
మూడంచెల్లో..
చెత్త సమస్యల పరిష్కారానికి జీహెచ్‌ఎంసీ తిప్పలు
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ పరిధిలోని వివిధ విభాగాలకు సంబంధించిన సమస్యలకు ఎంతో కొంత పరిష్కారం చూపగలుగుతున్నప్పటికీ, చెత్త సమస్యలు మాత్రం తీరడం లేదు. ఏళ్ల తరబడిగా ఉన్న ఈ సమస్య పరిష్కారానికి వివిధ చర్యలు చేపడుతున్నట్లు చెబుతున్నప్పటికీ, తగిన ఫలితాలంటూ కనిపించడం లేదు. ఇంటింటి నుంచి చెత్త సేకరణ సవ్యంగా జరగకపోవడంతో రోడ్ల వెంబడి బహిరంగ ప్రదేశాల్లో చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి. వీటిపై నిత్యం ఫిర్యాదులందుతున్నాయి. సోషల్ మీడియా వేదికగానూ ఫొటోలతో సహా ప్రజలు వీటిపై ఫిర్యాదు చేస్తుండటంతో ఆన్‌లైన్ మానిటరింగ్ విధాన్ని ప్రవేశపెట్టారు. అయినప్పటికీ ఫలితం కనిపించకపోవడంతో ఇప్పుడిక మూడు పర్యాయాలు చెత్త తరలింపును పరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే రూ.1000 జరిమానాలు విధిస్తున్నా, ఇక్కడ చెత్త వేయొద్దని మైకుల్లో హెచ్చరిస్తున్నా సమస్య పరిష్కారం కాలేదు. చెత్త వేసేవారికి ఈ– పెనాల్టీల విధానాన్ని సైతం అందుబాటులోకి తెచ్చారు. వీటి వల్ల జీహెచ్‌ఎంసీకి పెనాల్టీల రూపేణా ఆదాయం వస్తున్నప్పటికీ, ఎక్కడ పడితే అక్కడ ఉన్న చెత్త సమస్య సమసిపోలేదు.
మూడు పర్యాయాలు..
ఈ నేపథ్యంలో రోడ్ల వెంబడి చెత్త కనిపించకుండా ఉండేందుకు మూడుసార్లు పర్యవేక్షణతో, ఎక్కడ చెత్త తరలించలేదో గుర్తించి సంబంధిత సిబ్బంది, అధికారులను అప్రమత్తం చేయడం ద్వారా పరిష్కరించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల ప్రవేశపెట్టిన ఈ విధానంలో మూడు అంశాల్ని పరిశీలిస్తున్నారు.
1. ఇంటింటి నుంచి చెత్త తరలించే స్వచ్ఛ ఆటోలు ఎన్ని గైర్హాజరవుతున్నాయో గుర్తించడం.
2. చెత్తను సర్కిళ్లలోని సమీప ట్రాన్స్‌ఫర్ స్టేషన్లకు తరలించాల్సిన ఆటోల్లో ఎన్ని పని చేయడం లేదో గుర్తించడం.
3. బహిరంగ ప్రదేశాల్లో చెత్తకుప్పలు గుట్టలుగా పోగయ్యే ప్రాంతాలను గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్‌గా గుర్తిస్తున్నారు. వాటిలో ఎన్నింటిని క్లీన్ చేసిందీ, ఎన్ని చేయనిదీ గుర్తిస్తున్నారు.
ఈ పనుల్ని కేవలం రోజుకు ఒక్కసారి మాత్రమే కాకుండా మూడు పర్యాయాలు పర్యవేక్షిస్తున్నట్లు శానిటేషన్ విభాగం అడిషనల్ కమిషనర్ సీఎన్ రఘుప్రసాద్ తెలిపారు. ఆమేరకు.. ఉదయం 8గంటలలోగా ఎన్ని స్వచ్ఛ ఆటోలు, ట్రాన్స్‌ఫర్ స్టేషన్ల ఆటోలు తమ పని పూర్తిచేసింది గుర్తిస్తారు. పని చేయని ఆటోల సిబ్బందిని అలర్ట్ చేస్తారు. అలాగే జీవీపీల్లో ఎన్నింటిని శుభ్రం చేయలేదో గుర్తించి సంబంధిత సిబ్బందిని అప్రమత్తం చేస్తారు. తిరిగి మధ్యాహ్నం 1.30 గంటలకు మరోసారి పరిశీలిస్తారు. ఆ తర్వాత 2.30 గంటలకు మరోమారు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారు. ఉన్నతాధికారులు కార్యాలయాల నుంచే పరిశీలించేందుకు రియల్‌టైమ్‌లో ఆయా ప్రాంతాలు కనిపించేలా వెబ్‌పోర్టల్ నిర్వహిస్తున్నారు. తొలిదశలో ఉదయం 8 గంటలలోగా 30 శాతం కంటే తక్కువ పనిచేసిన వారిపై తగిన చర్యలు తీసుకోనున్నారు. తద్వారా ఒకేసారి కాకున్నా క్రమేపీ చెత్త సమస్యలు పరిష్కారమవుతాయని అధికారులు భావిస్తున్నారు.
రోజుకు మూడుసార్లు పరిశీలించే యోచన

మూడంచెల్లో..