంటర్‌తో పాటు ఐఐటీ, మెడిసిన్ అంటూ వల విసిరి విద్యార్థులను చేర్చుకున్న కార్పొరేట్ కాలేజీలు ఫీజుల విషయంలో అసలు రూపం బయటపెడుతున్నారు. విద్యా సంవత్సరానికి కనీసం రూ.1.50 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నాయి. ఒకసారి ఫీజుల విషయంలో అంగీకరింపజేసి.. నెమ్మదిగా వసూళ్ల దిగుతున్నారు. కార్పొరేట్ వలలో చిక్కుకున్న పేద కుటుంబాలు ఫీజులు చెల్లించేందుకు అప్పులు చేయక తప్పడం లేదు. పరీక్షల సమయంలో ఒత్తిడి పెంచి పూర్తి స్థాయి ఫీజులు వసూళ్లకు పాల్పడుతుండటంతో పేద కుటుంబాలకు తలకు మించిన భారంగా తయారైంది. ఫీజుల ఒత్తిడితో విద్యార్థులు పరీక్షలపై సరిగా దృష్టి పెట్టలేకపోతున్నారని తల్లితండ్రులు ఆందోళన చెందుతున్నారు.